Nandamuri Tarakaratna: పిన్నవయసులోనే కన్నుమూసిన హీరో తారకరత్న గురించి, ఇప్పుడు నందమూరి అభిమానులు విశేషంగా చర్చించుకుంటున్నారు. నిజానికి తారకరత్న కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సాలిడ్ హిట్ లేకపోయినప్పటికీ, నందమూరి ఫ్యాన్స్ కు ఆయనంటే అంత అభిమానం! అందుకు కారణం- తారకరత్న పలుమార్లు తెలుగుదేశం పార్టీ ప్రచారంలో పాల్గొనడం, తద్వారా ఫ్యాన్స్ లో ఎంతోమంది పరిచయం కలగడం, కనిపించిన ప్రతీవారితోనూ ఆప్యాయంగా మాట్లాడడం – అని తెలుస్తోంది. తారకరత్న కన్నుమూశాక, దర్శకుడు అనిల్ రావిపూడి తాను బాలకృష్ణతో తెరకెక్కించబోయే చిత్రంలో తారకరత్న కోసం ఓ పాత్రను క్రియేట్ చేశానని, అందుకు బాలకృష్ణ కూడా ఎంతో సంతోషించారని చెప్పారు. అలాగే ప్రభాస్ తో తాము నిర్మిస్తోన్నభారీ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’లో కూడా తారకరత్నకు ఓ కీలక పాత్ర ఇవ్వాలని భావించామని నిర్మాత అశ్వనీదత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నందమూరి అభిమానుల్లో ఓ ఆలోచన కలిగింది.
Read Also: Ileana D’Cruz: ఇలియానా ఆ ఆలోచనలో ఉందా!?
ఇంతకూ నందమూరి ఫ్యాన్స్ కు వచ్చిన ఆలోచన ఏమిటంటే – తారకరత్న ఎటూ ఇక లేరు. ఆయన నటించిన చిత్రాలలోని విజువల్స్ తో గ్రాఫిక్ రోల్ ను క్రియేట్ చేయవచ్చు కదా అన్నది వారి అభిప్రాయం. ఇతరులు కాకపోయినా, కనీసం నందమూరి స్టార్ హీరోస్ బాలకృష్ణ, జూనియర్ యన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ చిత్రాలలో తారకరత్న గ్రాఫిక్ విజువల్స్ చొప్పిస్తే అభిమానులకు ఆనందం కలిగించిన వారవుతారని అంటున్నారు. అదీగాక, తారకరత్న భార్యాబిడ్డలు, కన్నవారు సైతం సంతోషిస్తారని, తద్వారా వారి కుటుంబానికి ఊరట కలుగుతుందనీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నిజమే… గతంలో నటరత్న యన్టీఆర్ తో కలసి నటించలేకపోయిన కొందరు తారలు, ఆయన పాత చిత్రాల్లోని విజువల్స్ తో గ్రాఫిక్ మాయాజాలం చేసి ఒకే ఫ్రేమ్ లో కలసి నటించిన భ్రాంతి కలిగించారు. ‘కలిసుందాం రా’ చిత్రంలో వెంకటేశ్, ‘యమదొంగ’ సినిమాలో జూనియర్ యన్టీఆర్ అలా నటరత్నతో కలసి చిందులేసి కనువిందు చేసిన వారే కదా! అదే తీరున ఇప్పుడు తారకరత్న విజువల్స్ తో గ్రాఫిక్స్ తో జిమ్మిక్ చేసి నందమూరి హీరోలు కలసి నటిస్తే అభిమానులు ఆనందించడమే కాదు, సదరు చిత్రాలను విశేషంగా ఆదరిస్తారనీ చెప్పవచ్చు.