*”పవన్ నహి వో తుపాన్ హే” పార్లమెంట్లో ప్రశంసల వర్షం కురిపించిన మోదీ
నేడు (శుక్రవారం) ఉదయం ఢిల్లీలోని సంవిధాన్ సదన్(పాత పార్లమెంట్) భవనంలో ఎన్డీయే కూటమి నేతలు మోదీని మూడోసారి ఎన్డీయే పక్షనేతగా ఏక్రగీవంగా ఎన్నుకున్నారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ బీజేపీ ఎంపీ రాజ్‌నాథ్ సింగ్ తీర్మానం ప్రవేశ పెట్టారు. అనంతరం ఎన్డీయే కూటమి పార్టీల నేతలంతా మోదీకి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీయే పక్ష నేతగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. నాపై విశ్వాసం ఉంచి ఎన్డీయే నేతగా ఎన్నుకున్నారు. దేశానికి ఇంకా సేవచేసే భాగ్యం లభించింది. 22 రాష్ట్రాల్లో ఎన్డీయేకు ప్రజలు అధికారం ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రం లో కూడా తమకు మంచి ఆదరణ లభించింది అని ఇది అంత పవన్ వల్లే సాధ్యం అయ్యింది అని అతను పవన్ కళ్యాణ్ కాదు తుపాన్ అని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు
*ఎల్‌కే.అద్వానీ, జోషిలతో ప్రధాని మోడీ భేటీ.. ప్రమాణస్వీకారానికి ఆహ్వానం
రాజకీయ కురువృద్ధులు, బీజేపీ అగ్ర నేతలు ఎల్‌కే.అద్వానీ, మురళీ మనోహర్ జోషిని ప్రధాని మోడీ కలిశారు. ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానించారు. మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనెల 9న సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మోడీచే ప్రమాణం చేయించనున్నారు. శుక్రవారం ఎన్డీఏ పక్ష నేతలంతా సమావేశం అయ్యారు. ఎన్డీఏ పక్ష నేతగా మోడీని ఎన్నుకున్నారు. నితీష్ కుమార్, చంద్రబాబు బలపరిచారు. అందరూ ఏకగ్రీవంగా ఉన్నారు. రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఈ సమావేశానికి ఎన్డీఏ ఎంపీలంతా హాజరయ్యారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 240 స్థానాల్లో విజయం సాధించింది. అయితే మిత్రపక్షాలతో కలిసి 293 స్థానాలను సొంతం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది
*ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత సీబీఐ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో రెండు వారాల పాటు పొడిగించింది. కాగా సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు సీబీఐ కేసులో ఈ నెల 21 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు.. కవిత చదువుకోవడానికి కొత్తగా తొమ్మిది పుస్తకాలు కావాలని కోర్టును కోరింది. ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తిని రౌస్ రెవిన్యూ కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణను జూన్ 21వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అదే రోజు సీబీఐ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది.
*హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షాలు..
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీగానే వర్షం పడుతోంది. నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఎస్సార్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్ పేట్, భరత్ నగర్, సనత్ నగర్, మారేడ్ పల్లి, బోయిన్ పల్లి, కుత్బుల్లాపూర్, అడ్డగుట్ట, బన్సీలాల్ పేట, బేగంపేట, రాణీగంజ్, సికింద్రాబాద్, పద్మారావు నగర్, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, చంద్రాయన్ గుట్ట, కోఠి, కాచిగూడ, నారాయణ గూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, రామ్ నగర్ ఇలా సిటీలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం గంట నుండి కురుస్తుండటంతో జనం ఎక్కడికక్కడే స్తంభించిపోయారు. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వానలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్ సిటీలో గత రెండు మూడు రోజుల నుండి సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. ఇకపోతే హైదరాబాద్ జంట నగరాలలో వాన దంచికొట్టనున్నట్లు వాతావవరణ శాఖ తెలిపింది. ఇక నేడు సాయంత్రం మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలో భారీ వర్షం పడే ఛాన్స్ ఉండటంతో హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, సేరిలింగంపల్లి లతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఇక జూన్ 10 వరకు జంట నగరాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. అలాగే జూన్ 11 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులుతో వర్షం పడే అవకాశం ఉందని సమాచారం.
*కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్దరణ పై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం సరస్వతీ బ్యారేజ్ లో అత్యవసరంగా జర్గుతున్న మరమ్మత్తులను క్షేత్రస్థాయిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. బ్యారేజ్ 34 వ పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట్ వద్ద జరిగిన గ్రౌటింగ్ పనులను పరిశీలించి, పనుల పురోగతిని ఈఈ యాదగిరిని అడిగి తెలుసుకున్నారు మంత్రి ఉత్తమ్. బ్యారేజ్ అప్ స్ట్రీమ్ లో తొలిగించిన ఇసుక మేటలను, సీసీ బ్లాక్ ల అమరికను మంత్రి పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్న గత ప్రభుత్వం బయటపెట్టలేదని., కాళేశ్వరం ప్రాజెక్టు లో సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టు, బ్యారేజిలు డ్యామేజ్ అయ్యాయని ఆయన ఈ సందర్బంగా మాట్లాడారు.NDSA అధికారుల ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా.. కాళేశ్వరం పునరుద్దరణ చేబట్టామని., మా ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చాక నేషనల్ డ్యాం సేప్టి అథారిటికి పనుల పరిశీలన అప్పజెప్పామని ఆయన పేర్కొన్నారు. ఏయే టెస్ట్ లు చేయాలో.. ఏవిధంగా పనులు చేయాలో NDSA మాకు తెలిపిందని., ఎన్నికల సందర్భంగా పనుల పరిశీలన వీలుకాలేదని ఆయన అన్నారు. ఎవరి పనులు ఎవరు చేయాలో కంపేనీలకి పనులు అప్పజెప్పామని., వర్షకాలం సమీపిస్తున్న దృష్ట్యా పనులు వేగవంతం చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. జస్టీస్ పినాకి ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్టులు పరిశీలన చేస్తామని ఆయన అన్నారు. అలాగే తుమ్మిటిహెట్టి వద్ద కూడా బ్యారేజి నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు.
*మోడీపై బాబు ప్రశంసలు.. ఆయన లాంటి పవర్ ఫుల్ వ్యక్తిని చూడలేదు..
పార్లమెంట్ భవనంలో జరిగిన ఎన్డీఏ కూటమి నేతలు, బీజేపీ, ఎన్డీఏ పక్ష ఎంపీల సమావేశంలో.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఎన్డీఏ కూటమి, బీజేపీ ఎంపీల సమావేశంలో టీడీపీ, జేడీఎస్, ఎన్‌సీపీ, జనసేన, అప్నాదళ్ ఎంపీలు, నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మోడీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ పవర్ హౌస్‌గా మారిపోయిందన్నారు. నా రాజకీయ జీవితంలో ఎంతోమంది నేతలను చూశాను.. కానీ, నరేంద్ర మోడీ లాంటి పవర్ ఫుల్ వ్యక్తిని చూడలేదన్నారు.. మేకిన్ ఇండియా, విజినరీతో మోడీ.. దేశానికి అద్భుత విజయాలు అందించారని ప్రశంసలు కురిపించారు.. అంతర్జాతీయ స్థాయిలోనూ మోడీ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు.. మోడీ విజన్, సమర్థత దేశానికి ఎంతో అవసరం.. మోడీ సేవలు దేశానికి చాలా అవవసరం అన్నారు. భారత్‌కు సరైన సమయంలో సరైన నాయకుడు దొరకాడంటూ మోడీని ఆకాశానికి ఎత్తేశారు. ఈ అవకాశాన్ని భారత్ వినియోగించుకోవాలని సూచించారు. మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే ఐదో ఆర్థికశాఖగా ఎదిగింది.. ఈ ఐదేళ్లలో ప్రపంచంలోనే రెండో లేదా మూడో ఆర్థిక శక్తిగా మారబోతోందనే నమ్మకాన్ని వెలిబుచ్చారు చంద్రబాబు. దేశంలో ఉన్న యువశక్తి ఐటీ రంగంలో దూసుకుపోతోందన్నారు చంద్రబాబు.. ఇక, ఎన్డీఏతో ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి అనుబంధం ఉందని గుర్తుచేశారు.. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు ప్రజలకు ఎంతో సేవ చేశారు.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎంతో విజన్‌తో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా మేం నరేంద్ర మోడీని ప్రతిపాదిస్తున్నాం అని ప్రకటించారు. మరోవైపు.. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 95 శాతం సీట్లు గెలిచామని వెల్లడించారు.. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడిగా పనిచేసి ఈ విజయం సాధించాయన్నారు.. నా జీవితంలో ఇలాంటి ఫలితాలను చూడలేదని పేర్కొన్నారు.. ఎన్నికల్లో విజయం వెనుక జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత్ర అమోగం అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి అంతా పనిచేశామని పేర్కొన్నారు.
*ఎన్డీఏ సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్ పాత భవనం వేదికగా జరిగిన ఎన్డీఏ పక్షాలు, ఎంపీల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ సమావేశంలో మూడోసారి ఎన్డీఏ పక్షనేతగా నరేంద్ర మోడీ పేరును ప్రతిపాదించారు రాజ్‌నాథ్‌సింగ్.. ఆ ప్రతిపాదనను అమిత్‌షా, గడ్కరీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నితీష్ కుమార్, షిండే సహా ఇతర ఎన్డీఏ నేతలు బలపరిచారు.. ఇక, ఎన్డీఏ నేతగా నరేంద్ర మోడీ పేరును బలపరుస్తూ మాట్లాడిన పవన్ కల్యాణ్.. దేశానికి మోడీ ఒక స్ఫూర్తిగా అభివర్ణించారు.. యావత్ దేశానికి మీరు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు.. ఇక, నరేంద్ర మోడీ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించామన్నారు. మీ దిశానిర్దేశంతో ఏపీలో 91 శాతం పైగా సీట్లు సాధించామని తెలిపారు. మోడీ వెనుక తామంతా ఉన్నామని ప్రకటించారు. ఎన్డీఏ పక్ష నేతగా మోడీకి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు పవన్ కల్యాణ్.
*బాధ్యతలు స్వీకరించిన కొత్త సీఎస్.. రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు కృషి
ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్. ఈ సందర్భంగా కొత్త సీఎస్‌ను ఆశీర్వదించారు టీటీడీ, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వేద పండితులు. ఇక, కొత్త సీఎస్ కు శుభాకాంక్షలు తెలిపారు వివిధ శాఖల అధికారులు… ఈ సందర్భంగా సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ.. సీఎస్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.. సహచర అధికారులు సిబ్బందితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు నా వంతు కృషి చేస్తానని వెల్లడించారు.. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా తన పని ఉంటుంది.. మంచి చేసేలా కృషి చేస్తాను అన్నారు.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలుకు కృషి చేస్తాను అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు శాయశక్తులా కృషి చేస్తాను అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్. కాగా, ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ ను సీఎస్‌గా నియమించింది ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేసినట్టు పేర్కొంది ప్రభుత్వం.. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్ కుమార్ ప్రసాద్.. ప్రస్తుతం ఏపీ పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతికశాఖ స్పెషల్ సీఎస్‌గా పనిచేస్తుండగా.. ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.. అయితే, తన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ జవహర్ రెడ్డి చేతుల మీద జరపడానికి చంద్రబాబు విముఖతతో ఉన్నారని.. అందుకే ఈ పరిణామం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లినా.. తాజా ఉత్తర్వుల్లో బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది..
*‘‘ వాటికి ఇప్పుడు విశ్రాంతినివ్వండి.. వచ్చే ఎన్నికల్లో తిట్టండి’’..ఈవీఎంలను నిందించడంపై సీఈసీ సెటైర్లు..
ఈసారి ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల పనితీరుపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి నేతలు పలుమార్లు ఆరోపణలు గుప్పించారు. అయితే, తీరా ఫలితాలు వెలువడిన తర్వాత అంతా సైలెంట్ అయ్యారు. జూన్ 4 ఫలితాలు వెలువడిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంల పనితీరును తప్పుబడుతూ ఒక్క కామెంట్ చేయలేదు. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అయితే, ఈవీఎంలను పనితీరును తప్పుబడుతూ ప్రతిపక్షాలు తిట్టడాన్ని ఉద్దేశిస్తూ సీఈసీ రాజీవ్ కుమార్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘బహుషా ఈవీఎంలపై నిత్యం విమర్శలు, ఆరోపణలు చేయాల్సిన సమయంలో పుట్టినట్లు ఉన్నాయి, కానీ అవి చాలా నమ్మకమైనవి’’ అని అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఈవీఎంలను తిట్టడానికి సిద్ధంగా ఉన్నందున ప్రస్తుతం వాటికి విశ్రాంతి ఇవ్వాలని అననారు. గత 20-22 ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్‌కి గురవుతున్నాయని, వాటి విశ్వసనీయతను ఎప్పుడూ ప్రశ్నార్థకంగా ఎత్తి చూపేవారని, కానీ చివరకు ఎల్లప్పుడు అవి ఫలితాలను చూపించాయని అన్నారు.‘ఈవీఎంలు అన్నింటికన్నా ముందున్నాయి, ఆ పూర్ ఫెల్లోని ఎందుకు నిందించాలి..? వచ్చే ఎన్నికల వరకు కొన్ని రోజుల విశ్రాంతినివ్వండి. ఆ తర్వాత మళ్లీ అవి తమ బ్యాటరీలను మార్చుకుని, పేపర్లను మార్చుకని వినియోగంలోకి వస్తాయి. అప్పుడు మళ్లీ వాటిని నిందించడం ప్రారంభం అవుతుంది. అవి ఫలితాలను ఇస్తాయి.’’ అని అన్నారు. 18వ లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికైన సభ్యుల పేర్లను భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ కాపీని రాష్ట్రపతికి సమర్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య కసరత్తు అయిన ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినందుకు అధ్యక్షుడు ముర్ము ఎన్నికల సంఘాన్ని అభినందించారు. మొత్తం దేశం తరపున, ఎన్నికల సంఘం, దాని అధికారులు మరియు సిబ్బంది సభ్యులు, ప్రచారం మరియు పోలింగ్ నిర్వహణ మరియు పర్యవేక్షణలో పాల్గొన్న ఇతర ప్రభుత్వ అధికారులు మరియు పోలీసు మరియు భద్రతా సిబ్బంది, కేంద్ర మరియు రాష్ట్ర, ప్రయత్నాలను ఆమె ప్రశంసించారు.
*ఎన్డీయే పక్ష నేతగా మోడీ.. ఆమోదించిన నితీష్, చంద్రబాబు
లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరుగుతోంది. ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోడీ పేరును రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించగా.. ఆ ప్రతిపాదనను నితిన్ గడ్కరీ, అమిత్ షా బలపరిచారు. ఇక, ఈ ప్రతిపాదనను జేడీయూ అధినేత నితిష్ కుమార్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆమోదించడంతో.. ఎన్డీయే లోక్ సభ పక్ష నేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. కాగా, ఈ రోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎన్డీయే పక్ష నేతలు కలవనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎంపీల సంతకాలతో కూడిన లేఖను రాష్ట్రపతికి మోడీ అందజేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ స్టార్ట్ అయింది. అంతకు ముందు ఉదయం 11 గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించింది. జూన్ 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు భారత ప్రధాన మంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీయే సమావేశానికి ఎన్డీఏ పక్ష నేతలు నితీశ్ కుమార్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, అజిత్ పవార్ తదితరులు హాజరయ్యారు. మిత్రపక్షాల ఎంపీలు కూడా హాజరయ్యారు.
*భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం ప్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు.. అనంతరం సూచీలు పుంజుకుంటూ లాభాల్లో కొనసాగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా ఎనిమిదోసారి పాలసీ రేటును యథాతథంగా ఉంచాలని నిర్ణయించిన తర్వాత భారతీయ షేర్ మార్కెట్ భారీ లాభాలను నమోదు చేసింది. ఇక సెన్సెక్స్ తాజాగా ఆల్-టైమ్ హై లెవల్ కొనసాగింది. సెన్సెక్స్ 1,618 పాయింట్లు లాభపడి 76, 693 దగ్గర ముగియగా.. నిఫ్టీ 468 పాయింట్లు లాభపడి 23, 290 దగ్గర ముగిసింది. అన్ని రంగాల సూచీలు లాభాలు కొనసాగాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు 1 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 2 శాతం పెరిగాయి. నిఫ్టీలో విప్రో, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, LTIMindtree టాప్ గెయినర్స్‌గా సాగాయి. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా కన్స్యూమర్, బజాజ్ ఆటో, బ్రిటానియా నష్టపోయాయి.