టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హిట్ కోసం సామదాభేద దండోపాయాలు ఉపయోగిస్తున్నాడు. ఈ సారి హిట్ కోసం ఏకంగా బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నాడు. తొలిసినిమాతో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సోనాక్షి. దబాంగ్ ఓవర్ నైట్ బీటౌన్ క్రష్ బ్యూటీని చేసింది. ఆ తర్వాత సన్నాఫ్ సర్దార్, దంబాగ్ 2, లూటేరా, ఆర్ రాజ్ కుమార్ హిట్స్‌తో స్టార్ డమ్ తెచ్చుకుంది. గతేడాది హీరా మండి, కకుడాతో పలకరించిన అమ్మడు అదే ఏడాది హడావుడిగా పేరెంట్స్ తెలియకుండా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.
పెళ్లి తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తోంది శృతఘ్ణ సిన్హా డాటర్. తాజాగా తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవదళపతి సుధీర్ బాబు అప్ కమింగ్ ప్రాజెక్ట్ జటాధర. ఈ సినిమా దర్శకుడు వెంకట్ కళ్యాణ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షిని కలిసి కథ వినిపించగా అందుకు సోనాక్షి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా జటాధరా సెట్స్ లో సోనాక్షి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ పవర్ ఫుల్‌గా ఉండబోతుందట. ఇప్పటికే సుధీర్ బాబు కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. వర్షం రీమేక్ బాఘీలో విలన్ రోల్ పోషించాడు సుధీర్. మరోవైపు వరుస సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు హిట్ కోసం తెగ కష్టపడుతున్నాడు. కానీ అనుకున్న రేంజ్ హిట్ మాత్రం రావట్లేదు. హరోం హరతో ఓకే అనిపించుకున్న సుధీర్, మా నాన్న సూపర్ హీరో హీరోతో ప్లాప్ కొట్టాడు. ఇప్పుడు రాబోతున్న జటాధరతో సోనాక్షి అదనపు ఆకర్షణ తోడైతే హీరోగారి ఫేట్ మారుతుందేమో చూడాలి.