జార్జిరెడ్డి, పలాస వంటి సినిమాల్లో విలన్‌గా మెప్పించి.. మసూద, పరేషాన్ చిత్రాలతో హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్. అయితే, ఆయన నటించిన ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడానికి కారణం సరైన ప్రమోషన్లు లేకపోవడమేనని తిరువీర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కొత్త చిత్రం ‘భగవంతుడు’ టీజర్ లాంచ్ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానాలిచ్చారు.
Also Read : #D55: ధనుష్ సరసన శ్రీలీల.. #D55 క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది!
“ముందుగా నిర్మాతలు ప్రమోషన్ల కోసం ప్రత్యేక బడ్జెట్ ఉందని చెబుతారు, కానీ రిలీజ్ సమయానికి వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు. డబ్బులు అయిపోయాయని, రావాల్సినవి రాలేదని కారణాలు చెబుతూ ప్రమోషన్లు ఆపేస్తున్నారు” అని తిరువీర్ వెల్లడించారు. అంతేకాకుండా, కొందరు జర్నలిస్టులతో ఇంటర్వ్యూలు చేయిస్తే సినిమా జనాల్లోకి వెళ్తుందని తను చెబితే.. “వాళ్లు డబ్బులు అడుగుతారు, మేము ఇవ్వలేము” అని నిర్మాతలు తనను నమ్మించారని ఆయన చెప్పారు. మీడియాలో అలాంటిదేమీ ఉండదని విలేకరులు చెప్పగా.. తనకు ఆ విషయాలు తెలియవని, నిర్మాతలు చెప్పిందే తను నమ్మానని ఆయన పేర్కొన్నారు. ఒక రకంగా ప్రమోషన్ల విషయంలో తన నిర్మాతలు తనను దెబ్బతీస్తున్నారని తిరువీర్ నేరుగా చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇకపై తన సినిమాలను గట్టిగా ప్రమోట్ చేసుకునేలా జాగ్రత్త పడతానని ఆయన స్పష్టం చేశారు.