పోటీ నుంచి తప్పుకున్న భార్య..! దువ్వాడకు లైన్ క్లియర్
శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది.. దువ్వాడకు ఇంటి పోరు తప్పేలా లేదు అనే ప్రచారం జోరుగా సాగింది.. ఆయనపై సొంత భార్య దువ్వాడ వాణి పోటీకి సిద్ధం కావడమే దీనికి ప్రధానం కారణం.. తాను స్వతంత్ర అభ్యర్థిగా తాను బరిలోకి దిగుతానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య, జెడ్పీటీసీ సభ్యురాలైన దువ్వాడ వాణి.. తన అనుచరుల సమక్షంలో ప్రకటడం.. కలకలం రేపింది.. ఆమె ప్రకటించిన ప్రకారం.. ఈ నె 22న అంటే సోమవారమే నామినేషన్ వేయాల్సి ఉంది… కానీ, నామినేషన్ వేయడంపై వెనక్కి తగ్గారట దువ్వాడ వాణి.. టెక్కలిలో వైసీపీ రెబల్ అభ్యర్థిగా 22న నామినేషన్ వేసేందుకు రెడీ అన్న దువ్వాడ వాణి.. ఇప్పుడు పోటీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అయితే, తమ టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటిపోరుపై దృష్టి పెట్టిన వైసీపీ అధిష్టానం.. రంగంలోకి దిగి దువ్వాడ వాణితో మంతనాలు జరిపిందట.. దువ్వాడ వాణిని బుజ్జగించినట్టు టాక్ వినిపిస్తోంది.. ఈ నేపథ్యంలోనే దువ్వాడ వాణి వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది.. ఇక, తన భార్య పోటీకి దూరంగా ఉంటానని చెప్పడంతో.. దువ్వాడ శ్రీనివాస్ కు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది.. మొత్తానికి భర్తపై భార్య పోటీ లేనట్టే అన్నమాట.. తాజా పరిణామాలతో టెక్కలి నియోజకవర్గం వైసీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తుందంటున్నారు.
టీ కోసం పెళ్లి ఇంట ఘర్షణ.. బీరు సీసాలు, కర్రలతో దాడి.. చివర్లో ఊహించని ట్విస్ట్..!
పెళ్లికూతురు ఇంట్లో భోజనాలు సరిగా పెట్టలేదని.. మాంసం వడ్డించలేదని.. మర్యాద సరిగా చేయలేదని గొడవలు జరుగుతుంటాయి. కానీ, టీ పోయలేదని ఇరువర్గాలు గొడవ పడ్డ ఘటన ఖమ్మంలో జరిగింది. ఖమ్మం ప్రకాష్ నగర్ కు చెందిన యువతికి చెరువుబజార్ కు చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. దీంతో పెళ్లి కూతురి ఇంటి వద్ద పూజలకు పెళ్లి కొడుకు తరపు బంధువులు వెళ్లారు. అయితే, అక్కడ వారికి టీ పోయలేదని చిన్న బుచ్చుకుని మనసులో పెట్టుకున్నారు. అనంతరం అందరూ భోజనాలు చేశాక ఊరేగింపులో నృత్యాలు చేస్తున్నారు. ఆ సమయంలోనే సాయంత్రం తమకు టీ పోయలేదని, మర్యాద చేయడం రాదంటూ వరుడి తరఫు వారు అలకబూనారు.. దానికి వధువు తరుపు బంధువులు ‘టీ ఎందుకు.. మీకు ఏకంగా మందు పోశాం.. భోజనాలు కూడా పెట్టాంగా అని గొడవకు దిగడంతో.. పరస్పరం దాడి చేసుకొని బీరు సీసాలతో కొట్టు కొట్టుకున్నారు.. ఈ ఘర్షణలో ఇద్దరి తలలు పగిలాయి, నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఖమ్మం త్రీటౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సర్దిచెప్పేందుకు యత్నించినా.. వారి ముందే కర్రలతో కొట్టుకుపోవడంతో పోలీసులు చేసేదేంలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.. ఇంతా జరిగాకా.. పెళ్లి ఎలా జరుగుతుందో అని బంధువులు అంతా ఆందోళన చెందారు. కానీ, ఇరువైపుల పెద్దలు సర్దిచెప్పటంతో ప్రశాంతంగా పెళ్లి వేడుక ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు..
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మా వైఖరి ఇదే.. స్పష్టం చేసిన సీఎం జగన్
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విశాఖపట్నం జిల్లా ఎండాడ నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు. విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యను సీఎంకు నివేదించారు కార్మిక సంఘాల నాయకులు. ఇక, ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడిన సీఎం.. రాష్ట్ర ప్రభుత్వం, వైయస్సార్పీపీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.. ఈ సమస్యపైమొదటిసారిగా కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే గళమెత్తింది.. తొలిసారిగా ప్రధానికి లేఖ కూడా రాశామని గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్ కర్మాగారం అంశంపై పరిష్కారాలు కూడా సూచించాం అన్నారు సీఎం జగన్.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం .. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలది రాజీలేని ధోరణి.. ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పుడు జట్టుకట్టాయి, కూటమిగా ఏర్పడ్డాయి.. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షాలు నైతికతను, విలువలను విడిచిపెట్టాయి.. స్టీల్ ప్లాంట్ విషయంలో వారి వైఖరి ఏంటో బయటపడిందని దుయ్యబట్టారు. శాశ్వతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయింపుతో ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు సీఎం.. మిగతా అంశాలు దీనివల్ల పరిష్కారం అవుతాయి.. విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాం.. కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి తీసుకు వస్తూనే ఉన్నాం.. ఈ ఎన్నికల్లో కార్మికుల మద్దతు కోరే నైతికతక వైయస్సార్సీపీకే ఉంది.. పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని కోరారు సీఎం వైఎస్ జగన్.
నా గురించి తప్పుగా మాట్లాడితే ప్రజలే ఓట్లతో సమాధానం ఇస్తారు
సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. టీడీపీపై హాట్ కామెంట్లు చేశారు.. రాత్రికి రాత్రి చంద్రబాబుతో కలిసి ఇక్కడ మనం గెలిపించిన వ్యక్తి మనపై పోటీ చేస్తున్నాడు.. చంద్రబాబు సత్యవేడు ను గెలిపించడం కాదు, ముందు కుప్పంలో గెలవాలి అని సవాల్ చేశారు.. నా పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే టీడీపీకి ఓట్లు పోతాయని హెచ్చరించారు. మేం వద్దు అనుకున్న అభ్యర్థిని నువ్వు టీడీపీ నుండి నిలబబెట్టావు.. టీడీపీకి అభ్యర్థులు లేక ఇక్కడ మనం వద్దనుకున్న వారిని పెట్టుకున్నారు అని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన అన్ని హామీలు పూర్తి చేశారు అని తెలిపారు పెద్దిరెడ్డి.. చంద్రబాబు 2014లో 100 పేజీల మేనిఫెస్టో, 600 హామీలు ఇచ్చారు.. ఒక్క హామీ అయినా చంద్రబాబు నెరవేర్చాడా ? అని నిలదీశారు. కొత్తగా సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు తిరుగుతున్నారు.. ఎవరు మాటపై నిలబడుతారో ప్రజలు గుర్తించాలని సూచించారు. చంద్రబాబు నా గురించి మాట్లాడిన మాటలకు సత్యవేడు ప్రజలు ఓట్ల రూపంలో సమాధానం ఇస్తారని హెచ్చరించారు. రాత్రికి రాత్రి పార్టీ మారిన వ్యక్తిని టీడీపీలో ఎవరు ఆదరిస్తారు? అని ప్రశ్నించారు. ఇన్ని సంవత్సరాలు వైసీపీ వారితో సేవలు చేయించుకుని టీడీపీకి వెళ్లావు.. కచ్చితంగా ఇక్కడ టీడీపీకి ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
వైసీపీ గూటికి బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్..
ఓ వైపు మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారం ఉధృతం చేసిన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మరోవైపు ఇతర పార్టీలకు చెందిన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.. వైసీపీ కండువా కప్పి.. ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం పనిచేయాలని దిశానిర్ధేశం చేస్తున్నారు.. ఇక, విశాఖపట్నం జిల్లా ఎండాడ ఎంవీవీ సిటీ నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో మరికొందరు ఇతర పార్టీల నేతలను వైసీపీ గూటికి చేరారు.. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు పలువురు నేతలు.. భారతీయ జనతాపార్టీ గాజువాక నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్ ప్రకాష్ రావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవింద్, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి, సంపత్ కుమార్.. ఇక, టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు యువజన విభాగం నేత ఏఎన్ఆర్.. వైసీపీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ కార్యక్రమంలో మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్ధి గుడివాడ అమర్నాథ్ సహా పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.
రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపు (24న) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నట్లు వెల్లడించారు. పలితాల కోసం https:// tsbie. cgg. gov. in లేదా https:// results. cgg. gov. in వెబ్‌సైట్‌లోనూ చెక్ చేసుకోవచ్చని తెలిపారు. అయితే.. తొలుత ఫలితాలు ఇవాళ (మంగళవారం) విడుదల చేయాలని భావించారు. కానీ పలు కారణాలవల్ల మంగళవారం కుదరదని రేపు (బుధవారం) ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక.. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో.. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,43,993 మంది ఉన్నారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 46,542 మంది విద్యార్థులు ఉన్నారు.
రేపటి నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సుయాత్ర..
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే.చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర రేపు (బుధవారం) 24వ తేదీన ప్రారంభం కానుంది. ఈ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది. సుమారు 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. మిర్యాలగూడలో ప్రారంభమైన యాత్ర సిద్దిపేటలో బహిరంగ సభతో ముగియనుంది. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభించారు. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం, ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు. తమ నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ బస్సుయాత్ర చేయాలని వివిధ నియోజకవర్గాల నేతల నుంచి డిమాండ్ ఉంది. అయితే సమయాభావం, ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకుని పలు నియోజకవర్గాల్లో మాత్రమే బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. కేసీఆర్ యాత్ర పొడవునా 100 మందికి పైగా వాలంటీర్లు వాహన శ్రేణి వెంట రానున్నారు. ఇప్పటికే ఎంపికైన వారికి సోమవారం తెలంగాణ భవన్‌లో అవగాహన కల్పించారు. తొలిరోజైన బుధవారం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముందుగా తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ క్యాడర్, నేతలతో భేటీ కానున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తొలిరోడ్డు షోలో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, ప్రజలు ఉత్సాహంగా, స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకు వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ప్రజలు పెద్దఎత్తున నిలబడి ప్రసంగాన్ని దూరం నుంచి వినేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రజల్లో భారీ స్పందన వస్తుందని స్పష్టంగా భావిస్తున్నారు.
క్షమాపణ మీ ప్రకటనల పరిమాణంలో ఉందా?.. రామ్‌దేవ్ బృందానికి సుప్రీంకోర్టు చురకలు
పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు (పీటీఐ)పై విచారణ కోసం యోగా గురు రామ్‌దేవ్ సుప్రీంకోర్టుకు వచ్చారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలపై సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా పతంజలి ఆయుర్వేద్, 67 వార్తాపత్రికల్లో క్షమాపణలు ప్రచురించామని, కోర్టు పట్ల తమకు అత్యంత గౌరవం ఉందని, తమ తప్పులు పునరావృతం కాబోవని పేర్కొంది. పతంజలి వార్తాపత్రికలలో పెట్టిన క్షమాపణ పరిమాణం దాని ఉత్పత్తులకు సంబంధించిన పూర్తి పేజీ ప్రకటనలను పోలి ఉందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రకటనలో, “మా న్యాయవాదులు సుప్రీంకోర్టులో ప్రకటన చేసిన తర్వాత కూడా ప్రకటనలను ప్రచురించడం, విలేకరుల సమావేశం నిర్వహించడం తప్పు” అని పతంజలి క్షమాపణలు కోరింది. పతంజలి ప్రకటనల కోసం రూ. 10 లక్షలు ఖర్చయిందని సుప్రీంకోర్టులో పేర్కొంది. సుప్రీంకోర్టు విచారణకు ముందు వారం రోజుల తర్వాత ఎందుకు క్షమాపణలు చెప్పారని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. “క్షమాపణ మీ ప్రకటనల పరిమాణంలోనే ఉందా?” జస్టిస్ హిమా కోహ్లి అన్నారు. బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు.
దానిపై బావ కన్నేశారు.. రాహుల్‌జీ తొందరగా కర్చీఫ్ వేయండి..
ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి లోక్‌సభ స్థానానికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.. ఇక్కడి నుంచి ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని జోరుగా ప్రచారం కొనసాగుతుంది. దీనిపై బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ స్పందించింది. పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె రాహుల్ గాంధీపై విమర్శలు కురిపించింది. పోలింగ్‌కు ఇంకా 27 రోజులే సమయం ఉంది.. కానీ, కాంగ్రెస్ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించకలేదని ఎద్దేవా చేసింది. ఈ స్థానంపై రాహుల్ గాంధీ బావ (రాబర్ట్ వాద్రా) కన్నేశాడు.. ఇప్పుడు ఆయన ఏం చేస్తారో? చూడాలని తెలిపింది. ఒకప్పుడు ప్రజలు బస్సుల్లో వెళ్లే సమయంలో సీట్ల కోసం కర్చీఫ్ వేసుకునేవారు.. కానీ, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అమేథిలో సీటును బుక్ చేసుకునేందుకు కర్చీఫ్ వేస్తారేమోనంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎద్దేవా చేసింది.
హనుమంతుడి చేతిలో ఇన్సులిన్ పెట్టి శోభాయాత్ర.. ఆప్ తీరుపై నెటిజన్లు ఫైర్
హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. హనుమంతుడి చేతిలో ఇన్సులిన్ పెట్టి శోభాయాత్ర చేయడం పట్ల నెటిజన్లు, హిందుత్వ వాదులు ఫైర్ అవుతున్నారు. ఆమ్ పార్టీ లీడర్, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ పాల్గొన్న ఈ ర్యాలీలో హనుమంతుడి వేషాధారణలో ఉన్న వ్యక్తి రెండు చేతుల్లో ఇన్సులిన్ బాటిళ్లు పట్టుకున్నాడు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సోమవారం తిహార్ జైలులో ఇన్సులిన్ డోస్ ఇచ్చిన విషయం తెలిసిందే. జైలులో ఉన్న ఆయనకు షుగల్ లెవల్స్ 320కి పెరగడంతో ఆయనకు ఇన్సులిన్ ఇచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇస్తే హనుమంతుడి చేతిలో ఇన్సులిన్ పెట్టి శోభాయాత్ర చేయడం ఏంటని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
రిజర్వేషన్లు రద్దు, మతం ఆధారంగా విభజించడం జరగదు..
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రచారంలో బిజీబిజీగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తనదైన శైలిలో విపక్షాలపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ (మంగళవారం) రాజస్థాన్‌లోని టోంక్- సవాయి మాధోపూర్‌లో జరిగిన మీటింగ్ లో మోడీ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే.. నేటికి అక్కడ జవాన్లపై రాళ్ల దాడులు కొనసాగుతునే ఉండేవి అన్నారు. ప్రజలు మెచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం తీసుకొచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మన సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు జరిగేది కాదని నరేంద్ర మోడీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే దేశంలో ఎక్కడో ఒక చోట బాంబు పేలుళ్లు జరిగేవన్నారు. రాజస్థాన్ లో వరుస పేలుళ్ల నిందితులను కాంగ్రెస్ కాపాడి పాపానికి పాల్పడిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే అవినీతికి కొత్త మార్గాలను అన్వేషిస్తుంది.. కాంగ్రెస్ హయాంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలు రాజస్థాన్ నెంబర్-1 స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. అలాగే, తనకు దేశ ప్రజలందరి ప్రేమ, ఆశీస్సులు, ఉత్సాహం లభించాయని ప్రధాని మోడీ చెప్పారు. ఈ రోజు హనుమాన్ జయంతి శుభ సందర్భంగా.. ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని నరేంద్ర మోడీ వెల్లడించారు.
‘నథింగ్’ నుంచి 2 కొత్త ఇయర్‌బడ్స్.. 40 గంటల బ్యాటరీ లైఫ్!
వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పై స్థాపించిన ‘నథింగ్’ నుంచి రెండు కొత్త ఇయర్‌బడ్స్ భారత్ మార్కెట్‌లో లాంచ్ అయ్యాయి. నథింగ్ ఇయర్, నథింగ్ ఇయర్ ఏ పేరిట కంపెనీ వీటిని ఆవిష్కరించింది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే ఈ ఇయర్‌బడ్స్‌ను ఆకర్షణీయమైన డిజైన్‌తో నథింగ్ తీసుకొచ్చింది. ఏప్రిల్ 22 నుంచి విక్రయాలు ఆరంభం కానున్నాయి. ప్రారంభ ఆఫర్ కింద కొనుగోలు చేసినవారికి నథింగ్ ఇయర్‌ను రూ.10,999, ఇయర్ ఏను రూ.5,999కే పొందవచ్చు. నథింగ్ నుంచి వచ్చిన ఈ రెండు ఇయర్‌బడ్స్‌కు సంబందించిన వివరాలను ఓసారి పరిశీలిద్దాం. నథింగ్ ఇయర్ ధర రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. ఇవి బ్లాక్, వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ఇందులో 11mm డ్రైవర్స్ అమర్చారు. 45 డీబీ వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఇంటెలిజెంట్ నాయిస్ క్యాన్సిలింగ్ సదుపాయం ఉంది. ఇందులో కేస్‌ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 40.5 గంటల ప్లే బ్యాక్ టైమ్ ఇస్తాయి. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 10 గంటలు వాడుకోవచ్చని కంపెనీ పేర్కొంది. 2.5W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయడంతో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉందని కంపెనీ తెలిపింది. దీన్ని 90 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. నథింగ్ ఇయర్ ఏ ధర రూ.7,999గా ఉంది. ఇవి ఎల్లో, బ్లాక్, వైట్ రంగుల్లో లభ్యమవుతాయి. 45 డీబీ వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయం ఇందులో ఉంది. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఉంటుంది. క్యారీ కేస్ 500mAh బ్యాటరీ, ఇయర్‌బడ్స్‌లో 46mAh యూనిట్ ఇచ్చారు. ఈ ఇయర్‌బడ్స్‌ను ఒకసారి ఫుల్ ఛార్జి చేస్తే 42.5 గంటల ప్లే బ్యాక్ టైమ్ ఇస్తాయి. 10 నిమిషాల ఛార్జింగ్‌తో పది గంటలు పని చేస్తాయి.
భారత్ భయం లేకుండా ఆడాలి.. ఓపెనర్లుగా వారిద్దరే కరెక్ట్: దాదా
టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ ఎలాంటి భయం లేకుండా ఆడాల్సిన అవసరం ఉందని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ప్రపంచకప్ కోసం జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్లేయర్లను ఎంపిక చేయాల్సిన బాధ్యత బీసీసీఐ సెలక్షన్ కమిటీ, కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మపై ఉందన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ కలిసి ఓపెనింగ్‌కు దిగితే బాగుంటుందని తాను భావిస్తున్నానని దాదా పేర్కొన్నారు. ఐపీఎల్ 2024 అనంతరం జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లో పొట్టి టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. సోమవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ… ‘టీ20 ప్రపంచకప్ 2024కు జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్లేయర్లను ఎంపిక చేయాల్సిన బాధ్యత బీసీసీఐ సెలక్షన్ కమిటీ, కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మపై ఉంది. మెగా టోర్నీలో రోహిత్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్‌కు దిగితే బాగుంటుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. సెలెక్టర్లు కచ్చితంగా ఇలాగే చేయాలని నేను సూచించడం లేదు. తుది నిర్ణయం బీసీసీఐ సెలెక్టర్లదే. ప్రపంచకప్‌లో భారత్ ఎలాంటి భయం లేకుండా ఆడాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లి.. దేవరకొండ స్వీట్ సర్ప్రైజ్
రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకి యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అసలు పెద్దగా సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చిన విజయ్ చాలా కాలం ఎన్నో కష్టాలు పడి ఈరోజు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు అందరూ గుర్తించుకునే స్థాయికి వచ్చాడు. సాధారణ కుటుంబం నుంచి రావడంతో విజయ్ కి ముందు నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే విజయ్ చేసే పనులు మాత్రం ఊహాతీతం. కరోనా సమయంలో మిడిల్ క్లాస్ ఫండ్ ఇవ్వడం మొదలు ప్రతి ఏటా పుట్టినరోజుకు ప్రత్యేకమైన గిఫ్టులు పంచుతూ ఉంటాడు. అలాంటి విజయ్ తన పర్సనల్ బాడీ గార్డుకు ఊహించని షాక్ ఇచ్చాడు. అసలు విషయం ఏమిటంటే విజయ్ దేవరకొండ దగ్గర రవి అనే కుర్రాడు పర్సనల్ బాడీ గార్డుగా పని చేస్తున్నాడు. తాజాగా రవి వివాహం చేసుకుంటూ తన యజమాని విజయ్ సహా ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని ఆహ్వానించాడు. ఒక ఇంట్లో పని చేస్తున్న సమయంలో ఏదైనా శుభకార్యం అంటే మాములుగా ఆహ్వానిస్తారు. అలానే విజయ్ ఫ్యామిలీని కూడా ఆహ్వానించాడు రవి. కానీ ఈ విషయాన్ని లైట్ తీసుకోకుండా విజయ్ దేవరకొండ తన కుటుంబం మొత్తాన్ని తీసుకుని వెళ్లి రవి ఫ్యామిలీ మొత్తానికి ఒక స్వీట్ షాక్ ఇచ్చ్చాడు. ఇక అక్కడి ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఫ్యామిలీ ఇస్తారనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఆశించిన మేర ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా మీద దేవరకొండ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం
ఎన్నికల హడావుడిలో ఉన్న కమల్‌హాసన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నటుడు కమల్‌హాసన్ మామ, పీపుల్స్ జస్టిస్ సెంటర్ అధ్యక్షుడు శ్రీనివాసన్ నిన్న అంటే సోమవారం నాడు కొడైకెనాల్‌లో కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. పరమకుడి ప్రాంతానికి చెందిన ఆయన ఒకప్పుడు ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారు. ఆ తర్వాత కొడైకెనాల్‌లో చాలా కాలం నివసించారు. ఆయన భౌతికకాయాన్ని చెన్నైకి తీసుకొచ్చి ఆళ్వార్‌పేటలోని ప్రజా న్యాయ కేంద్రం ప్రధాన కార్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈరోజు ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కమల్ తెలిపారు. తన ట్విట్టర్ పేజీలో ఒక సందేశంలో, “నా వ్యక్తిత్వ వికాసానికి అంకుల్ ఆరుయిర్ శ్రీనివాసన్ ప్రధాన పాత్ర పోషించారు. మామ వాసు తన విప్లవాత్మక ఆలోచనలు, ధైర్య సాహసాల విషయంలో వీరోచిత వ్యక్తి. అంత్యక్రియల నిమిత్తం ఆయన భౌతికకాయాన్ని నిన్న రాత్రి ప్రజానీతి కేంద్రం కార్యాలయానికి తీసుకువచ్చారు. రేపు (23-04-24) ఉదయం 10:30 గంటలకు బీసెంట్ నగర్ మిన్ మయన్‌లో దహన సంస్కారాలు మొదలుపెట్టారు. కమల్ హాసన్ మామ మృతి పట్ల మంత్రి ఉదయనిధి కూడా సంతాపం తెలిపారు.మహాలక్ నీతి మయ్యం పార్టీ శ్రీనివాసన్ మరణ వార్త విని మేము చాలా బాధపడ్డాము, కళైజ్ఞాని కమల్ హాసన్ సర్. కమల్ సర్‌కు సినీ ప్రపంచంలో, రాజకీయ రంగాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన శ్రీ శ్రీనివాసన్ మరణం ఆయన కుటుంబానికి తీరని లోటు. కమల్ సర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.