రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు..
రాజ్యసభ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలతో పాటు.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది.. అయితే, రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా మరోసారి రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు.. రేపు ఉదయం విచారణకు రావాలని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు స్పీకర్.. ఇక, రేపు మధ్యాహ్నం విచారణకు రావాలని టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మోహన్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరికి నోటీసులు ఇచ్చారు. విచారణకు పిలిచినట్టు పిటిషనర్, టీడీఎల్పీ విప్ స్వామికి ఇంటిమేట్ చేసింది స్పీకర్ పేషీ. విచారణ సమయంలో హాజరు కావాలని స్వామికి సూచించారు. అయితే, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలను మూడోసారి విచారణకు పిలిచారు స్పీకర్ తమ్మినేని.. ఇక, వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఇప్పటికే మూడుసార్లు విచారణ కొనసాగింది.. మరోవైపు ఇప్పటికే రెండు సార్లు స్పీకర్ ఎదుట హాజరయ్యారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి.. ఒక్కసారి హాజరయ్యారు రెబెల్ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. అసలు ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు వల్లభనేని వంశీ మోహన్, కరణం బలరాం, మద్దాలి గిరి.. కాగా, ఈ నెల 12న విచారణకు రావాలని ఇంతకు ముందు స్పీకర్ నోటీసులు జారీ చేయగా, వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నామని స్పీకర్‌కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ పంపిన విషయం విదితమే కాగా.. రేపు స్పీకర్ ఎదుట హాజరు కావాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు లేఖలు పంపారు.
నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.. క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. విపక్షాల వైపు చూస్తున్నారు.. కొందరు ఇప్పటికే టీడీపీ గూటికి చేరగా.. మరికొందరు జనసేన కండువా కప్పుకున్నారు.. మరికొంతమంది సైతం టీడీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతూనే ఉంది.. ఆ ప్రచారంపై నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు.. నేను చంద్రబాబును కలిశానని.. పార్టీ మారుతానని కొందరు ఏడాది నుంచి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. ప్రతిసారి నేను క్లారిటీ ఇస్తున్నాను.. నేను పార్టీ మారే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు.. ఈ సారి కూడా వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. నెల్లూరు రూరల్ నుంచి అసెంబ్లీకి లేదా నెల్లూరు లోక్‌సభ కా అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు.. ఇక, త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలుస్తాను అని తెలిపారు ఎంపీ ఆదాల.. మరోవైపు.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు మా గుంట శ్రీనివాసులు రెడ్డితో చర్చలు జరిపా.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం తీవ్ర మనస్థాపానికి గురయ్యారని తెలిపారు.. ఆయనను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించాను.. కానీ, నా ప్రయత్నం ఫలించలేదని.. అదే విషయాన్ని అధిష్టానానికి చెప్పాను అని వెల్లడించారు. అయితే, మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాత్రం పార్టీలోనే కొనసాగాలనుకుంటున్నారని.. వైసీపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని అంటున్నారని పేర్కొన్నారు.
ఉద్దేశపూర్వకంగా రాజధానిపై వివాదం..! ఉమ్మడి రాజధాని అంటే..?
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కొత్త వ్యవహారం తెరపైకి వచ్చింది.. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తే బాగుంటుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను కొందరు సమర్థించగా.. విపక్షాలు మండిపడుతున్నాయి.. విశాఖలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే ప్రజలు ఉమ్మేస్తారు అని హెచ్చరించారు.. ఉద్దేశ పూర్వకంగా రాష్ట్రంలో రాజధాని వివాదం రేకేస్తున్నారని మండిపడ్డారు.. మరోవైపు.. బీజేపీకి మద్దతు తెలుపుతున్న పార్టీలను రాన్నున్న ఎలక్షన్ లో ఓడించాలని పిలుపునిచ్చారు శ్రీనివాసరావు.. వైసీపీ, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ఆరోపించిన ఆయన.. టీడీపీ – జనసేన పార్టీలు బీజేపీకి పల్లకి మోస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటు వేసినా.. బీజేపీకి ఓటు వేసినట్టే అవుతుందని దుయ్యబట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీ వచ్చిన వాళ్లతో కలిసి పోరాడుతామని ప్రకటించారు సీపీఎం ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు.
ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు..
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.. అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా ఉన్న సుమిత్ కుమార్‌ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.. ఇక, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా ఉన్న పి. ప్రశాంతిని అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు.. మరోవైపు పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఎం. విజయ సునీతను అల్లూరి సీతారామ రాజు జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు.. ఇక, సివిల్‌సఫ్లయ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా ఉన్న జి. వీరపాండ్యన్‌కు డైరెక్టర్ అదనపు బాధ్యతలు అప్పగించారు.. మరోవైపు ఐఎఫ్ఎస్ అధికారి రాహుల్ ప పాండ్యేకు పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
3 రాజధానుల పేరిట చిచ్చు పెట్టారు.. హైదరాబాద్ పేరుతో నాలుగో ముక్క తెరపైకి తెచ్చారు..!
మూడు రాజధానుల పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు.. మూడు ప్రాంతాల్లో బినామీ ఆస్తులు పోగేసుకున్నారు.. ఇప్పుడు హైదరాబాద్ పేరుతో నాలుగో ముక్క తెరపైకి తీసుకొచ్చారు అంటూ ఫైర్ అయ్యారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. వైవీ సుబ్బారెడ్డి నోట జగన్ రెడ్డి మాట.. బినామీ ఆస్తులు కాపాడుకోవడానికే వైవీ నోట హైదరాబాద్ పాట అని ఆరోపణలు గుప్పించారు. విశాఖలో జగన్ రెడ్డి రూ.40 వేల కోట్ల బినామీ ఆస్తుల్ని కూడగట్టుకున్నాడు. అందుకే ఇప్పటి వరకు విశాఖే రాజధాని అన్నాడు. ఇప్పుడు హైదరాబాద్‌లోని బినామీ ఆస్తుల కోసం కొత్త నాటకానికి తెరలేపారని దుయ్యబట్టారు. గతంలో అమరావతికి 30 వేల ఎకరాలుండాలని అన్నాడు. ఇక్కడే ఇల్లు కట్టుకున్నాని జగన్ అన్నాడు. అమరావతిని పూర్తి చేస్తానంటూ ప్రజల్ని నమ్మించాడు. అధికారంలోకి వచ్చాక అమరాతిని నాశనం చేశాడు అని విరుచుకుపడ్డారు. సీఎం జగన్.. యువతకు ఉద్యోగ, ఉపాధి దూరం చేశాడు అని విమర్శించారు అచ్చెన్నాయుడు.. రైతుల త్యాగాన్ని హేళన చేసి బూటు కాళ్లతో హింసించాడు. కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పి కర్నూలుకు హైకోర్టు బెంచి రాకుండా చేశాడు. మూడు రాజధానుల పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు. బినామీ ఆస్తుల కోసం ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు అని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి అరాచకం స్థాయి రాజధాని ఫైల్స్ సినిమా చూస్తే అర్ధమవుతుందన్న ఆయన.. 60 రోజుల తర్వాత అధికారంలోకి వస్తాం. అమరావతిని పూర్తి చేస్తాం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపుతామని.. రాష్ట్రాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుపుతామని ప్రకటించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
చచ్చిన పామును మళ్ళీ చంపుతాడా ఎవడన్నా.. కేసీఆర్ పై రేవంత్
కేసీఆర్ అనే పాము సచ్చింది అని.. సచ్చినా పామును మళ్ళీ చంపుతాడా ఎవడన్న అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సభకు రాకుండా పారిపోయి..కేసీఆర్ తప్పించుకుంటాడని తెలిపారు. మూడు రోజులగా సభలో అన్ని విషయాలు చర్చ చేయాలని అనుకున్నామన్నారు. చూసి వచ్చి చర్చ చేద్దాం అని..అందరం మేడిగడ్డ పోదాం అన్నాము.. పిలిస్తే వాళ్ళు రాలేదని రేవంత్ అన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళదే తప్పు అన్నట్టు మట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నిన్న సభలో ఏం మాట్లాడారు ? అని ప్రశ్నించారు. బాషా మీద మాట్లాడదమా ? అన్నారు. ఎం పికనికి పోయారు అన్నాడు కేసీఆర్.. ఇప్పటికే నీ పాయింట్ ఉడపికారు ప్రజలు అంటూ చెప్పుకొచ్చారు రేవంత్.. చెప్పుకునే దిక్కు లేక బొక్కబోర్ల పడి కాళ్ళు ఇరిగాయన్నారు. సీఎం ని ఏం పికనికి పోయావు అంటారా? అని మండిపడ్డారు. ఇదేనా సంప్రదాయం అని ప్రశ్నించారు. మేడిగడ్డ నీళ్లు నింపే పరిస్థితి ఉందా..? హరీష్ కి పెత్తనం ఇస్తాం.. వాళ్లనే మేడిగడ్డ ఎట్లా నింపుతారో చేయమనండి అన్నారు. నీళ్లు నిలిచే పరిస్థితి లెకుండా ఉంటే.. ఇక్కడకు వచ్చి మళ్ళీ మాట్లాడతారా? అని మండిపడ్డారు. మేడిగడ్డ మీద చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. రమ్మను..సభకు..రేపు వరకు చర్చ చేద్దాం అన్నారు. జైలుకు పోవాల్సి వస్తుంది కేసీఆర్..అన్నారు. కేసీఆర్ అనే పాము సచ్చింది.. సచ్చినా పామును మళ్ళీ చంపుతాడా ఎవడన్న అన్నారు. సభకు రాకుండా పారిపోయి.. కేసీఆర్ తప్పించుకుంటున్నాడని తెలిపారు. ఈయన వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు అంటూ మండిపడ్డారు. కొత్త విషయం చెప్తున్నాడని అన్నారు. కాళేశ్వరం మీద అయినా.. మేడిగడ్డ మీద చర్చ చేయడానికైనా సిద్ధం మేము అని రేవంత్ అన్నారు.
అహంకారం తగ్గించుకో.. కేటీఆర్ పై రాజగోపాల్ రెడ్డి ఫైర్
కేటీఆర్.. మంత్రి పొన్నం మాట్లాడుతుంటే కూర్చో అంటాడు..ఎంత అహంకారం.. కేటీఆర్ బుద్ధి మార్చుకో అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మారలేదన్నారు. కడియం మొన్న నేను మంత్రివి కావు కూర్చో అన్నాడు.. మంత్రి పదవి..మా పార్టీ చూసుకుంటారు.. అని తెలిపారు. ఉద్యమ కారుడు రాజయ్యకి అన్యాయం చేసింది నువ్వు అంటూ మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పదవి లాక్కున్నావన్నారు. అవమానకరంగా మంత్రి పదవి తీయించుకున్న చరిత్ర మీది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కావాలని.. ఎమ్మెల్యే వదిలేసి.. ఎమ్మెల్యే సీటు కోసం రాజయ్య కి అన్యాయం చేశావన్నారు. నాగురించి ముందు మాట్లాడింది కడియం శ్రీహరి అని మండిపడ్డారు. మా పార్టీ విషయాల గురించి వాళ్లకు ఏంది? అని ప్రశ్నించారు. అధికారం పోయిన తర్వాత మా పార్టీ ని చీల్చే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు పదవులు ముఖ్యమా… పదవులు నాకు ముఖ్యమా.. అని ప్రశ్నించారు. రాజీనామా చేసి మీ సర్కార్ ని ప్రజల కాళ్ల దగ్గరికి తీసుకు వచ్చామంటూ కేటీఆర్ పై మండిపడ్డారు. స్పీకర్ గా మిమ్మల్ని గౌరవిస్తామని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మేము మాట్లాడేది తప్పు అయితే.. మంత్రులు చెప్పొచ్చన్నారు. కానీ మంత్రులు దూషించి.. స్పీచ్ ఇస్తున్నారని మండిపడ్డారు. రాజగోపాల్ ..కడియం పై చేసిన వ్యాఖ్యలు తొలగించాలన్నారు. ట్రెజరీ బెంచ్ సబ్యులకు మైక్ ఇస్తున్నారు.. మాకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నం అంటే గౌరవం అన్నారు. కానీ వాస్తవానికి విరుద్ధ మాటలు చెప్పారు.. అందుకే అలా అన్నం అని తెలిపారు. గౌరవేల్లి డ్రై రన్ కాలేదా..? అని ప్రశ్నించారు. మేడిగడ్డ వెళ్లి మా పై బురద జల్లే పని చేస్తున్నారని అన్నారు. మంత్రిని అగౌరవ పరిచే ఉద్దేశం మాకు లేదన్నారు. కానీ ఆయన కూడా అబద్ధాలు చెప్పొద్దూ అంటూ మండిపడ్డారు. మేడిగడ్డ కుంగితే.. మేడిగడ్డ నింపండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద కోపం ఉంటే..రైతుల మీద పగ తీర్చుకోవద్దన్నారు.
మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం.. 60 మంది రైతులకు గాయాలు!
‘ఢిల్లీ చలో’ మార్చ్ నిరసన కార్యక్రమంలో భాగంగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఉన్న రైతులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం జరిగింది. మంగళవారం ఉదయం పంజాబ్-హర్యానా సరిహద్దు పాయింట్ల వద్ద పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ ఘటనలో 60 మంది రైతులు గాయపడ్డారని తెలుస్తోంది. పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు దేశ రాజధాని లోపలి వెళ్లేందుకు బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నించడంతో రెండు సరిహద్దు పాయింట్ల వద్ద పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను అడ్డుకునేందుకు పోలీసు అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. యూపీ, పంజాబ్, హర్యానాల నుంచి ఢిల్లీ నగరంలోకి ప్రవేశించే మార్గంలో పెద్ద ఎత్తున సిమెంట్ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. రైతులను అడ్డుకునేందుకు కాంక్రీటు దిమ్మెలు, ఇనుప కంచెలు, కంటైనర్ల గోడలతో బహుళ అంచెల్లో బ్యారికేడ్లను పెట్టారు. మరోవైపు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించేందుకు వాడే డ్రోన్లకు కూడా ఏర్పాటు చేశారు. ఇక కొన్ని మార్గాల్లో వాహన రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేశారు.
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ను తొలగించండి..
జ్ఞాపకశక్తి, వయసుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన దేశ అధ్యక్షుడిగా ఉండటం తీవ్ర ఇబ్బందికరమని పశ్చిమ వర్జీనియా అటార్నీ జనరల్ పాట్రిక్ మోరిసే తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పదవి నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు లేఖ రాసుకొచ్చారు. అయితే, ఇటీవల జరిగిన సమావేశాల్లో దేశాల పేర్ల విషయంలో జో బైడెన్ గందరగోళానికి గురికావడాన్ని మోరిసే గుర్తు చేశారు. బైడెన్ జ్ఞాపక శక్తిలో మార్పును అమెరికన్లు చాలా కాలంగా గమనిస్తునే ఉన్నారు.. బహిరంగ సభల్లో, విదేశీ నేతలతో సమావేశాల సమయంలోనూ ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అధ్యక్షుడిగా కొనసాగడానికి ఆయన అర్హులుకారు.. సీనియర్ నేతలు సైతం బైడెన్ వయసుపై విమర్శలు చేస్తున్నారు.. 25వ సవరణను అమలు చేసి.. జో బైడెన్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలన్నారు. అగ్రరాజ్యం అమెరికాకు మానసికంగా దృఢంగా ఉన్న అధ్యక్షుడు అవసరం అని లేఖలో పేర్కొన్నారు. కాగా, మాజీ అధ్యక్షుడు కెనడీ హత్య తర్వాత 1965లో కాంగ్రెస్ 25వ సవరణకు ఆమోదించింది. దీని ప్రకారం అధ్యక్షుడు శారీరంగా, మానసికంగా ఫిట్‌గా లేకపోతే వైస్ ప్రెసిడెంట్, కేబినెట్ సభ్యులు భావిస్తే.. ఆయనను పదవి నుంచి తొలగించే అధికారం ఉంటుందని అనే విషయాన్ని పశ్చిమ వర్జీనియా అటార్నీ జనరల్ పాట్రిక్ మోరిసే గుర్తు చేశారు. వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల జో బైడెన్ జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది.
అమెరికాలో మంచు తుపాను.. స్కూల్స్ బంద్, 1200 విమానాలు రద్దు!
అమెరికాలోని ఈశాన్య యునైటెడ్ స్టేట్స్ను తీవ్ర మంచు తుపాను తాకింది. మంగళవారం ఉదయం నుంచే ఈశాన్య ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. దాంతో చాలా చోట్ల భారీగా హిమపాతం నమోదైంది. శీతాకాలపు మంచు తుఫాను కారణంగా ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. 1200 విమానాలు రద్దయాయి. కొన్ని చోట్ల విద్యుత్ నిలిచిపోయింది. మరోవైపు పాఠశాలలు మూతపడ్డాయి. న్యూయార్క్, మస్సాచుసెట్స్, పెన్సిల్వేనియా సహా పలు ప్రాంతాల్లో ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. పెన్సిల్వేనియా నుంచి మస్సాచుసెట్స్ వరకు ఉన్న పట్టణాల్లో మంగళవారం ఉదయం నుంచే మంచు పడడంతో దాదాపు ఐదు కోట్ల మంది ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తుపాను కారణంగా పెన్సిల్వేనియాలో ఓ స్నో మొబైలర్ ప్రాణాలు కోల్పోయాడు. కనెక్టికట్‌లోని ఫర్మింగ్టన్ పట్టణంలో దాదాపు 15.5 అంగుళాల మంచు కురిసింది. గత రెండేళ్లలో ఇలాంటి మంచు తుపాన్‌ను చూడలేదని స్థానికులు పేర్కొన్నారు. సుమారు 10-20 సెంటీమీటర్ల మంచు, గంటకు 64 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందట.
జనవరిలో 0.27శాతానికి తగ్గిన టోకు ద్రవ్యోల్బణం
ప్రస్తుతం ద్రవ్యోల్బణం రేటులో స్వల్ప క్షీణత కనిపించింది. ఈ సంవత్సరం జనవరి నెల అత్యంత శీతల వాతావరణానికి గుర్తుండిపోతుంది. టోకు ద్రవ్యోల్బణం రేటు గణాంకాలు వచ్చాయి. జనవరిలో టోకు ద్రవ్యోల్బణం రేటు 0.27 శాతానికి తగ్గింది. అంతకు ముందు నెలలో అంటే డిసెంబర్ 2023లో టోకు ద్రవ్యోల్బణం 0.73 శాతంగా ఉంది. ఇది గత నెలలో 0.3శాతంగా ఉంది. ఒక సంవత్సరం క్రితం 5శాతంతో పోలిస్తే, ఆహార ధరల పెరుగుదలతో నడపబడింది. రిటైల్ ద్రవ్యోల్బణం కూడా జనవరి 2024లో తగ్గింది. డిసెంబర్‌తో పోలిస్తే ఇది 5.10 శాతానికి తగ్గింది. డిసెంబర్ 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.69 శాతంగా ఉంది. నవంబర్ 2023లో టోకు ద్రవ్యోల్బణం రేటు 0.26 శాతంగా ఉంది. జనవరి 2024లో టోకు ద్రవ్యోల్బణం ఈ రేటులో ఎక్కువ లేదా తక్కువగా ఉంది.
ముంబై ఇండియన్స్ భవిష్యత్తు కోసమే కెప్టెన్సీలో మార్పు!
ఐపీఎల్ 2024 ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీలో మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. దాంతో సోషల్ మీడియాలో రోహిత్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. హిట్‌మ్యాన్ అభిమానులు ముంబై మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆపై కోచ్ మార్క్ బౌచర్ వ్యాఖ్యలు, రోహిత్ సతీమణి రితికా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. తాజాగా ముంబై కెప్టెన్సీ మార్పుపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. ముంబై టీమ్ భవిష్యత్తు గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుందని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. స్టార్ స్పోర్ట్స్‌తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘ముంబై జట్టు భవిష్యత్తు గురించి ఆలోచించింది. రోహిత్ శర్మకు ఇప్పుడు 36 ఏళ్లు. ఇప్పటికే అతడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. భారత జట్టుకు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా ఉన్నాడు. హిట్‌మ్యాన్‌పై ఉన్న భారాన్ని కొంత తగ్గించాలనే ఉద్దేశంతోనే హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. దీంతో ముంబైతో పాటు రోహిత్‌కు ప్రయోజనం చేకూరనుంది. రోహిత్ మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. టాప్ ఆర్డర్లో హిట్‌మ్యాన్ మరిన్ని పరుగులు రాబడితే జట్టుకు కలిసొస్తుంది. హార్దిక్ మూడు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. అప్పుడు ముంబై 200లకు పైగా స్కోరు చేసే అవకాశాలు ఉంటాయి’ అని అన్నాడు.
జై హనుమాన్ హీరోగా కెజిఎఫ్ యష్?.. డైరెక్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా హనుమాన్.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ సూపర్ హీరో చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతం చేసింది.. హనుమాన్ చిత్ర విజువల్స్ అబ్బురపరిచాయి. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్ లో ఇంత క్వాలిటీ విజువల్స్ ఏమిటని జనాలు నోరెళ్లబెట్టారు.. స్టార్ డైరెక్టర్స్ కూడా ఈ సినిమా పై ప్రశంసలు కురిపించారు.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ రూ. 300 కోట్ల వసూళ్లు రాబట్టింది. తేజ సజ్జా వంటి ఒక యంగ్ హీరో చిత్రం ఈ స్థాయి వసూళ్లు సాధించడం ఊహించని పరిణామం. కేవలం కంటెంట్ ఆధారంగా హనుమాన్ భారీ వసూళ్లు రాబట్టింది. కాగా హనుమాన్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించాడు. జై హనుమాన్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.. అయితే ఈ సినిమాలో హనుమాన్ హీరో గా కథ మొత్తం ఉంటుందని డైరెక్టర్ చెప్పారు.. ఇక ఆ పాత్ర కోసం ఒక స్టార్ హీరోను దించుతున్నట్లు చెబుతున్నారు.. హనుమాన్ లో ఫేస్ సరిగా రివీల్ చేయకపోయినప్పటికీ హనుమాన్ పాత్ర చేసింది రానా అని కథనాలు వెలువడ్డాయి. దీంతో జై హనుమాన్ హీరో రానా అని జనాలు ఫిక్స్ అయ్యారు. అయితే ఈ ప్రాజెక్ట్ హీరోగా యష్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట… భారీ బడ్జెట్ మూవీ కావడంతో యష్ ని లైన్లోకి తెస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.. కానీ ఈ వార్త మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది… త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రానుందని తెలుస్తుంది..
సీక్రెట్ గా పెళ్లి.. ఏడాది తిరక్కుండానే విడాకులు..
సెలెబ్రేటీలకు సంబంధించిన లవ్ స్టోరీలు అంటే చాలా మంది చెవులు కోసుకుంటారు.. ఆ సెలెబ్రేటీలు సీక్రెట్ లవ్ ఎఫైర్ లు, పెళ్లిళ్లు గురించి తెలుసుకోవడానికి జనాలు కూడా ఆసక్తి చూపిస్తారు. సెలబ్రిటీలు, ఫ్యాన్స్‌కు మధ్య సోషల్ మీడియా వారధిగా నిలుస్తోంది. ఈరోజుల్లో సామాన్యుల ఇళ్లల్లో జరిగే వివాహాలే ఎంతో ఆడంబరంగా జరుగుతున్నాయి. అలాంటిది.. సెలబ్రిటీల పెళ్లి అంటే మాటలా.. చాలా గ్రాండ్‌గా చేసుకుంటారు. కానీ కొందరు మాత్రం.. చాలా సీక్రెట్‌గా, సింపుల్‌గా పెళ్లి పీటలు ఎక్కి.. ఆ తర్వాత తమ మ్యారేజ్ ఫొటోలు షేర్ చేసి ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నారు. ఇటీవల చాలా జంటలు ఇదే పార్ములాను ఫాలో అవుతున్నారు.. గత ఏడాది టాలీవుడ్ బుల్లి తెర నటి ఒకరు ఇలా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. అది కూడా విదేశాల్లో. ఆమె పెళ్లి ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఆమె ఎవరో కాదు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి మెప్పించిన ప్రియాంక నల్కారి పేరు వినే ఉంటారు. .బాలనటిగా పలు సీరియళ్లలో నటించింది. ఆ తర్వాత కూడా కొన్ని సీరియల్స్‌లో కీలక పాత్రల్లో నటిస్తూ గుర్తింపు పొందింది. ఈటీవీ ప్లస్‌లో ప్రసారం అయిన ‘సినిమా చూపిస్తా మామ’ షోకి జబర్దస్త్ శ్రీనుతో కలిసి యాంకర్‌గా సందడి చేసింది. ఆ షో ప్రియాంకకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగులో సరైన అవకాశాలు లభించకపోవడంతో.. చివరికి ఆమె తమిళ ఇండస్ట్రీలోకి వెళ్లింది. అక్కడ ఆమె పలు సీరియల్స్ లో నటించి బాగా పాపులర్ అయ్యింది.. ఇదిలా ఉండగా.. తాను ప్రేమించిన అబ్బాయిని మలేషియాలోని మురుగన్ ఆలయంలో ప్రియాంక పెళ్లి చేసుకున్నసంగతి తెలిసిందే.. అయితే పెళ్ళై ఏడాది తిరక్కుండానే విడాకులు తీసుకోబోతుందనే వార్తలు ఇప్పుడు నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి.. ఇటీవల సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ మీరు, మీ భర్తతో విడిపోయారా అని ప్రశ్నించగా అవును అని సమాధానం ఇచ్చింది.. ఎందుకు విడిపోయారో మాత్రం చెప్పలేదు.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట మాత్రం వైరల్ అవుతుంది..