నేడు తెలంగాణ భవన్ కు కేసీఆర్.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్..
త్వరలో దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. దీంతో గులాబీ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు మధ్యాహ్నం తెలంగాణ భవన్ కు రానున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల 10 వ తేదీన కరీంనగర్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభపై చర్చించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లు,జనసమీకరణ,సభ విజయవంతంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ప్రజలు ఎవ్వరూ చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో లేరు: పెద్దిరెడ్డి
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 2014లో వంద పేజీల మానిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారని, ఎన్నికలు పూర్తవగానే ఆ మానిఫెస్టోను వెబ్ సైట్ నుండి తొలగించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇప్పుడు ప్రజలు ఎవ్వరూ చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు.. అయన ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తారా? అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
గుడ్ న్యూస్.. 119 నియోజకవర్గాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జి కేంద్రాలు..
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని, చెప్పి మూడు నెలల్లోనే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మధిర నియోజకవర్గం భీమవరం గ్రామంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ఒకటవ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందించిన ఘనత ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. మార్చి ఒకటో తేదీ నాడు 3,65,262 మంది రెగ్యులర్ ఉద్యోగులకు, 2 లక్షల 85 వేల మంది పెన్షన్ దారులకు వేతనాలను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. 2019 ఆగస్టు ఒకటో తేదీ నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు ఒకటవ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వచ్చిన చరిత్ర లేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. ఆర్థిక పరిస్థితిని బాగు చేసి ఒకటో తేదీ నాడు ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన ఈ ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలను, ఆరు గ్యారెంటీ ల హామీల అమలులో అలసత్వం లేకుండా ఉద్యోగులు పారదర్శకంగా బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతీ యువకుల ఉద్యోగ నియామకాల కోసం టిఎస్పిఎస్సి నీ ప్రక్షాళన చేశామని తెలిపారు.
యాంటి డ్రగ్ కమిటి స్కూళ్లలలో పెట్టాలి కానీ.. ఆ పేరు ఉండకూడదు..!
యాంటి డ్రగ్ కమిటి స్కూళ్ళలలో పెట్టాలి, కాని కమిటి పేరులో డ్రగ్ అనేది రాకుండా చూడాలని విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరి బుర్ర వెంకటేశం అన్నారు. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ లో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సెమినార్ ప్రారంభమైంది. ఈకార్యక్రమంలో.. యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, విద్యాశాఖ అధికారులు, పోలీసు సిబ్బంది, పలు స్కూల్, కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 50% విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారన్నారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్తో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం సమాజంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో విద్యా స్టాండెర్డ్స్ ఒకే విధంగా ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో 100 ఏళ్ళ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటామన్నారు. ఆ.. సమయానికి మన దేశాన్ని ఎలా అభివృద్ధిలో పెడతామనేది ముఖ్యం అన్నారు.
గుంటనక్కలు కాసుకుని కూర్చున్నారు.. ప్రజలు గమనించి ఓటేయాలి!
గుంటనక్కలు కాసుకుని కూర్చున్నారని, ప్రజలు గమనించి ఓటేయాలని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రేపు రాజమండ్రిలో లోకల్‌గా సిద్దం కార్యక్రమాన్ని సుబ్రమణ్యం మైదానంలో ఏర్పాటు చేశామని, రాజమండ్రి ప్రజల అభివృద్ధికి తాము సిద్దం అని అన్నారు. 10 వేల మందితో సిద్దం సభ జరగబోతోందన్నారు. రాజమండ్రిలో టీడీపీ చేసిన ఒక అభివృద్ధి చెప్తారా?, 16 ఏళ్లు పదవిలో ఉండి ఏ సాధించాలో చెప్పాలి అని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. పేదరికాన్ని కొలమానంగా చేసుకుని సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారన్నారు. డ్వాక్రా, రైతు రుణమాఫీ అని మాయమాటలు చెప్పి బాబు మోసం చేసాడు.. బాబొస్తే జాబొస్తుందని నమ్మించి నిరుద్యోగులను మోసం చేయలేదా? అని మార్గాని భరత్ ప్రశ్నించారు.
విశాఖలో గంజాయి కంటైనర్‌ను వెంటాడి పట్టుకున్న పోలీసులు
విశాఖలోని ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భారీ కంటైనర్ పట్టుబడింది. ఈరోజు ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాసలో వేకువజామున ఒక కంటైనర్ గంజాయి లోడుతో వెళ్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఈబీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అది గమనించిన కంటైనర్ డ్రైవర్ ఎస్‌ఈబీ పోలీసులను ఢీకొట్టి పరారయ్యాడు. వాహనాన్ని వెంబడిస్తూ వచ్చిన పోలీసులకు విశాఖలోని ఆనందపురం హైవే వద్ద ఈ భారీ కంటైనర్ పట్టుబడింది.. డ్రైవర్ తోపాటు క్లీనర్ పరారవడంతో కంటైనర్‌ను పోలీసులు ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు… మరి ఆ కంటైనర్ లో ఏముందో అన్న సస్పెన్షన్ కాసేపు కొనసాగింది.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండ తీవ్రత.. మార్చి ప్రారంభంలోనే మండిపోతున్న భానుడు
తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరిగింది. మార్చి నెల ప్రారంభంలోనే భానుడు భగభగ మండిపోతున్నాడు. బెజవాడలో ఎండ తీవ్రత పెరిగింది. గతవారం రోజులుగా నిత్యం ఎండ తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఐదు రోజుల క్రితం 33.6 డిగ్రీలు ఉన్న ఎండ.. ప్రస్తుతం ప్రతిరోజూ 35 డిగ్రీల కంటే ఎక్కువ ఎండ ఉండటంతో నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
విజయవాడలో నేడు 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు తెలంగాణలోనూ అత్యధికంగా సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈరోజు నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత కొనసాగే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి
ఆదిలాబాద్ నియోజకవర్గానికి 3500 ఇళ్లు నిరుపేదలకు అందించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ అంటేనే గ్యారంటీలకు గ్యారెంటీ అన్నారు. ధరణితో దొరలకే లబ్దిచేకురిందన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ కు వారెంట్ లేదన్న బీఆర్ఎస్ఎటు పోయిందన్నారు. పేదలకు కట్టిన ఇల్లు ఇవ్వని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. సొంత ఆస్తులు పెంచుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. గత ప్రభుత్వాలు జిల్లాకు అన్యాయం చేశాయన్నారు. చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల కుటుంబం కాని భోగాల కుటుంబం కాదన్నారు. పేద ప్రజల కోసం బిజెపి ఏం చట్టం తెచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. కుల మతాల పేరుతో అధికారం కోసం అలజడులు సృష్టిస్తుంది బీజేపీ అని ఆమె అన్నారు. ప్రధానమంత్రి సూటు బూటు ప్రధానమంత్రి అంటూ ఆమె చమత్కరించారు. అలాగే మిగిలిన గ్యారెంటీస్ పథకాలను త్వరలోనే పూర్తిస్థాయిలో అమలు చేస్తామని పేర్కొన్నారు.
పెళ్లి మండపం నుంచి పెళ్లి కూతురును ఎత్తుకుని వెళ్లేందుకు ప్రయత్నం
పెళ్లి జరుగుతున్న అమ్మాయి సోదరుడు గతంలో తమ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళాడని ఆరోపణలతో తాజాగా పెళ్లి మండపంలోకి వెళ్లి గొడవ చేసిన ఘటన ఇది. పెళ్లి మంటపంలో అమ్మాయి పెళ్లి జరగకుండా చేయడానికి ఒక వర్గం వారు ప్రయత్నాలు చేయడంతో పెళ్లికూతురు పెళ్లి నీ అడ్డు కునేందుకు యత్నం చేశారు..దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి యువకులని చెదరగొట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి వద్ద ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో వివాహం జరుగుతుండగా కొంతమంది దుండగులు వచ్చి పెళ్లిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. వివాహం జరుగుతున్న అమ్మాయి సోదరుడు గతంలో మరొక అమ్మాయి ని పెళ్లి చేసుకొని వెళ్లిపోయాడు. అయితే ఇప్పటివరకు అలా వెళ్లిపోయిన అమ్మాయి సోదరుడు ఇంటికి రాలేదు. ఈ నేపథ్యంలో తమ అమ్మాయిని తీసుకుని వెళ్లిన పెండ్లి కూతురు అన్న ఎక్కడుండో చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ పెండ్లి మండపంలోకి కొంతమంది యువకులు జొరబడి గందరగోళం సృష్టించారు. పెండ్లి కూతురుని ఎత్తుకొని వెళ్లడానికి ప్రయత్నం చేశారు .దీనితో పెండ్లి కూతురు తరపున బంధువులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం గొడవ జరిగింది .సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలని చదరగొట్టి సమాధానపరిచారు.
పట్టాలు కరెక్ట్ కాదని నిరూపిస్తే పోటీ కూడా చేయను.. బాలినేని సవాల్
ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఉద్యోగం చేస్తున్న వాలంటీర్లపై ప్రతిపక్షాలు దారుణంగా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల విషయంలో విషం చిమ్ముతున్నారన్న ఆయన.. అర్హులను సచివాలయ అధికారులే ఎంపిక చేశారన్నారు. అర్హుల ఎంపికలో పార్టీలను చూడలేదు, ఎవరి ప్రమేయం లేదన్నారు. పేదలకు పట్టాలు ఇవ్వలేకపోతే నేను ఒంగోలులో పోటీ కూడా చేయనని చెప్పానన్నారు. ఇబ్బందుల్లో కూడా ముఖ్యమంత్రి పట్టాల కోసం భూముల కొనుగోలుకు నిధులు విడుదల చేశారని.. మన మీద ఉన్న ప్రత్యేక అభిమానంతో ఆయన నిధులు విడుదల చేశారని బాలినేని పేర్కొన్నారు.
రేపు తెలంగాణకు మోడీ.. విద్యుద్దీకరణ ప్రాజెక్టు జాతికి అంకితం
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అంబారి- ఆదిలాబాద్ – పింపల్ కుట్టి విద్యుదీకరణ ప్రాజెక్టును 04 మార్చి, 2024న ఆదిలాబాద్‌లో జాతికి అంకితం చేయనున్నారు. అంబారి – ఆదిలాబాద్ – పింపల్ కుట్టి మధ్య విద్యుద్దీకరణ ముద్ఖేడ్ – పింపల్ కుట్టి విద్యుద్దీకరణ పనుల ప్రాజెక్ట్ లో భాగం. అంబారి – ఆదిలాబాద్ – పింపల్ కుట్టి సెక్షన్‌లోని 58 రూట్ కిమీ (71 ట్రాక్ కిమీలు) సుమారు రూ. 70 కోట్ల అంచనా వ్యయంతో విద్యుద్దీకరించబడింది. ఈ రైల్వే లైన్ విభాగం తెలంగాణలోని ఆదిలాబాద్ ( 46.6 రూట్ కిమీ)లోని వెనుకబడిన జిల్లాలు మహారాష్ట్రలోని నాందేడ్ యవత్మాల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో (11.5 రూట్ కిమీ) విస్తరించిఉంది.