ఏపీలో కంచుకోట లేమి లేవు.. రాష్ట్రమంతా సీఎం జగన్ కంచుకోటే..
సర్వ సాధారణంగా ఒక్కో నియోజకవర్గం.. ఒక్కొక్కరి కంచుకోట అని చెబుతుంటారు.. కొందరు నేతలు ఎక్కువ పర్యాయాలు పోటీ చేసి.. క్రమంగా మెజార్టీ పెంచుకుంటూ పోతే.. అది కంచుకోట.. వారిని ఓడించడం కష్టమనే నిర్ణయానికి వస్తాయి ప్రత్యర్థి పార్టీలు.. అయితే, కంచుకోటలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. శ్రీసత్యసాయి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దృష్టి పెట్టకా రాష్ట్రంలోని పంచాయితీలు, స్థానిక సంస్థలు గెలిచాం.. చంద్రబాబు కుప్పంలో అనేక పర్యాయాలు పోటీ చేశారు.. కానీ, కుప్పంలో రానున్న రోజుల్లో ఎమ్మెల్యే సీటు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.. కుప్పంతో పోలిస్తే ఇక్కడ అంతకంటే బలమైనవారులేరన్న ఆయన.. రాష్ట్రంలో కంచుకోటలు ఏమి లేవు.. రాష్ట్రమంతా సీఎం వైఎస్ జగన్ కంచుకోటే అని అభివర్ణించారు. సంక్షేమ పథకాలు అందించడం వలన కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బందులు తప్పాయని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి.. కరోనా సమయంలో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు హైదరాబాద్‌లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. ఇక, హిందూపూర్ లో దీపిక విజయం కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కృషి చేస్తారు.. అందరూ కష్టపడి పని చేసి విజయం సాదించాలని స్పష్టం చేశారు. ఎన్నికల లోపు కనీసం రెండు మూడు సార్లు సీఎం జగన్‌ను హిందూపూర్ లో పర్యటించాలని కోరనున్నట్టు పేర్కొన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
కేసీఆర్ ప్రభుత్వం అందరి ప్రభుత్వం.. సంక్షేమ పథకాల్లో దూసుకుపోతున్నాం
చేవెళ్లలో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో బీసీ కులాల చేతివృత్తుల లబ్ధిదారులకు అందించే బీసీ బందు కార్యక్రమాన్ని మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రులు మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ చెక్కులను పంపిణీ చేసారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అందరి ప్రభుత్వం అని అన్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమం కోరే పార్టీగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రపంచంలోనే ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ దేశానికి మార్గదర్శకత్వం వహిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తొలి విడత ప్రతిగా రంగారెడ్డి జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 300 చొప్పున.. రంగారెడ్డి జిల్లాలో 2100 మంది లబ్ధిదారులకు 21 కోట్లతో పథకం వర్తిస్తుందని మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. చేవెళ్ల నియోజకవర్గంలో 300 మంది లబ్ధిదారులకు మూడు కోట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడ జరగని విధంగా పథకాలను అమలుపరుస్తున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రతి పథకం నిరంతర ప్రక్రియగా సాగుతాయని.. ఎవరు రాలేదని అసంతృప్తికి గురికారాదని, అందరికీ అర్హతలను బట్టి అందుతాయని మహేందర్ రెడ్డి వెల్లడించారు.
విశాఖలో మెడికో సూసైడ్.. లాడ్జి గదిలో..!
విశాఖపట్నంలో మెడికో ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది.. డాబా గార్డెన్స్ లోని కేరళకు చెందిన మెడికో ప్రాణాలు తీసుకుంది.. లాడ్జి గదిలో ఉరివేసుకొని వేలాడుతున్నట్టు యువతి మృతదేహాన్ని గుర్తించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.. ఇక, లోపల నుంచి గడియ పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం రావడంతో.. లాడ్జ్ నిర్వాహకుల సమాచారంతో తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లిన పోలీసులు.. యువతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.. ఇక, ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.. విశాఖ పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న రమేష్ కృష్ణ అనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు.. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు టూటౌన్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.. మలయాళం భాషలో రాసుకున్న సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యం అయ్యింది. “జీవితంలో ఓడిపోయానని, తన చావుకు ఎవరూ బాధ్యులు కారంటూ” సూసైడ్ నోట్ లో రాసుకొచ్చింది యువతి.. ఇక, కేసు నమోదు చేసిన పోలీసులు.. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేందుకు సిద్ధం అయ్యారు.
కృష్ణా ఎక్స్ప్రెస్లో పొగలు.. ప్రయాణికులు సేఫ్
ఈ మధ్యకాలంలో రైళ్లలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. సాంకేతిక లోపాల కారణంగా కొన్ని అయితే.. మానవ తప్పిదాల వల్ల మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఘటన, తెలంగాణలో రైలు పట్టాలు తప్పడం, బోగీల్లో మంటలు చెలరేగడం.. ఇలాంటి ప్రమాదాలు తరుచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతి, ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. రైలులోని ఏసీ బోగీలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు ఆగింది. రైలు సికింద్రాబాద్ వెళుతుండగా ఏపీలోని వెంకటగిరి స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరమ్మతులు పూర్తిచేశాక తిరిగి రైలు అక్కడినుంచి బయలుదేరింది. శుక్రవారం తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరిన కృష్ణా ఎక్స్ ప్రెస్.. వెంకటగిరి స్టేషన్ సమీపంలో ఏసీ బోగీలో పొగలు రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు. దీంతో వెంటనే ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగి రైలును ఆపారు. ఆ తర్వాత రైల్వే సిబ్బంది.. బోగీ వద్దకు చేరుకుని పొగలు ఎక్కడి నుంచి వస్తుందని పరిశీలించారు. అయితే ఏసీ కోచ్ బోగీ బ్రేకులు పట్టేయడం వల్లే పొగలు వచ్చాయని సిబ్బంది గుర్తించారు. వెంటనే మరమ్మత్తులు చేసిన రైల్వే సిబ్బంది.. ఆ తర్వాత అక్కడినుంచి రైలు బయల్దేరింది. దాదాపు 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. మరోవైపు ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు.
దేశానికి ఏం చెప్పదలచుకున్నారు.. బీజేపీ సర్కార్‌పై ఒవైసీ ఫైర్
చైనా, భారత్‌ల మధ్య 19 సార్లు చర్చలు జరిగాయని.. చైనా వాళ్లు మన భూభాగంలో ఆక్రమణలు చేస్తుంటే దేశ ప్రధాని మోడీ చైనా ప్రధాని వెనకాల ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. దేశానికి ఏం చెప్పదలచుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ సర్కార్ చైనా ముందు ఎందుకు మోకరిల్లుతోందని చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపైన బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని, అందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బోర్డర్‌లో ఏదైనా జరిగితే రీస్టోర్ చెయ్యాల్సిన అవసరం ఉంది.. కానీ భారత్ సర్కార్ ఏమి చేస్తుందంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు. ఇవన్నీ ఒకవైపు సాగుతూ ఉంటే భారత ప్రధాని చైనా ప్రధానితో భేటీ అవ్వడం ఏమిటని ఆయన పేర్కొన్నారు. గల్వాన్ లో ఏం జరుగుతుందో దేశ ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 19సార్లు చర్చలు జరిగాయని, ఆ చర్చల్లో ఏం జరిగిందో చెప్పాలన్నారు అసదుద్దీన్ ఒవైసీ. లఢఖ్‌లో ఏం జరుగుతుందో చెప్పకుండా దాచిపెడుతోందని ఆయన మండిపడ్డారు. ఆర్మీని అగ్రిమెంట్‌ల కోసం ఎందుకు ఒత్తిడి చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఇదే అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని.. అందుకు స్పెషల్ పార్లమెంట్ సెషన్ నిర్వహించాలన్నారు.
జీ-20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ దూరం.. క్రెమ్లిన్ ప్రకటన
సెప్టెంబర్‌లో భారత్‌లో జరగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. పుతిన్ భారత్‌కు రాలేరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ధృవీకరించారు. అదే సమయంలో విమాన ప్రమాదంలో యెవ్జెనీ ప్రిగోజిన్ మరణంలో క్రెమ్లిన్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని ఆయన అన్నారు. ప్రిగోజిన్ మరణం వెనుక క్రెమ్లిన్ ఉందని పాశ్చాత్య దేశాలు చెబుతున్నాయని, ఇది పూర్తిగా అబద్ధమని పెస్కోవ్ చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ జి-20 శిఖరాగ్ర సమావేశానికి భారత్‌కు రావడం లేదని, ఉక్రెయిన్ యుద్ధమే కారణమని పేర్కొంది. జీ-20 సదస్సు కోసం పుతిన్ భారత్‌లో పర్యటించేందుకు ఎలాంటి ప్రణాళికలు లేవని.. తమ దృష్టంతా ప్రస్తుత సైనిక చర్య పైనే ఉంది దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో జరగనున్న జీ20 సదస్సుకు వ్యక్తిగతంగా హాజరయ్యే ఆలోచన లేదని క్రెమ్లిన్ శుక్రవారం తెలిపిందని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారని అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ICC) ఆయనపై వారెంట్ జారీ చేసిన తర్వాత పుతిన్ విదేశాలకు వెళ్లినప్పుడు అరెస్టు చేసే ప్రమాదం ఉంది. దీంతో ఆయన విదేశాలకు వెళ్తే అరెస్టయ్యే ముప్పు ఉంది. ఐసీసీ సభ్యదేశంగా ఉన్న దక్షిణాఫ్రికా.. ఒకవేళ పుతిన్ తమ దేశానికి వస్తే ఆయనను అరెస్టు చేయాల్సి ఉంటుంది. ఈ కారణం వల్లనే ఆయన.. బ్రిక్స్ సదస్సుకు హాజరుకాలేదు. వీడియో లింక్ ద్వారా దక్షిణాఫ్రికాలో ఇటీవల ముగిసిన బ్రిక్స్ సదస్సుకు పుతిన్ హాజరయ్యారు. కాగా.. గతేడాది ఇండోనేషియాలో జరిగిన జీ-20 సదస్సుకు కూడా పుతిన్ గైర్హాజరయ్యారు.
కళ్లు తెరచి తుమ్మిన బాలిక… వీడియో వైరల్
తుమ్ము.. ఇది వస్తే ఆపడం చాలా కష్టం. ఎంతమందిలో ఉన్న, ఎక్కడ ఉన్న తుమ్మాల్సిందే. తుమ్మును ఆపుకుంటే చాలా నష్టాలు జరుగుతాయి. కొన్ని సార్లు అది ప్రాణాపాయం కూడా కావచ్చు. ఇక బ్రిటన్ లో ఈ మధ్య తుమ్ము ఆపుకున్న ఓ వ్యక్తికి శ్వాసనాళంలో రంధ్రం పడిన విషయం కూడా తెలిసిందే. ఇక తుమ్ము గురించి చాలా విషయాలు చెబుతూ ఉంటారు. కళ్లు మూయకుండా తుమ్మలేమని, కళ్లు తెరుచుకొని తుమ్మితే కళ్లు బయటకు వచ్చేస్తాయని అంటూ ఉంటారు. ఇక తుమ్ముతో చాలా సెంటిమెంట్లు కూడా ముడిపడి ఉంటాయి. బయటకు వెళ్లేటప్పుుడు తుమ్మకూడదని అలా చేస్తే నష్టం జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఇక తుమ్మితే కూర్చొని మంచి నీరు తాగి వెళ్లాలంటారు. అంతేకాకుండా కళ్లు మూసుకోకుండా తుమ్మితే కంటి సమస్యలు వస్తాయని, కంటి నరాలు దెబ్బతింటాయని చాలా మంది చెబుతారు. అయితే దీనిని ఛాలెంజ్ గా తీసుకొని ఒక అమ్మాయి కళ్లు మూయకుండా తుమ్మాలనుకుంది. దాని కోసం ముక్కులో మేకప్ బ్రష్ పెట్టుకొని తుమ్ము వచ్చినప్పుడు కళ్లు మూసుకోకుండా తుమ్మింది. అయితే తుమ్మడం పూర్తి కాగానే ఆమె నవ్వు ఆపుకోలేక నవ్వేసింది. అయితే కళ్లు మూసుకోకుండా తుమ్మిన ఇప్పటి వరకు అందరూ చెప్పినట్లు ఆమెకు ఏం కాలేదు. ఆమె బాగానే ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బన్నీకి ఆర్జీవీ విషెస్.. పవన్ ను అవమానించాడా.. ?
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేసినా.. ఏ ట్వీట్ వేసినా వివాదమే. నలుగురికి నచ్చనిది.. ఆర్జీవీ కి నచ్చదు అనే చెప్పాలి. ఇక రాజకీయాల్లో కూడా వర్మ జగన్ కు సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు పై నిత్యం విమర్శలు గుప్పిస్తూ .. పవన్ ఫ్యాన్స్ చేత తిట్లు తింటూనే ఉన్నాడు. ఇక మొదటి నుంచి కూడా వర్మకు.. అల్లు అర్జున్ అంటే ఇష్టమని అందరికి తెల్సిందే. మెగా ఫ్యామిలీలో బన్నీనే మెగాస్టార్ అని కూడా చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ఇక నిన్న అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ రావడంతో.. వర్మ తనదైన రీతిలో బన్నీకి శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఆ విషెస్ లో కూడా పవన్ ను, చరణ్ ను వదిలిపెట్టలేదు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ” వన్ వే సక్సెస్ అంటే ఒక టాప్ హీరో తమ్ముడు లేదా కొడుకుగా వచ్చి అదృష్టవంతులు కావడం..సూపర్ సక్సెస్ అంటే కింది నుండి మొదలు పెట్టి ఉన్నత స్థాయికి చేరుకోవడం..మెగా సక్సెస్ అంటే హాస్యనటుడి మనవడు అనే బ్యాగేజీని కలిగి ఉండి కూడా బాక్సాఫీస్ మరియు అవార్డుల్లో కూడా సూపర్ హీరో అవడం.. కుడోస్ అల్లు అర్జున్” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ పై మెగా ఫ్యాన్స్ హార్ట్ అవుతున్నారు. బన్నీని విష్ చేయాలంటే చెయ్ కానీ.. తమ్ముడు, కొడుకు అంటూ పవన్, చరణ్ ను విమర్శిస్తే ఊరుకోము అని కొందరు అంటుండగా.. మరికొందరు.. అస్సలు ఆ మెగా ట్యాగ్ అనేది లేకుండా ఉంటే.. బన్నీ ఇండస్ట్రీలో అడుగుపెట్టేవాడు కాదు అని చెప్పుకొస్తున్నారు.
గుంపులో ఒకరిగా బన్నీకి చరణ్ విషెష్.. షాకింగ్ గా రిప్లై!
69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినీ పరిశ్రమ సత్తా చాటిందన్న సంగతి తెలిసిందే. 2021 ఏడాదికి ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో తెలుగు సినిమాలకు పెద్ద ఎత్తున అవార్డులు లభించాయి. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఏకంగా ఆరు అవార్డ్స్ రాగా.. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాకి కూడా రెండు అవార్డ్స్ వచ్చాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలుగు సినీ పరిశ్రమలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిట్ చెప్పాలి. ఎందుకంటే ఈ అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టిన 69 ఏళ్లలో అవార్డు అందుకోబోతున్న మొదటి తెలుగు నటుడిగా నిలిచారు. ఇక బన్నీకి జాతీయ ఉత్తమ నటుడిగా రావడంతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయింది. చిరు సోషల్ మీడియా వేదికగా బన్నీకి స్పెషల్ విషెస్ తెలుపగా వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి వారు బన్నీ ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్త ఆలస్యంగా స్పందించడం చర్చనీయాంశం అయింది. శుక్రవారం తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ తోపాటు.. పుష్ప, కొండపొలం, ఉప్పెన, అలియా భట్ లకు అభినందనలు తెలిపారు. “ఇది నేను ఎంతగానో గర్వించే క్షణాలు.. నా బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితులే అవార్డులను గెలుచుకున్నారు, ఆర్ఆర్ఆర్ టీం, విజనరీ డైరెక్టర్ రాజమౌళి గారికి కంగ్రాట్స్. ఆరు అవార్డ్స్ వచ్చాయి. ఎంఎం కీరవాణి గారు.. ప్రేమ్ రక్షిత్, కాళభైరవ, శ్రీనివాస్ మోహన్, కింగ్ సోలోమన్, డీవీవీ ఎంటర్టైన్మెంట్, డీవీవీ దానయ్య గారు. ఇది నాకు ఎంతో మెమోరబుల్ జర్నీ” అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా అందరిలో ఒకరిగా అల్లు అర్జున్ పేరు చేర్చారు. దానికి బన్నీ కూడా ముక్తసరిగానే థాంక్ యూ అని ట్వీట్ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.
సర్జరీ కోసం ఇల్లు అమ్మేస్తున్న జబర్దస్త్ నటుడు..
పైకి నవ్వుతూ కనిపించేవారందరు సంతోషంగా ఉన్నట్లు కాదు. నలుగురిని నవ్వించేవారందరికి కష్టాలు లేనట్టు కాదు. ఎన్ని కష్టాలు ఉన్నా .. మనసులో దాచుకొని ప్రేక్షకులను నవ్వించేవాడినే కమెడియన్ అంటారు. రోజు మొత్తం అలసిపోయిన వారికి జబర్దస్త్ అనేది ఎంతో రిలీజ్ ఇచ్చే షో. ఇప్పుడు ఎలా ఉంది అన్నదానికన్నా ఒకప్పుడు ఎలా ఉండేది అనేది మాట్లాడుకుంటే బావుంటుంది. ఇప్పుడంటే యూట్యూబ్, సోషల్ మీడియా వచ్చాకా టీవీ లో ఈ షో చూడడం తగ్గింది కానీ, ఒకప్పుడు అయితే.. ఈ షో కోసం కుటుంబం మొత్తం ఎదురుచూసేది. ఇక జబర్దస్త్ ద్వారా పరిచయమైన నటులు.. ప్రస్తుతం స్టార్ కమెడియన్స్ గా మారారు. ఇక మరికొందరు మంచి గుర్తింపును అందుకొని వరుస షోలలో కనిపిస్తున్నారు. అందులో శాంతి స్వరూప్ ఒకడు. బక్క పలచని దేహం.. అబ్బాయిగా కన్నా అమ్మాయిగానే ఎక్కువ కనిపించాడు అతను. శాంతి స్వరూప్ కాస్తా శాంతిగా మారాడు. పొట్టకూటి కోసం ఎన్నో ఇబ్బందుల పడుతున్న సమయంలో జబర్దస్త్ శాంతి పాలిట వరంగా మారింది. ఇక లేడీ గెటప్ లో అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు. ఇక ఎంత నవ్వించినా.. శాంతి స్వరూప్ వెనుక ఉన్న కష్టాలు ప్రతిఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ మధ్యనే శాంతి ఒక ఇల్లు కొన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. అయితే తాజాగా ఆ ఇంటిని అమ్మేస్తున్నట్లు అతను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. తన తల్లికి సర్జరీ చేయించాల్సి ఉందని, దానికి సరిపడ్డ డబ్బులు తనవద్ద లేవని.. అందుకే తన ఇంటిని అమ్మేస్తున్నట్లు తెలిపాడు. తనకు తన తల్లి కన్నా ఏది ముఖ్యం కాదని, ఈ విషయం అమ్మకు చెప్తే ఒప్పుకోదు.. అందుకే ఆమెకు తెలియకుండా అమ్మేస్తున్నట్లు తెలిపాడు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు.. అధైర్యపడొద్దు.. అమ్మగారు కోలుకుంటారు అని కొందరు.. తల్లి కోసం నువ్వు చేస్తున్న త్యాగం గొప్పది అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.