Rajnath Singh: మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లోని ఆర్మీ వార్ కాలేజీలో బుధవారం నిర్వహించిన త్రివిధ దళాల ఉమ్మడి సింపోజియం ‘రణ్ సంవాద్ 2025’ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో యుద్ధాలు ఎలా జరుగుతాయో వివరించారు. భారతదేశం ఎప్పుడూ ముందుగా దాడి చేయదని, కానీ సవాలు చేస్తే దానికి పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తుందని స్పష్టం చేశారు. జాతీయ భద్రత ఇకపై కేవలం సైన్యం విషయం కాదని, అది మొత్తం దేశం దృక్పథానికి సంబంధించిన సమస్యగా మారిందని అన్నారు. భారతదేశం ఏ దేశంపైనా యుద్ధాన్ని కోరుకోదని, కానీ దాని భద్రత కోసం పూర్తి శక్తితో స్పందించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
READ ALSO: India CWG Bid: 2030 కామన్వెల్త్ క్రీడల బిడ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
ఆపరేషన్ సింధూర్..
ఈసందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంలో త్రివిధ దళాల ఉమ్మడి కృషి గొప్పదని అన్నారు. ఈ యుద్ధంలో భారతదేశ స్వదేశీ పరికరాలు, ఆయుధ వ్యవస్థల పని తీరు ప్రపంచానికి తెలిసి వచ్చిందన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో సాధించిన విజయాల లాంటివి రాబోయే కాలంలో కూడా మనకు చాలా అవసరం అన్నారు. మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని చెప్పారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు ఎంత కచ్చితత్వంతో, ధైర్యంగా, వేగంగా దాడులు చేశాయో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచం చూసిందన్నారు. ఈ ఆపరేషన్‌ను ఉగ్రవాదులు ఎప్పుడూ ఊహించలేనిదని అన్నారు. ఆపరేషన్ సింధూర్ నిజంగా సాంకేతికత ఆధారిత యుద్ధానికి అద్భుతమైన ఉదాహరణ అని అన్నారు.
వీటితోనే రక్షణ సామర్థ్యాలు బలోపేతం..
ఆధునిక యుద్ధం కేవలం సైనిక శక్తిపై ఆధారపడి ఉండదని అన్నారు. సాంకేతికత, నిఘా, ఆర్థిక వ్యవస్థ, నైపుణ్యం కలిగిన దౌత్యం కూడా యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు. శిక్షణ, సాంకేతిక పురోగతి, అంతర్జాతీయ సహకారం ద్వారా మాత్రమే భారతదేశం తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోగలదని, ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కోగలదని స్పష్టం చేశారు. అన్ని రకాల భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి సైనికులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. భౌగోళిక రాజకీయ వాతావరణం అనూహ్యంగా మారిందని, సైన్యం ప్రతి పరిస్థితికి సిద్ధంగా ఉండాలని అన్నారు. నేటి యుగంలో యుద్ధాలు చాలా అకస్మాత్తుగా, అనూహ్యంగా మారాయని చెప్పారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, ఎంతకాలం ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టమని అన్నారు. అందుకే యుద్ధం రెండు నెలలు, నాలుగు నెలలు, ఏడాది, రెండు సంవత్సరాలు లేదా ఐదేళ్లు కొనసాగినా దానికి సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉండాలని చెప్పారు. భారత్ ఎవరి భూమిని కోరుకోదని, కానీ దాని ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడానికి ఎంత వరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో త్రివిధ దళాల అగ్ర నాయకత్వం, రక్షణ నిపుణులు, అంతర్జాతీయ భద్రతా నిపుణులు పాల్గొన్నారు.
READ ALSO: Pixel Dhruva Space Mission: సుంకాల పెంపు వేళ.. అమెరికా గడ్డపై భారత్ జెండా..