India CWG Bid: 2030 కామన్వెల్త్ క్రీడల (CWG) నిర్వహణకు బిడ్ సమర్పించాలన్న యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. బిడ్ ఆమోదం పొందితే, గుజరాత్ ప్రభుత్వానికి సహకార ఒప్పందం, గ్రాంట్–ఇన్–ఎయిడ్ మంజూరు చేయడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కామన్వెల్త్ క్రీడల్లో 72 దేశాల నుంచి అథ్లెట్లు పాల్గొననున్నారు. ఈ క్రీడల సమయంలో దేశాన్ని పెద్ద సంఖ్యలో అథ్లెట్లు, కోచ్‌లు, సాంకేతిక అధికారులు, పర్యాటకులు, మీడియా వ్యక్తులు సందర్శించనున్నారు. దీంతో స్థానిక వ్యాపారాలకు ప్రయోజనం చేకూరడంతో పాటు ఆదాయం కూడా లభించనుంది.
READ ALSO: Pixel Dhruva Space Mission: సుంకాల పెంపు వేళ.. అమెరికా గడ్డపై భారత్ జెండా..
ఆతిథ్య నగరం అహ్మదాబాద్..
ప్రపంచ స్థాయి స్టేడియాలు, అత్యాధునిక శిక్షణా సౌకర్యాలు, ఉద్వేగభరితమైన క్రీడా సంస్కృతిని అందించే అద్భుత ఆతిథ్య నగరం అహ్మదాబాద్ అని కేంద్ర మంత్రివర్గం పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియం 2023 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఇప్పటికే తన సామర్థ్యాన్ని చాటి చెప్పింది. కామన్వెల్త్ క్రీడల డైరెక్టర్ డారెన్ హాల్ నేతృత్వంలోని అధికారుల బృందం ఇటీవల అహ్మదాబాద్‌ను సందర్శించి, ప్రతిపాదిత వేదికలను పరిశీలించడంతో పాటు, గుజరాత్ ప్రభుత్వ ప్రతినిధులను కూడా కలిశారు. త్వరలో మరో ప్రతినిధి బృందం భారతదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది.
అంతకు ముందు ఇండియా ఒలింపిక్ సంఘం ఆగస్టు 13న న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (SGM) సందర్భంగా CWG 2030ని నిర్వహించడానికి బిడ్‌ను ఆమోదించింది. CWG 2030ని నిర్వహించడానికి IOA ఇప్పటికే ఆసక్తి తెలిపింది. ఇప్పుడు తుది బిడ్ ప్రతిపాదనను సమర్పించడానికి ఆగస్టు 31 వరకు సమయం ఉంది. భారతదేశం గతంలో 2010లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది, ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో నిర్వహించారు.
” భారతదేశంలో CWGని నిర్వహించడం పర్యాటకాన్ని పెంచడంతో పాటు ఉద్యోగాలను సృష్టించడం, లక్షలాది మంది యువ అథ్లెట్లకు స్ఫూర్తినిచ్చే శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా స్పోర్ట్స్ సైన్స్, ఈవెంట్ ఆపరేషన్స్, మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్ట్ కోఆర్డినేటర్లు, బ్రాడ్‌కాస్ట్, మీడియా, IT, కమ్యూనికేషన్స్, పబ్లిక్ రిలేషన్స్, ఇతర రంగాలలో కూడా పెద్ద సంఖ్యలో నిపుణులు అవకాశాలను పొందుతారు” అని కేంద్ర మంత్రివర్గం తెలిపింది. ఇండియాతో పాటు, నైజీరియా, మరో రెండు దేశాలు కూడా 2030లో బహుళ-క్రీడా మహోత్సవాన్ని నిర్వహించడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. 2030 కామన్వెల్త్ క్రీడలకు తుది ఆతిథ్య దేశాన్ని నవంబర్ చివరి వారంలో గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీ నిర్ణయిస్తుంది.
READ ALSO: Indore Lady Smuggler Arrest: 32 ఏళ్ల కి’లేడి’ అరెస్ట్.. 12 కేసులు.. కోట్లల్లో ఆస్తులు