జగన్ నాలుగేళ్ల పాలన ఒక చరిత్ర.. గుంట నక్కలు వస్తున్నాయి జాగ్రత్త..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాలుగేళ్ల పాలన ఒక చరిత్ర.. ఎన్నికలు వస్తున్నాయి అనగానే గుంట నక్కలు పగటి వేషాలు వేసుకొని వస్తున్నాయి.. ప్రజలను భ్రమల్లో పెట్టి మళ్ళీ అధికారంలోకి రావటానికి ప్రయత్నిస్తున్నాయి.. అంతా అప్రమత్తంగా ఉండాలి.. జాగ్రత్త అని హెచ్చరించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీసులో నాలుగేళ్ళ సంబరాలు జరిగాయి.. పార్టీ జెండాను ఆవిష్కరించారు సజ్జల.. ఈ కార్యక్రమానికి మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఇవాళ్టికి నాలుగేళ్లు.. మే 30, 2019న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు.. ఈ నాలుగేళ్ల పాలన ఒక చరిత్రగా అభివర్ణించారు. రాష్ట్రంలో కోటి 60 లక్షల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు సజ్జల.. 50 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజాప్రతినిధులకు తెలుసు ప్రభుత్వం ఆ యా వర్గాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారోనని అన్నారు.. 2014-19 మధ్య చంద్రబాబు ఏం చేశాడు? చెప్పుకోవటానికి చంద్రబాబుకు ఒక పథకం అయినా ఉందా? అని ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు ఇస్తున్నా అడ్డుకుంటున్నారు.. తాను ఏం చేయలేదు కనుకే చెప్పుకోలేక పోతున్నాడని సెటైర్లు వేశారు. అమ్మ ఒడి ఇస్తానంటాడు.. పక్క రాష్ట్రాల్లోని పథకాలు చెబుతున్నాడు.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో వెన్నుపోట్లు, పక్క పోట్లు అన్నీ ఉంటాయి.. వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ ఒక్కటిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు మనకు మంచి అవకాశం ఇచ్చారు.. గుంట నక్కల వ్యవహారాలను ప్రజలకు వివరించండి.. 175 కు 175 వచ్చేటట్లు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
నిర్మల్ హృదయ్ భవన్‌కు సీఎం దంపతులు.. అనాథ పిల్లలతో ముచ్చట్లు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు ఈ రోజు విజయవాడలో పర్యటించారు. రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్‌ను సందర్శించారు జగన్ దంపతులు.. వారికి వైసీపీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు నగర మేయర్ భాగ్య లక్ష్మి తదితరులు స్వాగతం పలికారు. దాదాపు 30 నిముషాల పాటు అనాథ పిల్లలతో ముచ్చటించారు సీఎం జగన్.. ఆ తర్వాత నిర్మల్ హృదయ్ భవన్ లో నూతనంగా నిర్మించిన భవనాన్ని చిన్నారులతో కలిసి ప్రారంభించారు ఏపీ సీఎం.. మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన.. నిర్మల్ హృదయ్ భవన్ లోని అనాథలను ఆత్మీయంగా పలకరించారు.. అనాథలతో సరదాగా ముచ్చటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు.. ఆ తర్వాత తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు సీఎం జగన్.
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. లోక్‌సభ స్థానాలు పంపకంపై కేటీఆర్ ఆవేదన
జనాభా ప్రాతిపదికన 2026 తర్వాత జరిగే లోక్‌సభ స్థానాల (లోక్‌సభ స్థానాలు) డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు (దక్షిణ భారతానికి) తీవ్ర అన్యాయం జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దశాబ్దాలుగా కేంద్రం మాటలు, విధానాలను నమ్మి ప్రగతిశీల విధానాలు జనాభాను అదుపులో ఉంచుకున్న దక్షిణాది రాష్ట్రాలు అధిక జనాభాతో అల్లాడుతున్న దేశాన్ని కాపాడాలంటే జనాభా నియంత్రణ పద్ధతులు పాటించే అవకాశం ఉందన్నారు. ఈరోజు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ప్రగతిశీల విధానాలతో ముందుకు సాగుతున్న దక్షిణాది రాష్ట్రాలకు ఈ కొత్త డీలిమిటేషన్ వల్ల తక్కువ లోక్ సభ స్థానాలు (ఎంపీ సీట్లు) రావడం అన్యాయం, బాధాకరమని ట్విట్టర్ లో పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా జనాభాను నియంత్రించుకోని రాష్ట్రాలు ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్ సభ సీట్ల పెంపుతో లాభపడుతున్నాయి.. ఇది దురదృష్టకమని కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా జనాభాను నియంత్రించుకొని రాష్ట్రాలు ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్ సభ సీట్ల పెంపుతో లాభపడుతున్నాయి.. ఇది దురదృష్టకరం. జనాభా నియంత్రణలో ఉన్న కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ప్రగతిశీల విధానాలతో కఠినంగా శిక్షిస్తున్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జనాభా నియంత్రణలోనే కాకుండా అన్ని రకాల మానవాభివృద్ధి సూచికల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని తెలిపారు. కేవలం 18 శాతం జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు జాతీయ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 35 శాతం వాటాను అందిస్తున్నాయని చెప్పారు. జాతీయ ఆర్థికాభివృద్ధికి, దేశాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్న దక్షిణాది రాష్ట్రాలు అసంబద్ధ లోక్ సభ డీలిమిటేషన్ విధానం వల్ల భవిష్యత్తులో తమ ప్రాధాన్యతను కోల్పోకూడదన్నారు. తమ అభ్యుదయ విధానాలకు లబ్ధి చేకూర్చాల్సిన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అన్యాయంపై నాయకులు, ప్రజలు గళం విప్పాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
ప్రపంచ దేశాల నేతలకు బాస్‌లా మారిన మోడీ.. ఐదో బలమైన దేశంగా భారత్
ఏపీకి ప్రత్యేక నిధులు ఇచ్చారు.. పదివేల నాలుగు వందల కోట్లు ఏపీకి ఇచ్చి కేంద్రం తన ఉదారతను చాటుకుందన్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రపంచ దేశాల నేతలకు బాస్‌లా మోడీ మారారు.. 2014 లో బలహీనమైన దేశాల జాబితాలో ఉండేది… మోడీ నాయకత్వంలో ప్రపంచంలో ఐదవ బలమైన దేశంగా ఎదిగిందని తెలిపారు.. నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ళ పాలన సుభిక్షంగా సాగిందన్న ఆయన.. ఆరున్నర దశాబ్దాల లో భారత దేశం సాధించలేని అద్భుతాలు విజయాలు మోడీ ప్రభుత్వం సాధించిందని తెలిపారు.. కరోనా సమయంలో ఆత్మ నిర్భర భారత్ ద్వారా మన సత్తా చూపించాం.. ప్రపంచానికి మేడ్ ఇన్ ఇండియా వాక్సిన్ అందించామని గుర్తుచేశారు. మొబైల్ ఫోన్ ల తయారీ లో ప్రపంచం లో రెండవ దేశంగా భారత్ ఎదిగిందన్నారు జీవీఎల్.. కోవిడ్ సమయం లో వంద దేశాలకు మందులు అందించిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనన్న ఆయన.. ఈ దేశం లో వాక్సిన్ తయారు అవ్వక పోతే కొన్ని కోట్ల ప్రాణాలు ప్రమాదంలో పడేవన్నారు.. రెండున్నరేళ్లలో పార్లమెంట్ ఉభయ సభల భవనాలను నిర్మించిన చరిత్ర మోడీ నాయకత్వనిది.. పది కోట్ల మందికి ఉచితం గా గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చాం.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీ ఖాయం అన్నారు.. తీవ్రవాద చొరబాట్లు దాడులను అరికట్టిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం.. కొవిడ్ సమయంలో, యుద్ధ సమయంలో విదేశాల నుండి ప్రజలని రక్షించి తీసుకు వచ్చిన ప్రభుత్వం మోడీది అని కొనియాడారు.. గత తొమ్మిదేళ్ళ లో 74 కొత్త ఐర్పోట్ లను నిర్మించాం.. 55 వేల కోట్ల రూపాయల నరెగ నిధులను ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చాం.. 22 లక్షల ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. ఏపీ కి ప్రత్యేక నిధులు ఇచ్చారు అంటూ కేంద్రంపై ప్రశంసలు కురిపించారు.. చారిత్రాత్మక పార్లమెంట్ భవన ప్రారంభానికి రాజకీయ పార్టీల నేతలు రాక పోవడం వాళ్ళ సంకుచిత మనసును తెలియ జేస్తుందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
చంద్రబాబువి అన్నీ శంకుస్థాపనలే.. ప్రారంభోత్సవాలు ఉండవు..!
చంద్రబాబువి అన్నీ శంకుస్థాపనలే.. వేటికీ ప్రారంభోత్సవాలు చేయలేదని ఆరోపించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాలుగేళ్లలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నో ఆదర్శవంతమైన పథకాలు తీసుకువచ్చారు.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారని తెలిపారు.. దళారులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే అందించారు.. నామినేటెడ్ పదవుల్లో అన్ని వర్గాలకూ ప్రాధాన్యం ఇచ్చారు.. కరోనాతో పాటు ఎన్నో విపత్కర పతిస్థితులు వచ్చినా ఇచ్చిన హామీలను అమలు చేశారంటూ ప్రశంసలు కురిపించారు. మహానాడు పేరుతో చంద్రబాబు ఆడిన డ్రామాలను ప్రజలు చూశారని ఎద్దేవా చేశారు కాకాణి.. ఎన్నికలప్పుడు ఎన్టీఆర్‌ను గుర్తుకు తెచ్చుకుంటారు.. మహానాడులో మాత్రమే ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని అడుగుతారు.. మరి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నపుడు ఎందుకు గుర్తుకు రాలేదు? చంద్రబాబుకు చిత్ర శుద్ధి లేదు అని మండిపడ్డారు.. ఇక, టీడీపీ మొదటి మేనిఫెస్టో విడుదల చేశారు.. ఇంకా ఎన్ని వస్తాయో చూడాలన్న ఆయన.. 2014లో ఇచ్చిన హామీలు గుర్తుకు రాలేదు.. అప్పుడు మేనిఫెస్టోలో 650 వాగ్దానాలు ఇచ్చి.. 10 శాతం కూడా చంద్రబాబు అమలు చేయలేదు అని ఆరోపించారు.. చంద్రబాబువి అన్నీ శంకుస్థాపనలే.. వేటికీ ప్రారంభోత్సవాలు చేయలేదని ఆరోపించారు.. కృష్ణపట్నం, రామయ్య పోర్టులకు కేవలం శంకుస్థాపనే చేశారు.. కానీ సీఎం జగన్ అన్నింటినీ పూర్తి చేసి ప్రారంభిస్తున్నారని తెలిపారు. అసలు, చంద్రబాబు పేరు చెబితే ఏ పథక మైనా గుర్తుకు వస్తుందా..? అని ప్రశ్నించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
విజేత చెన్నై అయినా.. స్టార్ మాత్రం అతడే..
ఐపీఎల్ ఫైనల్‌లో గుజరాత్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్.. ఆఖరి రెండు బంతుల్లో జడేజా చేసిన మాయతో స్టేడియమంతా హోరెత్తింది. తన గురువులాంటి ధోనికి.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు జడేజా.. చెన్నై సూపర్ కింగ్స్ ను కింగ్ లా ఏలిన మహేంద్ర సింగ్ ధోనికి.. 16వ సీజన్ ట్రోఫీ గెలుపును బహుమానంగా అందించాడు. ఆదివారమే జరగాల్సిన మ్యాచ్.. వరుణుడి బ్యాటింగ్ తట్టుకోలేక మండేకు షిఫ్ట్ అయ్యింది.. కానీ, ఆదివారమే జరిగి వుంటే, ఇంత మజా వచ్చేది కాదేమో.. మండే రోజు మస్తు మజా ఇచ్చింది ఫైనల్. అయితే, ఈ ఏడాది ఐపీఎల్ విజేత చెన్నైనే అయినా స్టార్ మాత్రం గుజరాత్ ఓపెనర్ శుభమన్‌గిలే… 17మ్యాచ్‌ల్లో గిల్ 890 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. మరే ప్లేయర్ కూడా గిల్ దరిదాపుల్లో లేరు. ఫైనల్లో ఇంకాస్త రాణించి ఉంటే ఓ ఐపీఎల్‌లో ఎక్కువ పరుగులు చేసిన కోహ్లీ రికార్డును కూడా బద్దలు కొట్టేవాడు. ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్‌గా కూడా నిలిచాడు గిల్. ఈ ఏడాది ఐపీఎల్‌లో గిల్ సగటు ఏకంగా 59.33 పరుగులంటే ఏ స్థాయిలో ఆడాడో అర్ధం చేసుకోవచ్చు. మొత్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ శుభమన్ గిల్ ఇన్నింగ్స్.. అతడితో పాటు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అతడి కెరీర్‌లో బెస్ట్ సీజన్‌గా మిగిలిపోతుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో సెంచరీ బాదుతాడని గుజరాత్ ఫ్యాన్స్ ఆశించినప్పటికీ అది కుదరలేదు. కానీ, ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకోనున్న శుభమన్.. పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు.. ఈ సీజన్‌లో 17 మ్యాచ్‌లు ఆడి మొత్తంగా 890 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు సహా నాలుగు హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా, తొలి టీమ్ఇండియా ఆటగాడిగా విరాట్ కోహ్లీ(2021-973 పరుగులు) ఉన్నాడు. ఇప్పుడు అతడి తర్వాతి స్థానంలో గిల్ నిలిచాడు. 2022 సీజన్‌లో 863 పరుగులు చేసిన జోస్ బట్లర్, డేవిడ్ వార్నర్ 848 పరుగులు, కేన్ విలియమ్సన్ 735 పరుగులును అధిగమించాడు. ఇంకా ఈ సీజన్‌లో అతడకిది 13వ 30 ప్లస్ స్కోరు. ఒకే సీజన్‌లో అత్యధిక సార్లు 30ప్లస్ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు.
దటీజ్ ధోనీ.. మిస్టర్ కూల్ స్ట్రాటజీలే వేరప్ప.. మెరుపు కంటే వేగం..!
మహేంద్ర సింగ్ ధోనీకి మిస్టర్ కూల్ అనే పేరు ఎందుకు వచ్చిందో.. ఒత్తిడిలోనూ అతడి స్ట్రాటజీలను చూస్తే.. తెలుస్తోంది.. బ్యాట్‌కు పనిచెప్పి.. ఊహించని విధంగా మ్యాచ్‌లను గెలిపించి బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకోవడమే కాదు.. వికెట్ల వెనుక మెరుపు వేగంతో కదలడం ధోనీకే సొంతం.. మిస్టర్ కూల్ కీపింగ్ చేస్తున్నాడంటే.. బ్యాటర్ క్రీజ్ దాటాడా? ఇక మళ్లీ చూడకుండా ఫెవిలియన్ చేరాల్సిందే.. అది ధోనీ పనితనం.. అందుకే ధోని వుంటే.. ఆ మ్యాచే వేరు.. మిస్టర్ కూల్ స్ట్రాటజీలే వేరు అంటారు. ఇదే ధోనికి లాస్ట్ ఐపీఎల్ అనే వార్తలొస్తున్న పరిస్థితుల్లో.. ఫైనల్ మ్యాచ్ మాత్రం ధోని ఐపీఎల్ కెరీర్ లో అద్భుతమైన పతాక సన్నివేశమే. అయితే, ఈ మ్యాచ్ లో ధోని అప్లై చేసిన స్ట్రాటజీలతో మాత్రం గుజరాత్ అల్లాడిపోయింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ ఓపెనర్ శుభమన్‌గిల్ తన బ్యాట్‌తో సృష్టించిన విధ్వంసం చిన్నదేం కాదు.. 17మ్యాచ్‌ల్లో గిల్ 890 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. మరే ప్లేయర్ కూడా గిల్ దరిదాపుల్లో లేరు. ఫైనల్లో ఇంకాస్త రాణించి ఉంటే ఓ ఐపీఎల్‌లో ఎక్కువ పరుగులు చేసిన కోహ్లీ రికార్డును కూడా బద్దలు కొట్టేవాడు. ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్‌గా కూడా నిలిచాడు గిల్. అయితే, ఈ ఐపీఎల్‌లో అత్యంత భీకర, విధ్వంసకర బ్యాటర్.. గుజరాత్ అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం.. ఫైనల్లో ఇతన్ని కట్టడి చెయ్యడానికి అస్త్రాలకే అస్త్రంలా పాశుపతాస్త్రం వ్యూహం వేశాడు ధోనీ. గిల్ లేకుండానే గుజరాత్ 214 పరుగుల చేసిందంటే.. ఇక గిల్ వుంటే.. ఆ స్కోరును ఊహించడానికే దారుణంగా వుండేది చెన్నైకి. అలాంటి గిల్ ను అత్యంత త్వరగా పెవిలియన్ కు పంపడంలో ధోని పక్కాగా వ్యవహరించాడు. ఒక్కసారి క్యాచ్ డ్రాపయితే, ఇక గిల్ ను ఎవరూ ఆపలేరని గత మ్యాచుల చరిత్రే చెబుతోంది. 3 పరుగుల వద్ద గిల్ క్యాచ్ ను దీపక్ చహర్ డ్రాప్ చేయడంతో చెన్నై అభిమానులు కూడా హడలిపోయారు. ఆ తర్వాత గిల్ ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 7 బౌండరీలతో జస్ట్.. 20 బంతుల్లో 39 రన్స్ కొట్టిపారేశాడు. మరో టన్ను బాదేస్తాడా అన్న అనుమానం చెన్నై ఫ్యాన్స్ ను కుదురుగా వుండనివ్వలేదు. గిల్ వెనకాలే వుండే, ధోనికి మాత్రం పక్కాగా స్ట్రాటజీ వుంది. గిల్ దూకుడుగా ఎలా కళ్లెం వెయ్యాలో వ్యూహం వేశాడు. అప్లై చేశాడు. గిల్ కు పెవిలియన్ దారి చూపాడు. కీపర్ గా వికెట్ల వెనకాలా ధోని ఎంత యాక్టివ్ గా వుంటాడో ప్రపంచంలోని అన్ని క్రికెట్ జట్లకూ తెలుసు. కానీ, గిల్ మాత్రం మర్చిపోయాడు. ఆద మరిచాడు. అదే పనిగా క్రీజ్ దాటుతున్న గిల్ ను ఒక కంట కనిపెట్టిన ధోని.. ఒక్కసారి వచ్చిన ఛాన్స్ తో గిల్ ను స్టంపౌట్ చేశాడు. మహేంద్ర సింగ్ ధోని సూపర్ కీపింగ్ కారణంగా గిల్ స్టంపౌట్ అయ్యాడు. మెరుపు వేగంతో ధోని చేసిన స్టంప్.. మ్యాచ్ కే హైలెట్. ఫైనల్ లో కీలక మలుపు కూడా. జడేజా బౌలింగ్ లో రెప్పపాటులో ధోని రియాక్షన్ ఫలితం అది. దటీజ్ ధోనీ.. అనాల్సిందే మరి.
చీతాల మృతిపై కేంద్రం..
దేశంలోని చీతాల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని పేర్కొంది. చీతాల సంరక్షణలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో చీతాల మృతిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. చీతాల సంరక్షణలో ఎటువంటి లోపాలు లేవని స్పష్టం చేసింది. మార్చి 27 నుంచి ఇప్పటి వరకూ కునో నేషనల్ పార్కులో ఆరు చీతాలు మృతిచెందాయి. వాటిలో మూడు ఇక్కడే పుట్టిన కూనలు ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. చీతాల ప్రాజెక్ట్ కింద చిరుతల సంరక్షణ, నిర్వహణలో పాలుపంచుకునే అధికారులు, ఉద్యోగులను ఎంపిక చేసి దక్షిణాఫ్రికా, నమీబియాలకు స్టడీ టూర్ కోసం పంపుతామని చెప్పారు. రక్షణ, సంరక్షణ, ప్రచారం, ప్రతిపాదిత చిరుత రక్షణ దళం కోసం ఆర్థిక వనరులతో సహా సాధ్యమైన అన్ని సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. భోపాల్‌లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి డాక్టర్ విజయ్ షా, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో చిరుత ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి యాదవ్ చర్చించారు. అటు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (IIFM)లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) 23వ సమావేశానికి కూడా ఆయన అధ్యక్షత వహించారు. చీతాల మృతిపై ఎటువంటి అలసత్వం లేదని.. మూడు చిరుత పిల్లల మరణాల విషయంలో కూడా ప్రపంచ వన్యప్రాణుల సాహిత్యం చిరుతల్లో 90% శిశు మరణాలను స్పష్టంగా పేర్కొందని ఒక అధికారి తెలిపారు.ఆఫ్రికన్ దేశాల నుంచి కునో నేషనల్ పార్కులోకి తీసుకొచ్చిన చిరుతలతో ఎలాంటి ట్రయల్స్ చేయలేదన్నారు. చిరుతలు కలిసి నివసిస్తాయి కాబట్టి మగ, ఆడ చిరుత సంభోగంలో కూడా ఎటువంటి ప్రయోగాలు జరగలేదని చెప్పారు. ఇది డాక్యుమెంట్ చేసిన సాక్ష్యమని.. ఆఫ్రికన్ నిపుణుల నుంచి క్లియరెన్స్ ఆధారంగా జరిగిందని కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ సీపీ గోయల్ పేర్కొన్నారు. సంభోగం సమయంలో రెండు మగ చిరుతలతో జరిగిన ఘర్షణలో ఆడ చీతా చనిపోయిన విషయం తెలిసిందే.
చనిపోయి నాలుగేళ్లయింది.. అయినా ఇదెలా సాధ్యం!
ఎవరైయినా చనిపోతే ఏమీ చేస్తారు.. వారిని వారి ఆచారాల మేరకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. చనిపోయిన తరువాత ఖననం చేస్తే కొద్ది రోజుల్లో అస్థిపంజరాలు మిగులుతాయి. అలా కాకుండా ఖననం చేయకుండా చనిపోయిన వారి మృతదేశాన్ని అలాగే కొద్ది కాలం ఉంచాలనుకుంటే కొన్ని రసాయనాలను వినియోగిస్తారు. కానీ ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా ఖననం చేస్తే.. అస్థిపంజరమే మిగులుతుంది. కానీ అమెరికాలోని మిస్సౌరీలో నాలుగేళ్ల క్రితం మరణించిన ఓ క్రైస్తవ సన్యాసిని మృతదేహం ఇప్పటికీ చెక్కు చెదరకుండా మరణించిన సమయంలో ఎలా ఉందో.. నాలుగేళ్ల తరువాత కూడా అలానే ఉంది. ఇదెలా సాధ్యమయిందని.. మృతదేహాన్ని చూడటానికి ప్రజలు తరలి వస్తున్నారు. అంతర్జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. అమెరికా గోవెర్ పట్టణంలో క్యాథలిక్ సన్యాసిని సిస్టర్ విల్హెల్మినా లాంకాస్టర్ 95 ఏళ్ల వయస్సులో 2019 మే 29న మరణించారు. దీంతో ఆమె మృతదేహాన్ని చెక్క శవపేటికలో ఉంచి క్రైస్తవ మత ఆచారాల ప్రకారం ఖననం చేశారు. నాలుగేళ్ల కిందట ఖననం చేసిన క్రైస్తవ సన్యాసిని మృతదేహం ఇప్పటికీ చెక్కుచెదరకపోగా.. కుళ్లిన సంకేతాలు కూడా కనిపించకపోవడం గమనార్హం. దీంతో దానిని చూసేందుకు క్రైస్తవ సన్యాసినులు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అమెరికాలోని మిస్సౌరీలో ఈ అద్భుతం వెలుగుచూసింది. సిస్టర్ విల్హెల్మినా 1995లో బెనెడిక్టైన్స్ ఆఫ్ మేరీ, క్వీన్ ఆఫ్ అపోస్టల్స్ ఆర్డర్‌ను స్థాపించినట్టు ది కాన్సాస్ సిటీ డియోసిస్ సెయింట్ జోసెఫ్ వెల్లడించింది. కాగా, మత ఆచారం ప్రకారం ప్రార్థనా మందిరంలోని బలిపీఠం కిందకు మృతదేహా అవశేషాలను తరలించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మే 18న ఖననం చేసిన ప్రదేశంలో శవపేటికను వెలికి తీశారు. లోపలి ఉన్న భౌతికకాయం కనీసం చెక్కుచెదరకపోవడంతో ఆశ్చర్యపోయారు. ఆమె నెక్‌కు ధరించే బెల్ట్ మాదిరి క్లాత్, తలకు ధరించిన క్లాత్ మాత్రమే పాడైయినట్టు ఆశ్రమ నిర్వహకులు తెలిపారు. నెలల తరబడి ఆమె శరీరం పాక్షికంగా పాడైన చెక్క శవపేటికలో ఉండి.. సూర్యరశ్మీ, వర్షాలకు ఎక్స్‌పోజ్ అయినా ఏ మాత్రం కుళ్లకుండా అలా ఉండటం అత్యంత విచిత్రం అని బంధువుల అంటున్నారు.ఆమె మృతదేహాన్ని మరోచోటికి తరలించి సమాధి చేయనున్నట్టు వారు తెలిపారు. ఆమె తల్లి సిసిలియా మాట్లాడుతూ ఇది దేవుడి పట్ల ఆమెకు ఉన్న భక్తి విశ్వాసం, నిస్వార్థపూరిత సేవకు భగవంతుడు ఇచ్చిన వరం కాబోలని అన్నారు.
జిన్నా ఇంటిపై దాడి కేసు.. ఇమ్రాన్‌ఖాన్‌కు సమన్లు
మే 9న లాహోర్‌లోని చారిత్రాత్మక కార్ప్స్ కమాండర్ హౌస్ లేదా జిన్నా హౌస్‌పై జరిగిన హింసాత్మక దాడిపై దర్యాప్తు చేస్తున్న సంయుక్త దర్యాప్తు బృందం మంగళవారం పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పిలిపించింది. లాహోర్‌లోని ఖిల్లా గుజ్జర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సాయంత్రం 4 గంటలకు సంయుక్త దర్యాప్తు బృందం(JIT) ముందు హాజరు కావాలని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఖాన్‌ను కోరారు. దాడికి వ్యతిరేకంగా సర్వర్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయనను విచారణకు పిలిచారు. మే 9న మాజీ ప్రధాని ఖాన్ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో జిన్నా హౌస్ (కార్ప్స్ కమాండర్ హౌస్)ను కాల్చివేసారు. మే 9న పెద్ద సంఖ్యలో పీటీఐ పార్టీ కార్యకర్తలు జిన్నా హౌస్‌లోకి చొరబడి దానిని ధ్వంసం చేసిన తర్వాత నిప్పంటించారు. మే 9న లాహోర్‌లోని జిన్నా హౌస్, అస్కారీ కార్పొరేట్ టవర్‌పై జరిగిన కాల్పుల దాడులపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త దర్యాప్తు బృందం (JIT) మంగళవారం ఖాన్‌ను పిలిపించింది. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు జరగగానే నిరసనలు ప్రారంభమయ్యాయి. పౌర, సైనిక సంస్థలపై దాడుల తర్వాత భద్రతా దళాలు పార్టీకి వ్యతిరేకంగా అణిచివేత ప్రారంభించాయి. దేశంలో హింసాత్మక నిరసనల్లో కనీసం ఎనిమిది మంది మరణించారు.హింసాత్మక నిరసనకారులు ఖాన్ స్వస్థలమైన పంజాబ్‌లోని మియాన్‌వాలి జిల్లాలో ఒక స్టాటిక్ విమానాన్ని తగులబెట్టారు. ఫైసలాబాద్‌లోని ఐఎస్‌ఐ భవనంపై దాడి చేశారు. రావల్పిండిలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై (జీహెచ్‌క్యూ) ఒక్కసారిగా మూక దాడి చేసింది. పోలీసుల ప్రకారం, రెండు రోజుల హింసాత్మక నిరసనల సమయంలో డజనుకు పైగా సైనిక స్థాపనలు ధ్వంసం చేయబడ్డాయి లేదా కాల్చబడ్డాయి.
హెల్మెట్ వల్ల జుట్టు రాలుతుందా? అయితే..
ఈ రోజుల్లో యువతీ యువకులను వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. దీనికి చాలా కారణాలున్నాయి. ఆహారం, వాడే షాంపూలు, జన్యుపరమైన సమస్యల వల్ల జుట్టు రాలిపోతుంది. అంతే కాకుండా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోయే సమస్య కూడా పెరుగుతోంది. హెల్మెట్ వల్ల జుట్టు రాలిపోతుందా? అవును. ఆ సమస్యను ఎదుర్కొంటున్నవారు చాలా మంది ఉన్నారు. ప్రాణ రక్షణకు హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. కానీ తరచుగా వాడటం వల్ల జుట్టు రాలిపోయే సమస్య పెరుగుతుంది. కొన్నిసార్లు హెల్మెట్‌ను తీసివేసినప్పుడు జుట్టు కనిపిస్తుంది. విపరీతమైన చెమట, బ్యాక్టీరియా, నాణ్యత లేని హెల్మెట్‌ల వాడకం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. హెల్మెట్ ధరించేటప్పుడు మీ జుట్టును ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే జుట్టు రాలిపోయే సమస్య పెరుగుతుంది. హెల్మెట్ లోపల ఒక గుడ్డ ఉంచండి. ఇది హెల్మెట్ లోపలి భాగం వల్ల జుట్టు పాడవకుండా చేస్తుంది. చెమట కూడా పీల్చుకుంటుంది. ఇది కూడా తరచుగా శుభ్రం చేయాలి. జుట్టు తడిగా ఉన్నప్పుడు హెల్మెట్ ధరించవద్దు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లు మరియు జుట్టు రాలడంతో పాటు చుండ్రు మరియు దురదను కలిగిస్తుంది. తడిగా ఉన్నప్పుడు జుట్టు బలహీనంగా ఉంటుంది, కాబట్టి అది సులభంగా విరిగిపోతుంది. ఫుల్ ఫేస్ హెల్మెట్ ధరించండి. నాణ్యమైన హెల్మెట్ ప్రమాదాల సమయంలో మిమ్మల్ని రక్షించడమే కాదు, మీ జుట్టును కూడా కాపాడుతుంది. అసౌకర్యంగా లేదు. కాబట్టి సౌకర్యవంతంగా ఉండండి మరియు నాణ్యమైన హెల్మెట్‌ను ఎంచుకోండి. వారానికోసారి హెల్మెట్ లోపలి భాగాన్ని కూడా శుభ్రం చేయండి. లోపలి కుషనింగ్‌పై ఉన్న మురికిని తొలగించండి. ఉపయోగంలో లేనప్పుడు కూడా హెల్మెట్‌ను వెంటిలేషన్ ప్రదేశంలో ఉంచండి. లేకపోతే, ఫంగస్ జుట్టును దెబ్బతీస్తుంది. చుండ్రు వల్ల సమస్యలు వస్తాయి. హెల్మెట్‌ను ఎప్పటికప్పుడు ఎండలో ఉంచాలి.