రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తోంది..
సంగారెడ్డి జిల్లాలోని రుద్రారంలో గల గణేష్ గడ్డ ఆలయంలో మాజీ మంత్రి హరీష్ రావు పూజలు నిర్వహించారు. పటాన్ చెరు బీఆర్ఎస్ నేత ఆదర్శ్ రెడ్డి పాదయాత్రకు మద్దతుగా పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తోంది.. ఏడాది కాంగ్రెస్ పాలనలో పాలేవో.. నీళ్ళేవో ప్రజలకు తెలిసిపోయింది అని మండిపడ్డారు. ఆనాడు LRS ఫ్రీ అని చెప్పి.. ఇప్పుడు ముక్కు పిండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ.. చేతలకు తక్కువ అని ఫైర్ అయ్యారు. ఇక, రైతు బంధు, రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి చెప్పేవి అన్ని అబద్ధాలే.. అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎం భట్టిలకు రుణమాఫీపై సవాల్ విసిరితే ఉలుకులేదు, పలుకు లేదు అని హరీష్ రావు అన్నారు.
జగన్‌పై కుట్ర..! ఇంటి దగ్గర రక్షణ లేదు, పర్యటనల్లో లేదు..
వైఎస్ జగన్ ను లేకుండా చేయాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.. వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి.. దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత జగన్.. కానీ, జగన్ పర్యటనల్లో భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. గతంలో రెండుసార్లు జగన్ పై దాడులు జరిగాయి.. పాదయాత్ర సమయంలో అనేక అడ్డంకులు సృష్టించారు.. జెడ్ ప్లస్ రక్షణలో ఉన్న జగన్‌కు పర్యటన సమయంలో కనీస భద్రత కల్పించకపోవటం దారుణం అన్నారు.. వందల మంది పోలీసులను జగన్ భద్రతకు కేటాయించామని పోలీసులు చెప్పటం అబద్దం.. జగన్ ను లేకుండా చేయాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.. జగన్ ను ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా కూడా గుర్తించటం లేదు.. జగన్ కు భద్రత కల్పించలేమన్న విషయాన్నైనా స్పష్టం చేయాలి.. జగన్ ఇంటి దగ్గర కూడా పోలీసులను పెట్టడం లేదు.. ఆకతాయిలు అనేక రకాల చర్యలకు పాల్పడుతున్నా పట్టించుకోవటం లేదు.. ఇంటి దగ్గర రక్షణ లేదు, పర్యటనల్లో లేదని ఫైర్ అయ్యారు.
వల్లభనేని వంశీకి మళ్లీ షాక్..
గన్నరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరో సారి షాక్ తగిలినట్టు అయ్యింది.. వల్లభనేని వంశీ రిమాండ్‌ను మరోసారి పొడిగించింది కోర్టు.. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలపై దాడి కేసులో వల్లభనేని వంశీకి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది సీఐడీ ప్రత్యేక న్యాయస్థానం.. ఇక, ఈ కేసులో వల్లభనేని వంశీ సహా పది మంది నిందితుల రిమాండ్ పొడిగించింది.. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులుగా ఉన్నారు వల్లభనేని వంశీ సహా ఇతర నిందితులు.. ఇవాళ్టితో రిమాండ్ ముగియనున్న తరుణంలో.. నిందితులను కోర్టులో హాజరు పరిచారు జైలు అధికారులు.. ఇక, ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం.. కాగా, సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో హైదరాబాద్‌లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు.. విజయవాడ తరలించారు.. ఆ తర్వాత.. వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన విషయం విదితమే..
వాళ్లు తెలంగాణ నీళ్లను దొంగిలించుకుని పోతున్నారు..
తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో కృష్ణా- గోదావరి జలాల్లో మనకున్న వాటాను పూర్తిగా వినియోగించుకున్నారని తెలిపారు. కానీ, ఇపుడు తెలంగాణ నీళ్లను దొంగలించుకుని పోతున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు ఏపీ సీఎం అయ్యాక ఈ ధోరణి మరింత పెరిగిపోయింది.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్లపై పట్టింపు లేదు అని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ లో ములుగు సీఆర్పీఎఫ్ బెటాలియన్ పోయి విశాఖ సీఆర్పీఎఫ్ బెటాలియన్ వచ్చిందన్నారు.. ఇప్పుడు సాగర్ పూర్తిగా చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయింది.. కేసీఆర్ సీఎంగ ఉన్నాన్ని రోజులు సీఆర్పీఎఫ్ బలగాలను సాగర్ కు రానివ్వలేదు అని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ ఐపీఎస్ పాస్పోర్టు రద్దు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి అయినటు వంటి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు అయినట్లు సిటీ పోలీస్ కి కేంద్ర సర్కార్ నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తుంది. కాగా, ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు ప్రక్రియ మొదలైనట్లు సిటీ పోలీస్ కి సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే, వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లి అక్కడే ప్రభాకర్ రావు ఉండి పోయారు.
పగటిపూట ఎండలు.. రాత్రిపూట వర్షాలు
గత మూడు రోజుల నుంచి రెండు విభిన్నమైన వాతావరణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. 40 నుంచి 41 సెల్సియస్ ఉష్ణోగ్రత గత వారం రోజులు బట్టి ఉంటుంది. దీంతో రోడ్ల పైన జనం తిరగటానికి ఆందోళన చెందుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎండల దాటికి తట్టుకోలేకపోతున్నారు. జాతీయ రహదారుల్లో వాహనాల రొద కూడా కనపడటం లేదు .ఇక పోతే సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారుతుంది. గాలి దుమ్ము, వర్షం, వడగండ్లు కురుస్తున్నాయి. దీంతో ప్రజానీకం పగటిపూట ఉక్క పోత రాత్రిపూట గాలుల వల్ల కరెంటు పోతుండడం తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ములుగు జిల్లాలో దారుణం.. గొడ్డలితో నరికి గిరిజన యువకుడిని హత్య
ములుగు జిల్లా వాజేడు మండలంలో దారుణ హత్య ఒక గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త టేకులగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వాసం విజయ్ (28) గుర్తు తెలియని దుండగుల చేతిలో బలైపోయాడు. ఆదివారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘోర ఘటన గ్రామంలో తీవ్ర ఆందోళన కలిగించింది.
విజయ్ తన ఇంటి సమీపంలో ఉన్న సమయంలో, గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై అకస్మాత్తుగా దాడికి దిగారు. విజయ్ తలపై గొడ్డలితో బలంగా మోది, అతన్ని అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. విజయ్ శవాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. సంఘటన స్థలంలో రక్తపు చిమ్ము కనిపించడంతో హత్య ఎలా జరిగిందో అర్థమయ్యేంత దారుణంగా ఉంది.
కాకాణికి హైకోర్టు షాక్.. పిటిషన్ డిస్మిస్..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.. కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.. తనపై నమోదైన కేసుల విచారణపై స్టే విధించాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు.. ఎటువంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన స్పష్టం చేసింది న్యాయస్థానం.. ఇక, కాకాణి క్వాష్ పిటిషన్ పై తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.. తెల్ల రాయి అక్రమ రవాణా సహకరిస్తున్నారని కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే.
మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆగ్రహం.. కడియం శ్రీహరిపై హాట్ కామెంట్స్
స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయ వేదికపై ఈ స్థాయి వ్యక్తిగత వ్యాఖ్యలు కావడం హాట్ టాపిక్‌గా మారింది. తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, “చనిపోయిన పాము కొస తోకకు ప్రాణం ఉన్నట్టు కడియం రాజకీయం ఉండేది ” అంటూ ఘాటుగా స్పందించారు. కడియం శ్రీహరికి రాజకీయ జన్మ ఇవ్వడంలో ముందుగా కేసీఆర్ పాత్ర ఉందని, రెండోసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతోనే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ లభించిందని రాజయ్య పేర్కొన్నారు.
మోడీ పరివారం.. గాడ్సే పరివారం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కుల గణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణే అని గర్వంగా తెలిపారు. రాష్ట్రంలోని కుల గణనను తాము విజయవంతంగా పూర్తి చేశామని, అదే తరహాలో దేశవ్యాప్తంగా కూడా జనాభా గణనతో పాటు కుల గణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం 21 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేశామని వెల్లడించారు. రైతులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.