*తెలంగాణకు175 ఎకరాల రక్షణ భూమి.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
కేంద్ర రక్షణ శాఖ 175 ఎకరాల రక్షణ శాఖ భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. దీంతో రోడ్లు, ఎలివేటర్ కారిడార్ల నిర్మాణంలో ఇబ్బందులు తొలగనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 5న తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ విషయాన్ని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలంగాణ సీఎంవో తెలిపారు. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు రక్షణ శాఖ పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరగా కేంద్ర రక్షణ శాఖ సానుకూలంగా స్పందించిందని సీఎంఓ వివరించారు. తమ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లకు సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు గాను కిషన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 44వ నెంబరు జాతీయ రహదారి (కామారెడ్డి మార్గం), రాష్ట్ర రహదారి నంబర్ 1లో ఎలివేటెడ్ కారిడార్లు, సొరంగాల నిర్మాణం సులభతరం కానుందని కిషన్ రెడ్డి తెలిపారు. మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రజా జీవనాన్ని సులభతరం చేస్తామని పదేళ్లుగా దేశ ప్రజలకు అందిస్తున్న హామీకి ఇదో ఉదాహరణ అని కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, రామగుండలను కలుపుతూ రాజీవ్ రహదారిపై నిర్మించనున్న 11.3 కిలోమీటర్ల పొడవునా ఎలివేటెడ్ కారిడార్ కోసం భూసేకరణ చేయాల్సి ఉంది. ఇందులో కొంత భూమి రక్షణ శాఖ పరిధిలో ఉంది. ఈ విషయమై కేంద్ర రక్షణ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపడంతో.. కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం విశేషం.
*అనవసరంగా వేధించవద్దు.. పోలీసులకు శ్రీధర్ బాబు ఆదేశం
పోలీస్ శాఖ వారు ఎవరిని కూడా అనవసరంగా వేధించవద్దని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు 87వ జయంతి సందర్భంగా శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీపాదరావు ఆశయాల మేరకు మంథని ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. మంథని ప్రాంతం శాంతిభద్రలతో కూడిన చదువుల తల్లి ప్రాంతంగా ఏర్పడడానికి అందరూ సహకరించాలన్నారు. శ్రీపాదరావు ఆశయాల మేరకు రైతులకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఈ ప్రాంతంలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. మంథని ప్రాంతంలో వాణిజ్య వ్యాపారాల అభివృద్ధి కోసం మంథని వద్ద రెండు జిల్లాల పరిధిలో గోదావరి నదిపై మంథని వద్ద వంతెన నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. చిల్లర గాళ్లు చేసి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఇలాంటి విషయాల్లో చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. చట్టం పరిధిలో కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని కార్యకర్తలకు ఉపదేశించారు. పోలీస్ శాఖ వారు ఎవరిని కూడా అనవసరంగా వేధించవద్దని ఆదేశించారు. మంథనిలో గృహజ్యోతి కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు జీరో కరెంటు బిల్లును మంత్రి పంపిణీ చేశారు. అధికారంలో ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు రక్షణ, మరమ్మతులకు ఎందుకు చర్యలు తీసుకోలేదో కేటీఆర్ ప్రజలకు చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నాడు పట్టించుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని, రాజకీయంగా మన ప్రభుత్వంపై బురదజల్లాలని కేటీఆర్, బీఆర్‌ఎస్ పార్టీల తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రాజెక్టు సందర్శనలో కనీసం భూ నిర్వాసితుల సమస్యలపై చర్చించకపోవడం శోచనీయమన్నారు. భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందడం లేదన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి నిపుణులైన ఇంజనీర్ల సలహాతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చీఫ్ జస్టిస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఖాళీల విషయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల అమలుకు తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.
*ముద్రగడ కుమారుడితో రాజకీయ అంశాలపై వైసీపీ నేతల చర్చ!
ముద్రగడ పద్మనాభం కుటుంబం రాజకీయ భవితవ్యంపై తర్జన భర్జన జరుగుతోంది. ముద్రగడ కుమారుడు గిరికి వైసీపీ పెద్దలు టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి వచ్చిన ప్రపోజల్‌పై ముద్రగడ కుమారుడు గిరి తన తండ్రితో చర్చించారని తెలిసింది. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా తనను సంప్రదిస్తారని, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని కొడుకు గిరికి పద్మనాభం సూచించినట్లు తెలుస్తోంది. పొలిటికల్‌గా తండ్రిని కాదని తాను చేసేది ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు గిరి. గతంలో కూడా ఇలాగే నాన్చుడు వ్యవహారం జరిపారని అంటున్నారు పద్మనాభం అనుచరులు. ఈ వ్యవహారంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు. గతంలో ఇంటికి వస్తామని కబురుపంపించిన వాళ్ళు తర్వాత ఆచూకీ లేదని ఇప్పుడు ఆకాశ రామన్న ఫోన్ రాయబారాలు ఎందుకని అంటున్నారు పద్మనాభం. పరోక్షంగా పవన్ వ్యవహారాన్ని ప్రస్తావించారు ముద్రగడ పద్మనాభం. గతంలోను వైసీపీ నుంచి 10 నెలలు పాటు ఇలాగే నాన్చుడు వ్యవహారం జరిగిందని చెప్తున్నారు అనుచరులు. ఆచి తూచి స్పందిస్తున్న వైసీపీ, ఈక్వేషన్స్ ఆధారంగా స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.
*నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరాను: వసంత కృష్ణప్రసాద్
హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరానని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే చంద్రబాబు రావాలన్నారు. మైలవరంలో గడిచిన ఆరేళ్లుగా వైసీపీని బలోపేతం చేశానని ఆయన తెలిపారు. మైలవరంకు సీఎం నిధులు ఇవ్వలేదని వసంత విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. సీఎం జగన్ కు ఇచ్చిన వినతి పత్రాలు అన్ని బుట్టదాఖలు అయ్యాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చారని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. తనతో పాటు రావాలనుకునే నియోజకవర్గ నేతలను జగన్ ఆపారన్నారు. జగన్ తోనే పని చేస్తానని అనేక సార్లు బల్లగుద్ది చెప్పానన్నారు. కలిసిన ప్రతిసారి నిధులు ఇస్తానని చెప్పారు కానీ చేయలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానన్నారు. మైలవరమా ఇంకొక్కటా అనేది ఇంకా తెలియదు.. పార్టీ ఎక్కడ చెబితే అక్కడ పని చేస్తానన్నారు.
*చీపురుపల్లి నుంచి పోటీ చేయనని తప్పుకున్న గంటా శ్రీనివాసరావు
వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలన్న టీడీపీ అధిష్ఠానం ప్రతిపాదనను దాదాపుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తిరస్కరించారు. ఆయన తన అయిష్టాన్ని ఇప్పటికే ప్రదర్శిస్తూ అధిష్ఠానం ముందు తన నిర్ణయాన్ని చెప్పినట్లు తెలిసింది. మరో ఒకట్రెండు రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తాను చీపురుపల్లి వెళ్లబోవడం లేదనే విషయాన్ని చెప్పాలని గంటా శ్రీనివాసరావు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మిగతా ఆప్షన్ల గురించి టీడీపీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. సీనియర్ నేత కళా వెంకట్రావుతో పాటు విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరను కూడా అధిష్ఠానం పరిశీలిస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ ఊపుకు బ్రేకులు వేయాలనే ఆలోచనతో టీడీపీ అధిష్ఠానం సీనియర్ నేతలను బరిలో దింపాలని యోచించింది. కానీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు తాను పోటీ చేయనని కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో..ఇప్పుడు తరువాతి నిర్ణయం ఏంటనే ఉత్కంఠ మొదలైంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లాలో గంటా కీలక నేతగా ఉన్నారు. టీడీపీ, ప్రజారాజ్యం తిరిగి టీడీపీ నుంచి గంటా వరుసగా గెలుస్తూ వచ్చారు. అనకాపల్లి ఎంపీగానూ పని చేసారు. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచిన గంటా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేయగా కొద్ది రోజుల క్రితం ఆమోదించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో గంటా కు సీటు దక్కలేదు. గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సపై పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు. తనకు విశాఖ నుంచే అవకాశం ఇవ్వాలని గంటా కోరారు. ఫస్ట్ లిస్టు ప్రకటన తరువాత చంద్రబాబుతో గంటా సమావేశమయ్యారు. గంటాను బొత్సా పైన పోటీ చేయాలని..అక్కడ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. గెలిస్తే విజయనగరం జిల్లా నుంచి మంత్రిగా అవకాశం ఉంటుందని హామీ ఇచ్చినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. అయితే, దీని పైన ఇప్పుడు గంటా స్పష్టత ఇచ్చారు. తాను చీపురుపల్లి నుంచి పోటీ చేయలేనని చెప్పినట్లు సమాచారం. విశాఖ జిల్లా పరిధిలోనే తనకు సీటు ఇవ్వాలని మరోసారి కోరారు.
*కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ కి ఓటు వేశారు.. ఈటల కామెంట్
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీద కోపంతోనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేశారని మాజీ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లాలో జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రకు మాజీ ఎమ్మెల్యే బీజేపీ జాతీయ కమిటీ సభ్యులు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ దేశంలో ప్రజల కష్టసుఖాల గురించి ఆలోచిస్తూ పేదలకు అండగా ఉంటూ అట్టడుగు వర్గాల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారన్నారని తెలిపారు. 40 వేల కోట్ల రూపాయలు ఖర్చుతో కేసీఆర్ నీళ్లు ఇవ్వలేదని.. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా 24 గంటల నీళ్లు ఇవ్వాలని కోరారు. రైతులకు రుణ మాఫీ చేస్తానని మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లే అని తెలిపారు. డిజిటల్ వేవస్థ తీసుకొచ్చిన ఘనత మోడీ ది అన్నారు. 140 కోట్ల ప్రజలకు మోడీ సేవకుడు మాత్రమే అన్నారు. నాడు వందల మంది రామ మందిరము కోసం చనిపోయారని, నేడు మోడీ రామమందిరం నిర్మాణం చేసిన ఘనత నరేంద్ర మోడీ ది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు పోరాడుతామన్నారు. దేశంలోనే భాజపా ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజా సమస్యలపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై భాజపా పోరాటం చేస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్, నీరు, ఎరువులు అందక ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఇళ్లు లేని పేదలకు ఇళ్ల నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లక్షలు, పట్టణ ప్రాంతాల్లో ఏడు లక్షల చొప్పున నిధులు కేటాయించి నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించిన ఘనత నరేంద్ర మోదీకే దక్కిందన్నారు. అందుకే దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేసేందుకు సిద్ధం కావాలని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.
*రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. పోలీసుల విచారణకు క్రిష్
హైదరాబాద్ లో సంచలం సృష్టించిన రాడిసన్ డ్రక్స్ కేసులో రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇందులో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారనే వార్తలు రావడంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి ఒక్కొక్కొరి వద్ద కూపీ లాగుతున్నారు. డ్రగ్స్ కేసులో అబ్బాస్ అలిని అదుపులో తీసుకున్న పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో డైరెక్టర్ క్రిష్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుపడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. డైరెక్టర్ క్రిష్ పై పోలీసుల నోటీసులు జారీచేశారు. అయితే ఈ వార్తలతో క్రిష్ పరారీలో వున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై క్రిష్ క్లారిటీ ఇచ్చారు. తను పలుకారణవల్ల హైదరాబాద్ కు దూరంగా వున్నానని త్వరలోనే హాజరు అవతానని క్లారిటీ ఇచ్చారు. ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం మాదాపూర్ డీసీపి ఆఫీసులో డైరెక్టర్ క్రిష్ వచ్చారు. డ్రగ్స్ కేసులో గచ్చిబౌలి పోలీసుల ఎదుట డైరెక్టర్ క్రిష్ విచారణకు హాజరైనట్లు సమాచారం. పోలీసుల నోటీసులకు స్పందించిన క్రిష్ పోలీసుల ఎదుట ఇవాళ విచారణకు హాజరు కావడంతో పరారీలో వున్నట్లు వచ్చిన వార్తలను చెక్ పెట్టారు. అక్కడకు వచ్చిన క్రిష్ ను డ్రగ్స్ టెస్ట్ ల కోసం సాంపిల్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. క్రిష్ బ్లడ్, యూరిన్ సాంపిల్స్ ను పోలీసులు ల్యాబ్ కు పంపారు. ఇప్పటికే క్రిష్ యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ గా రిపోర్ట్ వచ్చాయని పోలీసులు తెలిపారు. డ్రగ్ టెస్ట్ లో నెగటివ్ వచ్చిన విట్నెస్ కింద మరోసారి పోలీసులు విచారణకు పిలవనున్నారు. రాడిసన్ డ్రక్స్ కేసులో నిందితుల సంఖ్య ఇప్పటివరకు 14కు చేరిన విషయం తెలిసిందే.. అయితే.. వీరందరిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే అరెస్టై రిమాండ్ లో ఉన్న అబ్బాస్ అలికి డ్రగ్స్ సరఫరా చేసిన మిర్జా వాహిద్ బేగును గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. మిర్జా వాహిద్ బేగు అరెస్టుతో నిందితుల సంఖ్య 14కు చేరింది. కొకైన్ ఎక్కడి నుండి తీసుకువచ్చాడో మిర్జా పోలీసులకు తెలిపాడు. రాణిగంజ్ కు చెందిన డ్రగ్ పెడ్లర అబ్ధుల్ రహ్మాన్ నుండి కొకైన్ తీసుకొచ్చినట్లు చెప్పిన మిర్జా. దీంతో నిందితుల లిస్టులో అబ్దుల్ రహమాన్ పేరు చేర్చిన పోలీసులు. డ్రగ్ పెడ్లర్ అబ్ధుల్ రహమాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అబ్ధుల్ రహమాన్ చిక్కితే నిందితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు పోలీసులు. ఇప్పటి వరకు నిందితుల లిస్ట్ లో 9 మంది కన్జ్యూమర్లు కాగా మిగిలిన నలుగురు కొకైన్ సరఫరా చేసిన వారు, మరొకరు వివేకానంద డ్రైవర్ గా గుర్తించారు. ఇప్పటి వరకు పోలీసుల అరెస్టు చేసి బెయిల్ పాందిన వారు ముగ్గరు కాగా.. మరో ఇద్దరు పోలీసు విచారణకు హాజరయ్యారు. వారం రోజులు అవుతున్నమరో నలుగురు నిందితులు నీల్, సందీప్, శ్వేత, లిసిలు జాడ లేకపోవడం సంచలనంగా మారింది.
*ఆఫ్ఘనిస్థాన్ లో హిమపాతం.. 15మంది మృతి, 30మందికి గాయాలు
గత మూడు రోజులుగా ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. గత మూడు రోజులుగా పలు చోట్ల భారీగా మంచు కురుస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఖగోళ విపత్తు కారణంగా ఇప్పటివరకు దాదాపు 15 మంది మరణించగా, దాదాపు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రకృతి ధాటికి మూగ జంతువులు సైతం మృత్యువాత పడుతున్నాయి. బాల్ఖ్, ఫర్యాబ్ ప్రావిన్సుల నుండి అందుకున్న సమాచారం ప్రకారం.. మంచు కారణంగా సుమారు పది వేల జంతువులు చనిపోయాయి. గత కొన్ని రోజులుగా నిరంతరంగా మంచు కురుస్తోందని, దీని వల్ల చాలా నష్టం జరుగుతోందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. రోడ్లపై దట్టమైన మంచు పేరుకుపోయింది. దీంతో అన్ని రవాణా మార్గాలు మూసుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అనేక జంతువులు కూడా ఆకలితో చనిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాలని ఇక్కడి ప్రజలు విజ్ఞప్తి చేశారు. చిన్న పిల్లలు ఆకలితో విలపిస్తున్నారు. మంచు కురుస్తుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందిగా ఉందని ప్రజలు వాపోతున్నారు. పశువుల యజమానులు ఎదుర్కొంటున్న నష్టాల పరిష్కారానికి వివిధ మంత్రిత్వ శాఖల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమిటీలు మూసుకుపోయిన రోడ్లను తెరవడం, బాధిత వర్గాలకు ఆహారం, పశుగ్రాసం పంపిణీ చేయడంతోపాటు హిమపాతంలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు చురుకుగా పనిచేస్తున్నాయి. బాల్ఖ్, జాజ్జాన్, బద్గీస్, ఫర్యాబ్, హెరాత్ ప్రావిన్సులలోని పశువుల యజమానులకు సహాయం చేయడానికి అధికారులు 50 మిలియన్ డాలర్ల సహాయాన్ని అందించారు.
*మొగలి రేకులు సీరియల్ ఫేమ్ దయ మృతి
బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్స్ అంటే కచ్చితంగా గుర్తుకు వచ్చేవి చక్రవాకం, మొగలిరేకులు. ఈ రెండు సీరియల్స్ బుల్లితెరను కొన్ని సంవత్సరాల పాటు శాసించాయి. ఇక సీరియల్‌లో నటించిన నటీనటులను ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. స్రవంతి, ఇంద్ర, ఇక్బాల్, దయ ఇలా అన్ని పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. ఇప్పటికీ వారంతా ఓ ఫ్యామిలీలానే ఉంటారు. ఈ క్రమంలో ఓ చేదువార్త వెలుగులోకి వచ్చింది. చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్‌లో ఇంద్ర తమ్ముడిగా దయ పాత్రలో మెప్పించిన నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు. చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్‌లో ఇంద్రనీల్ తమ్ముడి పాత్రలో నటించి.. ప్రేక్షకుల మనసులో చెరగని స్థానం సంపాదించుకున్నారు పవిత్రనాథ్. ఈ విషయాన్ని ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘‘పవి.. ఈ బాధను మేం వర్ణించలేకపోతోన్నాం.. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వాడివి.. మేం ఈ వార్త విన్న తరువాత.. ఇది నిజం కాదని, కాకూడదని కోరుకున్నాను. ఇది అబద్ధం అయితే బాగుందని ఆశపడ్డాను. కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతోన్నాం బ్రదర్. కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేపోయాం.. గుడ్ బై కూడా చెప్పలేకపోయాం.. ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. నీ ఫ్యామిలీకి ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి’’ అంటూ ఇంద్రనీల్, మేఘన ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. ఇక మేఘన, ఇంద్రనీల్ పోస్ట్‌పై అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. అసలేం జరిగింది.. దయ చనిపోవడం ఏంటి.. ఇదంతా ఎప్పుడు జరిగింది.. ఎందుకు ఎలా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఇక గతంలో పవిత్రనాథ్‌పై అతడి భార్య సంచలన ఆరోపణలు చేసింది. అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని.. తన ముందే ఇంటికి వారిని తీసుకువచ్చేవాడని.. దీని గురించి ప్రశ్నిస్తే.. తనను కొట్టేవాడని గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.