Gorantla Butchaiah: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పోటీపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురంలో పనికిరాని మంత్రి.. రాజమండ్రి రూరల్లో పోటీకి పనికొస్తాడా అంటూ ఆరోపించారు. రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థిగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పోటీపై మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయటం ఖాయమని, అధిష్టానం ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా పోటీ చేస్తానని బుచ్చయ్య చౌదరి తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్ అని టీడీపీ అధిష్టానం ఎప్పుడో ప్రకటించింది.. ఇప్పుడు ఉండదని చెప్పడానికి జనసేన నాయకుడు ఎవరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: AP land titling Act: భూ వివాదాలు లేకుండా చేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందులు దుర్గేష్ చేసిన వ్యాఖ్యలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. దుర్గేష్ తో తనకు వ్యక్తిగతంగా విభేదాలు ఏమి లేవన్నారు. అధిష్టానం నిర్ణయం మేరకు త్యాగానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. టిక్కెట్లు ఎవరికిచ్చినా టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతో అవినీతిపరులైన మంత్రులు, అధికారులు ఇతర దేశాలకు పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దోచుకున్న సొమ్ములను ఇప్పటికే ఇతర ప్రాంతాలకు తరలించారని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ దోపిడీపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకున్న సొమ్ము అంతా రాబడతామని బుచ్చయ్య చౌదరి తెలిపారు.
Read Also:Bandi Sanjay: ప్రజా పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు..!