ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ సెంటిమెంట్ రిపీట్..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సత్తా చాటింది.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టికరిపిస్తూ.. తిరుగులేని విజయాన్ని అందుకుంది.. కూటమి సునామీలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యింది.. ఇక, ఇదే సందర్భంలో రాష్ట్రంలోని వివిధ స్థానాల్లో సెంటిమెంట్‌ను కూడా గుర్తుచేసుకుంటున్నారు నేతలు.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరోసారి పాత సెంటిమెంట్ రిపీట్ అయ్యింది.. ఓ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన వారు.. తర్వాత ఎన్నికల్లో ఓటమి చెందుతారనే సెంటిమెంట్ కృష్ణా జిల్లాల్లో మరో సారి రిపీట్ అయ్యింది.. దానికి వైఎస్ జగన్ కేబినెట్‌లో జిల్లా నుంచి మంత్రులుగా పని చేసిన అందరూ పరాజయం చవిచూశారు.. జగన్ 1 కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన కొడాలి నాని మరోసారి గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమి మూఠగట్టుకోగా.. ఇక, జగన్ 1 కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్, జగన్ 2 కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్.. పార్టీ అధినేత వైఎస్ జగన్ సూచనల మేరకు నియోజకవర్గాలు మారినా.. వారికి ఓటమి తప్పలేదు.. మరోవైపు.. మచిలీపట్నంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా రిపీట్ అయ్యింది.
ఇచ్చిన మాట ప్రకారం నా పేరు మార్చుకుంటున్నా..
ఎన్నికల ప్రచార సమయంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతూ వచ్చారు వైసీపీ నేత, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. అంతేకాదు.. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించలేకపోతే తన పేరు మార్చుకుంటానంటూ సంచలన శపథం కూడా చేశారు. ముద్రగడ పద్మనాభంగా ఉన్న నా పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేసిన విషయం విదితమే.. అయితే, పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రాష్ట్రంలో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు.. ఈ నేపథ్యంలో.. కీలక నిర్ణయం తీసుకున్నారు ముద్రగడ పద్మనాభం.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నాను.. సవాలులో నేను ఓడిపోయాను కాబట్టి.. నా పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాను అన్నారు. మరోవైపు.. ప్రజల కోసం కష్టపడ్డ వైఎస్ జగన్ ని గౌరవించకపోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ.. అయితే, నా రాజకీయ ప్రయాణం వైఎస్ జగన్ తోనే కొనసాగుతుందని స్పష్టం చే శారు.. జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు ఆదరించలేదో తెలియడం లేదన్నారు. ఇక, ఈ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి శుభాకాంక్షలు తెలిపారు ముద్రగడ పద్మనాభం.. కాగా, పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం సాధించిన తర్వాత.. సోషల్ మీడియా వేదికగా.. ముద్రగడను ట్రోల్ చేస్తున్న విషయం విదితమే.. ఈ రోజు సాయంత్రమే పేరు మార్చుకునే కార్యక్రమం అంటూ.. ఓ కార్డును కూడా తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు కొందరు నెటిజన్లు.
ఇది హిస్టారికల్ విజయం.. నేనెప్పుడూ చూడలేదు..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆనందం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇది హిస్టారికల్ విజయం.. నేనెప్పుడూ చూడలేదన్నారు.. ఎన్డీఏ సమావేశం కోసం ఢిల్లీ బయల్దేరేముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. మీడియాకు స్వాతంత్రం వచ్చిందంటూ ప్రెస్ మీట్ మొదలు పెట్టారు.. ప్రజలకు శిరస్సు వంచి ధన్యావాదాలు చెబుతున్నా. గత ఐదేళ్లల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదు. అన్ని వ్యవస్ధలను ధ్వంసం చేశారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలనే నినాదంతో వెళ్లామని గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి.. ఏదీ శాశ్వతం కాదన్న చంద్రబాబు.. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే వ్యక్తులు.. రాజకీయ పార్టీలు కనుమరుగు అవుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడో దూర తీరాల్లో ఉన్నవాళ్లు.. కూలీ పనులు చేసుకునే వాళ్లు కష్టంతో వచ్చి ఓటేశారని వెల్లడించారు చంద్రబాబు.. టీడీపీ చరిత్రలో.. ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలివి. 1984, 1994ను మించిన స్థాయిలో ఇప్పుడు ప్రదల నుంచి రియాక్షన్ వచ్చిందన్నారు. ప్రజలు స్వేచ్ఛని కొల్పోయారు. అందరం కలిశాం.. ఎన్నికల్లో పోటీ చేశాం. కంచుకోటలు బద్దలు చేశాం. మెజార్టీలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ ఎన్నికలను ఏ విధంగా అభివర్ణించాలో అర్థం కావడం లేదన్నారు. అహకారం, నియంతృత్వం, విచ్చలవిడి తత్వం వంటివి ప్రజలు సహించరు. ప్రజలు గుణపాఠం నేర్పించారన్నారు.. ఐదేళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. నిద్రలేని రాత్రులు గడిపాం. జై జగన్ అనకుంటే చంపేస్తామన్నా.. లెక్క చేయకుండా జై తెలుగుదేశం అని నినాదాలు చేసిన చంద్రయ్య లాంటి కార్యకర్తలను ఎలా మరువగలం అని ప్రశ్నించారు.
ఎన్డీఏకు మద్దతు.. తేల్చేసిన చంద్రబాబు
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ రాజకీయాల్లో కూడా టీడీపీ పాత్ర కీలకంగా మారిపోయింది.. ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు తప్పనిసరి అయ్యింది.. మరోవైపు.. ఇండియా కూటమి కూడా చంద్రబాబు వైపు చూస్తుందనే వార్తలు వచ్చాయి.. చంద్రబాబు.. ఇండియా కూటమిలో చేరతారంటూ.. ఆ కూటమిలోని నేతలు వ్యాఖ్యానించడం చర్చగా మారింది.. ఈ తరుణంలో.. మా ప్రయాణం ఎన్డీఏతోనే అని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. మేం ఎన్డీఏలో ఉన్నాం.. ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నా.. ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్నాం అని వెల్లడించారు. ఇక, రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం, ఎవరూ శాశ్వతం కాదు.. అధికారం కూడా శాశ్వతం కాదన్నారు చంద్రబాబు.. అయితే, ఇంత హిస్టారికల్ విజయం నేను ఎప్పుడూ చూడలేదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు చిన్నస్థాయి నుంచి పెద్దవారి వరకు వచ్చి ఓటు వేశారు.. ఇది టీడీపీ చరిత్రలో, ఏపీ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలుగా అభివర్ణించారు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలులేదంటూ పవన్ కల్యాణ్ ముందుకొచ్చారు.. కూటమికి పవన్ బీజం వేశారని గుర్తుచేసిన ఆయన.. ఇక, బేషజాలు లేకుండా కూటమి పనిచేసింది.. పవన్ కల్యాణ్‌ను అభినందిస్తున్నాను అన్నారు. మాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయం అని ప్రకటించారు.. అసెంబ్లీలో నా కుటుంబాన్ని, నన్ను ఎలా అవమానించారో నేను ఎప్పటికీ మర్చిపోలేను.. నాపై బాంబులు పడ్డప్పుడు కూడా నేను భయపడలేదు.. కౌరవ సభలో ఉండకూడదని నేను బయటికి వచ్చేశా.. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి.. మీ ముందుకు వచ్చాను అని వ్యాఖ్యానించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
పవన్ కల్యాణ్‌ను కలిసిన 20 మంది జనసేన ఎమ్మెల్యేలు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు.. తాజాగా గెలిచిన జనసేన పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు.. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సహా 20 మంది ఎమ్మెల్యేల ఈ రోజు జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్‌ను కలిశారు.. ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వడంతో పాటు.. తమ గెలుపునకు కృషి చేసిన పవన్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.. ఇక, ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పవన్ కల్యాణ్‌కు అందజేశారు ఆరణి శ్రీనివాసులు.. భారీ మెజారిటీతో గెలిచావ్ అంటూ ఆరణి భుజం తట్టి అభినందించారు పవన్.. ఆ తర్వాత జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబును కలిశారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆరణి మధన్, ఆరణి జగన్.. కాగా, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీతో కలిసి పోటీకి దిగిన జనసేన.. తను పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు.. రెండు పార్లమెంట్ స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేసిన విషయం విదితమే.. అంటే.. పోటీ చేసిన ప్రతీ నియోజకవర్గంలోనూ విజయం సాధించి రికార్డు సృష్టించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో.. ఈవీఎం ధ్వంసంతోపాటు, మరికొన్ని కేసుల్లో పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తుంది.. ప్రస్తుతం నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో పిన్నెల్లి బస చేసినట్టు గుర్తించిన పోలీసులు.. ఆయన కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు.. అయితే, రేపటి వరకు అరెస్టు చేయొద్దని కోర్టు చెప్పిన నేపథ్యంలో, రేపు కోర్టు ఇచ్చిన గడువు ముగిసిన వెంటనే పిన్నెల్లిని అదుపులోకి తీసుకొని, అరెస్టు చూసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు పోలీసులు తీసుకుంటున్న చర్యలు కూడా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు ఖాయం అనే సంకేతాలు ఇస్తున్నాయి.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకోకుండా అతని చుట్టూ గట్టి పోలీసు నిఘా ఏర్పాటు చేశారు.. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని ఎప్పుడు అరెస్టు చేస్తారో అనే సందిగ్ధత నెలకొంది పలనాడు జిల్లాలో.. కాగా, కౌంటింగ్‌కు ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆంక్షలు విధించింది సుప్రీంకోర్టు.. పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంపై ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు నంబూరు శేషగిరిరావు.. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్ కు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేసింది.. ఇదే సమయంలో.. ఈ నెల 6వ తేదీన హైకోర్టు పిన్నెల్లి కేసును విచారించి.. పరిష్కరించాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్.. మరోవైపు.. నిన్న వెలువడి ఫలితాల్లో పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ విజయం సాధించింది.. వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ తరఫున బరిలోకి దిగిన జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఘన విజయాన్ని అందుకున్న విషయం విదితమే.
ప్రధానిగా మోడీ అభ్యర్థిత్వంలో ఎలాంటి అనుమానాలు లేవు..
Ntvతో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరి బోర్డు మెంబర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇవాళ ఢిల్లీలో ఎన్డీయే కీలక సమావేశం జరుగుతుంది.. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరగనుంది.. ప్రధానిగా మోడీ అభ్యర్థిత్వంలో ఎలాంటి అనుమానాలు లేవు అని చెప్పుకొచ్చారు. నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా ఎన్నుకోవడం లాంఛనమే.. ఎన్నికలకు ముందే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించింది.. ప్రభుత్వ సానుకూల ఓట్లే బీజేపీని మళ్ళీ గెలిపించాయన్నారు. మూడో సారి మోడీ ప్రధానిగా త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారు.. ఎన్డీయే కూటమిలో అన్ని పార్టీలకు ప్రాధాన్యత ఉంటుంది అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఒకే ఫ్లైట్లో ఢిల్లీకి ఎన్డీయే- ఇండియా కూటమి నేతలు..!
లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయే కూటమిలో జేడీయూ అధినేత నితీశ్ కుమార్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కీ రోల్ పోషించబోతున్నారు. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో చంద్రబాబు, నితీశ్ లు కింగ్ మేకర్లుగా మారిపోయారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఈ నేతల మద్దతు కమలం పార్టీకి తప్పనిసరి అయింది. కాగా, ఎన్నికల ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో ఈ నేతలు ఇద్దరూ చేరారు. తొలుత ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన నితీశ్ కుమార్.. లాస్ట్ మినిట్ లో ఎన్డీయే గూటికి జంప్ అయ్యారు. ఈ క్రమంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ఇటు ఎన్డీఏ, అటు ఇండియా కూటమి సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. మిత్రపక్షాలతో కలిసి చర్చించేందుకు రెండు కూటములు మీటింగ్ ఏర్పాటు చేశాయి. అయితే, ఈ సమావేశానికి బీహార్ నుంచి నితీశ్ కుమార్, ఆర్జేడీ సీనియర్ నేత తేజస్వీ యాదవ్ ఇవాళ ఢిల్లీకి స్టార్ట్ అయ్యారు. ఇక, ఇండియా కూటమిలో సహచరులుగా, బీహార్ లో కొన్ని రోజుల పాటు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నడిపిన నితీశ్ కుమార్, తేజస్వీలు ఒకే విమానంలో ప్రయాణించబోతున్నారు. దీంతో నితీశ్, తేజస్వీల మధ్య చర్చ జరిగే ఛాన్స్ లేకపోలేదని ఊహగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఎప్పటికప్పుడు పొత్తులు మార్చుతాడని నితీశ్ కుమార్ కు పేరుంది. కొంత కాలం కిందటి వరకు సహచరులుగా, ప్రస్తుతం ప్రత్యర్థులుగా ఉన్న నితీశ్, తేజస్వీలు ఒకే విమానంలో ప్రయాణించడం ఎక్కడికి దారితీస్తుందోననే ఆందోళన కమలం పార్టీ వర్గాల్లో నెలకొన్నట్లు తెలుస్తుంది. ఎన్డీయే కూటమిలో కీలకంగా మారిన వేళ ఈ ప్రయాణం నితీశ్ కుమార్ ను ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తొలి ఇండియన్ నటిగా రేర్ ఫీట్ సాధించిన బాలయ్య భామ
‘ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు’ అనే తమిళ సినిమాతో తన నటనతో , పాటు నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాలో తన డ్యాన్స్ తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన చంద్రికా రవి ఇప్పుడు తన సినీ కెరీర్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్ళింది. భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నటి చంద్రిక రవి షో అనే అమెరికన్ రేడియో టాక్ షోను హోస్ట్ చేయడానికి సిద్ధం అయింది. చంద్రిక ఆమె తన గుర్తింపు కోసం ఎలా పోరాడుతుందో తెలుసుకుని రుకుస్ అవెన్యూ రేడియో వ్యవస్థాపకుడు సామీ చంద్ ఆమెకు ఒక ఆఫర్ అందించారు. తన జీవిత అనుభవాలను ప్రపంచంతో పంచుకోవడానికి రేడియో ఒక గొప్ప వేదిక కాబట్టి తనకు అందించిన ఈ అవకాశం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేస్తోంది. రేడియో టాక్ షోకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న చంద్రిక ఈ కార్యక్రమం యుఎస్‌లోని అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటైన ఐహార్ట్ రేడియోలో విడుదలవుతోందని వెల్లడించింది. ఇది ఒక గొప్ప అనుభవం. కొంచెం ఒత్తిడి, కానీ లాభదాయకం. “కెమెరా వెనుక” ఉండటం తరువాత ఇది నాకు భిన్నమైన అనుభవం, ప్రజలు నిజమైన నన్ను ఇప్పుడు వినగలరు అని పేర్కొంది. సినీ కెరీర్‌కు ముందు; చంద్రిక రేడియోలో మరియు టెలివిజన్‌లో అనేక లైవ్ షోలను హోస్ట్ చేసింది. అయితే USలో రేడియో షోను హోస్ట్ చేసిన మొదటి భారతీయ నటిగా ఆమె నిలవనుంది. “నేను మొదటివాడిని కావచ్చు, కానీ నేను చివరివాడిని కాను,” అని ఆమె కామెంట్ చేసింది. చంద్రిక షో USలోని అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటైన iHeart రేడియో మరియు రుకస్ అవెన్యూ రేడియోలో ప్రతి గురువారం, భారత కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటలకు ప్రసారం చేయబడుతుంది. పూర్తి ఎపిసోడ్ ప్రతి శుక్రవారం యూట్యూబ్‌లో అంతర్జాతీయంగా అందరి కోసం విడుదల చేయబడుతుందని ఆమె పేర్కొంది.
ఇకపై మరింత ఎక్కువగా కష్టపడుతా!
ఐఎండీబీ జాబితాలో 13వ స్థానాన్ని సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, తన కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది అని స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు తెలిపారు. కెరీర్‌ను ఇప్పుడే మొదలుపెట్టినట్లు అనిపిస్తుందని, అప్పుడే ఇన్నేళ్లు ఎలా గడిచాయో తనకు అర్థం కావట్లేదన్నారు. తనకు గొప్ప సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, ఇకపై మరింత ఎక్కువ కష్టపడి పనిచేస్తానని సామ్ చెప్పారు. ఇటీవల ఐఎండీబీ విడుదల చేసిన ‘టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్’ జాబితాలో 13వ స్థానాన్ని సమంత సొంతం చేసుకున్నారు. దీనిపై తాజాగా సామ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘ఐఎండీబీ జాబితాలో 13వ స్థానాన్ని సొంతం చేసుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉంది. నా కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది. కెరీర్‌ను ఇప్పుడే మొదలుపెట్టినట్లు అనిపిస్తోంది. అప్పుడే ఇన్నేళ్లు ఎలా గడిచాయో అర్థం కావట్లేదు. గొప్ప సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇకపై మరింత ఎక్కువ కష్టపడి పనిచేస్తా’ అని సమంత చెప్పారు. ఐఎండీబీ జాబితాలో టాప్ 15లో ఉన్న ఏకైక సౌత్ స్టార్‌గా సామ్ ఉన్నారు. ఈ జాబితాలో దీపికా పడుకోణె అగ్రస్థానంలో నిలిచారు. షారుఖ్ ఖాన్ రెండో స్థానంలో ఉండగా.. ఐశ్వర్య రాయ్ మూడో స్థానంలో ఉన్నారు. అలియా భట్, ఇర్ఫాన్ ఖాన్, అమీర్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ టాప్ 10లో ఉన్నారు. తమన్నా భాటియా, నయనతార వరుసగా 16, 18వ స్థానాల్లో నిలిచారు.