ఉగ్రవాదులు భారత్‌ను భయ పెట్టలేరు.. ఎందుకంటే..
ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్‌కు పరోక్షంగా సవాల్ విసిరారు. ఉగ్రవాదులు తమ ఇళ్లలో కూడా సురక్షితంగా ఉండలేకపోతున్నారన్నారు. భయం భయంగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మోడీ అన్నారు. శనివారం హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ప్రధాని ఉగ్రవాదం, అభివృద్ధి, ప్రభుత్వ విధానాలపై కూలంకషంగా చర్చించారు. సదస్సు ప్రాంగణంలో ప్రదర్శించిన 26/11 ముంబయి పేలుళ్ల కథనాలను వీక్షించిన ఆయన ఆ ఘటనపై స్పందించారు. ‘‘ఈ రోజు నేను 26/11 దాడికి సంబంధించిన నివేదికలను ఎగ్జిబిషన్‌లో చూశాను. ఆ సమయంలో ఉగ్రవాదం భారతీయులకు పెద్ద ముప్పు. ప్రజలు సురక్షితంగా లేరని భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు ఉగ్రవాదులు తమ సొంత ప్రదేశాల్లో కూడా సురక్షితంగా లేరు. భయంభయంగా బతుకుతున్నారు. ఇక, వారు మనల్ని భయపెట్టలేరు’’ అని ఆయన అన్నారు.
గీత కార్మికులకు త్వరలో మోపెడులు.. గుడ్ న్యూస్ చెప్పిన పొన్నం ప్రభాకర్
గీత కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా.. వచ్చే ఏడాది మార్చ్ తర్వాత గీత కార్మికులకు మోపెడులు ఇస్తాం తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచ్ కిట్లను పంపిణీ చేసిన మంత్రి మాట్లాడుతూ.. తాటి చెట్టు నుండి పడి గీత కార్మికులు చనిపోతున్నారనే ఈ కాటమయ్య కిట్ తయారు చేశారన్నారు. తాటి చెట్టు ఎక్కే ప్రతి వ్యక్తికి ఈ కిట్ ఇస్తాం, ప్రభుత్వంతో పాటు శాసనసభ్యుని, పార్లమెంట్ సభ్యుని నిధులు కూడా వెచ్చించి ఈ రక్షణ కవచాలు పంపిణీ చేస్తున్నామన్నారు. తాటి చెట్లు ఎత్తు తక్కువగా ఉండేలా కూడా శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. రోడ్లమీద వేరే చెట్లు పెడితే ఎలాంటి ఉపయోగం లేదని ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో చర్చించారు. 50% తాటి ఈత చెట్లను కాలువలు, రోడ్ల పక్కన, చెరువుల గట్ల పైన నాటాలని సూచించారు. ఈ కిట్లను గీత కార్మికులు జాగ్రత్తగా వాడుకోవాలని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా మార్చ్ తర్వాత గీత కార్మికులకు మోపెడులు ఇస్తామని మంత్రి తెలిపారు.
సనాతనాన్ని రక్షించడానికే శివసేన-జనసేన.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.. మహాయుతి కూటమి తరపున.. బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే పార్టీ), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు.. ఈ రోజు మహారాష్ట్రలోని డెగ్లూర్‌లో మొదట ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివాజీ మహరాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు.. జాతీయ భావం, ప్రాంతీయ తత్వం మా పార్టీల సిద్ధాంతంగా చెప్పుకొచ్చారు.. బాలా సాహెబ్ ఠాక్రే (బాల్ ఠాక్రే) నుంచి తాను ఎంతో నేర్చుకున్నాను.. శివసేన-జనసేన సనాతనాన్ని రక్షించడానికే ఆవిర్భవించాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇక, శివసేన-జనసేన అన్యాయంపై పోరాడతాయన్నారు.. ధైర్యం, పౌరుషంతో కూడిన భారత్‌ను బాలాసాహెబ్ కోరుకున్నారని గుర్తుచేశారు.. బాలాసాహెబ్ కలలు కన్న అయోధ్య రామమందిరాన్ని నిర్మించి చూపించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అంటూ ప్రశంసలు కురిపించారు..
ఎంగేజ్మెంట్ అయిన నెలలోపే నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నిజానికి నారా రోహిత్ ఈ మధ్యకాలంలో తాను ప్రేమించిన శిరీష అనే యువతిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుని ఎందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలో ఆయన తండ్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు హఠాన్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని నారా రోహిత్ టీం స్వయంగా ప్రకటించింది. నారా రోహిత్ తండ్రి, చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కార్డియాక్ అరెస్టు కారణంగా ఈరోజు మరణించారు.
గుజరాత్ గులాంలుగా మారారు.. శిండే.. అజిత్ పవార్ పై సీఎం కీలక వ్యాఖ్యలు
శిండే.. అజిత్ పవార్ గుజరాత్ గులాంలుగా మారారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర చంద్రాపూర్ నియోజవర్గం గుగ్గూస్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. ఏడాది కాలంలో తెలంగాణలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని క్లారిటీ ఇచ్చారు. ఈ దేశంలో గుజరాత్ సహా ఏ రాష్ట్రంలోనూ ఏడాది కాలంలో 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.
మహారాష్ట్రలో ప్రజా తీర్పును ఏక్ నాథ్ శిండే… అజిత్ పవార్ కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిండే.. అజిత్ పవార్ గుజరాత్ గులాంలుగా మారారని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ పడ్ వేకర్ ను 50 వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ ప్రవీణ్ ను గెలిపిస్తే మీకు ఇక్కడ ఒక అన్న ఉంటారు… హైదరాబాద్ లో మరో అన్నగా నేను ఉంటా అన్నారు. ఇక రేపు ఇక రెండోరోజు ఆదివారం ఉదయం నాగ్‌పూర్ నుంచి నాందేడ్ చేరుకుంటారు. నయగావ్, భోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రచారం అనంతరం అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్ కు తిరిగి రానున్నట్లు తెలుస్తుంది.
టిడ్కో ఇళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. అసెంబ్లీ సోమవారానికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి.. అయితే, టిడ్కో ఇళ్ల అంశంపై సభలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ.. టిడ్కో ఇళ్ల లోన్లు ఒక నెల వాయిదా వేయాలని బ్యాంకులకు లేఖ రాశామని తెలిపారు.. హడ్కో నుంచీ రుణం ప్రభుత్వమే తీసుకుని టిడ్కో రుణాలు తీరుస్తాం అని వెల్లడించారు. లబ్ధిదారులను మార్చేయడం, డీడీలు కట్టించుకుని బ్యాంకులో వేయలేదు అన్నదానిపై దర్యాప్తు జరిపిస్తారని స్పష్టం చేశారు.. పూర్తయిన ఇళ్లకు ముందుగా సౌకర్యాలు ఇస్తాం అన్నారు.. 2018-19 లో నిర్ణయించిన లబ్ధిదారులను గుర్తించి వారికి ఇళ్లు కేటాయిస్తాం అని వెల్లడించారు మంత్రి నారాయణ.
త్వరలో 16 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం..
గుంటూరులో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మెగా డిఎస్సీ ఉచిత శిక్షణా తరగతులను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు ప్రభుత్వం అని మరోకసారి నిరూపించిందన్నారు. ఉద్యోగ కల్పన, విద్యా కల్పన, పరిశ్రమల కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నది కూటమి ప్రభుత్వం.. డిఎస్సీ నోటిఫికేషన్ ను త్వరలో విడుదల చేస్తామన్నారు. 16 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత డిఎస్సీ కోచింగ్ సెంటర్స్ ప్రారంభిస్తున్నామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం తప్పిదాల మూలంగా విద్యార్థుల భవిష్యత్ ఇప్పట్టికే దెబ్బ తిన్నది అని మంత్రి సవిత పేర్కొన్నారు.
విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా?
ట్రిపుల్ ఐటీ ముట్టడికి వెళ్తున్న ఏబీవీపీ నాయకులు అరెస్ట్‌లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఖండించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ స్పందిస్తూ.. ఏబీవీపీ నాయకులపై పోలీసుల, బాసర ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం దుర్మార్గమన్నారు. ఆత్మహత్య చేసుకున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధినికి న్యాయం చేయమంటే విచక్షణారహితంగా దాడి చేయిస్తారా? అని, బాసర ట్రిపుల్ లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా? అని ఆయన ప్రశ్నించారు.
త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి అరుదైన రికార్డు..
త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్‌కు అరుదైన రికార్డు దక్కింది.. న్యాయమూర్తిగా అత్యధిక కేసులు పరిష్కరించి జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్ రికార్డ్ సృష్టించారు.. ఈ క్రమంలో.. తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా శనివారం ఆయన పురస్కారం అందుకున్నారు.. మరోవైపు.. జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్‌కు యూకే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కింది. 2017 నుంచి ఇప్పటివరకు 92 వేల కేసులు పరిష్కరించారు జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్.. హైదరాబాద్ వాసి అయిన జస్టిస్ అమర్నాథ్ గౌడ్.. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే 2017లో సుప్రీంకోర్టు కొలీజియం ఆయన్ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించింది. ఆ తర్వాత త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు.. ఈ సందర్భంగా తన బెంచ్‌లో కేసులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని జస్టిస్ అమర్నాథ్ గౌడ్ తెలిపారు.
బీఆర్‌ఎస్ నేతలకు టీపీసీసీ చీఫ్ సవాల్.. అభివృద్ధిపై మేము చర్చకు సిద్ధం
మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామని వెల్లడించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ కు నూకలు చెల్లినాయని, అందుకే ఆపార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధి, మేము ఏడాదిలో చేసిన అభివృద్ధిపై మేము చర్చకు సిద్ధమని ఆయన బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామని ఆయన ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై విజయోత్సవాలు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు ఏం చేశామో వరంగల్ విజయోత్సవ సభలో వెల్లడిస్తామని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.
సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12:45కు మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నెల 14న ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. రేపు (ఆదివారం) చంద్రబాబు నాయుడి సొంతూరు నారావారి పల్లెలో నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.