కూటమి మేనిఫెస్టోపై స్పందించిన హరి రామజోగయ్య.. అది దురదృష్టకరం
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో.. వరుసగా వివిధ అంశాలపై లేఖలు విడుదల చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య.. తాజాగా, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంపై స్పందించిన ఆయన హాట్ కామెంట్లు చేశారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోలపై మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య తాజాగా లేఖ రాశారు.. కాపు, బలిజ, ఒంటరి కులస్తులకు జనాభా ప్రాతిపదికన ఐదు శాతం కానీ విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్స్ అంశం కానీ లేకపోవడం దారుణం అన్నారు. తమ పార్టీల మేనిఫెస్టో ప్రకటనలో కాపుల రిజర్వేషన్ అంశం లేకపోవడం దురదృష్టకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన కాపుల పట్ల ఈ పార్టీలు చిన్న చూపు చూడటం బాధాకరంగా ఉన్నమాట నిజం అంటూ తన లేఖలో పేర్కొన్నారు కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య.
జగన్‌ను చంపేందుకు కుట్ర..! సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తా..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ప్రాణహాని ఉంది.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగంగా వ్యాఖ్యలు చేసినా పట్టించుకునేవాడే లేడని ఫైర్ అయ్యారు పోసాని కృష్ణమురళి.. అయితే, వైఎస్ జగన్‌కు ప్రాణహానిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) చంద్రచూడ్ కు లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కి ఒక రోజు రండి.. తిరిగి చూడండి.. వైఎస్ జగన్ ను కాపాడండి అని లేఖలో సీజేఐను కోరనున్నట్టు వెల్లడించారు పోసాని.. వైఎస్ జగన్‌ను కాపాడండి అని సీజేఐకి రాసే లేఖలో విజ్ఞప్తి చేస్తాఅన్నారు. ఇక, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పొత్తు పెట్టుకుని ఏదైనా చేస్తా అన్నట్టుగా చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు.. భారత్ దేశంలో నెంబర్ వన్ డాన్ చంద్రబాబుగా పేర్కొన్న ఆయన.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాలని విజ్ఞప్తి చేశారు.. ప్రతి యుగానికి ఒక రాక్షసుడు ఉంటాడు.. ఈ యుగంలో చంద్రబాబు రాక్షసుడు అంటూ హాట్ కామెంట్లు చేశారు.
జనసేనకు హైకోర్టులో దక్కని ఊరట.. గాజు గ్లాసు సింబల్‌పై ఈసీ కీలక నిర్ణయం
గాజు గ్లాసు సింబల్‌పై జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నిరాశే ఎదురైంది.. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది జనసేన.. ఆ పిటిషన్ పై నిన్న, ఈ రోజు కూడా వాదనలు జరిగాయి.. అయితే, నిన్న హైకోర్టును 24 గంటల సమయం కోరిన ఎన్నికల కమిషన్.. ఈ రోజు కీలక విషయాలను వెల్లడించింది.. జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో.. గాజు గ్లాసు గుర్తును ఎంపీ అభ్యర్థులకు ఇవ్వబోమని స్పష్టం చేసింది ఈసీ.. జనసేన పోటీ చేస్తున్న 2 పార్లమెంట్ స్థానాల పరిధిలో పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించమని కోర్టుకు తెలిపింది ఎన్నికల కమిషన్.. గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఇలా చేస్తామని పేర్కొంది ఎన్నికల కమిషన్.. దీంతో.. జనసేన పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో ఆ పార్టీకి కాస్త ఊరట లభించినట్టు అయినా.. మిగతా స్థానాల్లో మాత్రం జనసేన ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. అయితే, తాము పోటీ చేసే స్థానాల్లో మాత్రమే కాకుండా మిగతా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో కూడా గాజు గ్లాసు గుర్తు వేరేవారికి కేటాయించ వద్దని హైకోర్టును కోరింది జనసేన.. కానీ, గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ లో ఈసీ పెట్టిన నేపథ్యంలో అలా అన్ని చోట్లా ఇవ్వటం ఎలా సాధ్యమని న్యాయస్థానం ప్రశ్నించింది.. జనసేన పిటిషన్ డిస్పోజ్ చేసింది.. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే వేరే పిటిషన్ వేసుకోవాలని సూచించింది ఏపీ హైకోర్టు.
కూటమి మేనిఫెస్టోను బీజేపీ కనీసం ముట్టుకోలేదు.. వైసీపీ సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మేనిఫెస్టోని మాత్రమే ఎన్డీఏ కూటమి పార్టీ అయిన టీడీపీ విడుదల చేసిందని.. దానిని బీజేపీ కనీసం ముట్టుకోలేదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. చంద్రబాబు పేరు ఆల్ ఫ్రీ బాబు అంటూ విమర్శించారు. రాజమండ్రిలో ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు స్వతహాగా ఒక ఆలోచన ఉండదు.. అన్ని పార్టీల మేనిఫెస్టోలను కాపీ కొడతాడని విమర్శించారు. బీజేపీ చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లో నమ్మదని ఆరోపించారు. టీడీపీ మేనిఫెస్టోలో వేలం పాట తరహాలో పథకాల మొత్తం పెంచుతున్నారని అన్నారు. ఇక, ఎన్నికల తర్వాత చంద్రబాబు ఇంటికేనని జోస్యం చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబు కోసం ఎదురు చూస్తోందని సంచనల వ్యాఖ్యలు చేశారు. జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు మూడు సిలిండర్లు ఇస్తే జన్మభూమి కమిటీలు పట్టుకుపోతారని విరుచుకుపడ్డారు. రాజమండ్రిలో పేపర్ మిల్లు లాంటి పరిశ్రమలు మరో రెండు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. రానున్న ఐదేళ్లలో రాజమండ్రిలో 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని అన్నారు మార్గాని భరత్ రామ్.
తెలంగాణకు మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు.. రేవంత్ రెడ్డి ట్విట్ వైరల్
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయ యుద్ధం వేడెక్కుతోంది. బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ.. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని సమస్యలపై డిమాండ్లు పరిష్కరించాలని కోరితే బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందంటూ కాంగ్రెస్ నేతలు ఇటీవల గాంధీభవన్ వద్ద ప్రదర్శన నిర్వహించిన విషయం సంగతి తెలిసిందే. ఇప్పుడు మేడే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా బీజేపీపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.
* తెలంగాణ అడిగింది… పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా బీజేపీ ఇచ్చింది… “గాడిద గుడ్డు”
* తెలంగాణ అడిగింది… రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. బీజేపీ ఇచ్చింది… “గాడిద గుడ్డు”
* తెలంగాణ అడిగింది… బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ.. బీజేపీ ఇచ్చింది… “గాడిద గుడ్డు”
* తెలంగాణ అడిగింది… కృష్ణా, గోదావరిలో వాటాల పంపకం.. బీజేపీ ఇచ్చింది… “గాడిద గుడ్డు”
* తెలంగాణ అడిగింది… మేడారం జాతరకు జాతీయహోదా.. బీజేపీ ఇచ్చింది… “గాడిద గుడ్డు”
* తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు… పదేండ్ల మోడీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద “గాడిద గుడ్డు”.
కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం..
కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధనకై వికారాబాద్ జిల్లాలో చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ని బలపరుస్తూ మందకృష్ణ మాదిగ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలంగా స్పందించిన బీజేపీ పార్టీకి పూర్తి మద్దతునిస్తూ.. వికారాబాద్ చిగుళ్లపల్లి గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించామన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. గత పదెల్లుగా అధికారం అనుభవించిన బిఆర్ఎస్ పార్టీలు మాదిగలకు అన్యాయం చేశాయన్నారు. ఎన్నో సందర్భాలలో మాదిగల హక్కుల కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వ పెద్దలతో చర్చించిన ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ప్రస్తుత బిజెపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి మాదిగలకు జరుగుతున్న అన్యాయం పట్ల వివరించామన్నారు. అయితే అది విన్న మోడీ వెంటనే ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అంతేకాకుండా.. ద్వారా మాదిగల పూర్తి మద్దతు బీజేపీ పార్టీకి ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించి, కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.
10 లక్షలలో ఏడుగురికే దుష్ప్రభావాలు.. కోవిషీల్డ్ పై ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్తలు
కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ గురించి భారతదేశంలో వ్యాప్తి చెందుతున్న భయం మధ్య, ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త ఉపశమన సమాచారాన్ని అందించారు. కరోనా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు ఏ విధంగానూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. దీని నుండి దుష్ప్రభావాలు అరుదైన సందర్భాల్లో మాత్రమే సంభవిస్తాయి. ఇది మాత్రమే కాదు, దాని డేటా గురించి వివరిస్తూ వ్యాక్సిన్ తీసుకునే 10 లక్షల మందిలో 7 లేదా 8 మందికి గుండెపోటు లేదా రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉండవచ్చు. ఈ దుష్ప్రభావాన్ని థ్రోంబోసిస్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS) అంటారు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగాఖేద్కర్ తెలిపారు. ఇది అసాధారణమైన.. అరుదైన సందర్భాలలో మాత్రమే జరుగుతుంది. ‘మొదటి డోస్ వేసినప్పుడు రిస్క్ ఎక్కువ అని చెప్పారు. ఇది రెండవ మోతాదు తీసుకున్న తర్వాత తగ్గిపోతుంది. మూడవ మోతాదులో పూర్తిగా అదృశ్యమవుతుంది. దుష్ప్రభావాలు సంభవించినట్లయితే, మొదటి రెండు మూడు నెలల్లో ప్రభావాలు కనిపిస్తాయి. టీకా వేసుకుని ఏళ్లు గడుస్తున్నా భయపడాల్సిన అవసరం లేదన్నారు. వాస్తవానికి, ఈ మొత్తం వ్యవహారం బ్రిటీష్ కోర్టులో కొనసాగుతున్న కేసుతో ప్రారంభమైంది. అక్కడ కొంతమంది మరణించిన వారి బంధువులు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే మరణించారని పేర్కొన్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ కీలక నిర్ణయం.. ఇకపై ఎలాంటి ఛార్జీలు లేవు!
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) ఒకప్పుడు భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలకు రారాజు. అయితే భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో రాకతో బీఎస్‌ఎన్‌ఎల్ మార్కెట్ పడిపోయింది. దీంతో కస్టమర్లకు ఆకర్షించడం కోసం ఎప్పటికపుడు పలు రకాల ఆఫర్లతో ముందుకొస్తోంది. ఈ క్రమంలోనే బీఎస్‌ఎన్‌ఎల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి 31 వరకు కొత్త కనెక్షన్ తీసుకునేవారి నుంచి ఎలాంటి ఇన్‌స్టలేషన్ ఛార్జీ వసూలు చేయని పేర్కొంది. భారత్ ఫైబర్‌తో పాటు ఎయిర్‌ఫైబర్ వినియోగదారులకు ఇన్‌స్టలేషన్ ఛార్జీలను ఎత్తివేస్తునట్లు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. దాంతో ఈ రెండు కనెక్షన్ తీసుకున్న వారు ఇక నుంచి రూ.500 ఇన్‌స్టలేషన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మరోవైపు కాపర్ కనెక్షన్లపై రూ.250 ఇన్‌స్టలేషన్ ఛార్జీలు కూడా ఉండవు. భారత్ ఫైబర్ ప్లాన్స్ నెలకు రూ.249 నుంచి ఆరంభం అవుతాయి. ఈ ప్లాన్‌లో యూజర్లు 10 ఎంబీపీఎస్ వేగంతో 10 జీబీ డేటాను పొందుతారు. పరిమితి ముగిసిన అనంతరం వేగం తగ్గుతుంది. ప్రస్తుతం ప్రైవేటు టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోలు ఇన్‌స్టలేషన్ ఛార్జీలను వసూలు చేయడం లేదు. అయితే ఇన్‌స్టలేషన్ ఛార్జీలు ఉండకూడదంటే.. కచ్చితంగా దీర్ఘకాల ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో మాత్రం అలాంటి షరతులేమీ లేవు. ఏ ప్లాన్ ఇన్‌స్టలేషన్‌కు ఛార్జీలను వసూలు చేయడం లేదు.
కెప్టెన్‌గా రషీద్ ఖాన్.. నలుగురు బ్యాటర్లు మాత్రమే! అఫ్గానిస్థాన్ జట్టు ఇదే
టీ20 ప్రపంచకప్ 2024 కోసం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ నాయకత్వం వహించనున్నాడు. ఊహించని ఇద్దరు ఆటగాళ్లకు అఫ్గాన్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. 19 ఏళ్ల యువ వికెట్ కీపర్ మొహమ్మద్ ఇషాక్, 20 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నంగ్యాల్ ఖరోటిలకు అనూహ్యంగా చోటు దక్కింది. అఫ్గాన్ 15 మంది ఆటగాళ్లలో ఎనిమిది మంది ప్రస్తుతం ఐపీఎల్ 2024లో ఆడుతుండడం విశేషం. ఆఫ్ఘనిస్థాన్ జట్టులో నలుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు మాత్రమే ఉన్నారు. రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్ స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఉన్నారు. జట్టులో ఆరుగురు ఆల్‌రౌండర్లు ఉండడం విశేషం. రషీద్‌తో పాటు అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, కరీం జానత్, నంగేయాలియా ఖరోటిలు ఆల్‌రౌండర్లు. నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీ, ఫరీద్ అహ్మద్ పేస్ బౌలర్లు కాగా.. రషీద్‌తో పాటు మొహమ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్ స్పిన్ బౌలర్లుగా ఉన్నారు. సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీం సఫీ ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు.
హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మ్యాచ్ నిషేధం తప్పదా?
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది. హార్దిక్‌కు రూ.24 లక్షల జరిమానాను ఐపీఎల్ నిర్వాహకులు విధించారు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను హార్దిక్‌కు జరిమానా పడింది. ఈ సీజన్‌లో హార్దిక్‌కు ఫైన్ విధించడం ఇది రెండోసారి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్‌కు రూ.12 లక్షల ఫైన్ పడింది. హార్దిక్ పాండ్యా సహా ముంబై ఇండియన్స్ ప్లేయర్లపై కూడా ఐపీఎల్ నిర్వాహకులు కొరడా ఝుళిపించారు. ముంబై ఆటగాళ్లకు రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించనున్నారు. ఈ రెండింటిలో ఏది తక్కువైతే దాన్ని జరిమానాగా విధిస్తారు. ప్లేయింగ్ 11 సహా ఇంపాక్ట్ ప్లేయర్‌కు ఈ జరిమానా పడుతుంది. హార్దిక్ ఈ సీజన్లో ఇప్పటికే రెండుసార్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేశాడు. ఇదే మరోసారి పునరావృతం అయితే.. ఓ మ్యాచ్ నిషేదానికి గురవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు భారీగా జరిమానాను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఇప్పటికే రెండుసార్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేశాడు.
అజిత్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన షాలిని.. భర్తంటే ఎంత ప్రేమో ..
తమిళ స్టార్ హీరోలలో అజిత్ కూడా ఒకరు .. తెలుగులో కూడా ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయి. దాంతో ఆయనకు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది.. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. నేను ఆయన 53 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు , అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు..ఈ సందర్భంగా అజిత్ భార్య షాలిని భర్తకు అదిరిపోయే గిఫ్ట్ ను ఇచ్చింది.. అజిత్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసిన షాలిని ఆయనకి డుకాటీ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అజిత్ ప్రొఫిషనల్ రేసర్ అన్న విషయం తెలిసిందే.ఇప్పుడు షాలిని కూడా ఆయనకు ఇష్టమైన బైకు నే ఇచ్చింది.. ఇందుకు సంబందించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అజిత్ సినిమాల విషయానికొస్తే.. విడా ముయార్చితో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మరో సినిమా కూడా అజిత్ చేతిలో ఉంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేయబోతున్నారు.. ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. వీటితో పాటుగా పలు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది..
వీరమల్లు నుంచి తప్పుకున్నాడా? తప్పించారా? అసలు కథ ఏంటి?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆయన తన జనసేన ను టీడీపీ బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పాటు చేసి ఏపీ ఎన్నికల్లో బరిలోకి దిగారు, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఆయన చాలా కాలం క్రితమే ప్రారంభించిన హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం క్లారిటీ లేదు. కొండ పొలం అనే సినిమా చేసిన తర్వాత క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. తెలంగాణకు చెందిన పండుగ సాయన్న అనే ఒక బందిపోటు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ప్రచారం ఉంది. అయితే ఈ సినిమా అనూహ్యంగా వాయిదాలు పడుతూ వస్తున్న నేపథ్యంలో క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారానికి ఊతమిస్తూ నిన్న ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్లలో క్రిష్ పేరు లేపేశారు సినిమా యూనిట్. అయితే క్రిష్ సినిమా నుంచి తప్పుకోవడం వల్లే ఆయన పేరుని సినిమా పోస్టర్ మీద నుంచి తప్పించారని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ఈ సినిమా అప్డేట్ ఇస్తూ నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ చేసిన ట్వీట్లో మాత్రం క్రిష్ ట్విట్టర్ అకౌంట్ ని ట్యాగ్ చేశారు. నిజంగానే క్రిష్ సినిమా నుంచి తప్పుకుంటే ఆయన ట్విట్టర్ అకౌంట్ ని మాత్రం ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అయితే ఎందుకు సినిమా పోస్టర్ మీద ఆయన పేరు లేదు అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. ఆ మధ్య క్రిష్ సినిమా నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. జ్యోతికృష్ణ గతంలో పలు సినిమాలు డైరెక్ట్ చేసిన అనుభవం ఉండడంతో ఆయన సినిమాని టేకప్ చేశారని అన్నారు. ఇప్పుడు ఆయన పేరును కూడా ట్విట్టర్ లో టాగ్ చేశారు మేకర్స్. దానికి సంబంధించిన క్లారిటీ లేదు కానీ ఇప్పుడు క్రిష్ పేరు తొలగించడం మాత్రం హాట్ టాపిక్ అవుతుంది.