చూసైనా మారండి..! 104 ఏళ్ల తాతయ్య.. 18వ సారి ఓటు హక్కు వినియోగించుకున్నారు..
కొన్ని ప్రాంతాల్లో నమోదు అవుతోన్న పోలింగ్ శాతం ఆందోళనకు గురిచేస్తోంది.. పెద్ద ఎత్తున యువ ఓటర్లు పుట్టుకొస్తున్నా.. పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేసేవారి సంఖ్య తగ్గిపోతోంది.. ముఖ్యంగా పట్టణాల్లో ఇది మరీ ఎక్కువగా ఉన్నట్టు నమోదు అవుతోన్న పోలింగ్ శాతాన్ని బట్టి తెలుస్తుంటుంది.. అయితే, ఓ తాతగారిని చూసి అంతా నేర్చుకోవాలి.. 104 ఏళ్ల వయస్సులోనూ ఓటు హక్కు వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.. 18వ సారి ఓటు హక్కు వినియోగించుకుని తన ప్రత్యేకత చాటుకున్నాడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన వ్యాపారవేత్త రొంగల రాముడు. వయోవృద్ధులకు కేటాయించిన హోమ్ ఓటింగ్ ద్వారా 104 ఏళ్ల రాముడు.. 18వ సారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిడదవోలులోనే తన స్వగృహానికి పోలింగ్ అధికారులు బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చారు. దీంతో రాముడు ఇంటి నుంచి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ఈ మధ్యే.. ఓటింగ్ ఎట్ హోమ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎన్నికల కమిషన్.. వయోవృద్ధులు అంటే 85 ఏళ్లు పైబడినవారికి, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ అవకాశం ఇచ్చింది ఈసీ.. అయితే, ఏకంగా 18 సార్లు ఓటు హక్కు వినియోగించుకుని.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు రొంగల రాముడు అనే తాతయ్య. ఇప్పటికైనా కదలండి యువత.. ఓటు హక్కు వినియోగించుకొండి.. నచ్చిన నాయకుడికి ఓటు వేసి మెచ్చిన ప్రభుత్వాన్ని తెచ్చుకొండి.
వైఎస్ వివేకా కేసు.. వైఎస్ అవినాష్‌రెడ్డికి హైకోర్టులో ఊరట
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ, కడప లోక్‌సభ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డికి ఊరట లభించింది.. వైఎస్ వివేకా హత్య కేసులో.. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది హైకోర్టు.. దీంతో.. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి రిలీఫ్ దొరికినట్టు అయ్యింది.. అయితే, వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ మారిన దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది హైకోర్టు.. గతంలో అవినాష్ రెడ్డి.. హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు దస్తగిరి.. కానీ, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కోటివేయలేమన్న హైకోర్టు.. దస్తగిరి పిటిషన్‌ను కొట్టివేసింది. మరోవైపు.. వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా హైకోర్టు లో ఊరట లభించింది.. భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. ఇక, ఇదే కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. కాగా, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి.. ఈ కేసులో ఏడవ నిందితుడిగా ఉన్నారు.. భాస్కర్ రెడ్డి హెల్త్ కండీషన్ ఆధారంగా బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు.
పెన్షన్ల పంపిణీపై వైఎస్ అవినాష్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో పెన్షన్ల వ్యవహారం కాకరేపుతూనే ఉంది.. గత నెలలో పెన్షన్ల పంపిణీ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మొదలైన మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఇక, పెన్షన్ల పంపిణీ పై ఘాటుగా స్పందించారు కడప ఎంపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి.. పెన్షన్ల పంపిణీలో జరిగిన ఘోరానికి చంద్రబాబు నాయుడే కారణమన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అవ్వాతాతలు గుణపాఠం చెబుతారు అని హెచ్చరించారు. చంద్రబాబు తప్పుడు పని వల్ల నేడు అవ్వ , తాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన.. ఎండలకు తట్టుకోలేక చాలామంది వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారు. మరికొందరు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన కూతురి వ్యాఖ్యలపై స్పందించిన ముద్రగడ.. షాకింగ్ కామెంట్స్..!
తన కూతురు క్రాంతి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ఆర్సీపీ నేత, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. షాకింగ్ కామెంట్స్ చేశారు.. తాజాగా, ముద్రగడ వ్యవహార శైలి, సవాళ్లపై స్పందిస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు ఆయన కూతరు క్రాంతి.. అది కాస్తా వైరల్‌గా మారిపోయింది.. దీంతో.. తన కూతురు వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముద్రగడ.. నా కూతురుకు పెళ్లి అయ్యింది.. తాను పెళ్లి కాకముందు వరకే నా ప్రాపర్టీ.. ఇప్పుడు ఆమె మెట్టినిల్లె ఆమె ప్రాపర్టీగా పేర్కొన్నారు. నన్ను నా కూతురుతో కొంతమందితో తిట్టించారని మండిపడ్డారు.. ఇది బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, రాజకీయం రాజకీయమే, కూతురు కూతురే అని చెప్పుకొచ్చారు. నేను ఒకసారి వైఎస్ఆర్సీపీలో చేరాను.. ఇక పక్క చూపులు చూడను. ఎవరెన్ని అనుకున్న సీఎం వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు.. నేను పదవుల కోసం పాకులాడను అని స్పష్టం చేశారు ముద్రగడ.. ఏ పదవులు కూడా అడగనన్న ఆయన.. నేను సేవకున్ని మాత్రమే అన్నారు. నా కూతురి వ్యాఖ్యలకు బాధపడిన భయపడను.. నా కూతురు.. ఇప్పుడు నా ప్రాపర్టీ కాదని పేర్కొన్నారు.. ఇక, నా కూతురు చేత వీడియో రిలీజ్ చేయించారు.. ఎవరు బెదిరించినా.. బెదిరిపోను జగన్ కి సేవకుడిగా ఉంటాను.. నా కూతురికి, నాకు మధ్య చిచ్చు పెట్టాలని చూశారు.. బెదిరిపోను అని స్పష్టం చేశారు ముద్రగడ పద్మనాభం..
చార్లెస్ శోభరాజ్ కంటే పెద్ద మోసగాడు..! తమ్ముడిపై కేశినేని సంచలన ఆరోపణలు
విజయవాడ లోక్‌సభ బరిలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని బరిలోకి దిగుతుండగా.. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థిగా ఆయన తమ్ముడు కేశినేని చిన్ని పోటీ చేస్తున్నారు.. గతంలోనే అన్నదమ్ముల మధ్య మాటల యుద్ధం జరిగినా.. ఎన్నికల సమయంలో అది తారాస్థాయికి చేరుకుంది.. చార్లెస్ శోభరాజ్ కంటే కేశినేని చిన్ని పెద్ద మోసగాడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు కేశినేని నాని.. గతంలో కేశినేని చిన్ని కారు నంబర్లు 5555.. నావి 7777.. కానీ, నేను ఎంపీ అయ్యాక తాను కూడా కారు నంబర్లు 7777 వాడాడు.. అంతేకాదు రియల్ ఎస్టేట్ దందాల కోసం వందల స్టిక్కర్లు కార్లకు వేసి వాడాడు.. నేను నా స్టిక్కర్ ఫేక్ వి తయారు చేసి వాడుతుంటే నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను.. అపర కుబేరుడు అంటాడు ఇలా మోసాలు చేయటం ఏంటి ? కేశినేని చిన్ని లాంటి వ్యక్తులు ఎంపీ లేదా ఎమ్మెల్యే అయితే సమాజం పరిస్థితి ఏంటి ? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ మేనిఫెస్టో విడుదల..
ఇందిరమ్మ రాజ్యం..ఇంటింటా సౌభాగ్యం అనే పేరుతో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఇవాళ ఉదయం గాంధీభవన్ లో మేనిఫెస్టోను ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి అందరూ కాలిసి విడుదల చేశారు. అనంతరం మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ గొంతుకల ఆలోచన మేరకు మేనిఫెస్టో అన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాగానే 23 అంశాలపై దృష్టి సారిస్తోందన్నారు. వాటినే మేనిఫెస్టో లో చేర్చామన్నారు. విభజన చట్టం లో హామీలు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉందన్నారు. బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ.. మైనింగ్ విశ్వవిద్యాలయం .. లాంటి అంశాలు పూర్తి చేస్తామన్నారు. నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ లో అని తెలిపారు. నూతన ఎయిర్పోర్ట్, కొత్త రైల్వే లైన్ మణుగూరు కి.. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు, ఆంధ్రలో విలీనం అయినా ఐదు గ్రామాలు వెనక్కి తెలంగాణలో కలుపుతామన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసింది బీఆర్ఎస్ అన్నారు. దాన్ని అధిగమించి నాలుగు హామీలు అమలు చేశామన్నారు. ఇక ఇంచార్జి దీపా దాస్ మున్షీ మాట్లాడుతూ.. బీజేపీ ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చిందన్నారు. మోడీ..అమిత్ షా లు 400 సీట్లు అంటున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ జోడో యాత్రతో దేశం మొత్తం తిరిగారన్నారు. మోడీకి భయం పట్టుకుందన్నారు.
గాడిద గుడ్డు కాదు.. మీకు పాము గుడ్డు గుర్తు కావాలి..
గాడిద గుడ్డు కాదు.. మీకు పాము గుడ్డు గుర్తు కావాలని రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం అబద్దాలతో అడ్డ దారులు తొక్కుతుందన్నారు. ఎలాగైనా గెలవాలనే వర్గాల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంతలా దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని అన్నారు. అనుకూల వ్యతిరేక వర్గాలను ఏర్పాటు చేసి ఘర్షణ వాతావరణం సృష్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పినప్పటికీ..కావాలనే తాప్పు దారి పట్టిస్తున్నారని అన్నారు. ప్రధాన మంత్రి మోడీ నే స్వయంగా చెప్పినా కూడా రేవంత్ రెడ్డి పదే పదే రిజర్వేషన్ల విషయం ముందు వేస్తున్నాడన్నారు. ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉన్నారని తెలిపారు. ఫేక్ వీడియో లు సృష్టించిన వారిని బీజేపీ విడిచిపెట్టదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం తో ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందన్నారు. ఆ వ్యతిరేకత ను దారి మళ్లించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని అన్నారు. దళితుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్ ను చూస్తే దయ్యాలు వేదాలు వాళ్లిస్తున్నట్లు అనిపిస్తుందన్నారు. అనేక సార్లు బాబా సాహెబ్ అంబేద్కర్ నీ అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ కి గౌరవాన్ని పెంచిందన్నారు. కార్పోరీ ఠాకూర్ కి భారత రత్న ఇచ్చి గౌరవించింది మోడీ ప్రభుత్వం అని తెలిపారు. పేద వర్గాలకు మహిళలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించింది కూడా మోడీ ప్రభుత్వమే అని తెలిపారు. రిజర్వేషన్ ద్వారా వచ్చిన వారే అవకాశాలు పొందుతున్నారని స్వయంగా జవహర్లాల్ నెహ్రూ ప్రస్తావించారని గుర్తు చేశారు. రిజర్వేషన్ల ద్వారా మెరిట్ కి అవకాశం రావడం లేదని దళితులను అవమనిచింది కూడా కాంగ్రెస్ ప్రధాని హోదాలో నెహ్రూ ప్రస్తావించారని అని తెలిపారు.
వాయనాడ్‌లో ఓటమి భయంతో రాహుల్ రాయ్‌బరేలీ నుంచి పోటీ
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బర్ధమాన్-దుర్గాపూర్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. వాయనాడ్‌లో ఓటమి భయంతో షెహజాదే ( రాహుల్ గాంధీ) తన కోసం మరో స్థానాన్ని ఎంపిక చేసుకుంటారని నేను ముందే చెప్పానన్నారు. ఇప్పుడు అమేథీ నుంచి పారిపోయి రాయ్‌బరేలీ స్థానాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ గతంలో వచ్చిన సీట్ల కంటే ఈసారి తక్కువ స్థానాలను మాత్రమే గెలుస్తుందన్నారు. వీళ్లు ఎన్నికల్లో గెలవడానికి పాకులాడడం లేదు.. కేవలం దేశాన్ని విభజించేందుకు ఎన్నికలను ఉపయోగించుకుంటున్నారనే విషయాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. కాగా, బెంగాల్‌లోని టీఎంసీ ప్రభుత్వం హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేసిందని ప్రధాని మోడీ ఆరోపణలు చేశారు. జై శ్రీరామ్ నినాదం కూడా వారికి కోపం తెప్పించేలా చేసిందన్నారు. సందేశ్ ఖలీలోని దళితులపై జరిగన దౌర్జన్యాలను టీఎంసి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదన్నారు. దోషి షాజహాన్ ను కాపాడేందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు. ఇక, నేను 140 కోట్ల మంది ప్రజలకు సేవ చేయడానికి పుట్టాను.. అందుకే ప్రజలు నా వైపు ఉన్నారంటూ మోడీ చెప్పుకొచ్చారు.
హేమంత్ సోరెన్‌కు షాక్.. పిటిషన్ తిరస్కరించిన జార్ఖండ్ హైకోర్టు
జార్ఖండ్ హైకోర్టు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హేమంత్ సోరెన్ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి, జస్టిస్ నవనీత్ కుమార్ డివిజన్ బెంచ్ విచారణ పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 28న తీర్పును రిజర్వ్ చేసింది. హేమంత్ సోరెన్ తరపున దాఖలు చేసిన పిటిషన్‌లో ఈడీ మాట్లాడుతున్న భూమి తన పేరుపై ఎప్పుడూ లేదని పేర్కొంది. తీర్పు ఇవ్వడంలో జాప్యం కారణంగా హేమంత్ సోరెన్ తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అది మే 6న విచారణకు రానుంది. అంతకుముందు ఏప్రిల్ 27న సోరెన్‌కు షాక్ తగిలింది. భూ కుంభకోణం కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు రాంచీలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. హేమంత్ సోరెన్ తండ్రి, జేఎంఎం అధినేత శిబు సోరెన్ సోదరుడు రామ్ సోరెన్ శనివారం ఉదయం మరణించారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. సోరెన్ తన మేనమామ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు 13 రోజుల పాటు మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణ సందర్భంగా ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది.
ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు!
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్ 2024 కొనసాగుతోంది. మే 2న ఆరంభం అయిన ఈ సేల్.. మే 9 వరకు కొసనసాగనుంది. ఈ సేల్‌లో ల్యాప్‌ట్యాప్, టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా రానుంది. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో మోటో ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ.27,999కే లభించనుంది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.36,999గా ఉండగా.. 16 శాతం తగ్గింపు అనంతరం రూ.30,999కి అందుబాటులో ఉంది. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. దాదాపుగా రూ.28 వేలకు మీకు లభిస్తుంది. రియల్‌మీ పీ1 ప్రో రూ.19,999, వివో టీ2 ప్రో 5జీ రూ.20,999కే కొనుగోలు చేయొచ్చు. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో పోకో ఎక్స్6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.22,999కి మీకు అందుబాటులో ఉంది. రెడ్‌మీ నోట్ 13ప్రో 5జీ రూ.21,999కే లభించనుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో5జీని రూ.19,999కి.. ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ రూ.49,999కి కొనుగోలు చేయొచ్చు. రియల్‌మీ 12 ప్రో రూ.22,999, మోటోరొలా ఎడ్జ్ 40 నియో రూ.19,999కి లభిస్తుంది. మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లపై కూడా భారీ తగ్గింపు ఉంది.
‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం!
టీమిండియా మాజీ బ్యాటర్, ‘మిస్టర్ ఐపీఎల్’ సురేశ్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రైనా కజిన్ సౌరభ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ప్రమాదంలో సౌరభ్ స్నేహితుడు కూడా మృతి చెందాడు. ఈ ఘటన మే 1న హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాలోని గగల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు. రైనా తల్లి తరపు దగ్గరి బంధువే ఈ సౌరభ్. కాంగ్రా జిల్లాలో గగల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో సౌరభ్ కుమార్ ప్రయాణించిన కారు అదుపు తప్పింది. ముందుగా స్కూటర్‌ను ఢీ కొట్టిన కారు.. అనంతరం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సురేష్ రైనా కజిన్ సౌరభ్ కుమార్, అతని స్నేహితులు శుభమ్, ఖాతుమ్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి సౌరభ్, శుభమ్ తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు కాంగ్రా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ షాలిని అగ్నిహోత్రి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే వెంటనే కారు డ్రైవర్ షేర్ సింగ్ పరారయ్యాడు. అతని కోసం కాంగ్రా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఆధారంగా మండీలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్‌పై పలు కేసులు నమోదు చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రైనా ప్రస్తుతం ఐపీఎల్ 2024లో వ్యాఖ్యాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
సీన్ లోకి హరిహర వీరమల్లు.. మరి ‘ఓజి’ రిలీజ్ పరిస్థితి ఏంటి..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ” ఓజీ”. ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.దర్శకుడు సుజీత్ పవన్ కల్యాణ్ ను ఏవిధంగా చూపిస్తాడో అని ప్రేక్షకులు “ఓజి” సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.”ఓజి ” చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.ఫ్యాన్స్ పవన్ సినిమా నుంచి ఏమి కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సినిమాలో వుంటాయని సుజీత్ తెలిపారు..అయితే ఈ సినిమా ఈ సంవత్సరం సెప్టెంబర్ లో విడుదలవుతుంది అని చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నందున పవన్ షూటింగ్స్ బ్రేక్ ఇచ్చి రాజకీయాలలో ఫుల్ బిజీ అయిపోయారు .ఎన్నికలు ముగిసిన వెంటనే తన లైనప్ లో వున్న సినిమాలను పూర్తి చేస్తారు .అయితే తాజాగా పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా టీజర్ రిలీజ్ అయింది.ఆ సినిమాను 2024 ఎండింగ్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఆ టీజర్ లో ప్రకటించారు. ఒకే సంవత్సరంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం అసాధ్యం. కాబట్టి ఈ రెండు సినిమాలలో ఏదో ఒకటి కచ్చితంగా వాయిదాపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ ఇంకా మిగిలి ఉండటంతో ముందుగా పవన్ ఏది పూర్తి చేస్తారో తెలియాల్సి వుంది.అయితే తాజా సమాచారం ప్రకారం “ఓజి” సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది .
సుక్కు ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆల్రెడీ సెట్స్ మీద గేమ్ చేంజర్ సినిమా ఉండగా ఇప్పుడు మరో రెండు సినిమాలను లైన్లో పెట్టేశాడు… చరణ్ పుట్టినరోజు సందర్బంగా ఆ సినిమాలను అధికారికంగా ప్రకటించారు.. ఆ సినిమాల నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అయితే గేమ్ చేంజర్ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.. దీంతో తదుపరి సినిమాల పై చరణ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. ముందుగా చరణ్ 16 వ సినిమాగా రాబోతున్న బుచ్చి బాబు సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ఈ సినిమాను ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు.. జూన్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటుంది. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ తర్వాత వెంటనే గ్యాప్ లేకుండా సుకుమార్ తో రంగస్థలం 2 ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని రామ్ చరణ్ భావిస్తున్నారని తెలుస్తుంది.. సుక్కు ఈ సినిమా కథను పూర్తి చేసే పనిలో ఉన్నట్లు టాక్.. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప 2 సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమాను ఆగస్టు 15 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా పై ఫోకస్ పెట్టాడు.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన గ్రౌండ్ వర్క్ జరుగుతుంది.. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఈ సినిమా నుంచి అప్డేట్ రానుందని సమాచారం.. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు రాబోతున్న సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి..
నా బాడీ సూపర్ డీలక్స్ అంటున్న అషు రెడ్డి..
టాలీవుడ్ హాట్ బ్యూటీ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ద్వారా ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత తెలుగులో పలు చిత్రాలలో నటించి మెప్పించింది.ఆ తరువాత సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ భామ పిచ్చ క్రేజ్ తెచ్చుకుంది .ఈ భామ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది .నిత్యం తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ రెచ్చగొడుతుంది.తాజాగా అషురెడ్డి తెలుగులో ”యేవం” ఓ క్రేజీ చిత్రంలో నటిస్తుంది.ఈ సినిమాలో తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో వశిష్ఠ సింహ,జైభారత్ ,అషురెడ్డి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .ఈ చిత్రానికి ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహిస్తున్నాడు.నవదీప్ మరియు గోపరాజు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.కీర్తన శేషు ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు .రీసెంట్ ఈ సినిమాలో చాందిని చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో చాందిని పోలీస్ గెటప్ లో కనిపించింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి అషు రెడ్డి బోల్డ్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ చిత్రంలో అషు రెడ్డి హారిక అనే పాత్రలో నటిస్తుంది.తాజాగా రిలీజ్ చేసిన లుక్ లో ‘నా బాడీ సూపర్ డీలక్స్’ అనే కాప్షన్ ను ఉంచారు.దీనితో ఈ సినిమాలో అషు రెడ్డి బోల్డ్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం అషు రెడ్డి ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .