*బతికే ఉన్న పూనమ్ పాండే.. ఆమె ఎందుకు ఇలా చేసిందంటే ?
బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ పూనమ్ పాండే మరణవార్తతో సినీ పరిశ్రమ షాక్ కు గురైంది. ఆమె మరణ వార్త విన్న హార్ట్ కోర్ అభిమానులంతా విషాదంలో మునిగిపోయారు. పూనమ్ 32 ఏళ్ల వయసులో గర్భాశయ క్యాన్సర్‌తో మరణించింది. ఈ విషయాన్ని ఆమె మేనేజన్ ఇన్ స్టాలో ధృవీకరించారు. అయితే ఈ విషయంలో ఇప్పుడు ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పూనమ్ పాండే చనిపోలేదు. ఈ విషయాన్ని ఆమె మాట్లాడిన వీడియోను స్వయంగా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. తాను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. సర్వైకల్ క్యాన్సర్ ను లైమ్ లైట్ లోకి తీసుకు వచ్చేందుకు ఇలాంటి పని చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే పూనమ్ చనిపోయిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుంచి రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. పూనమ్ మరణ వార్త వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఆమె కుటుంబం అజ్నాతంలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసేందుకు ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అయితే అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. పూనమ్ మరణ వార్తను విన్న కొందరు నెటిజన్లు చనిపోలేదని మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని ఆగ్రహిస్తున్నారు. తాను బతికే ఉందన్న విషయం తెలిసిన మరుక్షణమే అరెస్ట్ చేయాలని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
*అద్వానీకి భారతరత్న
మాజీ ఉప ప్రధాన మంత్రి, భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా (ఎక్స్) వెల్లడించారు. దేశానికి అద్వానీ చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డ్ ఇస్తున్నట్లు ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా అద్వానీకి ఫోన్ చేసిన ప్రధాని కంగ్రాట్స్ చెప్పినట్లు తెలిపారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని.. దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర చరిత్రాత్మకమైనదని భాతర ప్రధాని వెల్లడించారు.
*బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అద్వానీ గురించి తెలుసా..?
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత అత్యన్నుత పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానికి (96) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. భారతరత్న అవార్డుతో అద్వానీని మోడీ సర్కార్ గౌరవించింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్కే అద్వానీ రాజనీతిజ్ఞుడు, భారతదేశ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు అని పేర్కొన్నారు. కింది స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు అద్వానీ ఎదిగారు అనే విషయాన్ని మోడీ గుర్తు చేసుకున్నారు. అయితే, భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడుగా లాల్ కృష్ణ అద్వానీ 1927 జూన్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచి పట్టణంలోని సంపన్న కుటుంబంలో జన్మించారు. 15 ఏళ్ల వయస్సులోనే ఆర్ఎస్ఎస్ లో ప్రవేశించారు. దేశ విభిజన సమయంలో భారత దేశానికి వలస వచ్చిన తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యారు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరిన అనతి కాలంలోనే ముఖ్య పదవులు పొందారు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రి పదవి పొందారు. ఇక, 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది. కాగా, ఎమర్జెన్సీ తర్వాత జనసంఘ్ పార్టీ జనతా పార్టీలో విలీనం కావడంతో అద్వానీ 1977లో జనతా పార్టీ తరపున పోటీ చేసి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పని చేశారు. జనతా పార్టీ పతనంతో జనసంఘ్ పార్టీ వేరు పడి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించడంతో అద్వానీకి దేశ రాజకీయాలలో ముఖ్య పాత్ర వహించే అవకాశం దొరికింది. కానీ, బీజేపీ ఏర్పాటు ప్రారంభంలో పార్టీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించలేదు. 1982లో బీజేపీకి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం లభించింది. 1986లో అద్వానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1989 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ స్థానాల సంఖ్యను 86కు పెంచారు. 1989లోనే అద్వానీ లోక్‌సభలోకి తొలి సారిగా ప్రవేశించారు. ఇక, 1990వ సంవత్సరంలో ఎల్ కే అద్వానీ రథయాత్ర చేసి దేశంలో సంచలనం సృష్టించారు. ఇక, 2002లో అటల్ బిహారి వాజపేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉప ప్రధాన మంత్రిగా పని చేశారు. అలాగే, 2004లో లోక్‌సభ ప్రతిపక్ష నేతగా పని చేశారు. 2009 ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఎంపికయ్యారు. కానీ, ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాలేదు. అలాగే, 2015లో ఎల్ కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషన్ అవార్డు ప్రకటించింది. అలాగే, ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు భారతరత్నను ప్రకటించడం ఇది రెండోసారి. ఇంతకు ముందు బీహార్ మాజీ సీఎం దివంగత నేత కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇస్తున్నట్టు జనవరి 23న మోడీ సర్కార్ ప్రకటించింది. అయితే, ఇప్పటి వరకూ 49 మంది ప్రముఖులు ‘భారతరత్న’ అందుకోగా.. వీరిలో 17 మందికి మరణానంతరం భారతరత్న లభించింది. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు ప్రముఖులు ‘భారతరత్న’ అందుకున్నారు.
*బీఆర్ఎస్ కు మాజీ డిప్యూటీ సీఎం గుడ్ బై..
బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సిద్ధమయ్యారు. ఈ నెల 10న కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు గులాబీ దళపతి టికెట్ నిరాకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో రాజయ్య పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజయ్య కాంగ్రెస్‌లో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా బరిలో దిగుతానని తాటికొండ రాజయ్య అడిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడంతో రాజీనామా చేసినట్లు సమాచారం. . మరి దీనిపై కాంగ్రెస్ వర్గాలు ఎలా స్పందిస్తారు? వరంగల్ టికెట్ ఇస్తారా? అనే దానిపై ఆశక్తి నెలకొంది. తన అనుచరులతో లోతుగా చర్చించిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో చర్చలు జరిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది. అభివృద్ధిపై చర్చించేందుకే సీఎంను కలిశామని చెబుతున్నా… వీరి భేటీ పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే.. ఆయన రాజీనామాతో వరంగల్‌లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.
*ఐఎన్ఎస్ సంధాయక్‌ను జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్
విశాఖలో ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. విశాఖలోని నేవల్ డాక్ యార్డులో తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను కేంద్ర మంత్రి జాతికి అంకితమిచ్చారు. నేవీ అవసరాల కోసం ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను ఉపయోగించనున్నారు. హైడ్రోగ్రాఫిక్ సర్వే సరిపేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) సంస్థ ఐఎన్ఎస్ సంధాయక్‌ను నిర్మించింది. ఈ ఐఎన్ఎస్ సంధాయక్ నౌక 3,800 టన్నుల సామర్థ్యంతో 110 మీటర్ల పొడవుతో.. హెలిపాడ్, సర్వే పరికరాలు, రెండు డీజిల్ యంత్రాలను కలిగి ఉంది. తాజాగా ఐఎన్ఎస్ సంధాయక్ నౌకను రాజ్‌నాథ్ సింగ్ అంకితమిచ్చారు. సంధాయక్ నౌకకు కమాండింగ్ అధికారిగా కెప్టెన్ ఆర్.ఎం.థామస్ వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి, వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్క పాల్గొన్నారు. భారత నౌకాదళ అమ్ములపొదిలో ఐఎన్ఎస్ సంధాయక్ జలప్రవేశం సంతోషకరమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత నౌకాదళం స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోందన్నారు. ప్రపంచ సముద్ర జలాల్లో కూడా భారత నౌకాదళం కీలక భద్రత చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. భారత్‌కు 8 వేల నాటికల్ మైళ్ల దూరంలో సముద్రపు దొంగలను కూడా నౌకాదళం అదుపు చేసిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత నౌకాదళానికి ఈరోజు ఒక చారిత్రాత్మకమైనది. హిందూ మహాసముద్ర జలాల్లో శాంతిని కాపాడేందుకు ఐఎన్ఎస్ సందాయక్ ఉపకరిస్తుంది. దేశీయంగా యుద్ధ నౌక తయారీలో చరిత్ర సృష్టించడం ఆనందంగా వుంది. ఇటీవల రెండు విదేశీ నౌకలను సముద్రంలో వేలమైళ్ల దూరంలో సముద్రపు దొంగల బారిన, వారి చెర నుంచి కాపాడిన ఘనత భారత నౌకా దళానిది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా తిరిగిందుకు భారత నౌకలు తన వంతుగా పూర్తి సహకారాన్ని అందరికీ అందిస్తుంది.హిందూ మహాసముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకలకు అవసరమైన భద్రతను ఇండియన్ నేవీ కల్పిస్తోంది. భారతదేశం ప్రధానమైన లక్షమైన శాంతి సామరస్యం అంతర్జాతీయ జలాల్లో కూడా ఇది కాపాడే విధంగా భారత తన వంతు పాత్రను సహకారాన్ని పోషిస్తుంది. మన విజ్ఞానమే మన శక్తి. ఇదే అన్ని రంగాల్లోనూ మనం నిరూపిస్తున్నాం.” అని రక్షణ మంత్రి అన్నారు.
*ఢిల్లీ సీఎం ఇంటికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల బృందం చేరుకుంది. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. నిన్న కూడా క్రైమ్ బ్రాంచ్ బృందం నోటీసు ఇచ్చేందుకు కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంది. 7 మంది ఎమ్మెల్యేలను 25 కోట్ల రూపాయలకు బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని ఆయన ఆరోపించిన వాటిపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. దీంతో పాటు ఢిల్లీ మంత్రి అతిషికి కూడా విచారణకు హాజరు కావాల్సిందిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. బీజేపీపై ఆరోపణలు చేస్తూ గత సోమవారం అతిషీ స్వయంగా మీడియాలో వెల్లడించారు. అలాగే, సమయం వచ్చినప్పుడు ఆధారాలు కూడా ఇస్తామని ఆయన చెప్పారు.. అతిషి ఈ మొత్తం వ్యవహారానికి ‘ఆపరేషన్ లోటస్ 2.0’ అని పేరు పెట్టారు.. నిజానికి ఇంతకు ముందు కూడా తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది.. అయితే, దీనికి సంబంధించిన వివరాలతో రావాలని వారికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక, ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ పదే పదే బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, ఎంపీ రమేశ్ బిధూరి, ఎంపీ ప్రవేశ్ వర్మ, మనోజ్ తివారీ తదితర నేతలు మంగళవారం ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను కలిసి మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతల డిమాండ్ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తును క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు.
*ఎన్నికలకు ముందు పాక్ లో హింస.. కరాచీలో రెండు పార్టీల మధ్య ఘర్షణ
పాకిస్థాన్‌లో ఈ నెల 8వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ లో హింసాకాండ కొనసాగుతోంది. కరాచీలో ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది. ఈ హింసాత్మక ఘర్షణలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనతో పాకిస్థాన్ లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొద్ది రోజులుగా ఇరు పార్టీల మధ్య ఇది పెద్ద గొడవ జరిగింది. గత ఆదివారం, కరాచీలోని నజిమాబాద్ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలో ముత్తాహిదా క్వామీ ఉద్యమ కార్యకర్త మరణించాడు. ముత్తాహిదా క్వామీ ఉద్యమం కూడా పీపీపీ కార్యకర్తలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక, తాజాగా న్యూ కరాచీలోని సెక్టార్ 11-జెలో ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్- పీపీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది అని వెల్లడించారు. అంతకుముందు, జనవరి 22న కరాచీలోని హైదరీ ప్రాంతంలో జరిగిన హింసాకాండపై ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు.
*జైస్వాల్ ద్విశతకం.. తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు భారత్ ఆలౌట్
విశాఖ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ 336/6తో రెండోరోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 396 పరుగులకు మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ చివరి వరకు అద్భుతంగా ఆడి డబుల్ సెంచరీ చెలరేగాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్స్‌లతో తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 101 ఓవర్ వేసిన స్పిన్నర్ బషీర్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్, ఫోర్ బాది జైస్వాల్ తన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కు తన అంతర్జాతీయ కెరీర్లో ఇదే తొలి ద్విశతకం కావడం విశేషం. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ విఫలమైన చోట జైశ్వాల్ తన అద్బుత ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 290 బంతుల్లో 209 పరుగులు చేసి జైస్వాల్ ఔటయ్యాడు. అండర్సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి జైస్వాల్ తన వికెట్‌ను కోల్పోయాడు. 8వికెట్‌గా జైస్వాల్ వెనుదిరగగా.. కాసేపటికే మరో రెండు వికెట్లు కోల్పోయి 396 పరుగుల వద్ద భారత్ ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లు బషీర్, అహ్మద్, అండర్సన్లకు తలో 3 వికెట్లు తీశారు.