Appanapalli: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో కొలువైవున్న శ్రీ బాలబాలాజీ స్వామివారి దివ్య కల్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది . స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు రాష్ట్రం నలుమూలలనుండి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఇక, ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా ముస్తాబు చేశారు . ఈ ఉత్సవానికి గాను నవీన ఆలయానికి ఉత్తరం వైపున కళ్యాణ వేదికను నయనానందకరంగా తీర్చిదిద్దారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు మంచి నీరు, ఉచిత అన్నదాన వసతి కల్పించారు.
Read Also: TG PGECET 2024: నేడే తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల..
ఇక, ప్రభుత్వం తరపున దేవదాయ శాఖ ఆర్‌జేసీకే సుబ్బారావు.. స్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పించారు. అంతర్వేది దేవస్థానం తరపున అంతర్వేది ఆలయ అర్చకులు పట్టువస్త్రాలు సమర్పించారు. వాడపల్లి దేవస్థానం తరఫున స్వామివారికి ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలు సమర్పించారు. కొత్తపేట డీఎస్పీ వెంకటరమణ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దలి తిరుమల సింగరాచార్యులు , త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి అర్చక బృందం ఆద్వర్యంలో స్వామివారితో పాటు ఉభయ దేవేరులను బుగ్గన చుక్కపెట్టి వారిని పెళ్ళికొడుకు , పెళ్ళికుమార్తెలుగా తీర్చిదిద్ది వారిరువురిని కళ్యాణమండపము నకు తీసుకువచ్చి వేదం మంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ దివ్య తిరుకళ్యాణం జరిపించారు. ఈ కళ్యాణోత్సవంలో, కూటమి నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తంగా నిత్యం భక్త జన నీరాజనాలు అందుకుంటున్న వైనతేయ నది తీరాన ఉన్న అప్పనపల్లి గ్రామంలో కొలువైవున్న శ్రీ బాలబాలాజీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి..