Pixel Dhruva Space Mission: భారతదేశానికి చెందిన రెండు స్టార్టప్ కంపెనీలు అగ్రరాజ్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశాయి. ఓ వైపు అమెరికా భారత్‌పై సుంకాలతో దాడులు చేస్తున్న సమయంలో.. భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగం తన ప్రయాణంలో గొప్ప ముందడుగును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించింది. బెంగళూరుకు చెందిన పిక్సెల్, హైదరాబాద్‌కు చెందిన ధ్రువ్ స్పేస్ స్టార్టప్ కంపెనీలు అమెరికాలోని ఎలోన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా తమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి సక్సెస్ పుల్‌గా ప్రవేశపెట్టాయి. ఈ ప్రయోగం కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి విజయవంతంగా జరిగింది. ఇక్కడ విశేషం ఏమిటంటే అంతర్జాతీయ ప్రయోగాలపై సుంకాల పెంపునకు ముందు విండో క్లోజ్ అవుతున్న సమయంలో రెండు కంపెనీలు ఈ ఘనతను సాధించాయి.
ప్రైవేట్ అంతరిక్ష రంగంలో భారత్..
ఒకే రాకెట్‌లో అంతరిక్షంలోకి చేరుకున్న రెండు భారతీయ స్టార్టప్ కంపెనీల ఉపగ్రహాలు వారి సాంకేతిక సంసిద్ధతను మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా భారతదేశం విశ్వసనీయతను కూడా బలోపేతం చేశాయి. పిక్సెల్ ప్రపంచం కోసం మేడ్ ఇన్ ఇండియా కథను సృష్టిస్తుండగా, ధృవ్ స్పేస్ కస్టమర్ల కోసం నమ్మకమైన పేలోడ్ హోస్టింగ్ ప్లాట్‌ఫామ్‌గా అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రయోగంతో భారత్ ఇకపై కేవలం రాకెట్ ప్రయోగ గమ్యస్థానం కాదని, అంతరిక్ష సమస్యల పరిష్కారాలను సృష్టించడంలో ప్రపంచవ్యాప్తంగా పాత్ర పోషించగలదని రుజువు చేస్తుంది. ఫైర్‌ఫ్లై, LEAP-1తో భారత్ ప్రైవేట్ అంతరిక్ష స్టార్టప్‌లు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి.
భూమిని నిరంతర రికార్డు చేస్తాయి..
ఈ ప్రయోగంలో పిక్సెల్ కంపెనీ తన మూడు కొత్త ఫైర్‌ఫ్లై ఉపగ్రహాలను ప్రయోగించింది. దీనితో కంపెనీ ఇప్పుడు మొత్తం ఆరు ఫైర్‌ఫ్లైస్‌ను యాక్టివ్‌గా కలిగి ఉందని తెలిపింది. ప్రతి ఫైర్‌ఫ్లైకి 135 కంటే ఎక్కువ స్పెక్ట్రల్ బ్యాండ్‌లలో, ఐదు మీటర్ల రిజల్యూషన్ చిత్రాలను తీయగల హైపర్‌స్పెక్ట్రల్ సెన్సార్‌లతో కూడి ఉంటుంది. వ్యవసాయంలో పంటల పరిస్థితి లేదా కాలుష్యం, గ్యాస్ లీకేజీలు సంభవించినప్పుడు.. వాటికి సంబంధించి ఇప్పటివరకు కనిపించని వివరాలను ఫైర్‌ఫ్లై అందజేయనుంది. ఈసందర్భంగా కంపెనీ CEO అవాయిస్ అహ్మద్ మాట్లాడుతూ.. “ఇప్పుడు మా ఉపగ్రహ చిత్రాలు భూమిని నిరంతర రికార్డు చేస్తాయి. ఇది భూమిని సజీవ ప్రయోగశాలగా మారుస్తుంది. ఫైర్‌ఫ్లై భూమిలోని ప్రతి భాగం డేటాను ప్రతిరోజూ పంపగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. హనీబీ అని పిలువబడే తదుపరి తరం ఉపగ్రహాలు ఈ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి’ అని అన్నారు.
ధృవ్ స్పేస్..
ధృవ్ స్పేస్ LEAP-1 ఉపగ్రహాన్ని ప్రయోగించడం ద్వారా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇది హోస్ట్ చేయబడిన పేలోడ్ మిషన్. దీంతో ఇప్పుడు కంపెనీ అంతర్జాతీయ కస్టమర్ల కోసం దాని ప్లాట్‌ఫామ్‌పై పరికరాలను తీసుకెళ్లడానికి సౌకర్యాలను అందించగలదు. ఈసందర్భంగా కంపెనీ CEO సంజయ్ నెక్కంటి మాట్లాడుతూ.. “ఈ మిషన్ భారతదేశం, ఆస్ట్రేలియా భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.” అని అన్నారు.
READ ALSO: Inga Ruzeniene: ప్రపంచం దృష్టిని ఆకర్షించిన యూరప్ దేశం.. కొత్త ప్రధానికి 44 ఏళ్లు..