రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రఫేల్ కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయని, ఒప్పందాన్ని రద్దు చేయాలని న్యాయవాది ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు పరిశీలించి, విచారణకు నిరాకరించింది.తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం పిటిషన్ దాఖలు చేయలేదని, అవినీతి వ్యవహారాలను కోర్టు దృష్టికి తీసుకురావడమే తన లక్ష్యమని ఎంఎల్ శర్మ కోర్టుకు తెలిపారు.
రఫేల్ ఒప్పందంలో జరిగిన అక్రమాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆయన సుప్రీంకోర్టుని కోరారు. ఒప్పందంలో భాగంగా ఒక మిలియన్ యూరోలు మధ్యవర్తులకు ఇచ్చినట్లు ఫ్రెంచ్ దర్యాప్తు సంస్థ కూడా చెప్పిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై అక్కడి మీడియా అనేక కథనాలు కూడా రాసిందని పేర్కొన్నారు.
36 యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించిన ఈ డీల్ భారత్-ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్‌తో కూడిన ధర్మాసనం ఎం.ఎల్. శర్మ అనే న్యాయవాది దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం ఈ మేరకు తీర్పునిచ్చింది. మరోసారి లెటర్స్ రోగటరీని జారీ చేసి ఈ డీల్‌కు సంబంధించిన ఆధారాలు సేకరించాలని ఈ పిటిషన్‌లో కోరారు. దీంతోపాటు ఈ డీల్ కుదిరేందుకు మధ్యవర్తులకు దసో సంస్థ బిలియన్ డాలర్లు చెల్లించినట్లు వచ్చిన కథనాలను ఆయన ప్రస్తావించారు. కానీ, సుప్రీం కోర్టు బెంచ్ ఈ అంశాన్ని పరిశీలించడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో పిటిషనర్ శర్మ తన పిల్‌ను ఉపసంహరించుకున్నారు.
Read Also: Hizab Controversy Supreme Notices: హిజాబ్ వివాదంపై కర్నాటకకు సుప్రీం నోటీసులు
భారత్-ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంపై వివిధ పార్టీలు అభ్యంతరం తెలిపాయి. ఇది వివాదాస్పదంగా మారింది. ఈ ఒప్పందంపై సుప్రీంకోర్టుల దాఖయిన వ్యాజ్యాలను 2018లో తిరస్కరించింది. ఈ డీల్ కుదిరిన సందర్భాన్ని అనుమానించేందుకు తగిన సందర్భాలు లేవని పేర్కొంది. ఫ్రాన్స్‌కు చెందిన దసో సంస్థ నుంచి 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలుకు 2016లో భారత్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం 35 వరకూ విమానాలు భారత వాయుసేన అమ్ములపొదిలో ఉన్నాయి.