దళిత బంధు ప్రారంభమైనప్పటి నుంచి ఈ పథకంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్ పార్టీ కి దళిత బంధు స్కీం పెద్ద తలనొప్పిగా మారింది. హుజురాబాద్ ఎన్నికల్లో దళితుల ఓట్లను రాబట్టేందుకు స్కెచ్ వేసిన టీఆర్‌ఎస్ కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ప్రతి పక్షాల అభ్యంతరం నేపథ్యంలో ఈ పథకానికి బ్రేకులు వేసింది ఎన్నికల సంఘం. అయితే.. ఈ పథకంపై అమలుపై మరో ట్విస్ట్ నెలకొంది. దళిత బంధుపై హైకోర్టు ను ఆశ్రయించారు పలువురు విపక్ష నేతలు.
ఈ పథకంపై అమలు పై ఏకంగా హై కోర్టు లో మూడు పిటిషన్లు దాఖలు చేశారు. పిటీషన్ దాఖలు చేసిన వారిలో మల్లెపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ ఏఐసీసీ మెంబర్ బక్క జడ్సన్, బీజేపీ నేత డా.చంద్రశేఖర్ ఉన్నారు. హుజురాబాద్ లో దళిత బంధు యధావిధిగా కొనసాగించాలని తమ పిటీషన్ లో కోరారు నేతలు. దళిత బంధుకు తాము వ్యతిరేకం కాదని పేర్కొన్న నేతలు.. దళితుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన దళిత బంధు ను యధా విధిగా కొనసాగించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్ , హుజరాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ కరీంనగర్, పోలీస్ కమిషనర్ ను పిటీషన్ లో ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్లు.