అందుకే మళ్లీ వైసీపీలో చేరా.. మూడోసారి విజయం మాదే..!
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్నారు.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో మళ్లీ పార్టీలోకి వచ్చేశారు.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే.. మంగళగిరిలో పార్టీని మూడవ సారి గెలిపించేందుకు వైసీపీలో చేరినట్టు వెల్లడించారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాటలో నడిచేందుకు వచ్చాను.. వైఎస్ జగన్ సీఎంగా ఉంటే ప్రజల జీవితాలు బాగు పడతాయన్నారు.. మంగళగిరిలో పార్టీ ఏ అభ్యర్థిని నిలబెట్టినా.. వాళ్ల గెలుపు కోసం కృషి చేస్తాను అని వైఎస్ జగన్‌కు చెప్పానని.. భేషరుతుగా వైసీపీలో చేరానని ప్రకటించారు. ఇక, బీసీ సామాజిక వర్గ అభ్యర్థి చేతిలో మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోతారు అని జోస్యం చెప్పారు ఆర్కే.. మంగళగిరి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్న ఆయన.. బీసీ సామాజికవర్గానికి వైసీపీ మంగళగిరి టికెట్ ఇస్తుందని క్లారిటీ ఇచ్చారు.. మరోవైపు వైఎస్ జగన్‌ను ఓడించడానికి రాష్ట్రంలో పార్టీలు అన్ని ఒక్కటి అయ్యాయని ఫైర్ అయ్యారు.. మొత్తంగా మూడోసారి మంగళగిరిలో వైసీపీ గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి.. కాగా, వైసీపీ టికెట్ రాదనే సంకేతాలతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆర్కే.. ఆ తర్వాత వైఎస్ షర్మిలతో కలిసి నడవనున్నట్టు ప్రకటించారు.. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు.. అయితే, కొన్ని రోజుల్లోనే తిరిగి ఆయన సొంత గూటికి చేరుకోవడం ఆసక్తికరంగా మారింది..
రాజమండ్రి రూరల్ జనసేనకే.. అభ్యర్థి ఖరారు..!
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి ముందుకు సాగాలని నిర్ణయించిన విషయం విదితమే.. ఆ రెండు పార్టీలతో బీజేపీ కలిసి వస్తుందా? అనే విషయం తేలాల్సి ఉన్నా.. పొత్తులో భాగంగా కొన్ని సీట్లు టీడీపీ-జనసేన పంచుకుంటున్నాయి.. ఇక, పొత్తులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ టిక్కెట్ జనసేన పార్టీకే దక్కింది.. అంతే కాదు.. తమ అభ్యర్థి పేరును కూడా ఖరారు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ పోటీ చేయనున్నట్టు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఆశావహులు, ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ సమావేశం ముగిసింది.. రాజానగరం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు పవన్.. అయితే రాజానగరం అభ్యర్థి ఖరారుపై ఉత్కంఠ నెలకొంది. అయితే, తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ ఉమ్మడిగా అధికారికంగా కందుల దుర్గేష్ పేరును ప్రకటించనున్నారని నేతలు చెబుతున్నారు.. అయితే, కందుల దుర్గేష్ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత ఖరారు చేయడంపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఆది నుంచి తనకే టికెట్ వస్తుందన్న నమ్మకంతోనే ఉన్నారు కందుల దుర్గేష్.. మొత్తానికి ఈ రోజు పార్టీ అధినేత క్లారిటీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీకి అందరూ సమానమే.. కేంద్రం సహకారం కోసమే కొన్ని బిల్లులకు మద్దతు..!
ఎస్సీలను కొందరు రెండు వర్గాలుగా విభజించాలని చూస్తున్నారు.. వైసీపీకి అందరూ సమానమే అన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. వైసీపీ సెంట్రల్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం నుంచి పలువురు నేతలు.. వైసీపీలో చేఆరు.. వేమూరు నియోజకవర్గం చుండూరు, అమర్తలూరు, భట్టిప్రోలు మండలాల్లోని ఇతర పార్టీలకు చెందిన బీసీ, ఎస్సీ, మైనార్టీ నాయకులు, కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు విజయసాయిరెడ్డి.. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి వరికూటి అశోక్ బాబు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సాయిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఒంటరిగానే పోటీచేయాలనేది సిద్ధాంతమని స్పష్టం చేశారు. ఇక, మతతత్వ పార్టీతో పొత్తుపెట్టుకునే టీడీపీని నమ్మొద్దని సూచించారు విజయసాయిరెడ్డి.. అయితే, కేంద్ర ప్రభుత్వ సహకారం కోసమే కొన్ని బిల్లులకు మద్దతు పలికామని తెలిపారు. త్రిపుల్ తలాక్ వంటి బిల్లులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకలేదని గుర్తుచేసిన ఆయన.. సెక్యులర్ భావాలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లులకు సపోర్టు చేయలేదన్నారు. మతతత్వ పార్టీలతో ఎప్పుడూ వైసీపీకి పొత్తు ఉండదూ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.
కుప్పంకే ఏమీ చేయలేదు.. ఇక, జిల్లాకు ఏమి చేసి ఉంటారు..?
టీడీపీ అధినేత చంద్రబాబును మరోసారి టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గానికే ఏమీ చేయలేని చంద్రబాబు జిల్లాకు ఏమి చేసి ఉంటారు..? అని ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి నీరు అందించలేకపోయారు.. కుప్పం కే ఏమి చేయలేని చంద్రబాబు జిల్లాకు ఏమి చేసి ఉంటారు ? అని మండిపడ్డారు. అయన ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని ప్రజలకు తెలుసన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ కుప్పంకు నీరు అందించాలన్న ధృఢనిశ్చయంతో పని చేశారని తెలిపారు. ఇప్పటికే హంద్రీనీవా నీరు కుప్పం నియోజవర్గంలోకి వచ్చాయి.. వచ్చే ఏడాదిలో కుప్పం ప్రజలకు పుష్కలంగా నీరు అందుతుందని పేర్కొన్నారు. ఇక, తెలుగుదేశం పార్టీ వారు అన్నా క్యాంటీన్ అని చెప్పి ట్రాక్టర్ లో తీసుకొచ్చి పది మందికి భోజనం పెట్టారు.. అలాంటి క్యాంటీన్ లు ఎన్ని ఉన్నా ఒక్కటే లేకున్న ఒక్కటే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే, మేం రాజన్న క్యాంటీన్ పేరుతో ఎంత మంది వచ్చిన, వారందరికీ మంచి భోజనం అందిస్తున్నాం అని వెల్లడించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
డీఎస్సీ నోటిఫికేషన్‌పై విచారణ.. ఏజీ అభ్యర్థనతో వాయిదా వేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.. అయితే, అడ్వకేట్ జనరల్ అభ్యర్థనతో విచారణ వాయిదా వేసింది హైకోర్టు.. హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం ముందు.. ఈ రోజు డీఎస్సీ నోటిఫికేషన్‌పై విచారణ సాగింది.. పిటిషనర్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.. ఎస్‌జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడo సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని న్యాయమూర్తులు ముందు వాదనలు వినిపించారు.. దేశ అత్యున్నత న్యాయస్థానం మరియు ఎన్సీటీఈ నిబంధనలుకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని ఆరోపించారు.. అయితే, ప్రభుత్వ వివరణ తీసుకోవడానికి సమయం కావాలని ఏజీ.. హైకోర్టును అభ్యర్థించారు.. అడ్వకేట్ జనరల్ అభ్యర్థన మేరకు విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.
రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం..
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు సీట్లకు మూడు నామినేషన్లే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్‌ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. కాగా.. రేపు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని రేణుకా చౌదరి తీసుకోనున్నారు. మరోవైపు.. అనిల్ కుమార్ యాదవ్ కు రిటర్నింగ్ అధికారులు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేశారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో.. 3 స్థానాలకు ముగ్గురే ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇటీవల రాజ్యసభ ఎన్నిలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే బీఆర్‌ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు.. శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, భోజరాజు కోయాల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ నామినేషన్లు వేశారు. అయితే వారి నామినేషన్లను ఈసీ తిరస్కరించడంతో.. ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ఆధునీకరించాలి.. సీఎం విజ్ఞప్తి
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా వీరి మధ్య చర్చలు కొనసాగాయి. కాగా.. తెలంగాణలోని జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అందులో భాగంగా.. 15 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ఆధునీకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా.. నల్గొండ టౌన్ కి బైపాస్ రోడ్ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. CIRF ఫండ్స్ పెంపుదల.. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం పనులు.. హైదరాబాద్ – కల్వకుర్తి, హైదరాబాద్ -విజయవాడ లైనింగ్ పనులు.. నల్గొండలో రవాణా శిక్షణ కేంద్రం ఏర్పాటు అంశాలపై నితిన్ గడ్కరితో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు.
మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్..!
మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తోంది. ఎంపీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ గత కొన్నిరోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేసింది. అందులో భాగంగా రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సింది. వీటితోపాటు జమ్మూ కాశ్మీర్ లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ సమాయత్తం అయింది. ఇందుకోసం మార్చి 8, 9వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం కావాలని ఈసీ భావిస్తోంది. ఆ తర్వాత మార్చి 12, 13వ తేదీల్లో ఎలక్షన్ కమిషన్ బృందం జమ్మూకాశ్మీర్ లో పర్యటించే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఎన్నికల నిర్వహణపై ఈసీ ఒక అంచనాకు రానుంది. ఈ టాస్క్ ముగిసిన తర్వాత మార్చి రెండోవారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంది. గత లోక్సభ షెడ్యూల్ను ఈసీ మార్చి 10 ప్రకటించింది. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలను నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.
పెళ్లి వేడుకలో అత్యుత్సాహం.. విషాదం మిగిల్చిన కాల్పులు
పెళ్లి (Wedding) అనేది జీవితంలో ఒక్కసారే చేసుకునేది. ఊహ వచ్చి.. తెలిసుండి చేసుకునేది పెళ్లొక్కటే. దీన్ని ఎంతో గ్రాండ్‌గా చేసుకోవాలని అనుకుంటారు. జీవితంలో గుర్తుండి పోయేలా చేసుకోవాలని అనుకుంటారు. పెళ్లి ఏర్పాట్ల దగ్గర నుంచి మ్యారేజ్ అయ్యేంత వరకూ ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. లైటింగ్, డెకరేషన్లు, డీజే సౌండ్.. బాణాసంచా, డ్యాన్సులు.. ఇలా ఒక్కటేంటి?.. ఎన్నో ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. తప్పేం లేదు. కానీ పెళ్లి పేరుతో హద్దులు దాటితే మాత్రం.. సంతోషం కాస్తా.. విషాదంగా మారే అవకాశం ఉంటుంది. ఇదంతా ఎందుకంటారా? పెళ్లి సంబరాల్లో తుపాకీతో కాల్పులు జరపడం కొందరికి ఆనందాన్ని ఇస్తే.. మరొకరికి కడుపుకోత మిగిలింది. ఈ ఘోరం మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్-చంబల్ డివిజన్‌లో జరిగిన మూడు వేర్వేరు ఘటనల్లో ఒక చిన్నారి మృతి చెందగా.. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గ్వాలియర్, దతియా, శివపురి జిల్లాల్లో జరిగిన వివాహ వేడుకల్లో 48 గంటల్లోనే ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
ఆపరేషన్ జక్కన్న.. ఆ పని చేసి అండర్ గ్రౌండ్ లోకి మహేష్?
ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకధీరుడు రాజమౌళి తన తరువాతి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేకపోయినా… అంచనాలు మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో రోజుకో వార్త ఈ సినిమాపై పుట్టుకొస్తుంది. వీటన్నిటికీ బ్రేకులు వేసేలా త్వరలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రెస్ మీట్ తరహాలోనే మహేష్ బాబు, రాజమౌళి, నిర్మాత కె ఎల్ నారాయణ కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టనున్నారట. ఇక ఈ ప్రెస్ మీట్ లోనే అధికారికంగా ఈ సినిమా గురించి చెప్పనున్నారని తెలుస్తోంది. ఆ రోజే సినిమా టైటిల్ లేదా వర్కింగ్ టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా పనులు పూర్తికాగా మరో పేరు SSRMB అనే వర్కింగ్ టైటిల్ కూడా అనధికారికంగా ప్రచారంలో ఉంది. ఇక ఈ ప్రెస్ మీట్ అనంతరం ఇక మహేష్ బాబు కూడా ఓ యాడ్ షూట్ లో బిజీగా ఉండనున్నారని సమాచారం. ఇక ఆ యాడ్ షూటింగ్ లోనే మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం ఫోటోషూట్ కూడా ఏర్పాటు చేయనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ యాడ్ షూటింగ్ తర్వాత పూర్తిగా జక్కన్న అధీనంలోకి మహేష్ వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇక జక్కన్న సూచనల మేరకు మహేష్ బాబు తన బాడీ బిల్డింగ్ మీద దృష్టి పెట్టి.. మీడియాకు, కెమెరాలకు దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది. దీనికి కారణం రాజమౌళి పెట్టిన కండిషన్స్ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా స్క్రిప్టింగ్ జరుగుతుండగా ఈ మే నెలలో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ఈ మూవీ పాన్ వరల్డ్ సినిమాగా రానుంది. ఈ మూవీలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు నటులు నటించనున్నారని ప్రచారం అయితే జరుగుతోంది.
సైలెంటుగా సిద్ధార్థ్ ఆనంద్ కి కౌంటర్ ఇచ్చిన వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్స్ లో వేగం పెంచుతోంది సినిమా యూనిట్. అందులో భాగంగానే తెలుగు, హిందీ భాషల ట్రైలర్స్ ని ఈరోజు లాంచ్ చేసింది. ఇక హైదరాబాద్ లో ఒక ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ నిర్వహించి ఆ తర్వాత మీడియాతో కూడా ముచ్చటించింది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ ఫైటర్ సినిమా దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ కి అనూహ్యంగా కౌంటర్ ఇచ్చినట్లు కనిపించారు. ఆయన కావాలని మాట్లాడలేదు కానీ ఆయన మాట్లాడిన మాటలు మాత్రం సిద్ధార్థ ఆనంద్ కి కౌంటర్ ఇచ్చినట్లుగానే ఉన్నాయి. అసలు విషయం ఏమిటంటే ఫైటర్ సినిమాకి హిందీలో సరైన రెస్పాన్స్ రాకపోవడంతో ఇదే విషయాన్ని సిద్ధార్థ ఆనంద్ ని ప్రశ్నిస్తే ఆయన చాలా మంది ప్రేక్షకులు కనీసం ఏరోప్లేన్ ఎక్కిన అనుభవం కూడా లేని వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఎయిర్ ఫైటింగ్ సినిమా అంత ఈజీగా అర్థం కాదు కాబట్టే సినిమా అంతగా ఆడలేదని ఆడియన్స్ మీద నెపం వేసే ప్రయత్నం చేశారు. ఇక వరుణ్ తేజ్ ని ఆయన గత సినిమాలు అన్ని ప్రయోగాత్మకమైనవే అయినా ఎందుకు ప్రేక్షకులు సినిమాలను ఎంకరేజ్ చేయలేదని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా సిద్ధార్థ ఆనంద్ కి కౌంటర్ ఇచ్చినట్లు మాట్లాడారు వరుణ్ తేజ్. తాను సినిమా బాగానే ఉన్నా ఆడియన్స్ ఎంకరేజ్ చేయలేదు అనే కాన్సెప్ట్ నమ్మను అని చెప్పుకొచ్చాడు. తన ప్రయోగాలు ఫెయిల్ అయినప్పుడు ఆడియన్స్ ని ఎప్పుడూ తాను బ్లేమ్ చేయలేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఆడియన్స్ తన సినిమాని చూడలేదంటే కచ్చితంగా స్క్రిప్ట్ లో కానీ స్క్రీన్ ప్లే లో కానీ ఏదో ఒక సమస్య ఉందని తాను భావిస్తానని, ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఆయన ఉద్దేశం వేరే అయినా సరే అది సిద్ధార్థ ఆనంద్ కి కౌంటర్ ఇచ్చినట్లుగానే ఉందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.
బ్లాక్ బస్టర్ భైరవకోన.. వీఐ ఆనంద్ తో మరో సినిమా అనౌన్స్ చేసిన అనిల్ సుంకర..
టాలీవుడ్ దర్శకుడు VI ఆనంద్ తెరకేక్కించిన తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన.. యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ సినిమాలో హీరోగా నటించారు.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. ప్రస్తుతం ఈ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. తాజాగా దర్శకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, అతని కొత్త చిత్రాన్ని ప్రకటించారు. OPBK సమర్పణలో AK ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన అనిల్ సుంకర రామబ్రహ్మం సుంకరతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రాజేష్ దండా, అజయ్ సుంకర సహ నిర్మాతలుగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రానికి డైలాగ్స్ అందించిన అబ్బూరి రవి కొత్త సినిమాకు కూడా పని చేయనున్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న టైటిల్ లేని సినిమాను ఒక టీవీ ప్రదర్శిస్తుంది.VI ఆనంద్ అతీంద్రియ సాహసాలు చేయడంలో పేరుగాంచాడు.. సరికొత్త ప్రయోగాలు చేశాడు.. కొత్త చిత్రం కథ మరియు సెటప్ పరంగా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ మెగా-బడ్జెట్ వెంచర్ TFIలో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవబోతోంది. ఇకపోతే ఈ సినిమా హీరో, ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
నాలుగు రోజులు కష్టపడ్డా.. అయినా గుంటూరు కారంలో నన్ను లేపేశారు!
యూట్యూబర్ కుషిత కళ్లపు గురించి సోషల్ మీడియా యూజర్స్ అందరికి పరిచయమే. యూట్యూబ్ స్థాయి నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే కుషిత అనే పేరు కంటే.. బజ్జిల పాపగా ఈ ముద్దుగుమ్మకు పేరు ఎక్కువగా వచ్చింది. బజ్జిల పాప అంటే ఎక్కువ మంది గుర్తుపట్టేస్తారు. ఆ విషయం పక్కన పెడితే.. కుషిత తాజాగా నటిస్తున్న చిత్రం బాబు నెం1 బుల్షిట్ గయ్. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేం అర్జున్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా.. ఆయన సరసన కుషిత హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో కుషిత గుంటూరు కారం సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గుంటూరు కారంలో తాను ఓ పాత్ర చేసినట్లు బయటపెట్టింది. అంతే కాదు ఆ సినిమా కోసం నాలుగు రోజులు షూటింగ్ కూడా పూర్తి చేసిందట. కానీ ఏం అయిందో తెలియదు ఫైనల్ అవుట్ పుట్ లో మాత్రం కుషిత పాత్రను గుంటూరు కారం మేకర్స్ లేపేశారు. ఈ విషయం తనను ఎందో బాధించదని.. సినిమా యూనిట్ తనకు అన్యాయం చేశారని బాధను వెల్లడించింది. అయితే తన పాత్రే కాదు.. ఆమెతో నటించిన చాలా మంది పాత్రలు లేపేశారని చెప్పుకువచ్చింది. ఇలా ఇండస్ట్రీలో జరగడం కొత్త కాదని.. ఇది సహజమని అనుకున్నట్లు ప్రెస్ మీట్ లో తెలిపింది. ఇక బాబు నెం1 బుల్షిట్ గయ్ చిత్రం విషయానికి వస్తే.. ఇటీవల ట్రైలర్ రిలీజ్ కాగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. లక్ష్మణ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.