Crime: పొటోషూట్ పేరుతో రప్పించి కెమెరాల ఓ యువ ఫొటోగ్రాఫర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖ పోలీసుల ప్రకారం.. విశాఖలోని మధురవాడ చెందిన పోతిన సాయి కుమార్ పెళ్లి వేడుకలకు ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆన్‌లైన్ ద్వారా బుకింగ్‌లు తీసుకొని స్థానిక ప్రాంతాలతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లి ఈవెంట్‌లలో ఫొటోలు తీస్తూ ఉంటాడు. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు పది రోజుల ఫొటోషూట్ ఉన్నట్లు చెప్పి ఫిబ్రవరి 26న సాయికుమార్‌ను పిలిచారు. ఈ క్రమంలో తన వద్దనున్న రూ.15 లక్షల విలువైన కెమెరా, సామగ్రితో అతను వెళ్లాడు. వెళ్లే ముందు పెళ్లి వేడుకలో ఫొటోల చిత్రీకరణకు వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు.
Read Also: Burkina Faso: బుర్కినా ఫాసోలో నరమేధం..170 మంది దారుణ హత్య..
సాయికుమార్ అక్కడికి ఒంటరిగా వెళ్లగా.. ఆ ఇద్దరు వ్యక్తులు అతడిని హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. సాయికుమార్ దగ్గరున్న కెమెరా, సామగ్రిని తీసుకెళ్లారు. మూడు రోజులుగా కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు విశాఖలోని పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు పోలీసులు విచారణ చేపట్టారు. సాయికుమార్ కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపట్టగా.. నిందితుల్లో ఒకరైన షణ్ముఖతేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితులు అతడి కెమెరా, సామగ్రి కోసమే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారు.
విశాఖ యువకుడి హత్యపై మృతుడి తల్లి రమణమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని హత్య చేసిన నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని మృతుడి తల్లి పోతిన రమణమ్మ డిమాండ్ చేశారు. మైనర్లు అయి ధైర్యంగా హత్య చేసారంటే వారు ఎంతటి వారో అర్థం చేసుకోవాలన్నారు.