*ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్న సీఎం జగన్..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధం అవుతున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అది కూడా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారట.. ఈ నెల 25వ తేదీన భీమిలిలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు వైసీపీ రెడీ అవుతోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి 5-6 వేల మందిని తీసుకుని వచ్చేలా పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ క్రియాశీల కార్యకర్తలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం అవుతారని తెలిపారు వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి.. భీమిలిలో జరిగే బహిరంగ సభ ద్వారా కేడర్ కు జగన్మోహన్ రెడ్డి దశ దిశ నిర్ధేశం చేస్తారని తెలిపారు. ఇక, పార్టీలో అసంతృప్తులు తొలగించడం, ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులకు గల కారణాలను నేరుగా సీఎం జగనే వివరించి చెబుతారని పేర్కొన్నారు. మొత్తంగా ఐదు ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు వైవీ సుబ్బారెడ్డి. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన సీఎం జగన్.. ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికలకు పార్టీని గెరప్ చేసే దిశగా రాష్ట్రంలో 5 కేడర్ మీటింగ్ లు పెట్టాలని కూడా వైసీపీ నిర్ణయించింది. తొలి బహిరంగ సభ ద్వారా కేడర్ కు దిశా నిర్ధేశం చేస్తారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ ప్లీనరీకి మించి ఈ సభ తలపెట్టారు.. ఒక్కో నియోజకవర్గం నుంచి 6 వేల మంది వరకు పార్టీ కేడర్‌ను తీసుకుని వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
*దావోస్ సమ్మిట్.. వరంగల్‌కు పరిశ్రమలు.. ఆయనే కీలకం..!
స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ నేతృత్వంలోని అధికారుల బృందం పాల్గొంది.. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సాగుస్తోన్న ఈ పర్యటనలో సదస్సు ప్రారంభం రోజే దాదాపు రూ.38 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి.. అదానీ గ్రూప్, అంబుజా సిమెంట్స్, జేఎస్‌డబ్ల్యూ, గోది ఇండియా, వెబ్ వర్క్ (ఐరన్ మౌంటెన్), అరాజెన్ లైఫ్ సైన్సెస్, గోద్రెజ్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇక, దావోస్ సమ్మిట్ నుంచి వరంగల్‌కు భారీగా పెట్టుబడులు, పరిశ్రలము రానున్నాయి.. ఆ దిశగా బిజినెస్ సమ్మిట్ లో చర్చలు జరుపుతున్నారు వరంగల్ గడ్డకు చెందిన నంబర్ 1 గుంటి శ్రీధర్ రావు.. తన జన్మ స్థలానికి పరిశ్రమలు తీసుకొచ్చే దిశలో దావోస్ బిజినెస్ మీట్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.. దీంతో, త్వరలోనే వరంగల్ కు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడతాయని అంచనా వేస్తున్నారు. దావోస్ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందాలతో వరంగల్ నంబర్ వన్ గా మారుతుందా? కొత్త కొలువులతో , కళకళలాడుతుందా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. దావోస్ బిజినెస్ మీట్‌లో వరంగల్ కు చెందిన గుంటి శ్రీధర్ రావు.. పెట్టుబడులు వచ్చే విధంగా కృషి చేస్తున్నారు. కర్ణాటకతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో టెలి కమ్యూనికేషన్ పరిశ్రమలు కలిగిఉన్న ఆయన.. తను పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలన్న మమకారంతో.. దావోస్ బిజినెస్ సమ్మిట్ లో పాల్గొన్నారు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో బిజీబిజీగా గడుపుతున్నాడు, పలు సెల్ కంపెనీలకు చెందిన ప్రముఖులతో గుంటి శ్రీధర్ రావు హిస్టారికల్ సిటీ వరంగల్ గురించి చెబుతూ.. పరిశ్రమలు తీసుకువచ్చే దిశలో చర్చలు జరుపుతున్నారు.. ఇది సక్సెస్ అయితే త్వరలో వరంగల్ కు జాతీయ అంతర్జాతీయ సంస్థలు రానున్నాయి.. దీనితో వరంగల్ ముఖచిత్రం మారడంతో పాటు ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ఉన్నారు.
*ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు: కేటీఆర్
కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని, ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే కేవలం ఆరు నెలల్లోని ప్రభుత్వంపైన ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతుబంధు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి గ్రామం నుంచి రాష్ట్రస్థాయి దాకా పెద్ద ఎత్తున అన్ని స్థాయిలలో ప్రాతినిథ్యం ఉందని, ఇంతటి బలమైన పార్టీ తిరిగి గెలుపు బాట పట్టడం పెద్ద కష్టమేమి కాదని కేటీఆర్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.’కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల సంఖ్య సరిగ్గా 420 ఉన్నాయి. ఈ 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయాలి. డిసెంబర్ 9న ముఖ్యమంత్రి అవుతున్న అని చెప్పి.. రైతు రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి పదేపదే చెప్పారు. డిసెంబర్లో కరెంట్ బిల్లు సోనియా గాంధీ కడుతుందని చెప్పారు. రైతులకు 10,000 కాదు 15,000 ఇస్తా అన్నారు. రెండు వేల పెన్షన్ను 4,000 చేస్తా అన్నారు. వాటిని అమలు చేయమని గుర్తు చేస్తున్నాం. పాలమూరు, రంగారెడ్డికి జాతీయ హోదా సాధిస్తామని చెప్పారు. మొన్న ఉత్తంకుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కేంద్ర జలవనరుల మంత్రిని కలిసిన తర్వాత జాతీయ ప్రాజెక్టు ఇవ్వడానికి వీలుల్లేదని చెప్పారు. జాతీయ హోదా మావల్ల కాదు అంటూ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది. ఈ విషయాన్ని మహబూబ్ నగర్ ప్రజలు గుర్తుంచుకోవాలి. మహబూబ్ నగర్ పక్కనే ఉన్న అప్పర్ బద్ర ప్రాజెక్టుకి కర్ణాటకలో జాతీయ హోదా ఇచ్చిన బీజేపీని నిలదీసే ప్రయత్నం ఉత్తమ్, కిరణ్ కుమార్ రెడ్డి చేయలేదు’ అని కేటీఆర్ అన్నారు. ‘ప్రియాంక గాంధీ 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కానీ అసెంబ్లీ సాక్షిగా ఉపముఖ్యమంత్రి మాత్రం నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెబుతున్నారు. ఒకటేసారి రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలకు భిన్నంగా ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి దశలవారీగా రుణమాఫీ చేస్తామంటున్నారు. గతంలో రోజుకు పది లక్షల మంది చొప్పున వారం రోజుల్లో 70 లక్షల మందికి రైతుబంధు ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా రైతుబంధు రైతు ఖాతాలలోకి వస్తలేదు. ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఎరువుల కోసం లైన్లో నిలబడే పరిస్థితులు మరలా వచ్చాయి. ఎరువులను పోలీస్ స్టేషన్లలో పెట్టి పంచే పరిస్థితి వచ్చింది. ఇలాంటి విషయాలను రైతులకు తెలియజేయాల్సిన బాధ్యత మాపైన ఉంది. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే కేవలం ఆరు నెలల్లోనే ప్రభుత్వంపైన ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది’ అని కేటీఆర్ చెప్పారు. ‘నాలుగు కోట్ల మంది ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీకి తక్కువ వచ్చిన ఓట్లు కేవలం నాలుగు లక్షలు మాత్రమే. పార్టీకి గ్రామం నుంచి రాష్ట్రస్థాయి దాకా పెద్దఎత్తున అన్ని స్థాయిలలో ప్రాతినిథ్యం ఉంది. గ్రామపంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ప్రతిచోట పార్టీకి బలమైన నాయకత్వం, ప్రాతినిథ్యం ఉంది. ఇంతటి బలమైన పార్టీ తిరిగి గెలుపు బాట పట్టడం పెద్ద కష్టమేమి కాదు. పార్టీపైన గతంలో జరిగిన దుష్ప్రచారాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మన పార్టీ నాయకులు, కార్యకర్తల పైన ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజలకు అందించిన మనపైన విస్తృతమైన దుష్ప్రచారం జరిగింది. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది నేరుగా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఆయా కార్యక్రమాలను అమలు చేశాము. సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్ళేటట్లు చేశాం. దీనివల్ల ప్రభుత్వం, పార్టీ అనే తేడాను ప్రజలు తెలుసుకోలేకపోయారు. ప్రజలకు కోసం చేసిన కార్యక్రమాలను కూడా బీఆర్ఎస్ పార్టీ ద్వారా జరిగిందనే విషయం చెప్పలేకపోయాం. భారీగా పెన్షన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందించినా చెప్పుకోవడంలో కొంత విఫలమయ్యాం’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
*నామినేషన్లు దాఖలు చేసిన బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్
ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ గురువారం అసెంబ్లీలో నామినేషన్లు దాఖలు చేశారు. వారి వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి దీపదాస్ మున్షీ తదితరులున్నారు. శాసనమండలికి ఉప ఎన్నికలు జనవరి 29న జరగనున్నాయి. గత ఏడాది డిసెంబరు 9న ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డిలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాజీనామా చేయడంతో శాసనమండలిలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. అదే రోజు ఎన్నికలు, ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. అసెంబ్లీలో వారి బలాన్ని పరిశీలిస్తే మండలిలోని రెండు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. శాసనమండలిలో బీఆర్‌ఎస్‌కు 27 సీట్లు ఉండగా, కాంగ్రెస్‌కు రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి. అంతకుముందు గుండెపోటుతో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పరామర్శించారు. తమ్మినేని వీరభద్రం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా సీపీఎం నేతను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
*నాలుగవ జాబితాపై కొనసాగుతున్న కసరత్తు.. అభ్యర్థుల్లో వీడని ఉత్కంఠ
ఏపీ సీఎం వైఎస్ జగన్ అభ్యర్ధుల ఎంపిక మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. దీంతో నాలుగవ జాబితాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే నాలుగవ జాబితా కోసం వైసీపీ అధినాయకత్వం తుది కసరత్తు ప్రారంభించింది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఫుల్ బిజీగా ఉన్నాట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నేతలు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జీల మార్పులపై సీఎం కసరత్తు ఆరంభించారు. పలువురు ఇన్చార్జీల మార్పుతో నాలుగో జాబితాను సిద్దం చేస్తున్నారు. ఇక, సీఎంవోకు మంత్రి అంబటి రాంబాబుతో పాటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు వచ్చారు. అలాగే, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల పార్టీ ఇన్ చార్జీల మార్పులపై సీఎం కసరత్తు చేస్తున్నారు. ఇక, పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చింది.. దీంతో హుటాహుటినా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. వీరి ఇరువురి సమావేశంలో కందుకూరు నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జి మార్పుపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు టాక్. అలాగే, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్ కూడా సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. కనిగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జి మార్పుపై చర్చిస్తున్నారు. అలాగే, మార్కాపురం నియోజకవర్గం పార్టీ ఇన్ చార్జి మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. సీఎం జగన్ ను మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి కలిశారు. మార్కాపురం నియోజకవర్గ ఇన్ చార్జిగా మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పేరును దాదాపు సీఎం ఖరారు చేశారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని పిలిపించి జగన్ మాట్లాడారు. దీనికి సంబంధించి సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వచ్చారు. అయితే, ఈసారి ఎమ్మెల్యే అభ్యర్ధుల కంటే ఎంపీ అభ్యర్ధులే ఎక్కువ మంది ఉంటారని సమాచారం. ఇప్పటికే కొన్ని చోట్ల ఎంపీ అభ్యర్ధులను వైసీపీ అధినాయకత్వం ప్రకటించింది. ఇక, నాలుగవ జాబితాలో ఏకంగా తొమ్మిది మంది ఎంపీ అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందని టాక్. ఈ మేరకు ముమ్మరంగా వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. నాలుగో జాబితాలో నర్సరావుపేట, గుంటూరు, మచిలీపట్నం, రాజమండ్రి, కాకినాడ, బాపట్ల, కడప, రాజంపేట, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్దులను సీఎం జగన్ ప్రకటించే ఛాన్స్ ఉంది.
*ఈ నెలాఖరులోగా టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చే ఛాన్స్
ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ రసవత్తరంగా మారుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల పోరుకు సిద్ధం అవుతున్నాయి. పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన మధ్య తీవ్రంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల జనసేన ఇన్ ఛార్జ్ లతో రాజమండ్రిలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. టీడీపీ- జనసేన పార్టీల మధ్య పొత్తులో సీట్ల సర్దుబాటు విషయమై ఇన్చార్జీలతో భేటీలో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. టికెట్ రాలేదని ఎవరు నిరుత్సాహ పడవద్దని ఇన్చార్జీలకు నాదెండ్ల సూచించారు. అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పారు. టీడీపీ- జనసేన పొత్తులో టిక్కెట్ ఎవరికి వచ్చిన గెలుపు కోసం కృషి చేయాలని మనోహర్ విజ్ఞప్తి చేశారు. అయితే, మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసేందుకు 3 ఎమ్మెల్యే నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారు. నర్సాపూరం, గాజువాక, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇక, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీరితో పాటు 50 నియోజకవర్గాలలో ఎవరికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలో అనే విషయంపై జనసేన పార్టీకి చెందిన నేతలతో నాదేండ్ల మనోహర్ ప్రధానంగా చర్చించారు.
*బాలరాముడి ప్రతిష్ట.. కేంద్రం కీలక నిర్ణయం
అయోధ్యలోని శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ హాలీడే ప్రకటిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరామ మందిరంలోని గర్భగుడిలో రామ్‌లాలా కొత్త విగ్రహం ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’ కార్యక్రమం సోమవారం జరగనుంది. ఈ వేడుకను ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అన్ని కార్యాలయాలన్నింటికి ఈ హాఫ్ హాలీడే వర్తించనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. మరోవైపు.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ఉదయం నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు హాఫ్ హాలీడే ఇచ్చే అవకాశం ఉంది. అయోధ్యలో జరిగే రాంలల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో చూసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈనెల 22ప ప్రధాని మోదీ రామాలయాన్ని ప్రారంభించి, రాంలల్లాను ప్రతిష్ఠాపన చేసిన తర్వాత జనవరి 23 నుంచి ఆలయాన్ని భక్తుల కోసం తెరుస్తామని తెలిపారు. కాగా.. విగ్రహ ప్రతిష్టాపన రోజు తమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని, దీపావళి వంటి పండుగలను జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా జనవరి 22 తర్వాత పార్లమెంటు నియోజకవర్గాల వారి ప్రజలను రైళ్లలో అయోధ్యకు పంపించాలని చెప్పారు.
*జాంబియాలో కలరాతో 400 మందికి పైగా మృతి.. 10,000 మందికి ఇన్ఫెక్షన్..
ఆఫ్రికా దేశం జాంబియాలో కలరా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఆ దేశంలో 400 మందికి పైగా మరణించారు. మరో 10,000 మందికి ఈ వ్యాధి సోకినట్లు తేలింది. కలరా భయంతో పాఠశాలల్ని మూసేసింది అక్కడి ప్రభుత్వం. సామూహిక టీకా కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తోంది. దేశ రాజధానిలో ఫుట్‌బాల్ స్టేడియంలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లను చేసింది. కలరా అనేది బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్. ఇది తీవ్రమైన డయేరియాకు దారి తీస్తుంది. కలుషిత నీరు, ఆహారం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. జాంబియాలో కలరా వ్యాప్తి గతేడాది అక్టోబర్ నెలలో ప్రారంభమైంది. ఇప్పటి వరకు 412 మంది మరణించారు. 10,413 కేసులు నమోదయ్యాయి. దేశంలోని సగం జిల్లాలు, 10 ప్రావిన్సుల్లోని తొమ్మిదింటిలో కలరాను కనుగొన్నట్లు జాంబియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో రోజుకు 400 కంటే ఎక్కువ కలరా కేసులు నమోదువుతున్నాయి. మలావీ, మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాల్లో 2023 ప్రారంభం నుంచి కలరా కేసులు నమోదవుతున్నాయి. 2023లో దశాబ్దాలలో మలావిలో కలరా వ్యాప్తి అత్యంత దారుణంగా ఉంది. గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. నైజీరియా, ఉగాండా దేశాలతో సహా సుమారు 30 దేశాలు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన వ్యాప్తికి గురయ్యాయని నివేదించింది. 1970 నుంచి జాంబియాలో చాలా సార్లు కలరా వ్యాప్తి చెందింది. ఎక్కువ కేసులు రాజధాని లుసాకాలోనే ఉన్నాయి. 60,000 సీటింగ్ సామర్థ్యం ఉన్న ఫుట్‌బాట్ స్టేడియాన్ని తాత్కాలిక ఆస్పత్రిగా మార్చింది అక్కడి ప్రభుత్వం. డబ్ల్యూహెచ్ఓ నుంచి జాంబియాకు దాదాపుగా 1.4 మిలియన్ డోసుల కలరా వ్యాక్సిన్ అందింది. త్వరలోనే 2,00,000 డోసులు వస్తాయని అంచనా వేస్తున్నారు.
*ఇరాన్‌పై పాక్ ప్రతీకార దాడి.. పలువురు ఉగ్రవాదులు హతం!
రెండు రోజుల క్రితం టెహ్రాన్ దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ గురువారం ఇరాన్‌లోని సిస్తాన్-ఓ-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై దాడి చేసింది. ఇస్లామాబాద్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇస్లామాబాద్‌లోని ఒక ప్రకటనలో, పాకిస్తాన్ భద్రతా దళాలు సమన్వయంతో , నిర్దిష్ట లక్ష్యంగా ఖచ్చితమైన సైనిక దాడులను నిర్వహించాయని పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇరాన్‌లో క్షిపణి దాడులు నిర్వహించామని, ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్‌లో పలువురు ఉగ్రవాదులను హతమార్చామని పాకిస్థాన్ గురువారం తెలిపింది. దీనికి ‘మార్గ్ బార్ శర్మాచర్’ అనే సంకేతనామం ఇవ్వబడింది. ఇరాన్‌లోని సిస్తాన్-ఓ-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై “అత్యంత సమన్వయంతో, నిర్దిష్ట లక్ష్యంతో నిర్దిష్టమైన సైనిక దాడులను” ప్రారంభించినట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్‌లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు, దీనికి ‘మార్గ్ బార్ శర్మాచర్’ అనే సంకేతనామం పెట్టారు. ఇరాన్ మంగళవారం నాటి దాడిని ఖండించిన తరువాత పాకిస్తాన్ సైనిక చర్య జరిగింది, ఇద్దరు పిల్లలు మరణించారని సమాచారం. పాకిస్థానీ మూలానికి చెందిన ఈ ఉగ్రవాదులు తమను తాము సర్మాచార్లు (అంటే తిరుగుబాటుదారులు)గా పిలుచుకుంటున్నారని, ఇరాన్ నేల నుండి తమ ప్రణాళికలను అమలు చేస్తారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్థాన్‌లోని అమాయకుల రక్తాన్ని వారు నిరంతరం చిందిస్తూనే ఉన్నారు. అటువంటి పరిస్థితిలో, పాక్ ఆర్మీ ఆపరేషన్‌కు ఈ పేరు పెట్టింది, దీని అర్థం సాధారణ భాషలో – తిరుగుబాటుదారులను చంపడానికి ఆపరేషన్. ఈ ఉగ్రవాదుల ఉనికి, కార్యకలాపాలకు సంబంధించిన ఖచ్చితమైన సాక్ష్యాలతో కూడిన అనేక పత్రాలను పాకిస్తాన్ పంచుకుంది. ఇరాన్ దాడి వల్ల అమాయక పాకిస్థానీలు రక్తాన్ని చిందించారని పాకిస్థాన్ వెల్లడించింది. “ఉగ్రవాద కార్యకలాపాల గురించి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఈ ఉదయం చర్య తీసుకోబడింది. ఈ చర్య అన్ని బెదిరింపుల నుంచి తన జాతీయ భద్రతను కాపాడుకోవాలనే పాకిస్తాన్ సంకల్పానికి ఒక వ్యక్తీకరణ. ” అని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సంక్లిష్టమైన ఆపరేషన్ విజయవంతమైంది. ఇది అమలుకు నిదర్శనం. పాకిస్తాన్ సాయుధ దళాల వృత్తి నైపుణ్యం, తన ప్రజలకు భద్రత కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలను పాకిస్థాన్ కొనసాగిస్తుందని ప్రకటించింది. ఈ రోజు తెల్లవారుజామున సరిహద్దు ప్రాంతంలో తొమ్మిది మందిని చంపిన పాకిస్తాన్ ప్రతీకార క్షిపణి దాడిని ఇరాన్ గురువారం ఖండించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాసర్ కనానీ మాట్లాడుతూ, వివరణ ఇవ్వడానికి టెహ్రాన్‌లోని అత్యంత సీనియర్ దౌత్యవేత్త, పాకిస్తాన్ ఛార్జ్ డి’అఫైర్స్‌ను పిలిపించినట్లు చెప్పారు. “సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని సరిహద్దు గ్రామంపై పాకిస్తాన్ తెల్లవారుజామున దాడి చేసిన తరువాత, ఒక గంట క్రితం టెహ్రాన్‌లోని పాక్ ఛార్జ్ డి’అఫైర్స్‌ను వివరణ కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించారు” అని స్థానిక మీడియా ప్రతినిధి చెప్పారు.
*మెగాస్టార్ కు పద్మవిభూషణ్ ఇవ్వనున్న కేంద్రం..?
తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవికి మరో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కు పద్మవిభూషణ్ అవార్డు రావడం గురించి రిపబ్లిక్ డే రోజు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. ఆరోజు మోదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.ఈ ఏడాది పద్మ అవార్డ్స్ లిస్ట్‌లో చిరంజీవి పేరు ప్రముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.కరోనా కష్ట సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి మోదీ ప్రభుత్వం మెగాస్టార్‌ను పద్మవిభూషణ్‌తో సత్కరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. లాక్‌డౌన్ టైమ్‌లో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు చిరంజీవి నిత్యావసరాలు అందజేశారు. సినీ కార్మికులతో పాటు కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడిన సామన్య ప్రజలను ఆదుకునేందుకు అంబులెన్స్ మరియు ఆక్సిజన్ సదుపాయాలను ఉచితంగా కల్పించారు.సినీ పరిశ్రమతో పాటు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తించి పద్మవిభూషణ్ అవార్డును అందజేయబోతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే చిరంజీవి పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. 2006లో ఈ అవార్డును ఆయన స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చిరంజీవి పద్మభూషణ్ అందుకున్నారు.. ఇప్పుడు బీజీపీ ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్‌తో సత్కరించనుంది. చిరంజీవి పద్మవిభూషణ్‌కు ఎంపికైన వార్త టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వార్త తెలిసి మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషిస్తున్నారు..ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు.ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న.ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. వంద కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ మరియు విక్రమ్ విశ్వంభర మూవీని నిర్మిస్తున్నారు. విశ్వంభరలో చిరంజీవికి జోడీగా త్రిష హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే త్రిషతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తుంది.అయితే త్వరలోనే ఈ సినిమాలోని హీరోయిన్స్ గురించి త్వరలోనే క్లారిటీ రానున్నట్లు సమాచారం