ఆన్‌లైన్ రమ్మీపై నిషేధం వద్దని ఏపీ హైకోర్టు తీర్పు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్ రమ్మీపై నిషేధం వద్దన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఆన్‌లైన్ రమ్మీ నిషేధం వద్దన్న ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే, ఆన్‌లైన్ రమ్మీ గేమా ? లేక అదృష్టమా..? అనే అంశం నిర్ధారించేందుకు కమిటీ ఏర్పాటు చేసింది హైకోర్టు.. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మధ్యంతర ఉత్తర్వులుగానే పరిగణించాలని పేర్కొంది.. కమిటీ నివేదిక అందిన తర్వాత అన్ని విషయాలను పరిశీలించాలని ఏపీ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు దీనిపై ప్రభావం చూపొద్దని ఆదేశించింది.. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను హైకోర్టు పరిగణలోకి తీసుకోవాలని సూచించింది సుప్రీంకోర్టు.. ఈ అంశంపై హైకోర్టు తుది తీర్పు మూడు వారాల వరకు అమల్లోకి తీసుకురాకూడదని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.
రెండు ప్రధాన అంశాలపై ఢిల్లీకి వచ్చా.. అది తేలాకే ఎన్నికలకు వెళ్లాలి..
ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మొదట ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు ప్రధాన అంశాలపై ఢిల్లీకి వచ్చాను.. ఒకటి ఎన్టీఆర్ 100వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేయడం.. ఎన్టీఆర్ కు కేంద్రం ఇచ్చిన గౌరవం అన్నారు. దేశ రాజకీయాల్లో దశ దిశా చూపిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్న ఆయన.. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలనేది చిరకాల వాంఛ అన్నారు. ఇక, అతి ముఖ్యమైన సమస్య.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇక్కడకు వచ్చాను.. వింత విచిత్ర సమస్యగా ఉంది.. ఒక పార్టీ ఓట్లు తీసేసే ఆలోచన ఎవ్వరికీ రాలేదు.. కానీ, ఇప్పుడు జరుగుతోంది.. దీనిపై ఆధారాలతో సహా పోరాడాం.. ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగైదు ఎన్నికలు జరిగాయి.. అన్నింటిలో దొంగ ఓట్లతో గెలిచారని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్ చర్యలకు ఉపక్రమించినా, అమలు చేయకపోవడం దారుణమైన విషయం అన్నారు. గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో కూడా అవకతవకలు చేశారు.. అయినా మేమే గెలిచాం అన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత.. ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేస్తున్నారు.. మాస్క్ ఇవ్వాలని అడిగితే, డాక్టర్ సుధాకర్ ను బెదిరించి చంపించేశారు.. ఎదురు తిరిగితే ఇబ్బందులకు గురి చేయడం కామన్ గా మారిపోయిందన్నారు. రౌడీయిజం నాకు తెలియదు.. నామీద దాడి చేసి.. నా మీదే కేసు పెట్టారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు. అధికారులను భయపెట్టారు. మీడియాను భయపెడ్తున్నారు.. టీడీపీ ఓట్లను తీసేస్తున్నారు.. ఆధారాలతో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశానని తెలిపారు. చంద్రగిరిలో ఒక పోలింగ్ స్టేషన్ పెట్టారు.. ఎప్పుడో కట్టబోయే భవనాన్ని నోటిఫై చేశారు.. విశాఖలో, మచిలీపట్నంలో ఓట్లు తొలగించారు.. ఉరవకొండలో ఇలాగే జరిగింది.. 15 లక్షల ఓట్లు దొంగ ఓట్లుగా చేర్చారు.. డోర్ నంబర్ జీరోలో వందల ఓట్లు ఉన్నాయి.. ఎక్కడ ఏం జరిగింది.. అనేది స్పష్టమయిన ఆధారాలతో ఈసీకి ఇచ్చామని, వాలంటీర్ల అరాచకాలపై ఆధారాలు కూడా ఈసీకి ఇచ్చామని వివరించారు.
మ్యానిఫెస్టోలో చెప్పినవి.. చేసింది కేసీఆర్ మాత్రమే..
కొల్లాపూర్ కు చెందిన పలు పార్టీలకు చెందిన నేతలు మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ డిక్లరేషన్లకు విలువ లేదు అని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు అని ఆయన అన్నారు. 2009 ఎన్నికల్లో పెట్టిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ అమలు చేయలేదు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. అంబేద్కర్ ను ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.. దళితులపై కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమ ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంట్ ఇస్తారు అని మంత్రి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఉచిత కరెంట్ అని.. ఉత్త కరెంట్ చేశారు.. మ్యానిఫెస్టోలో చెప్పనవి.. చెప్పినవి చేసింది కేసీఆర్ మాత్రమే అని మంత్రి హరీశ్ రావు అన్నారు. కొల్లాపూర్ లో గులాబీ జెండా ఎగురేయాలి.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ తో ఈ సీజన్ లో సాగునీరు అందిస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటున్నారు.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు ఐదు మెడికల్ కాలేజీలు ఉన్నాయి.. కేసీఆర్ హయాంలో కొల్లాపూర్ అభివృద్ధి చెందింది అని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రజల కోసమే కేసీఆర్ కష్టపడుతున్నాడని ఆయన పేర్కొన్నారు.
వీలైనంత త్వరగా అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తాం
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే మీడియాతో చిట్ చాట్ లో భాగంగా మాట్లాడుతూ.. లెఫ్ట్ పార్టీలతో అనధికారికంగా చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రాథమిక చర్చలు మాత్రమే కొనసాగుతున్నాయి.. సీపీఐ, సీపీఎంతో మాట్లాడుతున్నామన్నారు. వీలైనంత త్వరగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అంశం రాష్ట్ర స్థాయిలో చర్చలు జరగడం లేదు అని ఠాక్రే తెలిపారు. వైఎస్ షర్మిల అంశం అంతా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే పేర్కొన్నాడు. ఒక్క బీఆర్ఎస్ కారులో బీజేపీ.. కేసీఆర్.. కవిత, కేటీఆర్.. హరీశ్ రావు ఐదుగురు ప్రయాణం చేస్తున్నారు అని ఆయన తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోతోంది అని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోంది అని మాణిక్ రావు ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కీలక హామీలపై గ్యారంటీ కార్డు ఇస్తాం ప్రజలకు అని మాణిక్ రావు ఠాక్రే చెప్పాడు. ఇంటింటికి గ్యారెంటీ కార్డు తీసుకు వెళతాం.. బీసీలకు పార్లమెంట్ నియోజక వర్గంలో రెండు అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని ఆయన తెలిపాడు. త్వరలో మూడు డిక్లరేషన్లు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.
మహిళలకు గుడ్‌న్యూస్.. రక్షాబంధన్ కానుక ఇవ్వనున్న సిద్ధరామయ్య సర్కారు
కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం గృహలక్ష్మి యోజన ద్వారా మహిళలకు బహుమతులు ఇవ్వబోతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గృహలక్ష్మి యోజనను ప్రారంభించనుంది. ఖర్గే, రాహుల్ సమక్షంలో కోటి మందికి పైగా మహిళలకు నెలకు రూ.2,000 భృతి ఇవ్వనున్నారు. మైసూర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు సమాచారం అందించారు. అధికారుల ప్రకారం, గృహ లక్ష్మి యోజన కోసం సుమారు 1.08 కోట్ల మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీల్లో ఈ పథకం ఒకటి. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడంపై ఐదు హామీలు ఇచ్చింది. ఈ వేడుకలకు లక్ష మంది తరలివస్తారని సీఎం సిద్ధరామయ్య విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహిస్తారని, ఆయన సమక్షంలో గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. దీంతో పాటు రాహుల్ గాంధీ కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు. కార్యక్రమం గురించి సమాచారం ఇస్తూ.. ఇది ప్రభుత్వ కార్యక్రమం అని, కాబట్టి ఖర్గేను రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆహ్వానించడం జరిగిందని సిద్ధరామయ్య చెప్పారు. ఇది పార్టీ కార్యక్రమం కాదని ఆయన స్పష్టం చేశారు. అంతే కాకుండా తమ ప్రభుత్వం ఇప్పటికే ఐదు హామీల్లో మూడింటిని అమలు చేసిందని, అందులో మూడు పథకాలు ‘శక్తి’, ‘గృహ జ్యోతి’, ‘అన్నభాగ్య’లను ఇప్పటికే అమలు చేశామని సీఎం సిద్ధరామయ్య గుర్తు చేశారు. కాగా ‘గృహలక్ష్మి’ నాలుగో పథకం.
ఆదిత్య ఎల్ 1 మిషన్‌కి ముహూర్తం ఫిక్స్ చేసిన ఇస్రో.. సెప్టెంబర్ 2న ప్రయోగం..
చంద్రయాన్-3తో చంద్రుడిని అందుకున్న భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) ఇప్పుడు సూర్యుడిపై అధ్యయనానికి సిద్ధమైంది. ఇస్రో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి చేపడుతున్న ‘ఆదిత్య ఎల్ 1 మిషన్’ షెడ్యూల్ ఖరారైంది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్ ‘పీఎస్ఎల్వీ-సీ57’ ద్వారా ఆదిత్య ఎల్1 మిషన్ చేపట్టనుంది ఇస్రో. ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని సెప్టెంబర్ 2న చేపట్టబోతున్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. శ్రీహరికోట లోని షార్ నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 2 ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్1ను పీఎస్ఎల్వీ-సీ 57 రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్లబోతోంది. ఇస్రో చేపడుతున్న మొదటి అంతరిక్ష ఆధారిత భారత అబ్జర్వేటరీ ప్రయోగం.
రెండేళ్ల చిన్నారికి విమానంలో ఆగిన శ్వాస.. పునర్జన్మ ఇచ్చిన ఎయిమ్స్ వైద్యులు
విమానంలో శ్వాస ఆగిపోయిన రెండేళ్ల చిన్నారి ఓ వైద్య బృందం రక్షించింది. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తారా విమానంలో రెండేళ్ల చిన్నారి శ్వాస ఆగిపోగా.. విమానంలో ఉన్న వైద్యులు వచ్చి పాపకు చికిత్స చేయాలని సిబ్బంది అత్యవసర ప్రకటన చేశారు. అదృష్టం కొద్దీ అదే విమానంలో ప్రయాణిస్తున్న ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి చెందిన ఐదుగురు వైద్యులు చిన్నారికి అత్యవసర చికిత్స అందించారు. సమయానికి స్పందించి పసిబిడ్డ ప్రాణాలను కాపాడారు. ఆదివారం బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్తున్న విస్తారా విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనను ఢిల్లీ ఎయిమ్స్ ధ్రువీకరించింది. ఈ విషయాన్ని ఎయిమ్స్ సిబ్బంది ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ విమానంలో ఉన్న చిన్నారి చిత్రాలను పంచుకుంది. అసలేం జరిగిందంటే.. గుండె సమస్యతో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారిని అత్యవసర చికిత్స కోసం బెంగళూరు నుంచి ఢిల్లీకి తీసుకెళుతున్నారు. ఈ విమానం టేకాఫ్ అయిన కాసేపటికి చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. ఒక్కసారిగా పాప ఊపిరి తీసుకోవడం ఆపేసింది. అంతేకాకుండా పెదాలు, వేళ్లు నీలిరంగులోకి మారాయి. చిన్నారి నాడి కొట్టుకోవడం నిలిచిపోయింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా నాగ్‌పుర్ వైపు మళ్లించారు. ఇండియన్ సొసైటీ ఫర్ వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సదస్సుకు వెళ్లి అదే విమానంలో తిరిగి వస్తున్న ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన ఒక వైద్య బృందం చిన్నారి పరిస్థితిని తెలుసుకొంది. వెంటనే పాపను కాపాడేందుకు వారు ముందుకు వచ్చారు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా విమానాన్ని నాగ్‌పూర్‌కు మళ్లించినప్పటికీ చిన్నారిని రక్షించేందుకు వైద్యుల బృందం 45 నిమిషాల పాటు శ్రమిస్తూనే ఉంది. పాప కార్డియాక్ అరెస్ట్‌కు గురికాగా.. వైద్యులు ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ (AED)ని ఉపయోగించారు. ఇది సాధారణంగా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌ను ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికి ఉపయోగించే పరికరం. దాదాపు 45 నిమిషాల పాటు, శిశువుకు చికిత్స అందించారు. తీవ్రంగా శ్రమించి ప్రథమ చికిత్స ద్వారా చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఎట్టకేలకు నాగ్‌పూర్‌కు తరలించి అక్కడి పిల్లల వైద్యులకు చూపించారు. రెండేళ్ల చిన్నారికి వైద్యులు పునర్జన్మ అందించారు. విమానంలో జరిగిన ఘటనతో పాటు చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎయిమ్స్ ట్విటర్‌లో షేర్ చేసింది.
సిక్సర్ల మోత.. ఊచకోత మాములుగా లేదు
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతను సునాయాసంగా బౌండరీలు కొట్టగలడని తెలుసు. గతంలో ఐపీఎల్ లో ముంబై జట్టు తరుఫున ఆడిన ఈ స్టార్ ప్లేయర్.. ఎన్నో మ్యాచ్ లను గెలిపించిన సందర్భాలున్నాయి. అయితే కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు పొలార్డ్. పొలార్డ్ దూకుడు బ్యాటింగ్ తో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తమ ఖాతా తెరిచింది. లీగ్‌లో భాగంగా సోమవారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నైట్ రైడర్స్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. సెయింట్స్ కిట్స్ బ్యాటర్లలో రుథర్‌ఫర్డ్(38 బంతుల్లో 62 నాటౌట్) చెలరేగాడు. అటు నైట్ రైడర్స్ బౌలర్లలో నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రావో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత 179 పరుగుల టార్గెట్ తో దిగిన నైట్ రైడర్స్ చితక్కొట్టింది. 17.1 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ట్రిన్‌బాగో ఇన్నింగ్స్‌లలో పూరన్, పొలార్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో పూరన్ 61 పరుగులు చేయగా.. పొలార్డ్ 16 బంతుల్లో 5 సిక్స్‌లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా ఆఫ్గానిస్తాన్ స్పిన్నర్ ఇజారుల్హక్ నవీద్‌ను ఓ ఆట ఆడుకున్నాడు పొలార్డ్. ఇజారుల్హక్ వేసిన 14వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లు బాదాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా.. ఇషా, ఆకాశ్, అనంత్ ఇన్..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఓ వైపు సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ అనేక కీలక అంశాలపై ప్రసంగించగా.. మరోవైపు.. ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ బోర్డు నుంచి వైదొలిగారు.. ఇప్పటి వరకు బోర్డు డైరెక్టర్‌గా ఉన్న ఆమె రాజీనామా చేయగా.. రిలయన్స్ బోర్డులోకి ముఖేష్ అంబానీ పిల్లలు ఎంట్రీ ఇచ్చారు.. అంటే.. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలు ఇప్పుడు బోర్డులో అడుగుపెట్టారు.. ఈ ముగ్గురిని నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించారు. అయితే, ఇప్పటికే ముఖేష్ అంబానీ ఈ ముగ్గురు పిల్లలు రిలయన్స్ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. రిలయన్స్ అనుబంధ కంపెనీల బోర్డుల్లో కూడా వారు ఉన్నారు.. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ బోర్డులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక, ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ మరియు అనంత్ అంబానీలను రిలయన్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమిస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు సమావేశం నిర్ణయించింది. హ్యూమన్ రిసోర్స్, నామినేషన్ మరియు రెమ్యూనరేషన్ కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకోబడింది. వాటాదారుల ఆమోదం తర్వాత విధులు అధికారికంగా చేపట్టనున్నారు. నీతా అంబానీ రాజీనామాను డైరెక్టర్ల బోర్డు అధికారికంగా ఆమోదించింది. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్‌గా, నీతా అంబానీ అన్ని RIL బోర్డు సమావేశాలకు సాధారణ ఆహ్వానితులుగా హాజరవుతారు.
బన్నీని అభినందించిన బండారు దత్తాత్రేయ..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు .. దేశమంతటా మారుమ్రోగిపోతుంది. నేషనల్ అవార్డ్ అందుకోని టాలీవుడ్ సత్తాను చూపించాడు. ఇక పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడు విభాగంలో ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఈ అవార్డ్ రావడంతో బన్నీ అభిమానులతో పాటు దేశం మొత్తం మీద ఉన్న సినీ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అవార్డు వచ్చిన వెంటనే.. బన్నీ ఇండస్ట్రీ మొత్తానికి పార్టీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక సినీ, రాజకీయ ప్రముఖులు సైతం బన్నీని సత్కరించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే చిరంజీవి.. బన్నీని శాలువా తో సత్కరించి.. శుభాకాంక్షలు తెలిపిన విషయం తెల్సిందే. తాజాగా హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ.. బన్నీని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నేడు.. హైదరాబాద్ వచ్చిన దత్తాత్రేయ.. నేరుగా బన్నీ ఇంటికి వెళ్లి కలిశారు. నేషనల్ అవార్డ్ విన్నర్ గా నిలిచినందుకు బన్నీకి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఇద్దరు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఇక ఇదే విషయాన్నీ బండారు దత్తాత్రేయ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ” ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ గారితో ఆహ్లదకరమైన సమావేశం బాగా జరిగింది. హైదరాబాద్‌లోని తన నివాసంలో. ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సాధించినందుకు అభినందనలు తెలపడం జరిగింది. ఆయన భవిష్యత్తుకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను” అని తెలిపారు. ఇక ఈ ట్వీట్ కు స్పందించిన బన్నీ.. ” ధన్యవాదాలు బండారు దత్తాత్రేయ గారు.. మీరు పర్సనల్ గా ఇంటికి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలపడం నాకు చాలా ఆనందంగా ఉంది” అని తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది.
ఈ సారి సినిమాలో మరిన్ని యాక్షన్ ఎలిమెంట్స్ యాడ్ చేయబోతున్న సుకుమార్..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్.ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా సౌత్ ప్రేక్షకులు మాత్రమే కాదు నార్త్ ప్రేక్షకులని కూడా ఎంతగానో ఆకట్టుకుంది..అందుకే ఈసారి పుష్ప ది రూల్ సినిమాను అంతకు మించి తెరకెక్కిస్తున్నారు. సౌత్ ప్రేక్షకుల కంటే కూడా నార్త్ ప్రేక్షకులు ఈ సినిమాపై ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ సగానికి పైగానే పూర్తి అయ్యింది..ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది.. తాజాగా ప్రకటించిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ లో పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు రావడంతో పుష్ప సినిమా ట్రెండింగ్ గా నిలిచింది.. దీంతో పుష్ప ది రూల్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. పెరిగిన అంచనాల నేపథ్యంలో ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ను మరింతగా పెంచబోతున్నట్లు సమాచారం.నార్త్ ఆడియెన్స్ నే టార్గెట్ చేస్తూ సినిమాలో భారీ స్టంట్స్ ను పెట్టనున్నట్టు సమాచారం. అంతేకాదు సినిమా విడుదల కంటే ఎంతో ముందుగానే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.. పుష్ప ది రూల్ లో అల్లు అర్జున్ క్యారెక్టర్ లో మరిన్ని వేరియేషన్స్ ఉండనున్నట్లు సమాచారం..ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది..పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ తో పాటు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కి కూడా ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డు లభించింది. దీనితో ఈ సారి పుష్ప ది రూల్ సినిమాలో సాంగ్స్ అదిరిపోనున్నట్లు సమాచారం.
ఈ సంతోష సమయంలో మీరు ఉంటే .. తారకరత్న భార్య ఎమోషనల్
నందమూరి తారకరత్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది అత్యంత విషాదకర సంఘటనల్లో ఆయన మృతి చెందడం కూడా ఒకటి. అతి పిన్న వయస్సులో తారకరత్న గుండెపోటుతో మృతిచెందాడు. ఇక తారకరత్న మృతి.. నందమూరి కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది. ముఖ్యంగా ఆయన భార్య.. పిల్లలను తలుచుకుంటే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తారకరత్న- అలేఖ్య లవ్ స్టోరీ.. పెళ్లి గురించి అందరికి తెల్సిందే. ఇంట్లో వారికి ఇష్టం లేకపోయినా.. అలేఖ్యను పెళ్ళాడి తారకరత్న బయటికి వచ్చేశాడు. ఇక అప్పటినుంచే అతనే ప్రపంచం గా దేవుడు అన్యాయం చేశాడు. ఇటు పుట్టింటి సపోర్ట్.. అటు అత్తింటి సపోర్ట్ ఉందో లేదో తెలియదు. ముగ్గురు బిడ్డలతో ఆమె ప్రస్తుతం తన ఇంట్లోనే నివాసం ఉంటుంది. ఇక తారకరత్నను మర్చిపోలేని అలేఖ్య.. నిత్యం సోషల్ మీడియాలో ఆయన జ్ఞాపకాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. నేడు మరోసారి భర్తను తలుచుకొని ఆమె ఎమోషనల్ అయ్యింది. అందుకు కారణం.. వారి పిల్లల పుట్టినరోజు కావడం. తారకరత్న, అలేఖ్యలకు కవల పిల్లలు. తాన్యరామ్, రేయాన్ లు పుట్టినరోజును తారకరత్న ఉంటే ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవాడు. కానీ, ఈరోజు ఆ చిన్నారులు తండ్రి ఫొటోకు పూలు పెడుతూ కనిపించారు. ఇక అదే విషయాన్నీ అలేఖ్య.. ఎమోషనల్ గా రాసుకొచ్చింది. ” నా చిన్నారులకు పుట్టినరోజు విషెస్ ఎంతో బాగా చెప్పాలనుకున్నాను.. అదే ఆలోచించాను. కానీ, ఎంత అనుకున్నా.. ఎంత ఆలోచించినా మీ ఇద్దరికీ సరిపోయే పుట్టినరోజు శుభాకాంక్షలు నేను అందంగా చెప్పలేకపోతున్నాను. ఈ సంతోష సమయంలో మీరు లేరు.. వర్షం కురిసే రోజు ఇంద్రధనుస్సు కంటే నువ్వు చాలా అందంగా ఉన్నారు, పొద్దుతిరుగుడు పువ్వు కంటే ఉత్సాహంగా ఉన్నారు..ఓబు, మమ్ము, ఎన్ నిష్కక్కు నిన్ను చాలా ప్రేమిస్తున్నారు. మీరు ఆనందాన్ని రెట్టింపు చేయాలని, ప్రేమను రెట్టింపు చేయాలని, వేడుకలను రెట్టింపు చేయాలని కోరుకుంటున్నాను. అద్భుతమైన కవలలకు జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇక వీడియోలో తండ్రి ఫొటోకు చిన్నారులు పూలు పెడుతూ కనిపించారు. ఈ వీడియో చూసిన అభిమానులు చిన్నారులకు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. ఈ కుటుంబానికి దైర్యం ఇవ్వాలని దేవుడ్ని కోరుకుంటున్నారు.
మీడియా ముందే హీరోయిన్ కి ముద్దు పెట్టిన డైరెక్టర్
హీరో రాజ్ తరుణ్ హీరోగా ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘తిరగబడర సామీ’ టీజర్ ను దిల్ రాజు లాంచ్ చేశారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా సాగింది. హీరో రాజ్ తరుణ్ ఇందులో వైలెన్స్ కు వ్యతిరేకంగా ఉండే అమాయకమైన కుర్రాడు కాగా అతను ప్రేమించే అమ్మాయికి వైలెన్స్ అంటే ఇష్టం. ఆసక్తికరమైన విషయమేమిటంటే వీరిద్దరూ నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులే కావడం, ఇక పరిస్థితులు అతని ట్రాక్ మార్చడానికి, హింసాత్మక మార్గాన్ని తీసుకోవాలని ప్రేరేపిస్తాయి. తన వాళ్ళ కోసం తన మార్గాన్ని మార్చే అమాయక యువకుడి పాత్రలో రాజ్ తరుణ్ యాప్ట్ గా కనిపించగా హీరోయిన్ గా నటించిన మాల్వీ మల్హోత్రా అందంగా కనిపించింది. ఇక మకరంద్ దేశ్‌పాండే విలన్ పాత్రలో కనిపించగా మన్నారా చోప్రా కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో టీజర్ రిలీజ్ ఈవెంట్లో టీమ్ అంతా కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సమయంలో ఎఎస్ రవికుమార్ చౌదరి తన పక్కనే ఉన్న మన్నారా చోప్రా బుగ్గలపై ముద్దు పెట్టాడు. ముందు షాక్ అయినా తరువాత ఆమె తేరుకుని నవ్వేసింది.