Rohit Sharma Answers Is Tilak Varma To Play ICC ODI World Cup 2023: ప్రస్తుతం సోషల్ మీడియాలో భారత్ ఫాన్స్ ఎక్కువగా చర్చిస్తున్నది హైదెరాబాదీ కుర్రాడు ‘తిలక్ వర్మ’ గురించే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున గత రెండు సీజన్స్ సత్తాచాటిన తిలక్.. టీ20 ఫార్మాట్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అరంగేట్రం చేయడమే కాదు అద్భుత ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. విండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 39 పరుగులు చేసిన తిలక్.. రెండో టీ20లోహాఫ్ సెంచరీ (51) చేశాడు. ఇక మూడో టీ20లో 49 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాకు విజయాన్ని అందించాడు.
విండీస్ గడ్డపై మూడు మ్యాచ్‌ల్లోనూ తిలక్ వర్మ ప్రతికూల పరిస్థితుల్లో బ్యాటింగ్ చేశాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమయిన చోట క్రీజులో నిలబడి.. పరుగులు చేశాడు. దాంతో 20 ఏళ్ల ఈ యువ బ్యాటర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియాకు మూడు ఫార్మాట్లలో సుదీర్ఘకాలం ఆడగల సత్తా ఉందంటున్నారు. అంతేకాదు ప్రపంచకప్ 2023 రేసులో కూడా తిలక్ వర్మ ఉన్నాడని సోషల్ మీడియాలో అప్పుడే చర్చ మొదలైంది. ఈ విషయంపై తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తిలక్ ప్రపంచకప్ ఆడతాడో లేదో ఇప్పుడే చెప్పలేను అని అన్నాడు.
ముంబైలో జరిగిన ఓ ఫుట్‌బాల్ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మ జట్టులోని పలు అంశాలపై స్పదించాడు. ‘తిలక్ వర్మ బాగా ఆడుతున్నాడు. జట్టుకు నమ్మదగ్గ ఆటగాడిలా కనిపిస్తున్నాడు. రెండేళ్లుగా తన ఆటను చూస్తున్నా. పరుగులు చేయాలనే కసి ఉంది. అదే అన్నింటికంటే ముఖ్యం. ఆ వయసులో అంత పరిణతితో ఆడటం గొప్ప విషయం. ఏ పరిస్థితిలో ఎలా ఆడాలో తనకు బాగా తెలుసు. ఇప్పటికైతే అతడి గురించి ఇంతే చెప్పగలను. తిలక్ ప్రపంచకప్ ఆడే సంగతి నాకు తెలియదు’ అని రోహిత్ అన్నాడు.
Also Read: Vishal Marriage: అమ్మాయిల వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తున్నారు.. పెళ్లిపై స్పందించిన విశాల్!
‘జట్టులో ఎవరి స్థానాలకూ గ్యారెంటీ ఉండదు. నా విషయంలోనూ అంతే. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు పెద్ద గాయాలు అయ్యాయి. శస్త్రచికిత్సల అనంతరం 4 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నారు. పునరాగమనం చేయడం అంత తేలిక కాదు. ఆసియా కప్ 2023 కోసం జట్టు ఎంపిక త్వరలోనే ఉంటుంది. ప్రతి స్థానం కోసం గట్టి పోటీ ఉంటుంది. ఎవరికీ అంత తేలిగ్గా భారత జట్టులో చోటు దక్కదు. చాలా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మంచి కూర్పుతో జట్టును ఎంచుకోవాలి’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.