చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు.. అమిత్‌షా ఆహ్వానం మేరకే..!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చలు జరిగిపిన విషయం విదితమే.. అయితే, చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆహ్వానం మేరకే చంద్రబాబు హస్తినకు వెళ్లినట్టు వెల్లడించారు.. అక్కడి పరిణామాలపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా, అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉంటుంది.. కానీ, వైఎస్ జగన్ లా వ్యక్తిగత స్వార్ధం కోసం ఉండదని స్పష్టం చేశారు.. బీజేపీ కాళ్లపై పడటం, కాళ్లు మొక్కటం వైసీపీ సంస్కృతి.. తెలుగుదేశానికి ఆ అవసరం లేదన్న ఆయన.. అనేక కేసుల్లో ఏ1 ముద్దాయిగా వైఎస్ జగనే కాళ్ల మీద పడతాడు. వైసీపీ ఫేక్ పోస్టులను ఊరికే వదిలిపెట్టం అని వార్నింగ్ ఇచ్చారు.
మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంట విషాదం..
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఇంట విషాదం నెలకొంది.. దేవినేని ఉమ సోదరుడు దేవినేని చంద్రశేఖరరావు కన్నుమూశారు.. ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న దేవినేని చంద్రశేఖర్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున మృతిచెందారు.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత నాలుగు రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు చంద్రశేఖర్.. దీంతో.. మూడురోజులుగా హైదరాబాద్ లోనే ఉండే తన సోదరుడి బాగోగులను చూస్తు వచ్చారు దేవినేని ఉమ.. అయితే, ఈ రోజు తెల్లవారుజామున చంద్రశేఖర్‌రావు కన్నుమూయడంతో.. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.. ఇక, ఈ రోజు ఉదయం 8 గంటల తర్వాత హైదరాబాద్ నుంచి కంచికచర్లకు చంద్రశేఖర్ పార్థివదేహాన్ని తరలించారు కుటుంబ సభ్యులు.. దేవినేని చంద్రశేఖరరావు మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం కంచికర్లలో చంద్రశేఖర్ రావు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తు్న్నారు.
ఒక హత్య.. వంద ప్రశ్నలు.. ఎమ్మార్వో హత్య కేసులో విచారణ కథ ముగిసినట్టేనా..?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తహసిల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడి విచారణ కథ ముగిసినట్టేనా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. నిందితుడు మురారిని 14 రోజులు రిమాండ్ కు తరలించారు పోలీసులు.. అయితే, సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు కస్టడి కోరకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.. తహసీల్దార్ హత్య కేసులో కేవలం మురారి హస్తమే ఉందా..? అసలు సూత్రధారులు ఇంకెవరైనా ఉన్నారా..? ఇలా రమణయ్య హత్య కేసులో వందల అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.. రమణయ్యకు నిందితుడికి మధ్య ఎలాంటి లావాదేవీలు నడిచాయి? కన్వేయన్స్ డీడ్ వ్యవహారమే కారణమా? ఇంకేమైనా ఉన్నాయా..? ప్రైవేట్ కంపెనీ డీల్ లో భాగంగానే నిందితుడు మధ్యవర్తిగా వ్యవహరించాడా? సుపారి పుచ్చుకొని హత్య చేశాడా? తెర వెనక ఉండి మురారిని ఉసిగొలుపిన వారు ఎవరు? వీటన్నిటికీ సమాధానం దొరక్కుండానే నిందితుడిని రిమాండ్ కు తరలించడం, విచారణ నిమిత్తం కస్టడీకి కోరకపోవడం ఎవరిని కాపాడే ప్రయత్నం? అంటూ ఎన్నో అనుమాలను వ్యక్తం చేస్తు్న్నారు. అయితే, నగదు లావాదేవీల బాగోతం బయటకు వస్తే రెవెన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని ఈ కేసును ముందుకు సాగనివ్వడంలేదా? గతంలో కీలక కేసుల్లో కస్టడీ కోరిన విశాఖ పోలీసులు.. ఈ కేసులో కస్టడీ కోరకపోవడంపై పలు అనుమానాలు రేగుతున్నాయి.. హత్య నుంచి ఎస్కేప్ వరకు అంతా సినీ ఫక్కీలోనే.. ఒంటరిగానే ఆలోచించాడా..? తీసుకున్న కిరాయికి పని ముగించాడా..? నిందితుడు హత్య చేయాలనే ఉద్దేశంతోనే దాడి చేశాడా? దాడి చేసి బయపెట్టాలని చూసాడా? పోలీసులు తెర వెనుక ఉన్న సూత్రధారులను సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? రెండు టిక్కెట్లు చెన్నై కే ఎందుకు బుక్ అయ్యాయి… మేక్ మై ట్రిప్ లో ట్రైన్, ఫ్లైట్ టిక్కెట్ లు ఎవరు బుక్ చేశారు..? మూడు కోట్ల రూపాయల డీల్ అయితే అడ్వాన్స్ కింద 57 లక్షలు ఎమ్మార్వో కి ఇస్తే.. మిగిలిన వాటి సంగతేంటి..? ప్రసాద్, గంగారాం మధ్య లింకేంటి…? అన్నయ్యగా పరిచయం అయి మీడియా ముందు హడావిడి చేసిన రాజేంద్ర బ్యాక్ డోర్ వర్క్స్ తో MRO లింకులు ఏంటి…? ఇలా ఒక హత్య.. వంద ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
నా భవిష్యత్తేంటో పైవాడే నిర్ణయిస్తాడు..
నా భవిష్యత్తేంటో పైవాడే నిర్ణయిస్తాడు అని పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. అసెంబ్లీ లాబీల్లో చిట్‌చాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏ పరిస్థితుల్లో నేను వైసీపీలోకి వచ్చానో అందరికీ తెలుసన్న ఆయన.. 2012లో పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనుకే ఉన్నాను. నా పరిస్థితే ఇలా ఉంది.. మిగిలిన వాళ్ల సంగతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, నా భవిష్యత్తేంటో పైవాడే నిర్ణయిస్తాడు అని పేర్కొన్నారు కాపు రామచంద్రారెడ్డి.
మరో 10 రోజుల్లో జనసేన అభ్యర్థుల ప్రకటన..!
మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మా పార్టీ అధినేత పవన్ కల్యాన్ ప్రకటిస్తారని వెల్లడించారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తున్న జాబితాలపై స్పందించారు.. వైసీపీ ఏడో జాబితా కాదు.. లక్ష జాబితాలు విడుదల చేసినా మాకు నష్టం లేదన్నారు. జనసేన ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలో మా అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. పార్టీలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే.. పరిష్కరించుకొని ముందుకు వెళ్తాం అన్నారు. టీడీపీ-జనసే కూటమితో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కలిసి వస్తుందని భావిస్తున్నాం అన్నారు.. మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థులను మా అధినేత ప్రకటిస్తారన్న ఆయన.. టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంది.. కాబట్టి, టీడీపీ నేత చింతకాయల విజయ్ తో మర్యాద పూర్వకంగానే కలిశాం అన్నారు. ఇదే సమయంలో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ అంశం చర్చకు రాలేదు అన్నారు. ఇక, నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలో మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్ని వెల్లడించారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.
ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం.. త్వరలో మరో రెండు
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాళోజీ కవితతో ప్రసంగాన్ని గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించారు.. ప్రగతిభవన్‌ను.. ప్రజాభవన్‌గా అందుబాటులోకి వచ్చింది.. ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం.. ఆరు గ్యారంటీలను అందుబాటులోకి తీసుకుచ్చాం.. త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని ఆమె చెప్పుకొచ్చారు. అర్హులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం.. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అములుకు కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పగించారు.. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. దశాబ్ధకాంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తామని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు.. TSPSC, SHRC లాంటి సంస్థలు బాధ్యతాయుతంగా పని చేసే స్వేచ్ఛను కల్పిస్తామన్నారు. గత సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశాం.. ప్రజావాణి ద్వారా ప్రభుత్వం ప్రజా సమస్యలను తెలుసుకుంటోంది అని ఆమె వెల్లడించారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతాం.. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారు.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం తీసుకోస్తాం.. మౌళిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేయబోతున్నాం.. ఇంటర్నెట్ కనీస అవసరంగా గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నాం.. టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.
నేటి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా కేసీఆర్
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. కానీ, బడ్జెట్ రోజు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నట్లు తెలిపారు. ఇక, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. కాగా, ప్రమాదవశాత్తు తుంటి ఎముక విరగి సర్జరీ అవడంతో ఆయన రెండు నెలలుగా బయటికి రాలేదు.. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ సెషన్ కి కేసీఆర్ దూరం అయ్యారు.
కాంగ్రెస్ ‘బ్లాక్ పేపర్’ను దిష్టిచుక్కగా అభివర్ణించిన ప్రధాని మోడీ
గత పదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ‘బ్లాక్ పేపర్’ విడుదల చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ విడుదల చేసిన బ్లాక్ పేపర్‌ను ‘దిష్టిచుక్క’గా అభివర్ణించారు. ప్రతిపక్షాల అటువంటి చర్యను కేంద్ర ప్రభుత్వం కూడా స్వాగతించిందని అన్నారు.బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రతిపాదించిన ‘శ్వేతపత్రం’కు వ్యతిరేకంగా ఖర్గే ‘బ్లాక్ పేపర్’ను విడుదల చేశారు. కేంద్రం ఆర్థిక వ్యవస్థపై విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతుల కష్టాలు వంటి బీజేపీ నేతృత్వంలోని కేంద్రం వైఫల్యాలను ‘బ్లాక్ పేపర్’ హైలైట్ చేస్తుందని కాంగ్రెస్ పేర్కొంది.కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ‘బ్లాక్ పేపర్’ విడుదల చేసిన కొద్దిసేపటికే, ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ.. ప్రతిపక్ష పార్టీ ఈ చర్య తమ ప్రభుత్వానికి ‘దిష్టిచుక్క’ లాంటిదని, చెడు దృష్టిని పారదోలుతుందని అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ‘శ్వేతపత్రం’కు కౌంటర్‌గా కాంగ్రెస్ ఈ ఉదయం ‘బ్లాక్ పేపర్’ ప్రచురించింది. 2014 వరకు మనం ఎక్కడున్నాం, ఇప్పుడు ఎక్కడున్నాం అని శ్వేతపత్రం ప్రవేశపెడతామని సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ చర్య వెనుక ఉన్న ఏకైక లక్ష్యం, “ఆ సంవత్సరాల దుర్వినియోగం నుండి పాఠాలు నేర్చుకోవడమే” అని ఆమె అన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. మన్మోహన్ వీల్ చైర్లో కూడా వచ్చి పని చేశారని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహకారాన్ని ప్రశంసించారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సందర్భంగా సభలో ప్రసంగిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ సమయంలో ట్రెజరీ బెంచ్ గెలుస్తుందని తెలిసినా డాక్టర్ మన్మోహన్ సింగ్ తన వీల్ చైర్లో వచ్చి ఓటేశారని ప్రధాని మోదీ అన్నారు. ఒక సభ్యుడు తన విధుల పట్ల అప్రమత్తంగా ఉంటాడనడానికి ఇది ఒక ఉదాహరణ అని అన్నారాయన. పదవీ విరమణ చేయనున్న రాజ్యసభ సభ్యులకు ఢిల్లీలోని ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ నివాసంలో గురువారం వీడ్కోలు ఇవ్వనున్నారు.ఈ మేరకు ఇవాళ ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో రాజ్యసభ సభ్యులు గ్రూప్ ఫోటోలో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు చైర్మన్ నివాసంలో పదవీ విరమణ చేస్తున్న సభ్యులకు వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొంటారు.
పన్ను పంపిణీలో కర్ణాటకకు రూ.13 ఇస్తే.. యూపీకి మాత్రం రూ.333 ఎందుకిస్తున్నారు?
కర్ణాటకకు చెందిన ఎంపీ డి.కె.సురేష్ కేంద్ర-రాష్ట్రాల మధ్య ‘పన్నుల పంపిణీ’పై ఇటీవల వివాదాస్పద ప్రకటన చేశారు. కర్నాటకకు నిధులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఇలాగే వివక్ష కొనసాగిస్తే ‘దక్షిణ భారతదేశం’ ప్రత్యేక దేశంగా చేయాలని డిమాండ్ చేయడం తప్ప మరో మార్గం లేకుండా పోతుందన్నది ఆయన ప్రకటన సారాంశం. పన్ను పంపిణీలో ఈ ఉత్తర-దక్షిణ భారతదేశం అంతరం ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎందుకు అడుగుతున్నాయి? నిధుల డిమాండ్‌పై ఈ పోరాటం కొత్తదా? అన్న అంశం గురించి వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదట.. కర్ణాటక ఎంపీ ప్రకటనతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఢిల్లీలో నిరసనకు దిగింది. కేరళ ప్రభుత్వం కూడా గురువారం ఇదే తరహాలో నిరసన చేపట్టనుంది. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో ఇప్పటికే తమ వాటా తగ్గిందని కర్ణాటక ప్రభుత్వం చెబుతుండడమే ఈ వివాదానికి ప్రధాన కారణం. దీని వల్ల రాష్ట్రం నష్టపోతోంది. కాగా, దేశంలో అత్యధికంగా పన్నులు వసూలు చేస్తున్న రెండో రాష్ట్రం కర్ణాటక. అందువల్ల అతను కనీసం తన న్యాయమైన హక్కులను పొందాలి. కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. 14వ ఆర్థిక సంఘం పన్నులను పంపిణీ చేసినప్పుడు, కర్ణాటక వాటా 4.71 శాతం. కానీ 15వ ఆర్థిక సంఘంలో దానిని 3.64 శాతానికి తగ్గించారు. దీని వల్ల కర్ణాటకకు రూ.1.87 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇవ్వలేదన్నారు. దేశం కోసం జమ చేసిన ప్రతి రూ.100 పన్నుకు కర్ణాటకకు రూ.13 మాత్రమే రిటర్న్‌గా లభిస్తుండగా, ఉత్తరప్రదేశ్‌కు రూ.333 రిటర్న్‌గా లభిస్తోంది. దీనికి సంబంధించిన ఫార్ములా 16వ ఆర్థిక సంఘంలో రూపొందించాలని కోరుతున్నాం. చాలా ఇస్తున్నాం కానీ రూ.44,485 కోట్లు మాత్రమే అందుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు రూ.2.18 లక్షల కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.95,000 కోట్లు వచ్చాయి.
ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేట్ యథాతథం
కీలకమైన రెపోరేటుపై మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్‌లో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అంతా ఊహించినట్లుగానే రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం సెంట్రల్ బ్యాంక్‌కు ప్రాధాన్యతగా మిగిలిపోతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం మాట్లాడుతూ.. కీలకమైన రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచాలని సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) నిర్ణయించింది. ఈ నిర్ణయం స్థూలంగా ఆర్థికవేత్తలు ఊహించిన దానికి అనుగుణంగానే ఉంది. కాగా యథాతథంగా ఆర్బీఐ ఈ రెపోరేటును కొనసాగించడం వరుసగా ఇది ఆరోసారి.
త్వరలో మైదానంలోకి ఇషాన్ ఎంట్రీ.. బరోడా స్టేడియంలో ప్రాక్టీస్
టీమిండియా యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఫ్యాన్స్ కు శుభవార్త.. దాదాపు మూడు నెలలుగా ఆటకు దూరమైన ఈ డాషింగ్ ఓపెనర్ మళ్లీ గ్రౌండ్ లోకి దిగాడు. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టిన అతడు వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. వరల్డ్ కప్ తర్వాత దేశవాళీ క్రికెట్ తో పాటు ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమైన ఇషాన్ బరోడా స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అక్కడి కిరణ్ మోరే అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక, టీమిండియా ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో కలిసి ఇషాన్ కిషన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కొన్నిరోజులు విశ్రాంతి తీసుకున్న అతడు ఆటపై దృష్టి పెడుతున్నాడు అనే ఈ విషయాన్ని తాజాగా మాజీ క్రికెటర్ కిరణ్‌మోరె తెలిపారు. అయితే.. ఇషాన్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఎప్పుడు ఆడుతాడు? అనేది మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. ఇక, ఐపీఎల్లో ధనాధన్ ఇన్నింగ్స్‌ల ఆడిన ఇషాన్.. టీమిండియా ఓపెనర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలతో రాణించాడు. కానీ, వరల్డ్ కప్ 2023 స్క్వాడ్‌లో ఈయంగ్ ప్లేయర్ కు అవకాశం దక్కినా.. శుభ్‌మన్ గిల్ ఎంట్రీ ఇవ్వడంతో బెంచ్‌కే ఫిక్స్ అయ్యాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్ కు ఎంపికైనా సిరీస్ మధ్యలోనే స్వదేశం వచ్చేశాడు.
పవన్ కల్యాణ్, క్రిష్ కాంబో మూవీ ఆగిపోయినట్లేనా..?
క్రియేటివ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి గత కొన్ని ఏళ్లుగా తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’.టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీర మల్లు మూవీ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. అయితే తాజాగా ఈ మూవీ నుంచి క్రిష్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.గతంలో మణికర్ణిక మూవీని ఇలాగే సగానికిపైగా షూట్ చేసిన తర్వాత ఆ మూవీ లీడ్ కంగనా రనౌత్ తో పడకపోవడంతో క్రిష్ ఆ మూవీని మధ్యలోనే వదిలేశాడు. ఇప్పుడు హరి హర వీర మల్లు విషయంలోనూ అదే జరిగినట్లు కనిపిస్తోంది.హరి హర వీర మల్లు మూవీ ఎప్పుడో నాలుగేళ్ల కిందట ప్రారంభమైంది. ఇప్పుడు అప్పుడు అంటూ ఆరు నెలలకోసారి ఏదో అప్డేట్ వచ్చినా కానీ సినిమా మాత్రం అక్కడే ఉండిపోయింది. ఈలోపు పవన్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ మరియు బ్రో మూవీస్ రిలీజయ్యాయి. తాజాగా ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఓజీ మూవీ కూడా రాబోతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు.అయినా హరి హర వీర మల్లు పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వస్తున్న వార్తలు పవన్ అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే అతడు అనుష్క శెట్టితో ఓ కొత్త సినిమాను ప్రారంభించాడు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ అయిన ఈ ప్రాజెక్ట్ ఓ భారీ బడ్జెట్ సినిమా అని తెలుస్తోంది.గతంలో వేదం సినిమాలో క్రిష్ డైరెక్షన్ లో నటించిన అనుష్క..ఆ సినిమాలో సరోజ పాత్రలో అదరగొట్టింది. అయితే ఈ మధ్యనే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో మళ్లీ సినిమాలు మొదలుపెట్టిన అనుష్క.. ఇప్పుడు క్రిష్ తో మరో మూవీ చేస్తోంది. దీనితో క్రిష్ హరి హర వీర మల్లు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా మిగిలిపోయిన షూటింగ్ ను మరో డైరెక్టర్ పూర్తి చేస్తాడనీ వార్తలు వస్తున్నాయి.