Tesla Jobs: అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించేందుకు మరింత వేగాన్ని పెంచింది. త్వరలోనే ఇండియాలో తన ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలను ప్రారంభించేందుకు టెస్లా సిద్ధమవుతోంది. ఇందుకు సంకేతంగా కంపెనీ ఇప్పటికే ఉద్యోగ నియామక ప్రక్రియను ప్రారంభించింది. రీసెంట్‌గా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికాలో కలుసుకున్నారు. ఆ సమావేశం తర్వాతే టెస్లా భారత మార్కెట్‌లోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఇండియాలో తన కార్యకలాపాలకు మద్దతుగా టెస్లా 13 రకాల ఉద్యోగాల కోసం లింక్డ్‌ఇన్‌లో రిక్రూట్మెంట్ ప్రకటనలు పెట్టింది. కస్టమర్ డీల్ చేయడంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగాల నుంచి బ్యాక్-ఎండ్ సపోర్ట్ వరకు అనేక రకాల ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి.
Read Also: Akira Nandan : అకిరా నందన్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్.. కానీ
ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్, కస్టమర్ సపోర్ట్ సూపర్‌వైజర్, కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్, సర్వీస్ అడ్వైజర్, ఆర్డర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, సర్వీస్ మేనేజర్, టెస్లా అడ్వైజర్, పార్ట్స్ అడ్వైజర్, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్, స్టోర్ మేనేజర్, సర్వీస్ టెక్నీషియన్ లను టెస్లా భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాల్లో సర్వీస్ టెక్నీషియన్, టెస్లా అడ్వైజర్ లాంటి కనీసం ఐదు రకాల ఉద్యోగాలు ముంబై, ఢిల్లీ నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, కస్టమర్ ఎంగేజ్మెంట్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ లాంటి ఉద్యోగాలు ప్రస్తుతానికి ముంబైలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
టెస్లా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటి నుంచో భావిస్తోంది. కానీ, కొన్ని కీలకమైన సమస్యలు దీనిని అడ్డుకున్నాయి. ముఖ్యంగా భారతదేశంలోని హై ఇంపోర్ట్ డ్యూటీలు దీనికి ప్రధాన కారణమని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం ముందుగా టెస్లాకు కార్ల అమ్మకాలకు అనుమతి ఇస్తేనే దేశంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని మస్క్ స్పష్టం చేశారు. 2022లో మస్క్ స్వయంగా ఇండియాకు వచ్చి టెస్లా ఎంట్రీపై చర్చిస్తారని భావించారు. కానీ, ఆ సమయంలో అమెరికాలో ఉద్యోగాల కోతలు, కార్ల రీకాల్స్ వంటి అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన రద్దయింది. ఇప్పుడు టెస్లా ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభించడం భారత మార్కెట్లో కంపెనీకి కొత్త మార్గదర్శకంగా మారనుంది.
Read Also: Champions Trophy 2025: నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం..
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) పట్ల ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. గతంలో లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లపై ఇంపోర్ట్ డ్యూటీ 110% ఉండేది. అయితే, ఇటీవల భారత ప్రభుత్వం దీన్ని 70% కి తగ్గించడం టెస్లా ఎంట్రీకి మేలు చేయనుంది. ఇప్పటివరకు భారతదేశం గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. అయితే 2070 నాటికి నెట్-జీరో ఎమిషన్స్ లక్ష్యాన్ని సాధించాలని భారత ప్రభుత్వం సంకల్పించింది. ఇక భారతదేశంలోని మధ్య తరగతి పెరుగుతుండటంతో, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ కూడా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో టెస్లాకు భారతదేశం ఒక గొప్ప అవకాశంగా మారనుంది. మొత్తంగా టెస్లా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభించడంతో, త్వరలోనే భారత రోడ్లపై టెస్లా కార్లు పరుగులు పెట్టే రోజు దూరం లేకపోలేదు.