తమిళిసైకి అమిత్‌షా వార్నింగ్..!
తమిళనాడు బీజేపీతో అంతర్గత కుమ్ములాటలపై హైకమాండ్ సీరియస్‌గా ఉంది.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేరుగా రంగంలోకి దిగారు.. గన్నవరం ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా పవన్ కల్యాణ్, నారా లోకేష్ తదితరులు ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు తమిళిసై సౌందరరాజన్.. ఈ సందర్భంగా తమిళిసైతో మాట్లాడారు అమిత్‌షా.. అయితే, వెంకయ్యనాయుడు, అమిత్‌షాకు నమస్కారం చేస్తూ ముందుకు వెళ్తున్న తమిళిసైని వెనక్కి పిలిచిన దాదాపు నిమిషం పాటు మాట్లాడారు అమిత్‌షా.. ఈ సమయంలో అమిత్‌షా కాస్త సీరియస్‌గా ఉన్నట్టు కనిపించింది.. తమిళనాడు అన్నామలైతో గొడవపడొద్దని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది.
మంత్రులకు శాఖల కేటాయింపుపై చంద్రబాబు కసరత్తు.. ఎవరికి ఏ శాఖ అంటే..?
తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు.. కేబినెట్ మంత్రులను కూడా ప్రమాణస్వీకారం చేయించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలకు కూడా కేబినెట్‌లో చోటు దక్కింది.. ఇక. మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు కొనసాగిస్తున్నారు సీఎం చంద్రబాబు.. 24 మందిలో ఆరుగురికి మాత్రమే గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.. అయితే, సాయంత్రానికి శాఖల కేటాయింపు చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.. హోం, ఇరిగేషన్, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, ఆర్థిక శాఖ, పరిశ్రమల శాఖలను సీనియర్లకు కేటాయించే ఛాన్స్ ఉందంటున్నారు.. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖల కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది.. గతంలో ఐటీ శాఖ చూసిన నారా లోకేష్.. తిరిగి అదే శాఖతో పాటు విద్యా శాఖ ఇస్తారని చర్చ నడుస్తోంది.. ఆర్థిక శాఖను ఆనం రామనారాయణరెడ్డి లేదా పయ్యావుల కేశవ్‌కు కేటాయిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.. ఇక, పట్టణాభివృద్ధి శాఖ ను సీఎం వద్ద లేదా నారాయణకు కేటాయిస్తారని చర్చ కూడా ఉంది.. గతంలో పట్టణాభివృద్ధి శాఖలో భాగంగా అమరావతి నిర్మాణ బాధ్యతలు చూశారు నారాయణ. మైనారిటీల సంక్షేమం శాఖను ఫరూక్ కు కేటాయించే అవకాశం ఉండగా.. గిరిజన సంక్షేమ శాఖను గుమ్మడి సంధ్యా రాణికి ఇచ్చే ఛాన్స్ ఉంది.. సాంఘిక సంక్షేమ శాఖను డోలా బాలవీరాంజనేయ స్వామి లేదా అనితకు ఇస్తారని ప్రచారం సాగుతోంది.. గతంలో బీసీ సంక్షేమ శాఖ బాధ్యతలు చూశారు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర.. ఇలా మంత్రులకు శాఖలపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.. కానీ, ఫైనల్ ఎవరికి ఏ శాఖలు దక్కుతాయి అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
సీఎం చంద్రబాబు, మంత్రులకు మోడీ అభినందనలు.. ఏపీని నూతన కీర్తి శిఖరాలకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాం..
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.. ముఖ్యమంత్రిగా నాల్గోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.. వారితో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేశారు.. ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. సీఎం చంద్రబాబుతో.. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో.. సూపర్‌స్టార్ రజనీకాంత్, నందమూరి బాలకృష్ణ సహా పలువురు నేతలతో ఆప్యాయంగా మాట్లాడారు. ఇక, ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా సీఎం, కొత్త మంత్రులకు అభినందనలు తెలిపారు.. ఏపీని నూతన కీర్తి శిఖరాలకు తీసుకెళ్లడానికి మరియు రాష్ట్ర యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ విషయానికి వస్తే.. ”ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాను. ముఖ్యమంత్రి అయిన సందర్భంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, మరియు ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ కూడా అభినందనలు. ఏపీని నూతన కీర్తి శిఖరాలకు తీసుకెళ్లడానికి మరియు రాష్ట్ర యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి టీడీపీ, జనసేన మరియు బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.” అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక, తన ట్వీట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రుల ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేవారు ప్రధాని నరేంద్రమోడీ.
డిప్యూటీ సీఎంగా పవన్.. ముందే లీక్ చేసిన అమిత్‌షా, చిరంజీవి, అకీరా నందన్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు.. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా.. ఇతర మంత్రులు… సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు.. అయితే, మంత్రులకు శాఖల కేటాయింపుపై ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తుండగా.. మరోవైపు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటూ ముందే లీక్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. ”ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు నేడు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారందరికీ నా అభినందనలు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.” అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు అమిత్‌షా.. అంటే.. తన ట్వీట్‌లో పవన్ కల్యాణ్‌ను ఏపీ డిప్యూటీ సీఎంగా పేర్కొన్నారు అమిత్‌షా.. మరోవైపు.. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ముందుగానే పేర్కొన్నారు.. ”ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబునాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను….ఆశిస్తున్నాను.!!” అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, మెగాస్టార్ చిరంజీవి కంటే ముందే ఈ విషయాన్ని బయట పెట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్.. “Honourable Deputy Chief Minister Of Andhra Pradesh Shri Pawan Kalyan Garu” అంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు అకీరా నందన్..
సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై జస్టిస్ చంద్ర ఘోష్ కమిటీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రాజెక్టును సందర్శించిన కమిటీ.. ఇప్పుడు విచారణను వేగవంతం చేసింది. అయితే.. ఈనేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ మాట్లాడుతూ.. ఈరోజు ఏజెన్సీలతో సమావేశం అయ్యాము. వాళ్లను అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పానని, గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవాలని అఫిడవిట్ ఫైల్ చేయమన్నాని ఆయన తెలిపారు. టైం బౌండ్ గురించి ఏజెన్సీలు అందరూ చెప్తున్నారు. ప్రభుత్వం విధించిన సమయంలో ప్రాజెక్టు అందించామని అన్నారని, ఎజెన్సీలను నిర్మాణం, డిజైన్, మెంటేనెన్స్ గురించి పూర్తిగా ఇవ్వాలని అదేశించానన్నారు జస్టిస్ చంద్ర ఘోష్. ఏది చెప్పినా, ఎవరూ కమిషన్ కు చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలని, ఈ నెలాఖరు లోపు అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని అదేశించామని ఆయన తెలిపారు. ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయి అనేది రికార్డు రూపంలో సమాధానం వచ్చాక వాళ్లను కూడా పిలుస్తామని, సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేయమని చెప్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళతో అఫిడవిట్ వచ్చాక ఇతర వ్యక్తులను కూడా పిలుస్తానని, కొంతమంది అధికారులు స్టేట్ లో లేరు. వాళ్లను కూడా విచారణ చేస్తామన్నారు చంద్ర ఘోష్. విజిలెన్స్, కాగ్ రిపోర్టులు అందాయి…వాళ్లను కూడా విచారణ చేస్తామని, తప్పుడు అఫిడవిట్ ఫిల్ చేస్తే మాకు తెలిసిపోతుందన్నారు.
నా భర్త సీఎం అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు: మోహన్ మాఝీ భార్య
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దశాబ్ధంగా ఒడిశాను పాలిస్తున్న నవీన్ పట్నాయక్‌ని అధికారాన్ని నుంచి దించింది. అసెంబ్లీలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్రంలోని ఎంపీ స్థానాలను దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసింది. ఇదిలా ఉంటే ఈరోజు ఒడిశా సీఎంగా బీజేపీ ఎమ్మెల్యే మోహన్ చరణ్ మాఝీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఒడిశా రాష్ట్రానికి మూడో గిరిజన ముఖ్యమంత్రిగా, బీజేపీ నుంచి తొలి ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ చరిత్ర సృష్టించారు. తన భర్త ఒడిశా ముఖ్యమంత్రి అవుతారని తాము ఊహించలేదని మోహన్ మాఝీ భార్య ప్రియాంకా మాఝీ అన్నారు. తమ కుటుంబ సభ్యులు కూడా దీన్ని ఊహించలేదని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. భువనేశ్వర్‌లోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో మోహన్ తల్లి, భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. మంగళవారం మాఝీని కొత్త సీఎంగా ప్రకటించడంతో ఒక్కసారిగా వారంతా ఆశ్యర్యం వ్యక్తం చేశారు. టీవీ ఛానెల్ ద్వారా ఈ విషయం తెలిసిందని, ఆ క్షణం వరకు తన భర్త సీఎం అవుతారని ఎప్పుడూ కూడా ఊహించలేదని ప్రియాంకా చెప్పారు.
అంతులేని విషాదం.. 40 మంది భారతీయులు సజీవదహనం
బుధవారం తెల్లవారుజామున ఓ ఎత్తైన భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అందరూ నిద్రలో ఉండగా మంటలు అంటుకున్నాయి.. దీంతో నిద్రలోంచి మేల్కొనేలోపే మంటలు, పొగలు కమ్ముకున్నాయి. దీంతో తప్పించుకునే మార్గం లేక అక్కడినే 40 మంది భారతీయులు సజీవదహనం అయ్యారు. పదులు కొద్ది భారతీయులు గాయాలు పాలయ్యారు. వీరంతా ఇండియాలోని ఆయా రాష్ట్రాల నుంచి కార్మికులుగా వెళ్లి ఆ భవనంలో ఉంటున్నారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో కేరళకు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక భారత రాయబార కార్యాలయం నుంచి కేంద్రమంత్రి సమాచారం సేకరిస్తున్నారు. మృతుల కుటుంబాలకు జై శంకర్ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని.. సహాయ అందిస్తామని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
యాపిల్ సీఈఓతో 13 ఏళ్ల భారతీయ బాలుడు.. ఫొటో వైరల్
యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను 13 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన కుర్రాడు కలవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా.. యాపిల్ (Apple) అతిపెద్ద ఈవెంట్ వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 జరుగుతోంది. ఈవెంట్ మొదటి రోజున ఆపిల్ తన వినియోగదారుల కోసం అనేక పెద్ద ప్రకటనలు చేసింది. ఈ క్రమంలో ఆపిల్ యొక్క ఈ వార్షిక ఈవెంట్‌లో చాలా మంది వ్యక్తులు భాగమయ్యారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన విభిన్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో టిమ్ కుక్‌తో కలిసి 13 ఏళ్ల భారతీయ చిన్నారి నవ్వుతున్న ఫోటో కూడా వైరల్ అవుతోంది.
నేను గర్భవతిని.. నా మొగుడ్ని చంపేశారు, ఇప్పుడు దిక్కెవరు?
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన ఆరోపణలపై కన్నడ హీరో దర్శన్, అతని భార్య, స్నేహితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి దర్శన్ అభిమాని ఒకరు బెంగళూరుకు పిలిపించి కామాక్షిపాళ్యంలోని తన స్నేహితుడి గోడౌన్ షెడ్డులో దాచిపెట్టి దారుణంగా కొట్టి చంపినట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఇప్పుడు హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడతో సహా 13 మందిని అరెస్టు చేశారు పోలీసులు. బెంగళూరులో రేణుక స్వామి హత్యపై రేణుకాస్వామి భార్య సహాన మీడియా ముందు కన్నీరుమున్నీరుగా విలపించారు. నా భర్త హత్యకు గురయ్యాడు, నేను గర్భవతిని. మాకు పెళ్లయి ఏడాది అయింది. నా భర్తకు ఇలా జరగకూడదు, నేను తల్లి అవుతున్నాను, భర్త లేకుండా ఎలా ఉండాలి? నా, బిడ్డ భవిష్యత్తు ఏమిటి? అని ప్రశ్నిస్తూనే తనకు న్యాయం చేయాలని కన్నీళ్లతో వేడుకుంది.