*గుడ్ న్యూస్.. ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు
అనుకున్న సమయానికి ముందే మే 30న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు… క్రమంగా ముందుకు కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో కేరళవ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, అక్కడ నుంచి కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి. రుతుపవనాలు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. రుతపవనాల ప్రభాతంతో రాష్ట్రంలో కొన్ని చోట్లు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. తొలుత ఈ నెల 4-5 తేదీల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భావించగా.. ముందుగానే ప్రవేశించాయి. రుతుపవనాలు రాయలసీమ మీదుగా ప్రవేశించి రాష్ట్రమంతా విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది.
*కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్..
మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మోసగాడు పదేళ్లు తెలంగాణ పరిపాలించాడని తీవ్రంగా విమర్శించారు. ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే.. జిన్నా ఆగస్టు 14న వేడుకలు చేసుకున్నాడని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కూడా అట్లనే జూన్ 1 నుండి వేడుకలు చేస్తున్నాడన్నారు. కేసీఆర్‌కు పదవి పోయిందని, బిడ్డ జైల్లో ఉందని, కొడుకు పదవి పోయిందని దుఃఖంలో ఉన్నారన్నారు. గొర్రెలు పంపకం, చేపల మీద వేల కోట్లు తిన్నారని.. మీ దగ్గర పని చేసిన అధికారులు జైలుకి పోయారని ఆయన ఆరోపించారు. పదేళ్ల పాటు కేసీఆర్‌ని ఎలా భరించారు అనే బాధ ఉందన్నారు. మెట్రో ఆరేళ్ళ ఆలస్యం అవ్వడానికి కేసీఆర్ కారణం కాదా అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన అని అబద్ధం చెప్తున్నాడని విమర్శించారు. తెలంగాణ దేవత సోనియాగాంధీ అని.. తెలంగాణ వచ్చిన తర్వాత సోనియాగాంధీ కాళ్ళు మొక్కి.. అనంతరం గద్దె నెక్కి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఎన్ని మాటలు అన్నాడని మంత్రి వ్యాఖ్యానించారు. కేసీఆర్ నిజస్వరూపం ప్రజలకు తెలుసన్నారు. జూన్ 4 తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ ఉండదన్నారు. కుటుంబ సభ్యులు జైల్లో ఉంటారని ఆయన అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కి వెయ్యి కోట్లు ఇస్తే ఐపోయేదని.. కానీ వెయ్యి కోట్లు ఇవ్వకుండా మోసం చేశాడన్నారు. మేడిగడ్డ ప్రపంచంలో కేసీఆర్ వింత అన్నాడని.. నిజమే మూడు నెలలకు కూలింది వింతేనంటూ మంత్రి ఎద్దేవా చేశారు. రిపేర్లు చేసినా ఉండడటం అనుమానమే అని ఎన్డీఎస్ నివేదిక ఇచ్చిందన్నారు. తెలివి ఉన్నోడు 11 శాతం ఇంట్రెస్ట్‌తో అప్పులు తెస్తాడా అంటూ ప్రశ్నించారు. నల్గొండ, మహబూబ్ నగర్‌ను ఎండబెట్టారని.. గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు ఇవ్వాలని ఆలోచన కేసీఆర్‌కు వచ్చిందా అని అడిగారు. లిక్కర్ స్కామ్‌లు, టానిక్ కంపెనీలు పెట్టుకోవడమే కేసీఆర్ చేసిందంటూ తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ కరెంట్ గురించి మాట్లాడుతున్నారని.. ఛత్తీస్‌ఘడ్‌లో ఎక్కువ ధరకు కరెంట్ కొన్నారన్నారు. ప్రభాకర్ రావు ఎప్పుడు చూసినా ఆసుపత్రిలో ఉన్నా అనేవాడని ఆయన అన్నారు. ఆయన కరెంట్‌పై ఏం సమీక్ష చేశారని.. నెల రోజుల్లో కరెంట్ దోపిడీ అంతా బయటకు వస్తుందన్నారు. విచారణ నివేదిక బయటకు వస్తుందని మంత్రి తెలిపారు. అసెంబ్లీకి వచ్చే ముఖం కేసీఆర్‌కు లేదన్నారు. కేసీఆర్ ఎన్ని కేబినెట్ మీటింగ్ పెట్టారంటూ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయించారంటూ కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్, ఆయన కొడుకు ఇద్దరు జైలుకు పోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి అన్నారు.
*తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనియాడిన పవన్ కల్యాణ్
పోరాటాలకు పురిటి గడ్డయిన తెలంగాణ నాలో పోరాట స్ఫూర్తిని నింపిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. భారతదేశ చరిత్రలో తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉందని.. 1947లో తెలంగాణ మినహా దేశమంతటికీ స్వతంత్రం సిద్ధించిందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పెషల్ ట్వీట్ చేశారు. స్వాతంత్రం కోసం తెలంగాణ మరో రెండేళ్లు వేచి చూడవలసి వచ్చిందని చెప్పారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం సుమారు 60 ఏళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చిందన్నారు. సకల జనుల కల సాకారమై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అప్పుడే దశాబ్ద కాలం పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ గాలిలో.. నేలలో.. నీటిలో.. మాటలో… చివరకు పాటలో సైతం పోరాట పటిమ తొణికిసలాడుతుందని తెలిపారు. నీళ్లు నిధులు- నియామకాలనే నినాదంతో సకల జనులు సాగించిన ఉద్యమాన్ని పాలకులు సదా గుర్తెరగాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ తెలంగాణ ఫలాలు సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా అందాలని సూచించారు. అభివృద్ధిలో తెలంగాణా రాష్ట్రం అగ్రపదంలో పాలకులు నిలపాలని కోరారు. ప్రజా తెలంగాణను సంపూర్ణంగా ఆవిష్కరింప చేయాలన్నారు. అప్పుడే ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలను బలిదానం చేసిన అమరులకు నిజమైన నివాళి అని తెలిపారు. ఈ దశాబ్ద వేడుకల సందర్భంగా తన పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన తెలంగాణ వాసులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
*వైసీపీ మంచి మెజారిటీతో గెలుస్తుంది
కౌంటింగ్‌పై పార్టీ శ్రేణులకు అవగాహన కలిగించటం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి వైసీపీ పార్టీ కార్యాలయం నుండి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లతో సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. కౌంటింగ్‌లో అనుసరించాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తల పై దిశా నిర్దేశం చేశారు సజ్జల.. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ఏజెంట్లకు బాధ్యత ఉంది…. అధికారం ఉందని, కౌంటింగ్ సెంటర్ లో అలర్టు గా ఉండాలన్నారు. బ్యాలెన్స్ గా ఉండాలి…సంయమనం కోల్పోవద్దన్నారు సజ్జల. వైసీపీ మంచి మెజారిటీతో గెలుస్తుందని, వైసీపీకి పడిన ఓట్లు మన పార్టీ అభ్యర్థుల లెక్కలలోకి వచ్చేలా చూడాలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. Exit polls పేరుతో అడ్డమైన ఫిగర్స్ వస్తున్నాయని, బీజేపీ నాలుగు వందల టార్గెట్ కోసం అలా చేసినట్టు అనిపిస్తుందన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దేశంలోనే చంద్ర బాబు కు పీహెచ్డీ ఉందని, కౌంటింగ్ లో ఏమైనా ఇష్యూస్ వస్తె వెంటనే RO దృష్క్షికి తీసుకెళ్ళాలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కౌంటింగ్ సెంటర్ లో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే సెంట్రల్ ఆఫీసు దృష్టికి తీసుకురండని ఆయన తెలిపారు.
*జైలులో లొంగిపోయేందుకు బయలుదేరిన కేజ్రీవాల్..
ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో లొంగిపోయేందుకు తన నివాసం నుంచి బయలుదేరారు. మార్గం మధ్యలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీనికి నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించి హనుమంతుడి ఆశీస్సులు పొందనున్నారు. లొంగిపోయే ముందు ఆయన ఆప్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి కార్యకర్తలు, పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత తీహార్ జైలులో లొంగిపోతారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కేజ్రీవాల్ తన నివాసం నుంచి బయలుదేరారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ మార్చి నెలలో అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది. దాదాపుగా 50 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్న తర్వాత, ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మే 10 నుంచి జూన్ 1 వవరకు 21 రోజుల పాటు కేజ్రీవాల్‌కి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న లొంగిపోవాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంతో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తాను జైలుకు వెళ్లొద్దంటే ఆప్‌కి, ఇండియా కూటమికి ఓటేయాలని ఢిల్లీ ప్రజలను కోరారు. మరోవైపు ఢిల్లీ కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం కేజ్రీవాల్ వేసిన పిటిషన్ జూన్ 5న విచారణకు రానుంది. ‘‘ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు 21 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చినందుకు సుప్రీంకోర్టుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయన బయటకు వచ్చి ఎన్నికల కోసం ప్రచారం చేసి ప్రజాస్వామ్య ప్రక్రియకు సహకరించారు. మేము సుప్రీంకోర్టును గౌరవిస్తాము. ఆప్ నాయకుడు ఎవరూ భయపడరు. అరవింద్ కేజ్రీవాల్ లొంగిపోబోతున్నాడు మరియు అతను ఈ రోజు తీహార్ వెళ్తున్నాడు’’ అని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషీ అన్నారు.
*ఈసీని కలవనున్న ఇండియా కూటమి..ఎందుకంటే?
లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత.. ఇండియా కూటమిలో కలకలం రేగింది. అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా మారాయి. దీంతో ఇండియా కూటమికి చెందిన ప్రతినిధి బృందం ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు నిర్వాచన్ సదన్‌కు వెళ్లి ఎన్నికల కమిషన్‌ను కలవనుంది. కూటమి తమ 3 ప్రధాన డిమాండ్లను కమిషన్ ముందు ఉంచనుంది. ‘మొదటిది.. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం.. VVPAT లో స్లిప్‌లను సరిపోల్చాలి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టాలి. ప్రతి రౌండ్ తర్వాత అభ్యర్థులకు డేటా వెల్లడించాలి. ఆ రౌండ్ లో ఎలాంటి అవకతవకలు లేవని అందరూ తేల్చిన తర్వాతే మరో రౌండ్ లెక్కింపు ప్రారంభించాలి.’ ఈ డిమాండ్లను ఈసీ ముందుంచనుంది. కాగా తాజాగా ఎగ్జిట్ పోల్స్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఎగ్జిట్ పోల్‌ను ఆయన పూర్తిగా తిరస్కరించారు. ఇది ఎగ్జిట్ పోల్ కాదని, మోడీ మీడియా పోల్ అని రాహుల్ గాంధీ అన్నారు. ఇది వారి ఫాంటసీ పోల్ అని ఆరోపించారు. చాలా స్థానాల్లో పోటీ ఎక్కువగా ఉందని, ఫలితాలు వచ్చాక అంతా తేలిపోతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత కూటమికి 295 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ ‘సిద్ధూ మూసేవాలా పాటను గుర్తు చేశారు. ఈ పాట మీరు విని అప్పుడు అర్థం చేసుకోవాలని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్‌ను ‘నకిలీ’గా పేర్కొంటూ.. ఇది ఎన్నికల రిగ్గింగ్‌ను సమర్థించే ‘ఉద్దేశపూర్వక ప్రయత్నమని’, భారత కూటమి కార్యకర్తలను నిరుత్సాహపరిచేందుకు ప్రధాని మోడీ ఆడుతున్న ‘సైకలాజికల్ గేమ్’ అని కాంగ్రెస్ అభిప్రాయపడింది.
*అమిత్ షా కలెక్టర్లను బెదిరిస్తున్నారు.. స్పందించిన ఈసీ..
మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపు ముందు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. అమిత్ షా అన్ని జిల్లాల అధికారులను పిలిచి బెదిరించారని ఆరోపించారు. ఈ ఆరోపణలు చేసిన ఒక రోజు తర్వాత కేంద్రం ఎన్నికల సంఘం స్పందించింది. ఏ అధికారి కూడా ‘‘అనవసరమైన ప్రభావం’’ గురించి నివేదించలేదని, ఏవైనా వివరాలు ఉంటే ఆదివారం సాయంత్రం 7 గంటల వరకు ఇవ్వాలని, వీటిని బట్టి చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. ‘‘ అధికారం కోల్పోతున్న హోంమంత్రి కలెక్టర్లను పిలుస్తున్నారు. ఇప్పటి వరకు అమిత్ షా 150 మందితో మాట్లాడారు. అధికారులను బహిరంగంగా బెదిరించే ప్రయత్నం చాలా సిగ్గుచేటు మరియు ఆమోదయోగ్యం కాదు. ప్రజాస్వామ్యం ఆదేశానుసారం పని చేస్తుందని గుర్తుంచుకోండి, బెదిరింపులపై కాదు. జూన్ 4న ప్రధాని మోడీ, అమిత్ షా ఇద్దరు నిష్క్రమిస్తారు. ఇండియా కూటమి విజయం సాధిస్తుంది. అధికారులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకూడదు. వారు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి’’ అని ఎక్స్ వేదికగా జైరాం రమేష్ ట్వీట్ చేశారు. మీరు జాతీయ పార్టీలో సీనియర్ నేత కాబట్టి కౌంటింగ్ రోజుకు ముందు మీరు నిజమని నమ్ముతున్న సమాచారాన్ని, ఆధారాలను ఇవ్వాలని, 150 మంది కలెక్టర్ల అందించాలని ఈసీ కోరింది. తద్వారా తగిన చర్యలు తీసుకోవచ్చని ఎన్నికల సంఘం చెప్పింది. అయితే, ఇలాంటి ఆరోపణలను కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి కొట్టిపారేశారు. భారత హోం మంత్రి ఏ జిల్లా అధికారిని లేదా సబ్ డివిజనల్ అధికారిని పిలువరు, ఒక రాష్ట్ర సీఎంతో వ్యవహరిస్తారు అని అన్నారు.
*పూణే కార్ యాక్సిడెంట్‌లో కీలక పరిణామం
పూణేలో పోర్ష్ కార్ యాక్సిడెంట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మైనర్ నిందితుడు వేగంగా కారు నడిపి ఇద్దరు యువ ఐటీ నిపుణుల మరణానికి కారణమయ్యాడు. అయితే, ఈ కేసులో మైనర్ నిందితుడి తండ్రి ధనవంతుడు కావడంతో కేసులోని సాక్ష్యాలు తారుమారు చేయడం, అధికారులను ప్రభావితం చేయడం వంటి విషయాలు వెలుగులోకి రావడంతో ఈ కేసు ప్రముఖంగా మారింది. ఇదిలా ఉంటే ఈ కేసులో కీలక పరిణామం జరిగింది. ప్రమాదం జరిగిన రోజు రాత్రి బాగా తాగి ఉన్నట్లు మైనర్ పోలీసుల ముందు అంగీకరించినట్లుగా పోలీస్ వర్గాలు ఆదివారం తెలిపాయి. విచారణలో తనకు జరిగిన సంఘటనలన్నీ పూర్తిగా గుర్తుకు రాలేదని అధికారులకు తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేసిన కేసులో 17 ఏళ్ల మైనర్ తల్లిదండ్రులు శివాని అగర్వాల్, విశాల్ అగర్వాల్‌లకు పూణఏ కోర్టు అధివారం జూన్ 5 వరకు పోలీస్ కస్టడీ విధించింది. వీరిపై రక్తనమూనాలను తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మైనర్ బాలుడి రక్తాన్ని, అతని తల్లి రక్తంతో తారుమారు చేశారు. మే 19న పూణే కళ్యాణి నగర్‌లో మోటర్ బైక్‌పై వెళ్తు్న్న ఇద్దరు ఐటీ నిపుణలను మైనర్ నిందితుడు కారుతో ఢీకొట్టి చంపేశాడు. ఈ ఘటన తర్వాత నిందితుడు తాగి లేడని చెప్పేందుకు రక్త నమూనాలను మార్చారు. ప్రమాదానికి ముందు సదరు టీనేజ్ అబ్బాయి పబ్‌లో మద్యం సేవిస్తున్న సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, వైద్య పరీక్షల కోసం అతన్ని సాసూన్ జనరల్ హాస్పిటల్‌కు తీసుకువచ్చినప్పుడు, వైద్యులు అతని తండ్రి ఆదేశాల మేరకు అతని రక్త నమూనాను అతని తల్లి రక్తంతో మార్చారు. ఇందుకోసం బాలుడి తండ్రి వైద్యులకు లంచం ఇచ్చినట్లు కూడా తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అగర్వాల్ దంపతులు కుట్ర చేసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్త నమూనాలను తారుమారు చేయడం ద్వారా సాక్ష్యాలను నాశనం చేశారు. ఈ ఘటనలో పోలీసులు మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ప్రమాదానికి సంబంధించిన ఒక ఎఫ్ఐఆర్, మైనర్ బాలుడికి మద్యం అందించినందుకు బార్‌పై రెండోది, నిందితుడి కుటుంబ డ్రైవర్‌ని ఈ కేసులో తప్పుగా ఇరికించేందుకు బలవంతం చేయడంపై మూడో ఎఫ్ఐఆర్ నమోదైంది. బాలుడి తల్లిదండ్రులతో పాటు అతని తాతని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదనంగా, వారు రక్త నమూనా తారుమారు చేసినందుకు సాసూన్ జనరల్ హాస్పిటల్ నుండి ఇద్దరు వైద్యులను మరియు ఒక ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు.
*ఎయిర్‌పోర్టులో కలకలం.. నటుడి బ్యాగులో 40 బులెట్లు..
ఈ మధ్యకాలంలో దేశంలోని అనేక ప్రాంతాలలో బాంబులు పెట్టినట్లుగా బెదిరింపు కాల్స్ రావడం కామన్ గా మారింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో, అలాగే రవాణా స్టేషన్లలో ఇలాంటి బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో తాజాగా ఎయిర్పోర్టులో బులెట్లు దర్శనం ఇవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది. గడిచిన మే నెలలో దేశవ్యాప్తంగా ఇలా 50 కి పైగా ఫేక్ కాల్స్ లో పలుచోట్ల బాంబులు ఉన్నట్లుగా బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి మనం చూశాం. తాజాగా తెలంగాణలోని ప్రజాభవన్ లో, అలాగే నాంపల్లి కోర్టు ఆవరణలో బాంబు ఉన్నట్లుగా ఫేక్ కాల్స్ వచ్చిన సంగతి కూడా మీడియా ద్వారా తెలుసుకున్నాము. కాకపోతే ఇదంతా ఫేక్ గా జరుగుతోంది. ఇలా ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో ఒక మూలన దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా చెన్నై విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే సినీ నటుడైన కరుణాస్ హ్యాండ్ బ్యాగ్ లా దాదాపు 40 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది. దీంతో ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఈ విషయం సంబంధించి విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కరుణాస్ పొరపాటున బులెట్లు తనతో తీసుకోవాల్సినట్లు విచారణలో పేర్కొన్నారు. చూడాలి మరి దీనిపై ఎయిర్ పోర్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో.
*దిగ్గజ ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్న భారత యువ సంచలనం ప్రజ్ఞానంద
భారత టీనేజ్ చెస్ సంచలనం ఆర్. ప్రజ్జ్ఞనందా శనివారం రాత్రి క్లాసికల్ చెస్ గేమ్‌లో ఐదో రౌండ్‌లో ప్రపంచ నంబర్ 2 ప్లేయర్ ఫాబియానో కరువానాను ఓడించాడు. దింతో ప్రస్తుతం జరుగుతున్న నార్వే చెస్ పోటీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఈ విజయంతో, అతను నార్వేకు చెందిన ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్, ప్రపంచ నంబర్ 2 కరువానాను క్లాసిక్ చెస్‌లో మొదటిసారి ఓడించాడు. ప్రస్తుతం జరుగుతున్న పోటీలో అతని విజయాలు అతన్ని అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) ప్రపంచ ర్యాంకింగ్స్ లో మొదటి పది స్థానాల్లోకి సంపాందిచి పెట్టింది. యువ సంచలన ప్రజ్ఞానానంద రౌండ్ 5లో ప్రపంచ నం.2 ఫాబియానో కరువానాను ఓడించడం ద్వారా చెస్ ప్రపంచాన్ని మళ్లీ ఆశ్చర్యపరిచాడు. రౌండ్ 3 లో ప్రపంచ నం.1 మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడకొట్టిన తర్వాత, అతను ఇప్పుడు క్లాసికల్ చెస్‌లో మొదటి ఇద్దరు ఆటగాళ్లను ఓడించాడు. కాకపోతే గురువారం స్పేర్‌బ్యాంక్ 1 SR బ్యాంక్ లో జరిగిన నార్వే చెస్ 2024 రౌండ్ 4లో ప్రగ్నానంద అమెరికాకు చెందిన హికారు నకమురాపై ఓడిపోయాడు. ఆ గేమ్ లో నకమురా ప్రజ్ఞానందకు వ్యతిరేకంగా అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు. మరోవైపు, ప్రాగ్ సోదరి వైశాలి దిగ్గజ క్రీడాకారిణి పియా క్రామ్లింగ్‌ను ఓడించడం ద్వారా తన ఆధిపత్య ప్రదర్శనను కొనసాగించింది. తన ఆధిక్యాన్ని మొత్తం 8.5 పాయింట్లకు పెంచుకుంది. భారత మహిళల చెస్ గ్రాండ్‌మాస్టర్ హంపీ 4వ రౌండ్‌లో అన్నా ముజిచుక్ తో జరిగిన క్లాసికల్ గేమ్‌లో ఓడిపోయింది. ఇక అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ప్రముఖ మహీంద్రా కంపెనీ వ్యవస్థాపకుడు ఆనంద్ మహేంద్ర కూడా కొనసాగుతున్న నార్వే చెస్ పోటీలో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్, ప్రపంచ నంబర్ టూ ఫాబియానో కరువానాపై అద్భుతమైన విజయం సాధించిన తర్వాత భారత టీన్ చెస్ సంచలనం ఆర్ ప్రగ్నానందను ప్రశంసించారు.