Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా గెలుపుతో శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి గ్రూప్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మహ్మద్ షమీ ఐదు వికెట్లు పడగొట్టడంతో బంగ్లాదేశ్ 228 పరుగులకే ఆలౌట్ అయింది. ఛేజింగ్‌లో రోహిత్ శర్మ మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. 36 బంతుల్లో 41 పరుగులు చేసి టీమిండియాకు చక్కటి ఆరంభాన్ని ఇచ్చాడు. ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అరుదైన రికార్డులు సాధించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, మహ్మద్ షమీ, శుభ్‌మన్ గిల్ తమ ప్రదర్శనతో అభిమానులను అలరించారు.
Read Also: Crime News: వివాహేతర సంబంధం బయటపడుతుందని.. పక్కింటావిడపై హత్యాయత్నం!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో 11,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 270 మ్యాచ్‌లు, 261 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్న రోహిత్.. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు విరాట్ కోహ్లీ (222 ఇన్నింగ్స్) మాత్రమే ఉన్నాడు. రోహిత్ ప్రస్తుతం వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గంగూలీకి సమీపంలో ఉన్నాడు. అంతేకాకుండా వన్డేల్లో అత్యధిక సిక్సులు బాదిన భారత ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 338 సిక్సులు ఉండగా.. అగ్రస్థానంలో షాహిద్ అఫ్రిది 351 సిక్సులతో కొనసాగుతున్నాడు.
ఇక బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లు తీసిన మహ్మద్ షమీ, వేగంగా 200 వన్డే వికెట్లు పూర్తి చేసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అతను కేవలం 104 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించి భారత మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ (133 మ్యాచ్‌లు) రికార్డ్ ను అధిగమించాడు. ప్రపంచ క్రికెట్‌లో మాత్రం మిచెల్ స్టార్క్ (102 మ్యాచ్‌లు) అతనికి ముందున్నాడు. అంతేకాదు, షమీ ఇప్పుడు ప్రపంచ కప్ ఛాంపియన్స్ ట్రోఫీల్లో కలిపి అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. అతడి ఖాతాలో 60 వికెట్లు ఉండగా, జహీర్ ఖాన్ (59), జవగల్ శ్రీనాథ్ (47) తరువాతి స్థానాల్లో ఉన్నారు.
Read Also: Champions Trophy 2025: క్యాచ్ డ్రాప్ చేసినందుకు అక్షర్‌కు ఆఫర్ ఇచ్చిన రోహిత్
ఇక టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో తన అద్భుత బ్యాటింగ్‌తో సెంచరీ (101*) సాధించాడు. ఇది అతడి వన్డే కెరీర్‌లో 8వ శతకం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అతడికి ఇదే తొలి శతకం కావడం విశేషం. అలాగే, కెరీర్‌లో 8 వన్డే సెంచరీలు పూర్తి చేసిన ఫాస్టెస్ట్ భారత క్రికెటర్‌గా గిల్ నిలిచాడు. ఈ సెంచరీతో గిల్ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌లోనే శతకం బాదిన నాలుగో ప్లేయర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ ఘనత చేసిన వారిలో సచిన్, మహ్మద్ కైఫ్, శిఖర్ ధావన్ లు ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ అరంగేట్రంలోనే గిల్ సెంచరీ చేయగా, గతంలో విరాట్ కోహ్లీ కూడా తన వన్డే వరల్డ్ కప్ అరంగేట్ర మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పైనే శతకం బాదాడు. ఈ మ్యాచ్‌లో గిల్ “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డును అందుకున్నాడు. గిల్ ఆడిన గత 4 వన్డే మ్యాచ్‌ల్లో 3 సార్లు “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకోవడం విశేషం.