ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పవర్‌హౌస్ అభిషేక్ శర్మ రెచ్చిపోయిన విషయం తెలిసిందే. 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 30 రన్స్ చేశాడు. చేసిన 30 పరుగులలో 26 రన్స్ బౌండరీల ద్వారానే వచ్చాయి. ఎలాంటి బెరుకు లేకుండా ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్స్ కొట్టాడు. అభిషేక్ బ్యాటింగ్‌పై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. దాయాది పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ కూడా అభిషేక్ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యాడు. అంత దూకుడుగా ఎలా ఆడుతున్నాడు అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లోని లోపాలను ఎత్తిచూపాడు.
Also Read: Disha Patani: హీరోయిన్ దిశా పటాని ఇంటిపై కాల్పులు.. ఇది ట్రైలర్ మాత్రమే అంటూ వార్నింగ్!
పీటీవీ స్పోర్ట్స్ షోలో షోయబ్ మాలిక్ మాట్లాడుతూ… ‘అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. ఓ ఆటగాడికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే అతడి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అభిషేక్ 16 మ్యాచ్‌లలో 193.84 స్ట్రైక్ రేట్, 33.43 సగటుతో 533 రన్స్ చేశాడు. పాక్ ప్లేయర్స్ కూడా ఇలా దూకుడుగా ఆడగలరు. కానీ పీసీబీలో పరిస్థితి బిన్నం. ప్రతిభ ఉన్న ఆటగాడికి స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం ఇవ్వాలి. అప్పుడే అత్యుత్తమ ఆట బయటకు వస్తుంది. 2 మ్యాచ్‌ల తర్వాత జట్టులో ఉంటాడో లేదో తెలియని పరిస్థితిలో ఉంటే.. ఎలా ఆడుతాడు. దూకుడుగా ఆడలేడు. పీసీబీ వ్యవస్థ మారాలి. యువ ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను చూడలేకపోతున్నాం. సీనియర్లకు కూడా ఎలాంటి కారణం లేకుండా జట్టు నుంచి తొలగిస్తున్నారు. పాక్ ఆటగాళ్ళు మైదానంలో వారి ప్రత్యర్థులతో మాత్రమే కాకుండా.. మానసిక పోరాటం కూడా చేస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్ మళ్ళీ పుంజుకోవాలంటే బోర్డు తన విధానాన్ని సంస్కరించుకోవాలి’ అని అన్నాడు.