*45 గంటల పాటు ధ్యానం చేసేందుకు సిద్దమవుతున్న ప్రధాని మోడీ.. వివరాలు ఇలా..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం (మే 30) కన్యాకుమారి లోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద దాదాపు రెండు రోజుల ధ్యాన వ్యాయామాన్ని మొదలు పెట్టనున్నారు. మోడీ కార్యక్రమం నేపథ్యంలో జిల్లాలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. 2019 ఎన్నికల ప్రచారం తర్వాత ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్ గుహలో ప్రధాని ఇలాంటి ధ్యానాన్ని చేపట్టారు. ధ్యాన్ మండపంలో మోడీ 45 గంటలపాటు బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత., 1892లో స్వామి వివేకానందకు నివాళిగా నిర్మించిన రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని మోదీ ధ్యానం చేస్తారు. రాక్ మెమోరియల్ స్మారక చిహ్నం హిందూ తత్వవేత్త – సాధువుకు నివాళులర్పించడానికి నిర్మించబడింది. కన్యాకుమారి వెళ్లడం వల్ల మోడీ జాతీయ సమైక్యతకు సంకేతం ఇస్తున్నారని ఓ బీజేపీ నేత మీడియాతో అన్నారు. మే 30 నుండి, ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 1 సాయంత్రం వరకు ధ్యానం చేస్తారు. ఈ సమయంలో స్మారక చిహ్నంలోకి పర్యాటకులను అనుమతించరు. ప్రధాని మోదీ ధ్యానం చేస్తున్నందున గట్టి నిఘాను నిర్వహించడానికి దాదాపు 2,000 మంది పోలీసులతోపాటు భద్రతా ఏజెన్సీలను నియమించనున్నారు అధికారులు. నివేదికల ప్రకారం, ప్రధాని మోడీ మొదట తిరువనంతపురం చేరుకుంటారు. అక్కడ నుండి హెలికాప్టర్ లో కన్యాకుమారికి చేరుకుంటారు. ఆయన ల్యాండింగ్ తర్వాత సూర్యాస్తమయాన్ని వీక్షించి, ధ్యానంలో కూర్చుంటాడు. జూన్ 1న మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన కన్యాకుమారి నుంచి తిరిగి వెళ్తారు.
*సీఎంతో సమావేశానికి విజయంతి గైర్హాజరు.. కారణమేంటంటే?
సచివాలయంలో రాజకీయ పార్టీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ భేటీలో రాష్ట్ర గీతం, చిహ్నంపై ప్రభుత్వ నిర్ణయాన్ని పార్టీల ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఈ సమావేశానికి విజయశాంతిని కూడా ఆహ్వానించారు. కాని విజయశాంతి గైర్హాజరవుతున్నారు. సినిమా షూటింగ్ షెడ్యూల్ కారణంగా సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ముందే సినిమా సెడ్యూల్ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ముంబైతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్టిస్ట్‌లను దృష్టిలో ఉంచుకుని షూటింగ్ కి వెళ్తున్నారు. కాగా.. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి మొదట్లో బీజేపీకి మద్దతుదారుగా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీకి స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. మొదట్లో పరోక్ష రాజకీయాల్లో కీలకంగా ఉన్న విజయశాంతి.. 1998లో బీజేపీలో చేరారు. 1999 లోక్ సభ ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి సోనియా గాంధీపై పోటీ చేయాలనుకున్నారు. అయితే సోనియా గాంధీ బళ్లారి నుంచి పోటీ చేయడంతో… విజయశాంతి పోటీ నుంచి తప్పుకున్నారు. 2009 వరకు బీజేపీలో ఉన్న విజయశాంతి.. ఆ తర్వాత తల్లీ తెలంగాణ పేరుతో సొంత పార్టీని పెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. 2009లో మెదక్ లోక్ సభ స్థానానికి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం కేసీఆర్‌తో విభేదాల రావడంతో 2014లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌లో స్టార్ క్యాంపెయినర్, ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారుగా పనిచేశారు. అయితే 2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి మళ్లీ బీజేపీలో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు.
*ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతుకోసి హత్య.. ఆపై!
ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.. తనను ప్రేమించాలంటూ యువతిపై కత్తితో దాడికి పాల్పడి హత్య చేసి.. తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా సత్రంపాడులో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రేమ విఫలం కావడంతో యువతి పీక కోసి ఓ యువకుడు కిరాతకంగా హత్య చేశాడు. యువతి ప్రేమించడం లేదనే కక్షతో కత్తితో గొంతుకోసి చంపేశాడు. అనంతరం కత్తితో గొంతు కోసుకుని ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. యువకుడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. మృతురాలు రత్న గ్రెసీగా, దాడికి పాల్పడిన వ్యక్తి యేసు రత్నంగా గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రేమిస్తున్నానని వెంటపడి యువతిని ఆమె ఇంటి సమీపంలోనే హతమార్చి తాను కూడా ఆత్మహత్యాయత్నానికి యువకుడు పాల్పడిన ఘటన ఏలూరు నగరంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఏలూరు నగరంలోని ఎమ్మార్సీ కాలనీకి చెందిన జక్కుల రత్న గ్రేసీ(22) స్థానికంగా తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంది. తొట్టిబోయిన యేసురత్నం(23) అనే యువకుడు ఆమె వెంట గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడని వెంటపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం యువతీ ఇంటి సమీపంలో ఉండగా అతను తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు మెడపై దాడి చేశాడు. ఈ ఘటనలో యువతీ అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే యేసురత్నం కూడా అదే కత్తితో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అతన్ని చికిత్స నిమిత్తం ఏలూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యేసు రత్నం గతంలో ఇంటికి వచ్చి గ్రేసిని పెళ్లి చేసుకుంటానంటూ అడిగాడని.. దానికి ఒప్పుకోలేదని యువతి తల్లిదండ్రులు తెలిపారు.పెళ్లికి ఒప్పుకోలేదని కక్షగట్టిన యేసురత్నం దారుణానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. మా అమ్మాయి జోలికి రాకుండా చూడాలని యువకుడి కుటుంబ సభ్యులకు కూడా చెప్పినట్లు వారు వెల్లడించారు. కానీ మా కూతురిని మాకు కాకుండా చేశాడంటూ బోరున విలపించారు యువతి తల్లిదండ్రులు.
*వీర్ సావర్కర్‌పై అవమానకరమైన పోస్ట్.. కర్ణాటక వ్యక్తి అరెస్ట్..
స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్‌ని ఉద్దేశించి ఓ వ్యక్తి అవమానకరమైన సోషల్ మీడియా పోస్టు పెట్టడం వివాదాస్పదమైంది. హిందుత్వ సిద్ధాంతకర్తగా పేరున్న వీర్ సావర్కర్‌పై తన ఫోస్‌బుక్ స్టోరీలో కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో కర్ణాటకలోని కొప్పల్‌కి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. హుస్సేన్‌సాబ్ అనే వ్యక్తి, ఇతని ఫేస్‌బుక్ యూజర్ నేమ్ ‘టిప్పు’. ‘‘”సావర్కర్ భారతదేశపు మొదటి ఉగ్రవాది’’ అని పోస్ట్ పెట్టాడు. సావర్కర్ జయంతిని మే 28న జరుపుకున్నారు. ఆ తర్వాత ఈ పోస్టు వైరల్‌గా మారడంతో కర్ణాటక పోలీసులు చర్యలు తీసుకున్నారు. రెండు వర్గాల మధ్య శతృత్వాన్ని పెంపొందించడానికి ప్రయత్నించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొప్పల్ ఎస్పీ యశోధ వంటగోడి మాట్లాడుతూ.. సమాచారం అందుకున్న వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశామని, అతడు కూలీ పనులు చేసుకుంటున్నాడని తెలిపారు. మంగళవారం బెంగళూరులోని యలహంకలో సావర్కర్ పేరుతో ఉన్న ఫ్లైఓవర్‌పై సైన్‌బోర్డ్‌కు నల్ల ఇంక్‌ను పూశారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్‌యూఐ) సభ్యులు సైన్ బోర్డు ధ్వంసం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
*దేశం కోసం 100 సార్లు జైలుకు వెళ్లేందుకు సిద్ధం, అందుకు గర్వపడుతున్నా..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే పంజాబ్ జలంధర్‌లో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తన దేశాన్ని రక్షించేందుకు జైలుకు వెళ్లడానికి సిద్ధమని, ఇందుకు గర్వంగా ఉందని చెప్పారు. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్‌తో తనను తాను పోల్చుకుంటూ.. నేను భగత్ సింగ్ అనుచరుడిని, దేశాన్ని రక్షించేందుకు 100 సార్లు జైలుకు వెళ్లవలిసి వస్తే వెళ్లాను అని అన్నారు. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలుబడిన తర్వాత బీజేపీకి 200 కంటే తక్కువ సీట్లు వస్తాయని, ఇండియా కూటమికి 300 సీట్లు కన్నా ఎక్కువ వస్తాయని కేజ్రీవాల్ చెప్పారు. కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారని బీజేపీ వాళ్లు చెబుతున్నారు, దీనికి సంబంధించి వారి వద్ద ఒక్క రుజువు కూడా లేదని, ఒక వేళ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడినట్లైతే ఈ ప్రపంచంలో ఎవరూ నిజాయితీపరులు కాదన్నారు. రూ. 100 కోట్ల అవినీతి జరిగినట్లు చెబుతున్నారు, 500 చోట్ల దాడులు నిర్వహించినా ఒక్క పైసా కూడా పట్టుబడలేదు. రూ. 100 కోట్లు గాలిలో మాయమైపోయాయా..? అని ప్రశ్నించారు. ‘‘కేజ్రీవాల్‌కి సంబంధించి ఎలాంటి ఆధారాలు పట్టుబడలేదని ప్రధానిని ప్రశ్నిస్తే, ఆయన తమ వద్ద ఎటువంటి రుజువు లేదని, రికవరీ లేదని, కేజ్రీవాల్ అనుభవజ్ఞుడైన దొంగ అని ప్రధాని అంగీకరించారు. దేశం మొత్తం ముందు తమ వద్ద ఎటువంటి రుజువు లేదని ప్రధాని అంగీకరిస్తే, మొత్తం కేసు నకిలీదని అర్థం’’ అని కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్, ఢిల్లీల్లో ప్రజలకు తాను ఉచింతంగా విద్యుత్ అందించానని, ప్రజల కోసం మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేశానని అందుకే వారు తనను జైలులో పెట్టాలని చూస్తున్నారంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. వారు తనను సైలెంట్ చేయాలని అనుకుంటున్నారు, కానీ ప్రపంచంలోని ఏ శక్తి తనను అడ్డుకోలేదని ఆప్ చీఫ్ అన్నారు. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని, నా దేశాన్ని రక్షించుకోవడానికి జైలుకు వెళ్లేందుకు గర్వపడుతున్నానని చెప్పారు. పంజాబ్‌లో భగవంత్ మాన్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, 3 కోట్ల పంజాబ్ ప్రజల్ని బెదిరించడమే అని చెప్పారు.
*జమ్మూలో ఘోర ప్రమాదం..150 అడుగుల లోయలోకి బస్సు.. 16 మంది మృతి
జమ్మూలో ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి దాదాపు 150 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా.. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. యాత్రికులతో నిండిన బస్సు యూపీలోని హత్రాస్ నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని శివ్ ఖోడికి వెళుతోంది. చోకి చోరా ప్రాంతంలోని తంగ్లీ మలుపు వద్ద ఈ ప్రమాదం జరగ్గా.. బస్సు 150 అడుగుల లోయలో పడింది. అయితే బస్సుకు ఎదురుగా ఏదైనా వాహనం వచ్చిందా లేదా మరేదైనా కారణం ఉందా అనేది ఇంకా తెలియరాలేదు. రాజౌరి జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక ప్రజల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. క్షతగాత్రులను జమ్మూలోని అఖ్నూర్ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)కి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ప్రమాదం తర్వాత ఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. బస్సు ఒక్కసారిగా లోయలో పడటంతో ప్రయాణికులు కేకలు వేశారు. దీంతో చుట్టు పక్కల ప్రజలు గమనించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ట్వీట్ చేస్తూ చేశారు. ” జమ్మూ సమీపంలోని అఖ్నూర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం గురించి తెలుసుకోవడం చాలా బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.” అని రాసుకొచ్చారు.
*థాంక్యూ గాడ్.. అంటూ రిషబ్ పంత్ ఎమోషనల్ పోస్ట్..
527 రోజుల విరామం తర్వాత భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత రిషబ్ పంత్ భావోద్వేగానికి గురయ్యాడు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) విడుదల చేసిన వీడియోలో, ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులోని ఇతర సభ్యులతో నెట్ సెషన్ తర్వాత పంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. భారత జెర్సీతో తిరిగి మైదానంలోకి రావడం పూర్తిగా భిన్నమైన అనుభూతిని కలిగిస్తుందని, నేను చాలా కోల్పోయాను అని పంత్ అన్నాడు. ఇక ప్రస్తుతం ఇక్కడ సహ ఆటగాళ్లను చూడటం, వారిని మళ్లీ కలవడం, సమయం గడపడం, వారితో సరదాగా గడపడం లాంటివి నేను నిజంగా నేను నిజంగా ఆనందించానని తెలిపాడు. అలాగే X ఖాతా ద్వారా చేసిన పోస్ట్ లో దేవుడా.. నీకు ధన్యవాదములు. భారతీయ జెర్సీ ధరించడం నాలో కృతజ్ఞత, ఆనందం, గర్వాన్ని నింపుతుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని పొందడం కంటే మెరుగైన అనుభూతి మరొకటి లేదని పంత్ రాశాడు. భారత వికెట్ కీపర్ సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాతో కలిసి చిత్రాలకు పోజులిచ్చాడు. ఐపీఎల్ 2024ను పంత్ బ్యాట్ తో అద్భుతమైన ప్రదర్శన చేసాడు. అతను 13 మ్యాచ్‌లలో 40.55 సగటుతో 446 పరుగులు చేశాడు. మూడు అర్ధ సెంచరీలతో పాటు జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కెప్టెన్ గా కూడా ఉన్నాడు. కాకపోతే జట్టు IPL 2024 పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో నిలిచింది. అతని అద్భుత ప్రదర్శన భారత జట్టుకు ఎంపికయ్యేలా చేసింది. మెగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు పంత్ మొదటి బ్యాచ్ భారతీయ ఆటగాళ్లతో కలిసి అమెరికాకు వెళ్లాడు.
*భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్న నటుడు.. అడ్డంగా బుక్ చేసేసిందిగా!
ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు అనేకం తెర మీదకు వస్తున్నాయి. నటీనటులు కూడా పెళ్లై పిల్లలు ఉన్నా ఈ అక్రమ సంబంధాల జోలికి పోకుండా ఉండలేక పోతున్నారు. తాజాగా ఓ నటుడు కూడా భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళతో సంబంధం పెట్టుకుని ఆపై ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే నిజం ఎంతో కాలం దాగదు కదా ఎలాగో ఈ విషయం మిస్ వైజాగ్ కి తెలిసింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న భార్య తన భర్త తనకు కావాలంటూ ఆందోళనకు దిగింది. ఆమె మిస్ వైజాగ్ నక్షత్ర. విడాకులు ఇవ్వకుండానే తనను వదిలేసి వేరొక మహిళతో భర్త కాపురం చేస్తుండటంపై నక్షత్ర తాజాగా నిరసనకు దిగింది. తన భర్త తనకి కావాలంటూ ఆందోళన చేసింది నక్షత్ర. ఊహించని విధంగా నక్షత్ర నిరసనకు దిగడంతో ఆమె భర్త తేజ షాక్ అయ్యాడు. 2013లో ఓ సినిమా షూటింగ్‌లో నక్షత్ర, తేజలకు పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ 2017లో వివాహం చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఏమైందో ఏమో కానీ తేజ భార్యకు విడాకులు ఇవ్వకుండానే వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని నక్షత్ర మీడియా ముందుకు వచ్చింది. అంతేకాదు ఈ మేరకు నిరసనకు కూడా దిగింది. ఇక ఈ అంశం మీద పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది.
*వరుసగా ఐదో రోజూ నష్టాలే.. కారణమిదేనా?
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాల కారణంగా భారతీయ సూచీలపై ప్రభావం చూపించాయి. గత శుక్రవారం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక గురువారం సెన్సెక్స్ 617 పాయింట్లు నష్టపోయి 73, 885 దగ్గర ముగియగా.. నిఫ్టీ 216 పాయింట్లు నష్టపోయి 22, 488 దగ్గర ముగిసింది. బ్యాంక్‌లు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి. నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో టాటా స్టీల్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీలు ఉన్నాయి. ఇక సెన్సెక్స్ సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్ లాభపడ్డాయి. సెక్టార్లలో బ్యాంక్ ఇండెక్స్ 0.5 శాతం లాభపడగా.. ఆటో, ఎఫ్‌ఎమ్‌సీజీ, మెటల్, ఐటీ, హెల్త్‌కేర్ 1-2 శాతం క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1.3 శాతం చొప్పున క్షీణించాయి. ఇక ఉదయం ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 201 పాయింట్ల నష్టంతో 74,301 వద్ద ట్రేడ్ అవ్వగా.. నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 22,655 దగ్గర కొనసాగింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.43 దగ్గర ప్రారంభమైంది.