ప్రముఖ సినీ నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెలలో అరెస్ట్ అయ్యాడు పోసాని. నిన్న సీఐడీ కోర్టు బెయిలు మంజూరు చేసినప్పటికీ, షూరిటీ సమర్పణలో ఆలస్యం కారణంగా విడుదల ప్రక్రియ కొంత జాప్యం అయింది. చివరకు శనివారం సాయంత్రం జైలు అధికారులు అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసి ఆయనను విడిచిపెట్టారు. పోసాని కృష్ణమురళికి శుక్రవారం సీఐడీ కోర్టు బెయిలు మంజూరు చేసినప్పటికీ, లక్ష రూపాయల విలువైన రెండు బాండ్లను పూచీకత్తుగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
అయితే, బ్యాంక్ సమయం ముగిసిపోవడం, షూరిటీ పత్రాల సమర్పణలో ఆలస్యం కారణంగా ఆయన విడుదల శనివారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జైలు వద్ద ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో రిలీజ్ ఆర్డర్స్ జిల్లా జైలుకు చేరాయి. దీంతో అధికారులు విడుదలకు సంబంధించిన ఫార్మాలిటీలను వేగంగా పూర్తి చేశారు. పోసాని విడుదల సమయంలో ఆయన న్యాయవాదులు గుంటూరు జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు. వారి సమక్షంలోనే జైలు అధికారులు అవసరమైన పత్రాలను పరిశీలించి, విడుదల ప్రక్రియను సాయంత్రం 5 గంటల తర్వాత పూర్తి చేశారు. అన్ని కేసుల్లో బెయిలు లభించడంతో పోసాని జైలులో ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది.