సీఎం జగన్ నామినేషన్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆయన ఈ నెల 25వ తేదీన పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం జగన్ ఏప్రిల్ 24వ తేదీన శ్రీకాకుళంలో మేమంత సిద్ధం బస్సు యాత్ర ముగించుకుని నేరుగా పులివెందులకు వెళ్లనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అక్కడ వైసీపీ నిర్వహించే బహిరంగలో జగన్ పాల్గొంటారు. అయితే, ఈ నెల 22వ తేదీన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫున కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఇది ముందు జాగ్రత్త కోసమేనని సమాచారం. కాగా, వైఎస్ జగన్ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎస్వీ సతీశ్ కుమార్ రెడ్డిపై 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతకు ముందు, 2014లోనూ సతీశ్ కుమార్ పై జగన్ గెలిచారు. ఈసారి పులివెందులలో సీఎం జగన్ కు ప్రత్యర్థిగా తెలుగు దేశం పార్టీ తరపున బీటెక్ రవిందర్ రెడ్డి పోటీలో ఉన్నారు.
చంద్రబాబు నివాసంలో ఎన్డీయే కూటమి భేటీ.. పలు చోట్ల అభ్యర్థుల మార్పుపై చర్చ
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల భేటీ ముగిసింది. సుమారు రెండు గంటల సేపు సాగిన ఎన్డీఏ కూటమి నేతల సమావేశం.. ఎన్నికల కోడ్ వచ్చినా మారని కొందరి అధికారుల పని తీరు మీదే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికీ కొందరు ఐఏఎస్, ఐపీఎస్సులు అధికార పార్టీకి అండగా ఉన్నారనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. పెన్షన్ల పంపిణీ విషయంలో కొందరి అధికారుల తీరును కూటమి నేతల సమావేశంలో ప్రస్తావనకు తీసుకొచ్చారు. వైసీపీ చేస్తున్న అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఉమ్మడిగా ఫిర్యాదులు చేయాలని ఎన్డీఏ కూటమి నేతలు ఓ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఫిర్యాదులు చేయడమే కాకుండా చర్యలు తీసుకునే వరకు పోరాడాలని అభిప్రాయపడ్డారు. ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలు చేసేలా.. ఎన్నికల సంఘంతో నిరంతరం మాట్లాడుతుండాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూటమి నేతలకు చెప్పుకొచ్చారు. దీంతో పాటు ఎన్డీఏ కూటమి నేతల భేటీలో ఒకట్రొండు స్థానాల్లో మార్పు చేర్పులపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అనపర్తి, ఉండి, తంబళ్లపల్లె, లాంటి స్థానాల్లో మార్పు చేర్పులపై ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తుంది. సీటు కొల్పోకుండా.. ఓటు చీలకుండా సీట్ల సర్దుబాట్లు ఉండాలని కూటమి నేతలు అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు నాపై ఆరోపణలు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా..
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించినట్లు మెడికల్ కళాశాల భూముల కొనుగోలులో నేను ఒక్క రూపాయి తీసుకున్నట్లు రుజువు చేస్తే పోటీ నుంచి విరమించుకుంటాను.. అలాగే, రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. మున్సిపల్ బిల్డింగ్స్ నిర్మాణం టెండర్స్ పిలిచి నిర్మిస్తారు.. కార్యకర్తలకు ఇవ్వడం కుదరదని చంద్రబాబు ఆరోపణలను మంత్రి ఖండించారు. చౌకబారు ఆరోపణలు చేయ్యడం చంద్రబాబుకు అలవాటే అని ఆయన తెలిపారు. నేను చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత విమర్శలు ఎపుడూ చేయ్యలేదు.. ముఖ్యమంత్రి జగన్ ను దుర్మార్గుడు అని సంబోధించడం తగదు.. సిద్ధాంత పరంగా విమర్శించుకోవాలి.. కానీ వ్యక్తిగత విమర్శలు మంచిది కాదని మంత్రి విశ్వరూప్ చెప్పుకొచ్చారు. కోనసీమ అల్లర్లలో ఉన్న వారు ఇపుడు ఏ పార్టీలో ఉన్నారో చూసుకోవాలి అని మంత్రి విశ్వరూప్ తెలిపారు. నా ఇల్లు తగలబెట్టినా నేను ఎవరిపైనా ఆరోపణలు చెయ్యలేదు.. పోలీసులు దర్యాప్తు చేశారు.. విశ్వరూప్ మంచి వైరస్ వంటి వాడు కోనసీమకు మంచి చేశాను కానీ అపకారం చెయ్యలేదన్నారు.
కవితకు బిగ్ షాక్.. సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. సీబీఐ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. ఈనెల 15 ఉదయం గం. 10.00 వరకు కవితకు సీబీఐ కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పటికే ఆమెను ఈడీ పలు ప్రశ్నలపై విచారించగా.. సీబీఐ కూడా మరికొన్ని అంశాలపై ప్రశ్నించనుంది. ఇదిలా ఉండగా.. కవితను సీబీఐ కస్టడీలో కలిసేందుకు సోదరులు కేటీఆర్, సంతోష్, భర్త అనిల్, కవిత పిల్లలు, తల్లి, పీఏ కలిసేందుకు అనుమతిని కూడా కోర్టు ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కలిసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఐదు రోజులు కస్టడీకి సీబీఐ కోరగా.. కోర్టు మూడు రోజు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారిగా సీబీఐ తెలిపింది. విజయ్ నాయర్, తదితరులతో కలిసి కవిత ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్షపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్‌లపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విరుచుకుపడ్డారు. పొన్నం.. మీ పార్టీ మాట తప్పినందుకు గాంధీభవన్ వద్ద దీక్ష చెయ్యి.. కేసీఆర్ 10 ఏళ్లపాటు అరిగోస పెట్టినందుకు తెలంగాణ భవన్ వద్ద దీక్ష చెయ్యి.. 80 కోట్ల మంది పేదలకు మోడీ అన్నం పెడుతున్నందుకు.. కరోనా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తారా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో అన్న వర్గాలను దగా చేసినప్పుడు ఒక్కనాడు కూడా దీక్ష ఎందుకు చేయలేదని ప్రశ్నలు గుప్పించారు. వడ్ల కుప్పలపై రైతులు గుండెపగలి చస్తుంటే.. ఎందుకు దీక్ష చేయలేదని అడిగారు. వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చిన తర్వాతే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస ధరకు వడ్లను కొంటారా? లేదా? అంటూ ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని.. వడ్ల కొనుగోలుపై ప్రభుత్వం ఎందుకు సమీక్ష జరపడం లేదని అడిగారు. బీఆర్ఎస్ పాలనలో వడ్ల కొనుగోలుపై అరిగోస పడ్డ రైతులకు అండగా నిలిచింది తామేనని పేర్కొన్నారు. ప్రధాని అభ్యర్థి తెలియని కూటమికి ఎలా ఓటేస్తారని ప్రశ్నించారు. నిధులు తెచ్చి అభివృద్ధి నేను చేస్తుంటే… మీరు ప్రచారం చేసుకుంటారా అని బండి సంజయ్ అన్నారు. అభ్యర్థే దొరకని కాంగ్రెస్, అపర మేధావి కలిసి తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
రాష్ట్రానికి వర్షసూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్‌తో పాటు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా వాతావరణ పరిస్థితి మారింది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా.. రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లటికబురు చెప్పింది. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు ఆరెంజ్‌తో పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ(IMD). ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల,సూర్యాపేట, మహబూబాబాద్,యాదాద్రి భువనగిరి ,రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మంచిర్యాల,రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
బెంగళూర్ కేఫ్ పేలుడు కేసు.. బెంగాల్‌లో టీఎంసీ వర్సెస్ బీజేపీ..
ర తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), ప్రతిపక్ష బీజేపీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ రోజు రాష్ట్రంలోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. రాష్ట్రం ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే, ఈ ఆరోపణలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టైన ఇద్దరు వ్యక్తులు ఈ రాష్ట్రానికి చెందిన వారు కాదని, వారు ఇక్కడ దాక్కున్నారని, రెండు గంటల్లో వారిని అరెస్ట్ చేశామని ఆమె అన్నారు. బెంగాల్‌లో శాంతి నెలకొంటే బీజేపీ సహించదని ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలు సూర్తిగా సురక్షితంగా ఉన్నాయా..? అని ప్రశ్నించారు. సీనియర్ టీఎంసీ లీడర్ కునాల్ ఘోష్ కూడా బీజేపీ ఆరోపణల్ని తిప్పికొట్టారు. ఎన్ఐఏకి రాష్ట్ర పోలీసులు సహకారాన్ని అంగీకరించాలని అన్నారు. బెంగళూర్ బ్లాస్ట్ కేసులో ఈ రోజు ముస్సావిర్ హుస్సేన్ షాజేబ్, అబ్దుల్ మతీన్ తాహా అరెస్టయ్యారు. వీరిద్దరు కీలకమైన కుట్రదారులుగా ఉన్నారు. షాజెబ్ బాంబును అమర్చగా.. తాహా లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చినట్లు భావిస్తున్నారు. వీరిద్దరిని పూర్బా మేదినిపూర్ జిల్లాలో కంఠి లేదా కోటాయ్ అనే చిన్న పట్టణంలో ట్రేస్ చేశారు.
పేదరికంతో తిండి పెట్టలేక.. భార్య, ఏడుగురు పిల్లల్ని నరికి చంపిన వ్యక్తి..
ఆర్థిక సంక్షోభంలో దాయాది దేశం పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసరాల నుంచి గ్యాస్, కరెంట్, ఇంధనం ఇలా ప్రతీ దాని రేట్లు చుక్కల్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు వేగంగా పేదరికంలోకి కూరుకుపోతున్నారు. తినడానికి మూడు పూటలు తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇలా పేదరికంలో కూరుకుపోయిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు.
పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని పేదరికంతో ఉన్న ఓ వ్యక్తి తన భార్య, ఏడుగురు మైనర్ పిల్లల్ని శుక్రవారం గొడ్డలితో నరికి చంపాడు. సజ్జాద్ ఖోఖర్ అనే కూలీ తన భార్య కౌసర్(42), ఎనిమిది నెలల నుంచి 10 ఏళ్లు కలిగిన తన ఏడుగురు పిల్లలపై గొడ్డలితో దాడి చేసి వారందరిని కర్కషంగా చంపేశాడు. నిందితుడు ఆర్థిక సమస్యలతో మనస్థాపానికి గురై భార్యతో తరుచూ గొడవపడేవాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పంజాబ్ ప్రావిన్సులో చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్‌లోని దయనీయ పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. హత్యలకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తన పిల్లలకు ఆహారం ఇవ్వలేనందున ఈ పని చేశానని నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రావిన్స్ ఐజీ నుంచి నివేదిక కోరారు.
మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ చిలిపి పనులు..! వీడియో వైరల్
విరాట్ కోహ్లీ అంటే క్రికెట్ అభిమానులకు ఎంతో పిచ్చి.. అతని ఆటను చూసేందుకు ఎక్కడికైనా వెళ్లే వీరాభిమానులు ఉన్నారు. అంతేకాకుండా.. అతని ఫొటోను చేతులపై, గుండెలపై టాటూలు వేసుకున్న పిచ్చి అభిమానులు కూడా ఉన్నారు. కోహ్లీ బ్యాటింగ్ కోసం రంగంలోకి దిగాడంటే చాలు.. అభిమానులు విరాట్ విరాట్ అంటూ.. ఎంకరేజ్ చేస్తుంటారు. కోహ్లీకి కూడా గ్రౌండ్లో ఉండి అభిమానులను ఉత్సహపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు గ్రౌండ్లో డ్యాన్స్లు, క్రికెటర్లతో జోక్స్ చేస్తూ కనిపిస్తాడు. తాజాగా.. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ చేసిన ఓ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లైవ్ మ్యాచ్లో నాన్ స్ట్రైకర్గా ఉన్న రోహిత్ శర్మను గిల్లుకుంటూ వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. కాగా.. టీమిండియాలో వీరిద్దరూ చాలా కాలంగా కలిసి ఆడుతున్న విషయం తెలిసిందే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య సన్నిహిత్యం ఎలా ఉందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.