Ileana D’Cruz: ఒకప్పుడు నాజూకు షోకులతో కుర్రకారును కిర్రెక్కించిన ఇలియానా డి’క్రుజ్ ఇప్పుడు ముద్దుగా బొద్దుగా తయారయింది. తెలుగు సినిమాలతోనే ఓ వెలుగు వెలిగిన ఇలియానా ఉత్తరాదికి ఉరకలు వేసి, దక్షిణాదిపై – ముఖ్యంగా తనకు స్టార్ డమ్ సంపాదించి పెట్టిన టాలీవుడ్ పై కామెంట్స్ చేసింది. దాంతో అమ్మడికి అవసరమైన సమయంలో అవకాశాలు సన్నగిల్లాయి. బాలీవుడ్ లో రాణించాలన్నదే తన జీవితధ్యేయమని అప్పట్లో చెప్పుకున్న ఇలియానాకు అక్కడికి వెళ్ళాక “బర్ఫీ, ఫటా పోస్టర్ నిక్లా హీరో, రుస్తోమ్, బాద్ షాహో” వంటి చిత్రాలు మంచి పేరే సంపాదించి పెట్టాయి. అయితే సదరు చిత్రాలన్నీ ఆయా హీరోల కారణంగా విజయపతాకం ఎగురవేశాయని బాలీవుడ్ జనం మాట! తెలుగులో “దేవదాస్, పోకిరి” వంటి చిత్రాల ఘనవిజయంలో మాత్రం అయస్కాంతం లాంటి ఇలియానా అందం పాత్ర ఎంతో ఉందని చెప్పవచ్చు. అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఇలియానా చూపు టాలీవుడ్ వైపే సాగుతోందట!
Read Also: Amani: ఒంటరిగా రా.. అవకాశాలు ఇస్తాం అన్నారు
ఇలియానా ‘దేవదాస్, పోకిరి’ చిత్రాల్లో నటించే సమయానికి ఆమె వయసు 19 ఏళ్ళు. అప్పట్లో ఆ మిసమిసలాడే అందానికి జనం ఫిదా అయ్యారు. ఆ తరువాత కూడా ఇలియానా నటించిన “జల్సా, కిక్, జులాయి” వంటి చిత్రాలు బాగానే అలరించాయి. తరువాత ఈ ముద్దుగుమ్మనూ ఫ్లాపులు పలకరించాయి. ఇప్పుడు బొద్దుగుమ్మగా మారాక, ఆమెతో నటించిన స్టార్స్ మళ్ళీ జోడీ కట్టడానికి ఎటూ అంగీకరించరు. ఈ నేపథ్యంలో సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తో నటించాలన్న అభిలాషను వ్యక్తం చేస్తోంది ఇలియానా. పూరి జగన్నాథ్ ‘దేవుడు చేసిన మనుషులు’లో రవితేజతో నటించాక, బాలీవుడ్ చెక్కేసిందీ భామ. మళ్ళీ ఆరేళ్ళ తరువాత రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో మెరిసింది. కానీ, ఆ సినిమా కలసి రాలేదు. ఇప్పటికీ తమ తడాఖా చూపిస్తోన్న టాలీవుడ్ సీనియర్ స్టార్స్ చిత్రాలలో అవకాశాల కోసం అమ్మడు వేట ఆరంభించిందని సమాచారం. ఆమె నటించిన హిందీ చిత్రం ‘తేరా క్యా హోగా లవ్లీ’ పూర్తయింది. విడుదల కోసం ఎదురుచూస్తోంది. లేడీ డైరెక్టర్ శిరీషా గుహ రూపొందించే ఓ చిత్రంలో నటిస్తోంది. అంతకు మించి ఏమీ లేవు. శంకర్ ‘నన్బన్’లో నాయికగా నటించడం వల్ల ఆయన ‘ఇండియన్’లో ఓ కీలక పాత్ర కోసం ఇలియానాను సంప్రదించినట్టు సమాచారం. మరి అది ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.