విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు రానా దగ్గుబాటి. ప్రజంట్ మంచి కథలు ఏంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే తాజాగా తన ‘అరణ్య’ షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు రానా. ఈ సినిమాలో రానా, విష్ణు విశాల్‌తో కలిసి అడవి, ఏనుగుల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తిగా నటించారు. దర్శకుడు ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ఈ చిత్రం కొవిడ్ లాక్‌డౌన్ తర్వాత విడుదలైన తొలి పాన్ ఇండియా చిత్రంగా గుర్తింపు పొందింది. ఈ సందేశాత్మక సినిమా షూటింగ్ కోసం ఆరు నెలలు అడవిలోనే గడిపిన రానా, ఒకరోజు తాను ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఏనుగులు తిరిగే ప్రాంతంలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఊహించని సంఘటన జరిగిందని ఆయన తెలిపారు.
Also Read : OTT : ఓటీటీలో ఒక్కరోజే 11 సినిమాలు.. చూసేందుకు స్పెషల్‌గా 9 – తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 5 రిలీజ్
షూటింగ్ అనుకున్న సమయానికి ముగియకపోవడంతో, చీకటి పడే వరకు యూనిట్ అక్కడే ఉండిపోయింది. తాను ఒక సన్నివేశం కోసం కొంచెం దూరంగా ఉన్న సమయంలో, ఒక్కసారిగా యూనిట్ సభ్యులంతా హడావుడిగా పరిగెత్తడం చూశానని రానా చెప్పారు. దానికి కారణం ఏంటని చూసేసరికి, ఏనుగుల గుంపు తమ వైపు దూసుకు వస్తుండటమే! దీంతో ఏ మాత్రం శబ్దం చేయకుండా, ఏనుగులకు కనపడకుండా ఉండటానికి రానా, మరి కొంతమంది కలిసి చెట్ల చాటున దాక్కున్నారు. చిమ్మచీకట్లో, గుంపు తమను దాటి పోయే వరకు మూడు గంటలు కదలకుండా, శబ్దం చేయకుండా అలాగే ఉండిపోయానని, ఆ అనుభవాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని రానా వివరించారు. అప్పుడే అడవి ఎంత భయంకరంగా ఉంటుందో మొదటిసారి తెలిసిందని ఆయన తెలిపారు.