ఇటీవల ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 48 అసెంబ్లీ స్థానాలను గెలుపొందిన బీజేపీ ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకుంది. 70 సీట్లలో 48 సీట్లు గెలుపొందిన బిజెపి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దశాబ్ద కాలంగా సాగిన పాలనకు ముగింపు పలికింది. 27 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీలో బిజెపి గెలుపొందింది. కాగా ఇప్పుడు ఢిల్లీ కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్నది. కొత్త సీఎం ఎవరనేది ఇంకా ఖరారు కాకపోవడంతో అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే ఢిల్లీ కొత్త సీఎం ఎవరనేదానిపై రేపు ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:POCO X6 Neo 5G: క్రేజీ ఆఫర్.. రూ. 20 వేల స్మార్ట్ ఫోన్ రూ. 11 వేలకే
రేపు (ఫిబ్రవరి 17) బీజేపీ కీలక సమావేశం కానున్నది. ఈ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో పర్వేష్ వర్మ, రేఖ గుప్తాలతో పాటు పలువురు సీనియర్లు ఉన్నారు. న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మకే ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, వీరేంద్ర సచ్‌దేవా, బన్సూరి స్వరాజ్, హరీష్ ఖురానా వంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిలో ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొన్నది. సీఎం ఎంపిక తర్వాత ఫిబ్రవరి 19 లేదా 20న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.