*డ్వాక్రా సంఘాల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. డ్వాక్రా సంఘాల ఖాతాల్లో సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేశారు. వైఎస్సార్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నామని.. దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించనంత తేడా ఏపీలో కనిపిస్తోందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.6,395 కోట్లు జమ చేశామని సీఎం వెల్లడించారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 79 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందన్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ..” ఎక్కడా వివక్ష చూపడం లేదు.. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.. ఆసరా కింద 56 నెలల్లో రూ. 25,571 కోట్ల రుణాల చెల్లింపు.. వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ ఆసరా ద్వారా మహిళల ఖాతాల్లోకి రూ.31 వేల కోట్లు బదిలీ.. జగనన్న అమ్మఒడి కింద రూ.26,067 కోట్లు అందించాం.. వైఎస్సార్ చేయూత ద్వారా మహిళా ఖాతాల్లో రూ.14, 129 కోట్లు జమ చేశాం.. గత ప్రభుత్వ హయాంలో మహిళలకు ఇలాంటి సంక్షేమ పథకాలు ఎందుకు అందలేదు.. ముఖ్యమంత్రి మారడం వల్లే ఇప్పుడు ప్రజలకు పథకాలు అందుతున్నాయి.”అని సీఎం అన్నారు. గతంలో ప్రజాధనం దోచుకోవడం మాత్రమే ఉండేదన్నారు.
*వైసీపీకి, ఎంపీ పదవికి కృష్ణదేవరాయలు రాజీనామా
వైసీపీకి, ఎంపీ పదవికి నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నరసరావు పేటలో కొత్త అభ్యర్దిని పెట్టాలని అధిష్టానం భావించిందని.. ఈ రోజు రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందని ఆయన అన్నారు. దానికి తాను బాధ్యుడిని కాదన్నారు. కేడర్ కన్ఫ్యూజ్ అవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆయనను కలిసేందుకు మాచర్ల, పెదకూరపాడు ఎమ్మెల్యేలు వెళ్లారు. ఆలోపే లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రకటన చేసినట్లు తెలిసింది. లావు శ్రీకృష్ణదేవరాయలు మార్చొద్దంటూ 10 రోజులగా అధిష్ఠానానికి పల్నాడు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. నరసరావుపేట నుంచి బీసీ అభ్యర్థిని పోటీ చేయించే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి గుంటూరు నుంచి పోటీకి దిగాలని శ్రీకృష్ణదేవరాయలకు అధిష్ఠానం సూచించింది. నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని లావు శ్రీకృష్ణదేవరాయలు తేల్చిచెప్పారు. హైకమాండ్ నరసరావుపేట ఎంపీ టికెట్ తేల్చికముందే లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు.
*అయోధ్యకు భారీగా తరలిన భక్తులు.. తోపులాట
అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు భారీగా వచ్చారు. రామభక్తులు వేకువజామున 3 గంటలకే పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చారు. ఇక, తొలి రోజు రామ్‌లల్లాను దర్శించుకోవడానికి భక్తులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వెలుపల భారీ భక్త జనసందోహంతో కిటకిటలాడుతుంది. రాముడి దర్శనం కోసం భక్తులు నిరీక్షిస్తున్నారు. జైశ్రీరామ్ అనే నినాదాలతో అయోధ్య నగరం మార్మోగిపోతుంది. కాగా, అయోధ్య రామమందిరంలో తోపులాటలు కూడా జరిగినట్టు పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, తొలి రోజు అయోధ్య రామాలయాన్ని దాదాపు 5 లక్షల మంది భక్తులు సందర్శించుకునే అవకాశం ఉందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బోర్డు అంచనా వేసింది. సామాన్య భక్తులకు నేటి నుంచి దర్శనభాగ్యం కల్పించడంతో పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాగా రామ భక్తులు ఉదయం 8 గంటల నుంచి బాల రాముడిని దర్శించుకోవచ్చని ఆలయ అధికారులు చెప్పుకొచ్చారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివుంచుతారని పేర్కొన్నారు. ఆలయంలో రెండుసార్లు హారతిని భక్తులు దర్శించుకోవచ్చు అని తెలిపారు. ఉదయం 6.30 గంటలకు, రాత్రి 7.30 గంటల సమయంలో ఈ అవకాశం ఉంటుందని చెప్పారు. ఇక భక్తులు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దర్శనం, హారతి పాస్‌లను పొందవచ్చు అని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బోర్డు వెల్లడించింది.
*లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీ కీలక నిర్ణయం..
అయోధ్య శ్రీరాముడిని దర్శించుకునేందుకు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రామమందిరం దగ్గర క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. ఇదిలా ఉండగా, లోక్ సభ ఎన్నికల ముందు కమలం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం రామాలయం అందుబాటులోకి వచ్చింది. దేశ ప్రజలు రామ్ లల్లా దర్శనం చేసుకునేలా ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించబోతోంది. బీజేపీ శ్రీరామజన్మభూమి దర్శన ప్రచారం రేపటి నుంచి ప్రారంభం కానుంది. అయోధ్యకు చెందిన కమలం పార్టీ నాయకులకు పార్టీ హైకమాండ్ పనులు అప్పగించింది. ఇప్పటికి అయోధ్య ధామానికి వచ్చే భక్తులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని బీజేపీ జిల్లా యూనిట్‌ను హైకమాండ్ ఆదేశించింది. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.. అంతకంటే ముందే శ్రీరామ జన్మభూమి దర్శన ప్రచారాన్ని బీజేపీ ప్రారంభిస్తుంది. ప్రచారంలో భాగంగా దేశంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన ప్రజలను రాంలాలా దర్శనం కోసం పంపించాలని బీజేపీ అధిష్టానం తెలిపింది. అలాగే, రామమందిర ఉద్యమంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ల క్రియాశీలక పాత్ర గురించి ప్రజలకు తెలియజేయనున్నారు. అంతే కాకుండా ఆలయ నిర్మాణాన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఎలా అడ్డుకుంటున్నాయనే విషయం కూడా చెప్పనున్నారు. ఇక, బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సాల్, వినోద్ తావ్డే సహా పలువురు నేతలు ఈ ప్రచారాన్ని పర్యవేక్షిస్తారని ఓ నివేదిక పేర్కొంది. ప్రచారాన్ని విజయవంతం చేసేందుకు వీరంతా అయోధ్య జిల్లా యూనిట్‌తో టచ్‌లో ఉండనున్నారు. స్థానిక నేతలకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు (జనవరి 24న) అయోధ్యకు రానున్నారు. ఇక్కడ రామమందిరంలో శ్రీరాముడిని పూజించనున్నారు. అనంతరం శ్రీరామజన్మభూమి దర్శన ప్రచారాన్ని ప్రారంభిస్తారు.
*బడ్జెట్లో వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.22-25 లక్షల కోట్లకు పెంచే అవకాశం
రాబోయే మధ్యంతర బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.22-25 లక్షల కోట్లకు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించవచ్చు. అర్హులైన ప్రతి రైతుకు సంస్థాగత రుణం అందుబాటులో ఉండేలా కూడా ఇది నిర్ధారిస్తుంది. విశ్వసనీయ వర్గాలు ఈ సమాచారం అందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యవసాయ రుణ లక్ష్యం రూ.20 లక్షల కోట్లు. ప్రస్తుతం, ప్రభుత్వం అన్ని ఆర్థిక సంస్థలకు మూడు లక్షల రూపాయల వరకు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై రెండు శాతం వడ్డీ రాయితీని అందిస్తుంది. అంటే రైతులు ఏటా ఏడు శాతం రాయితీపై రూ.3 లక్షల వరకు వ్యవసాయ రుణాలు పొందుతున్నారు. సకాలంలో చెల్లించే రైతులకు ఏడాదికి మూడు శాతం అదనపు వడ్డీ రాయితీ కూడా అందజేస్తున్నారు. రైతులు దీర్ఘకాలిక రుణాలు కూడా తీసుకోవచ్చు కానీ వడ్డీ రేటు మార్కెట్ రేటు ప్రకారం ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ లక్ష్యం రూ.22-25 లక్షల కోట్లకు పెరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అగ్రి-క్రెడిట్‌పై ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. మిగిలిపోయిన అర్హులైన రైతులను గుర్తించి వారిని క్రెడిట్ నెట్‌వర్క్‌లోకి తీసుకురావడానికి ప్రభుత్వం అనేక ప్రచారాలను నిర్వహిస్తోంది. కేంద్రీకృత విధానంలో భాగంగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ‘క్రెడిట్’ (రుణాల కోసం)పై ప్రత్యేక విభాగాన్ని కూడా రూపొందించిందని వర్గాలు తెలిపాయి. ఇది కాకుండా, వివిధ వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల కోసం రుణ పంపిణీ గత 10 సంవత్సరాలలో లక్ష్యం కంటే ఎక్కువగా ఉందని వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 2023 నాటికి రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణ లక్ష్యంలో 82 శాతం సాధించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ కాలంలో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సుమారు రూ. 16.37 లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేయబడ్డాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా వ్యవసాయ రుణాల పంపిణీ లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యవసాయ రుణాల పంపిణీ రూ.21.55 లక్షల కోట్లు. ఇది ఈ కాలానికి నిర్దేశించిన రూ.18.50 లక్షల కోట్ల లక్ష్యం కంటే ఎక్కువ. కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) నెట్వర్క్ ద్వారా 7.34 కోట్ల మంది రైతులు రుణాలు పొందారు. మార్చి 31, 2023 వరకు దాదాపు రూ.8.85 లక్షల కోట్లు బకాయిలు ఉన్నాయి.
*రామ్ లల్లా విగ్రహానికి 11 కోట్ల విలువైన కిరీటాన్ని విరాళంగా ఇచ్చిన గుజరాత్ వజ్రాల వ్యాపారి..
అయోధ్య లో బాల రాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ కన్నుల పండుగగా జరిగింది.. రాముని దర్శన భాగ్యం కోసం దేశ ప్రజలు ఏంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. నేడు భక్తులకు రాముని దర్శనం కల్పిస్తున్నారు.. ఇప్పటికే వేలాది మంది భక్తులు రామ మందిరానికి చేరుకున్నారు.. ఇక రామ మందిరానికి భారీ విరాళాలను కూడా అందిస్తున్నారు.. దేశంలో రామ భక్తులు రాముడికి కానుకలు కూడా సమర్పిస్తున్నారు.. తాజాగా ఓ వజ్రాల వ్యాపారి కోట్ల విలువైన కిరీటం బహుకరించారు.. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరంలో ప్రతిష్టించిన రామ్ లల్లా విగ్రహానికి ‘ముకుట్’ (కిరీటం) విరాళంగా ఇచ్చారు . 11 కోట్ల విలువైన కిరీటాన్ని కొత్తగా నిర్మించిన రామమందిరంలో దేవత కోసం ప్రత్యేకంగా రూపొందించారు. సూరత్‌లోని గ్రీన్ ల్యాబ్ డైమండ్ కంపెనీ యజమాని ముఖేష్ పటేల్, రాముడికి బంగారం, వజ్రాలు మరియు విలువైన రత్నాలతో అలంకరించబడిన 6 కిలోల బరువున్న కిరీటాన్ని సమర్పించారు.. ముకేశ్ పటేల్ తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగతంగా అయోధ్యను సందర్శించి ఆలయ ట్రస్ట్ అధికారులకు చాలా చక్కగా రూపొందించిన కిరీటాన్ని సమర్పించారు.. రామమందిరం ప్రధాన అర్చకులు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ధర్మకర్తల సమక్షంలో ముఖేష్ పటేల్ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో కిరీటాన్ని అందజేశారు ..కొత్తగా నిర్మించిన ఆలయంలో ఏర్పాటు చేసిన శ్రీరాముడి విగ్రహానికి ముఖేష్ పటేల్ కూడా కొన్ని ఆభరణాలను అందించారని విశ్వహిందూ పరిషత్ జాతీయ కోశాధికారి దినేష్ భాయ్ నవియా వెల్లడించారు…
*భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం దారుణం..
ఐక్యరాజ్యసమితి పని తీరుపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐరాసతో పాటు దాని అనుబంధ సంస్థల్లో మార్పులు చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపాడు. ఈ సందర్భంగా భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించాడు. శక్తిమంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేక పోతున్నాయంటూ మాస్క్ విమర్శలు గుప్పించారు. అయితే, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఇటీవల ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ చేస్తూ.. భద్రతా మండలిలో ఏ ఒక్క ఆఫ్రికా దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గత 80 ఏళ్ల కిందటిలా ఇప్పటికీ కొనసాగకూడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో భద్రతా మండలిలో దేశాల శాశ్వత సభ్యత్వంపై చర్చ స్టార్ట్ అయింది. అలాగే, అమెరికాకు చెందిన వ్యాపారి మైఖెల్ ఐసెస్ బర్డ్ ఈ పోస్ట్ కు సమాధానం ఇస్తూ.. మరి భారత్ సంగతి ఏంటి అని ప్రశ్నించారు. దీనికి ఎలాన్ మాస్క్ రియాక్ట్ అవుతూ.. ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలను సవరించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడం దారుణమన్నారు. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదిలి పెట్టేందుకు ముందుకు రాకపోవడం వల్లే అసలు సమస్య వస్తుందన్నాడు.. ఆఫ్రికా యూనియన్‌కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని టెస్లా చీఫ్ ఎలాన్ మాస్క్ చెప్పుకొచ్చాడు. ఇక, ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా 1945లో ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించింది. దీనికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భద్రతా మండలిలో మాత్రం ఎలాంటి మార్పులూ జరగలేదు.. వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్ దేశాలే కొనసాగుతున్నాయి. శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ప్రయత్నిస్తున్నప్పటికి.. అందుకు అనుగుణంగా ఎలాంటి మార్పులు జరగడం లేదు.. ఐదింట నాలుగు దేశాలు భారత్‌కు అనుకూలంగానే ఉన్నాప్పటికి.. ఒక్క చైనా మాత్రం భారత్ కు శాశ్వత సభ్యత్వం ఇచ్చేందుకు అడ్డు తగులుతుంది.
*హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులు.. గాజాలో 1000 మసీదులు ధ్వంసం
ఇజ్రాయెల్ హమాస్‌ను నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేసింది. ఈ ప్రతిజ్ఞను నెరవేర్చడానికి అది నిరంతరం గాజాలో వైమానిక దాడులు చేస్తోంది. ఆసుపత్రులు, పాఠశాలలు, యూనివర్సిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 25 వేల మందికి పైగా మరణించారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలు. ఇజ్రాయెల్ దాడిలో మసీదులకు కూడా భారీ నష్టం వాటిల్లింది. గాజాలోని పాలస్తీనా మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, అక్టోబర్ 7 నుండి ఇజ్రాయెల్ సైన్యం 1,000 కంటే ఎక్కువ మసీదులను కూల్చివేసింది. అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీనితో పాటు, ఇజ్రాయెల్ సైన్యం డజన్ల కొద్దీ శ్మశానవాటికలను కూడా ధ్వంసం చేసింది. ఈ మసీదుల పునర్నిర్మాణానికి దాదాపు 500 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. దీనితో పాటు, ఇజ్రాయెల్ వైమానిక దాడులలో సెయింట్ పోర్ఫిరియస్ గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చి, జకాత్ మతపరమైన కమిటీలు, ఖురాన్-బోధన పాఠశాలలు, ఇస్లామిక్ ఎండోమెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంతో సహా అనేక చర్చిలు కూడా ధ్వంసమయ్యాయి. దీనితో పాటు, మిలిటరీ దాడి ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్ 100 మందికి పైగా మతపరమైన వ్యక్తులను చంపింది. వారిలో పండితులు, బోధకులు, ఇమామ్‌లు, మ్యూజిన్లు ఉన్నారని మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. దీనిపై విచారం వ్యక్తం చేసిన మంత్రిత్వ శాఖ.. ఇజ్రాయెల్ ఆక్రమణలో సైన్యం డజన్ల కొద్దీ శ్మశానవాటికలను ధ్వంసం చేసిందని, సమాధుల నుండి మృతదేహాలను బయటకు తీయడంతోపాటు వాటికి నష్టం కలిగించిందని.. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని పేర్కొంది. 1400 సంవత్సరాల క్రితం నిర్మించిన అల్-ఒమారీ మసీదు, గాజాలోని అతిపెద్ద, పురాతన మసీదులలో ఒకటి. పాలస్తీనాలోని మూడవ అతిపెద్ద మసీదు. డిసెంబర్లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో ఈ మసీదు ధ్వంసమైంది. అల్-ఒమారీ చిన్న అల్-అక్సా మసీదుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది అల్-అక్సా మసీదుకు అనుసంధానించబడి ఉంది. దీనితో పాటు, 1600 సంవత్సరాల పురాతనమైన సెయింట్ పోర్ఫిరియస్ చర్చి కూడా ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమైంది. అక్టోబర్‌లో, ఇజ్రాయెల్ సైన్యం సెయింట్ పోర్ఫిరియస్ చర్చిని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులతో ధ్వంసం చేసింది. ఈ చర్చి డజన్ల కొద్దీ వలస వచ్చినకుటుంబాలకు, శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది
*మిజోరంలో కూలిన బర్మా ఆర్మీ విమానం
జోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో బర్మాకు చెందిన ఆర్మీ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనట్లు సమాచారం. వీరందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం, ఈ విమానంలో పైలట్‌తో పాటు మరో 14 మంది ఉన్నారు. క్షతగాత్రులందరినీ లెంగ్‌పుయ్ ఆస్పత్రిలో చేర్చినట్లు మిజోరం డీజీపీ తెలిపారు. ఘటనా స్థలంలో సహాయ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో బర్మాకు చెందిన ఆర్మీ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 6 మందికి గాయాలయ్యాయి. విమానంలో పైలట్‌తో పాటు మరో 14 మంది ఉన్నారు.