ఒకప్పుడు షారుఖ్ ఖాన్ సినిమా వస్తోందంటే చాలు ‘కింగ్ ఖాన్ ఆ రహా హై…’ అంటూ అభిమానులు జేజేలు పలికేవారు. గత కొన్ని సంవత్సరాలుగా షారుఖ్ ఖాన్ కు సరైన సక్సెస్ లేదు. ఒకప్పుడు ఆల్ ఇండియా హిట్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ కింగ్ ఖాన్ ఇప్పుడు ఓ హిట్టు దొరికితే చాలు అనే పంథాలో పయనిస్తున్నాడు. నిజం చెప్పాలంటే 2013లో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెతో నటించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ తరువాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ ఆయన దరి చేరలేదు. ఆ మరుసటి సంవత్సరమే షారుఖ్ నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ కూడా విజయకేతనం ఎగురవేసినా, అందులో అభిషేక్ బచ్చన్ కూడా ఉన్నాడు. పైగా అతను డ్యుయల్ రోల్ లో కనిపించాడు. అదలా ఉంచితే, ఇందులోనూ దీపికా పదుకొణెయే హీరోయిన్. ఆ తరువాత షారుఖ్, దీపిక జోడీ కట్టిన సినిమా ఏదీ జనం ముందుకు రాలేదు. షారుఖ్ తాజా చిత్రం ‘పఠాన్’లో దీపికా పదుకొణె హీరోయిన్. దాంతో ఫ్యాన్స్ కు ‘పఠాన్’పై ఆశలు చిగురించాయి.
‘చెన్నై ఎక్స్ ప్రెస్’ తరువాత తొమ్మిదేళ్ళలో షారుఖ్ ఖాన్ ఏడు చిత్రాలలో నటించాడు. వాటిలో దీపికతో నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ మాత్రమే అలరించింది. చివరకు ఆయన కెరీర్ లో అచ్చివచ్చిన నాయికగా నిలచిన కాజోల్ తో కలసి షారుఖ్ నటించిన ‘దిల్ వాలే’ కూడా ఆకట్టుకోలేదు. 2018లో వచ్చిన షారుఖ్ ‘జీరో’ బాక్సాఫీస్ వద్ద ఆయన హీరోయిజం చాటలేకపోయింది. దాదాపు నాలుగేళ్ళకు మొన్న మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ‘రాకెట్రీ’లో అతిథి పాత్రలో కనిపించాడు షారుఖ్. రెండ్రోజుల క్రితం వచ్చిన ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’లోనూ కేమియో అప్పియరెన్స్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం సత్తా చాటలేకపోయాయి. సెప్టెంబర్ 9న రానున్న ‘బ్రహ్మాస్త్ర’లోనూ గెస్ట్ గానే కనిపించనున్నాడు. కాబట్టి ఆ సినిమా హిట్టయినా, ఫట్టయినా షారుఖ్ కు ఒరిగేదేమీ లేదు. అందువల్ల వచ్చే సంవత్సరం విడుదలయ్యే షారుఖ్ ‘పఠాన్’పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇందులో వారిని ఊరిస్తున్న ఏకైక అంశం దీపికా పదుకొణె ఒక్కటే! కానీ, ‘గెహ్రాయియా’ చిత్రంలో రెచ్చిపోయి లిప్ లాక్ లతో హాట్ సీన్స్ లో నటించిన దీపికకు ఇప్పుడు మునుపటి క్రేజ్ లేదనీ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి ఈ అమ్మడు షారుఖ్ కు కలసి వస్తుందో రాదో అనే అనుమానలూ ఉన్నాయి. ఏమవుతుందో మరి?