ఏపీ పర్యటనలో.. కలెక్టర్లు, ఎస్పీలకు సీఈసీ సీరియస్ వార్నింగ్..!
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల రెండు రోజుల పర్యటన ముగిసింది.. శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించిన సీఈసీ ప్రతినిధులు.. శనివారం సాయంత్రం తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్లిపోయారు.. అయితే, ఈ పర్యటనలో.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సీఈసీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికే 360 డిగ్రీల సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా శాంతియుత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు.. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ, సాధారణ ఎన్నికల సన్నద్ధతపై శుక్ర, శనివారాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు అధికారులు.. ఈ భేటీలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, స్వీప్ డైరెక్టర్ సంతోష్ అజ్మేరా, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా, అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరేంధిర తదితరులు పాల్గొన్నారు. ఇక, రెండు రోజుల సీఈసీ ప్రతినిధుల పర్యటనలో కీలకాంశాల ప్రస్తావనకు వచ్చాయి.. ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సీఈసీ దిశా నిర్దేశం చేసింది. ఓట్ల జాబితాలో మార్పు చేర్పులపై వచ్చిన ఫిర్యాదులను సీరియస్‌గా పరిగణించాలని కలెక్టర్లకు సీఈసీ దిశా నిర్దేశం చేసింది.. ఓటర్ల జాబితాపై పార్టీల ఫిర్యాదులను పారదర్శకంగా పరిష్కరించాలని సీఈసీ స్పష్టం చేసింది.
వైఎస్సార్ ఘాట్‌లో నివాళులర్పించిన సీఎం జగన్, కుటుంబసభ్యులు
సొంత జిల్లాలో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తన రెండో రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్సార్ ఘాట్‌కు వెళ్లారు.. మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించారు సీఎం వైఎస్ జగన్, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు వైసీపీ నేతలు.. ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు.. అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని ప్రార్థనల్లో పాల్గొంది సీఎం ఫ్యామిలీ.. ఆ తర్వాత పులివెందుల మండల నాయకులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. ఎంపీ అవినాష్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్ అమర్‌నాథ్‌రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, స్థానిక నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.. ఇక, వైఎస్సార్ ఘాట్ వద్ సీఎం వైఎస్ జగన్‌తో పాటు మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ్ రామరాజు, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మేయర్ సురేష్ బాబు సహా తదితరులు నివాళులు అర్పించారు. మరోవైపు.. నేడు సింహాద్రిపురంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు సీఎం వైఎస్ జగన్..
ఎవరు ఎవరిని తెచ్చుకున్నా గెలిచేది వైసీపీనే.. జగన్ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు..
ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు-ప్రశాంత్ కిషోర్ భేటీ హాట్ టాపిక్‌గా మారింది.. అయితే, ఎంతమంది చంద్రబాబు కలిసి వచ్చినా.. వైఎస్ జగన్‌ను ఏమీ చేయలేరు.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే అంటున్నారు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు.. ఇక, గుంటూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి విడుదల రజిని.. ఎవరు ఎవరిని తెచ్చుకున్నా ఇక్కడ గెలిచేది వైసీపీనే అని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇస్తున్న భరోసాతో ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారన్న ఆయన.. ఎవరికి మద్దతు ఇవ్వాలో ప్రజలు డిసైడ్ అయిఉన్నారు.. ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకే ఉన్నాయన్నారు. ఇక, పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజల కష్టాలు చూశారని తెలిపారు మంత్రి రజిని.. వాళ్ల బాధలు తీర్చడానికే నవరత్నాలు అని మేనిఫెస్టో రూపొందించారన్న ఆమె.. ఈ రాష్ట్రంలో బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు, ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యత చూసి ప్రతి ఒక్కరు సీఎంను తమ కుటుంబ సభ్యుడిగా చూసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ విధానంపై , ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు.. వైసీపీకి, వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. టీడీపీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మరోసారి జగన్ ని దీవించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు మంత్రి విడుదల రజిని.
సీఎం జగన్ క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు.. ఆడుదాం ఆంధ్రా స్ఫూర్తి నింపుతుంది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు.. ఆడుదాం ఆంధ్రా యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతుందని తెలిపారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు.. ఆడుదాం – ఆంధ్రా విజయవంతం చేయాలంటూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, వైసీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ.. విజయవాడ పరిధిలో 33 వేల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 4500 టీమ్ లు ఎంపికయ్యాయని తెలిపారు. ఇక, డిసెంబర్ 26 నుంచి 45 రోజులు పాటు ఆడుదాం ఆంధ్రా సాగుతుందని పేర్కొన్నారు.
వైరల్‌గా మారిన మడకశిర తహసీల్దార్ వీడియో..
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ప్రకారం.. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర తహసీల్దార్ ముర్షావలి కలిశాడు మెలవాయి పంచాయతీకి చెందిన ఓ రైతు.. తన సొంత పొలం సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. మీ కింది స్థాయి అధికారులు డబ్బులు లేనిదే పని చేయడం లేదని ఆవేదన వెల్లబోసుకున్నాడు ఆ రైతు.. ఇక, ఆ రైతు మాటలకు స్పందించిన తహసీల్దార్.. వెటకారంగా మాట్లాడుతూ.. సీఎం లాంటివారే డబ్బులు తీసుకుని ఫ్రాడ్ చేస్తున్నారు.. మేమెంత? అని ప్రశ్నించాడు.. మాపై అధికారులు మాకు డబ్బులు ఇవ్వరు.. అందుకు మీలాంటి రైతుల దగ్గర తీసుకొని పై అధికారులు వచ్చినప్పుడు ఖర్చు చేస్తుంటాం అని చెప్పుకొచ్చాడు.. ఈ నెల 13వ తేదీన టెక్స్టైల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీత వచ్చినప్పుడు వారి భోజనం కోసం అయినా ఖర్చు లక్షా 70 వేల రూపాయలు అయ్యిందన్నారు.. అంతేకాదు, ఆయనకు వాళ్లు పెట్టిన మెనూ కూడా చూపిస్తూ.. మడకశిరలో దొరకకపోతే మరో ప్రాంతం నుంచి తెప్పించాల్సి వచ్చిందంటూ రుబాబు చూపించారు. ఆ ఖర్చుకు నా జీతం డబ్బులు ఇవ్వాలా? అని ప్రశ్నించాడు.. రైతులతో డబ్బులు తీసుకొని పని చేసి పెడుతుంటాం.. పై స్థాయి అధికారులు వచ్చినప్పుడు వాటికి ఖర్చు పెడతాం.. అంతేకానీ, నేను, కింద వీఆర్వోలు ఖర్చు చేయాలంటే ఎలా అవుతుంది అంటూ ఆ రైతుకు సమాధానం చెప్పాడు.. ఎవడికి మా బాధ అర్థం కాదు.. మేం చెప్తేనే బయటకు తెలుస్తుంది.. ఏమన్నా అంటే లంచం తీసుకుంటున్నారు అంటారంటూ.. తాను చేసే పనిని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు మడకశిర తహసీల్దార్ ముర్షావలి.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాకు ఎక్కి చక్కర్లు కొడుతుండడంతో.. అతడిని పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.
‘శ్వేతపత్రం’ తప్పుల తడక.. కాంగ్రెస్ ప్రభుత్వం మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది: కేటీఆర్
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ‘శ్వేతపత్రం’ తప్పుల తడక అని, అబద్ధాల పుట్ట అని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్దేశ పూర్వకంగానే బీఆర్ఎస్ పాలనను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రక్తాన్ని రంగరించి రాష్ట్రాన్ని ప్రగతి పధం వైపు నడిపించామని, విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లిన ఘనత తమ పార్టీది అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన ఆరోపణలు, విమర్శలకు అసెంబ్లీ వేదికగా తాము దీటుగా సమాధానం చెప్పామని చెప్పుకొచ్చారు. తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ.. తెలంగాణ భవన్‌లో స్వేదపత్రం పేరిట కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంకు కౌంటర్‌గా బీఆర్‌ఎస్ స్వేదపత్రం విడుదల చేసింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ… ‘అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. వాయిదా వేసుకొని పోయారు. బాధ్యతగల పార్టీగా స్వేదపత్రం విడుదల చేస్తున్నాం. కోట్ల మంది చెమటతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే ఈ స్వేదపత్రం. కొత్తరాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత రక్తాన్ని రంగరించి రాష్ట్రాన్ని ప్రగతి పధం వైపు నడిపించాం. విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లిన ఘనత మాది. 60 ఏళ్ల గోస 10 ఏళ్లలో మాయం చేసి చూపించాం. రాష్ట్రం ఏర్పడక ముందు అన్ని రంగాల్లోనూ తెలంగాణపై వివక్ష నెలకొంది. ఇప్పుడు సమృద్ధివైపు తెలంగాణ అడుగులు వేసింది’ అని అన్నారు.
హిందీపై డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. వాళ్లు టాయిలెట్లు క్లీన్ చేస్తారు..
హిందీ భాషపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తూనే ఉంది.. మరీ ముఖ్యంగా తమపై హిందీని బలవంతంగా రుద్దవద్దని దక్షిణ భారత్‌లోని రాష్ట్రాలు పలు సందర్భాలు స్పష్టం చేశాయి.. ఇదే సమయంలో.. కొన్నిసార్లు హిందీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.. తాజాగా, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.. ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. హిందీని తక్కువగా చేసి చూపించే ప్రయత్నం చేశారు.. అందులో భాగంగా.. హిందీ భాష మాట్లాడే ఉత్తరప్రదేశ్, బిహార్‌కు చెందిన వ్యక్తులు తమిళనాడులో టాయిలెట్లు కడుతున్నారు.. రోడ్లు శుభ్రం చేస్తున్నారని పేర్కొన్నారు.. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. కొందరు సపోర్ట్ కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు దయానిధి మారన్‌పై ఫైర్ అవుతున్నారు.. తమిళనాడుకు వచ్చే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల వాసులు.. హిందీ మాట్లాడేవారు.. ఇక్కడ నిర్మాణ పనులు లేదా రోడ్లు, మరుగుదొడ్లు శుభ్రం చేయడం వంటి నీచమైన పనులు చేస్తుంటారని మారన్ వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్ నేర్చుకున్నవారు ఐటీ ఉద్యోగాల్లో చేరితే హిందీ నేర్చుకున్నవారు చిన్న కొలువుల్లో చేరుతున్నారని అన్నారు. ఇక, ఆ వీడియోపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహబాద్ పూనావాలా స్పందిస్తూ.. దేశాన్ని ఉత్తర, దక్షిణ, భాష, కులం, మతం ఆధారంగా విభజించాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.. ఎంపీ దయానిధి మారన్ వాడిన భాష దురదృష్టకరం అన్నారు. మొదట రాహుల్ గాంధీ ఉత్తర భారత ఓటర్లను అవమానించారు. కొందరు బీహార్ డీఎన్ఏను దుర్భాషలాడారు. అప్పుడు డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ “గౌమూత్ర రాష్ట్రాలు” అన్నారు. ఇప్పుడు దయానిధి మారన్ హిందీ మాట్లాడేవారిని, ఉత్తరాది వారిని అవమానించాడు. సనాతన ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, ఆపై విభజించి రూల్ కార్డ్ ప్లే చేయడం ఇండియా కూటమి యొక్క డీఎన్‌ఏ.. నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్, లాలూ యాదవ్, అఖిలేష్ యాదవ్ ఇలాంటి వ్యాఖ్యలపై స్పందించరా? వారు ఎప్పుడు స్టాండ్ తీసుకుంటారు? అంటూ బీజేపీ నాయకుడు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
శబరిమలకు పోటెత్తిన భక్తులు.. ఎరుమేలిలో భారీగా ట్రాఫిక్ జామ్!
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం శబరిమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగిపోతోంది. అయ్యప్ప స్వామిని దర్శించుకోవటానికి వస్తున్న భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఓ వైపు వర్షాలు, చలి పెడుతున్నా.. అయ్యప్ప భక్తులు మాత్రం స్వామిని దర్శనం చేసుకోవటానికి వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం కేరళలో భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, యూపీ నుంచి లక్షలాది మంది అయ్యప్ప దీక్షాపరులు, భక్తులు శబరిగిరులకు చేరుకుంటున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎఎరుమేలికి 4 కిలోమీటర్ల ముందే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ దృష్ట్యా కొందరు ఎరుమేలి నుంచి శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్నారు. స్వామి వారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది.
మరో సంచలనం సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు!
ఇంగ్లండ్‌పై చారిత్రక టెస్ట్ విజయంతో ఫుల్‌జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టు.. మరో సంచలనం నెలకొల్పింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో మరోరోజు ఆట మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసింది. భారత మహిళలకు ఆస్ట్రేలియా జట్టుపై మొట్టమొదటి టెస్టు గెలుపు ఇదే కావడం విశేషం. దాంతో భారత ప్లేయర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. భారత్‌తో ఏకైక టెస్టు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ముంబైకి వచ్చింది. డిసెంబరు 21న మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై చెలరేగిన భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 219 పరుగులకే ఆలౌట్ చేశారు. తహ్లియా మెక్‌గ్రాత్ (50) టాప్ స్కోరర్. పూజా వస్త్రాకర్ 4, స్నేహ్ రాణా 3 , దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు. ఆపై భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 406 పరుగులకు ఆలౌట్ అయి భారీ ఆధిక్యంలో నిలిచింది. స్మృతి మంధాన (74), జెమీమా రోడ్రిగ్స్ (73), రిచా ఘోష్ (52), దీప్తి శర్మ (78) హాఫ్ సెంచరీలు చేశారు.
క్రికెట్ లోకి అడుగుపెట్టిన గేమ్ ఛేంజర్… ఏకంగా టీమ్ కొనేసాడు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. 2024 సెప్టెంబర్ రిలీజ్ ని టార్గెట్ చేస్తూ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే చరణ్, బుచ్చిబాబుతో RC16 రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నాడు. బుచ్చిబాబు రామ్ చరణ్ ఫ్రీ అవ్వగానే ఆర్సీ 16 షూటింగ్ ని స్టార్ట్ చేసేలా ప్రీప్రొడక్షన్ వర్క్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నాడు. రెహ్మాన్ మ్యూజిక్ తో తెరకెక్కనున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలు తప్ప చరణ్ లైనప్ లో ఉన్న ఇతర సినిమాల వివరాలు ఇంకా బయటకి రాలేదు. సుకుమార్, ప్రశాంత్ నీల్, లోకి… ఇలా దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఏదీ అఫీషియల్ గా అనౌన్స్ అవ్వలేదు. చరణ్ సినిమాల విషయం కాసేపు పక్కన పెడితే… చరణ్ స్పోర్ట్స్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ తో పాటు చరణ్ కూడా ఒక క్రికెట్ టీమ్ కి ఓనర్ అయ్యాడు. ISPL-T10 (ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ – T10)లో హైదరాబాద్ క్రికెట్ జట్టుని చరణ్ కొన్నాడు. ఐపీఎల్ టీ20 అయితే ఐఎస్పీఎల్ 10 ఓవర్లు మాత్రమే ఉంటుంది. 2024 మార్చ్ 2 నుంచి మొదలవనున్న ఈ ప్రీమియర్ లో చరణ్ టీమ్ ఆడనుంది. స్టీట్ టు స్టేడియమ్ అనే స్లోగన్ తో ఈ ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ ని ఓపెన్ చేసారు. మరి ఈ బిజినెస్ లో చరణ్ ఎంతవరకు సక్సస్ అవుతాడు అనేది చూడాలి.
5 మిలియన్ డాలర్స్… మూడు రోజుల్లో కెరీర్ బెస్ట్
రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పించే పనిలో ఉన్నాడు. కాటేరమ్మ రాలేదు అందుకే కొడుకుని పంపింది అనే డైలాగ్ తో గూస్ బంప్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, సలార్ సినిమాతో మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసాడు. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలార్ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ట్రేడ్ వర్గాల ప్రిడిక్షన్ ప్రకారం రెండు రోజుల్లో దాదాపు 330 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది సలార్ సినిమా. డే 2 అలొమ్స్ 150 కోట్ల కలెక్షన్స్ రావడంతో 2023లో రిలీజైన మిగిలిన సినిమాల డే 1 కన్నా సలార్ డే 2 ఎక్కువ అయ్యింది. ఫైనల్ రిపోర్ట్స్ హోంబలే ఫిల్మ్స్ నుంచి ఇంకా అఫీషియల్ గా బయటకు రాలేదు. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ అఫీషియల్ గా బయటకి రాలేదు కానీ ఓవర్సీస్ రిపోర్ట్ మాత్రం వచ్చేసింది. నార్త్ అమెరికాలో సలార్ సినిమా ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది. ప్రీమియర్స్, డే 1 కలిపి సలార్ సినిమా 4 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. రెండో రోజు ఎండ్ అయ్యే సరికి సలార్ సినిమా నార్త్ అమెరికాలో 5 మిలియన్ డాలర్స్ ని క్రాస్ చేసింది. ఈరోజు ఎండ్ అయ్యే లోపు సలార్ సినిమా 5.5 మిలియన్ డాలర్స్ కి చేరువలో ఉండే అవకాశం ఉంది. ఇది ప్రభాస్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ డే ప్రీమియర్ కలెక్షన్స్ అనే చెప్పాలి. నార్త్ అమెరికాలో సలార్ సినిమా ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్ చేసింది. సాలిడ్ నంబర్ ఆఫ్ షోస్ సలార్ సినిమాకి దక్కేలా చేసిన ప్రత్యంగిరా సినిమాస్ సోషల్ మీడియాలో హోంబలే ఫిల్మ్స్ కన్నా యాక్టివ్ గా ఉండి ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నారు. బుల్డోజర్ బాక్సాఫీస్ ని దున్నేస్తుంది అంటూ ట్వీట్స్ చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్ ప్రభాస్ కి నాన్ స్టాప్ ఎలివేషన్స్ ఇస్తూనే ఉన్నారు.
రీజనల్ కింగ్ కి సోలో రిలీజ్ పడితే రికార్డ్స్ లేస్తాయ్
2024 సంక్రాంతి సీజన్ లో స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉన్నాయి. ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి హను మాన్, ఈగల్, నా సామీ రంగ, లాల్ సలామ్, అయలాన్, సైంధవ్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయి. తమ సినిమాకి డబ్బులు రావాలి, పండగ అంటే ఎక్కువ రోజులు సెలవలు వస్తాయి అని అలోచించి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయడంలో తప్పులేదు కానీ ఈ రేసులో మహేష్ బాబు కూడా ఉన్నాడు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. త్రివిక్రమ్ తో కలిసి గుంటూరు కారం సినిమాతో జనవరి 12న ఆడియన్స్ ముందుకి రానున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాపై గ్లిమ్ప్స్ తోనే అంచనాలు పెంచేసిన మేకర్స్, బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్స్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. షూటింగ్ ఫైనల్ స్టేజస్ లో ఉన్న గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలకి థియేటర్స్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సింపుల్ గా చెప్పాలి అంటే సంక్రాంతి సినిమాలన్నీ కలిసి పోటీ పడేది కేవలం మహేష్ బాబుతోనే… నెల రోజుల క్రితం వరకూ గుంటూరు కారం సినిమా రిలీజ్ అవ్వదులే అనే డౌట్ ఉండడంతో రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు మిగిలిన సినిమాల నిర్మాతలు. మహేష్ రావడం పక్కా అంటే థియేటర్స్ విషయంలో ఇబ్బందులు రావడం గ్యారెంటీ. ఇటీవలే ప్రొడ్యూసర్స్ అంతా కలిసి కూర్చోని రిలీజ్ డేట్ విషయంలో ఒక క్లారిటీకి వచ్చినట్లు టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే గుంటూరు కారం సినిమాకి సోలో రిలీజ్ దక్కేలా ఉంది. జనవరి 12న గుంటూరు కారం సోలో రిలీజ్ కి లైన్ క్లియర్ అయినట్లు ఉంది. ఇదే రోజు రిలీజ్ కానున్న హనుమాన్ మూవీ జనవరి 12 నుంచి ఒక రోజు ముందుకి జనవరి 11న రిలీజ్ అయ్యేలా ఉంది. ఈ విషయంలో అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కానీ దాదాపు గుంటూరు కారం సినిమాకి జనవరి 12న సోలో రిలీజ్ దక్కడం గ్యారెంటీ. ఇదే జరిగితే సంక్రాంతి పండగని మహేష్ బాబు రెండు రోజుల ముందే మొదలుపెట్టడం పక్కాగా… సోలో రిలీజ్ తో పాటు గుంటూరు కారం సినిమాకి హిట్ టాక్ పడిందో మహేష్ బాబు వన్ సైడ్ చేసేస్తాడు.