నీట్-యూజీ పరీక్ష రద్దుపై దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించి.. తీర్పువెలువరించనుంది. నీట్-యూజీ పరీక్ష రద్దు చేయాలని.. పరీక్షలో అవకతవకలు జరిగాయని కొందరు విద్యార్థులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికే ఆ పిటిషన్లపై విచారణ కొనసాగించిన కోర్టు.. పరీక్ష రద్దుపై కేంద్రాన్ని వివరణ కోరింది. స్పందించిన కేంద్రం పరీక్షను రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పలు కారణాలు పేర్కొంది. మొత్తం పరీక్షను రద్దు చేయడం వల్ల ఈ ఏడాది మే 5న జరిగిన పరీక్షలో పాల్గొన్న లక్షలాది మంది నిజాయితీ గల విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని కేంద్ర తెలిపింది.
READ MORE: Jammu Kashmir: ఉగ్రదాడుల వెనక లష్కర్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.. తలపై రూ. 10 లక్షల నజరానా..
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌లో.. “ఆలిండియా పరీక్షలో ఎటువంటి పెద్ద అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేనప్పుడు, మొత్తం పరీక్ష..ఇప్పటికే ప్రకటించిన ఫలితాలను రద్దు చేయడం సరికాదు. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు నష్టం జరుగుతుంది. అవకతవకలు, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే పలువరి నిందితులను సీబీఐ అరెస్ట్ చేసింది. విచారణ కొనసాగుతోంది. ఇకపై అన్ని పోటీ పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నాం.” అని కేంద్రం తెలిపింది.