బేస్తవారిపేటలో రైస్ పుల్లింగ్ పేరుతో ఘరానా మోసం జరిగింది. రూ.3.28 లక్షల రూపాయలు నగదును మోసం చేశారని అటవీ శాఖ అధికారులపై ఆరోపణలు ఉన్నాయి. మార్కాపురం మండలం వేములకోటకు చెందిన సాయికుమార్, కిషోర్, రాజేష్ రైస్ పులింగ్ యంత్రం కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేశారు. బేస్తవారిపేటకు చెందిన రామకృష్ణ.. మార్కాపురంలోని కుంట వద్ద కిషోర్, రాజేష్, సాయికుమార్లకు రైస్ పుల్లింగ్ను సెల్ ఫోన్లో చూపించాడు. 3 లక్షలకు రైస్ పుల్లింగ్ కొనుగోలు చేయవచ్చని మిగతా స్నేహితులకు కిషోర్ చెప్పాడు.
నగదు కోసం తర్లుపాడులోని తన స్నేహితుడు మల్లికార్జున్ను సాయికుమార్ ఆశ్రయించాడు. వేరే వారి వద్ద బంగారం ఉందని, రూ.3 లక్షలతో పాటు మరో 3 లక్షల రూపాయలు అదనంగా వస్తాయని మల్లికార్జున్ చెప్పాడు. రైస్ పుల్లింగ్ యంత్రం అమ్మే రామకృష్ణకు సాయికుమార్ విషయం చెప్పాడు. రైస్ పుల్లింగ్ యంత్రాన్ని కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ నుంచి ఇద్దరు బంధువులను బాధితులు పిలిపించుకున్నారు. తర్వాత రూ.2.80 లక్షల నగదు తీసుకొని కారులో బేస్తవారిపేట పందిళ్ళపల్లి టోల్ ప్లాజా వద్దకు సాయికుమార్, మల్లికార్జున్, రామకృష్ణ, కిషోర్ చేరారు.
రైస్ పుల్లింగ్ యంత్రాన్ని విక్రయిస్తానన్న రామకృష్ణ రాకపోవడంతో.. సాయికుమార్, మల్లికార్జున్, రామకృష్ణ, కిషోర్ అక్కడే వేచి చూశారు. ఫారెస్ట్ అధికారుల రూపంలో అక్కడికి ముగ్గురు వ్యక్తులు చేరుకొని.. బాధితులను బెదిరించి కారు సోదా చేశారు. కారులో ఉన్న రూ.2.80 లక్షల నగదును తీసుకోవడంతో పాటు వారి వద్ద నుంచి ఫోన్ పేలో మరో రూ.48,000 వేయించుకున్నారు. బాధితుల వీడియోలు తీసుకొని ఎవరికైనా చెబితే అరెస్టు చేయిస్తామని బెదిరించారు. బెదిరించిన వారిలో ఇద్దరు ఫారెస్ట్ బీట్ అధికారులు గరికపాటి శ్రీనివాసులు, జక్కం శ్రీనివాసులుగా గుర్తించారు. మరో వ్యక్తి ఫారెస్ట్ బీట్ అధికారి శ్రీనివాసులు కుమారుడు రవిగా గుర్తించారు. మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.