వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు మహోత్సవం’ నిర్వహిస్తోంది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు రైతులకు అందే సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం రైతు మహోత్సవం నిర్వహించ తలపెట్టింది. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో మూడు రోజుల పాటు (ఏప్రిల్ 21 నుంచి 23 వరకు) ఈ మహోత్సవం కొనసాగనుంది. ఈ ప్రదర్శనలో దాదాపు 150 స్టాళ్లు నెలకొల్పాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా రానున్నారు.
నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అభ్యుదయ రైతులు రైతు మహోత్సవంకు హాజరుకానున్నారు. రైతులతో పాటు రైతు ఉత్పాదక సంస్థలు తమ అనుభవాలు పంచుకునేందుకు ఇది మంచి వేదిక కానుంది. సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తగా మార్కెట్లోకి వచ్చే యంత్రాలు, పరికరాలు, నూతన వంగడాలు, మేలు రకం విత్తనాలను వ్యవసాయ అనుబంధ విభాగాలు, విశ్వవిద్యాలయాలు ప్రదర్శించనున్నాయి. పంట సాగుకు దోహదపడే డ్రోన్లు ఇక్కడ చూడొచ్చు. డెయిరీ, పట్టు పరిశ్రమ, చేపల పెంపకంలో వచ్చే లాభాల గురించి అధికారులు వివరించనున్నారు. ఈ రోజులు వసతులు, సౌకర్యాలన అధికారులు ఏర్పాటు చేశారు.