విజయవాడలో మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జనసేన ఆధ్వర్యంలో జనవాణి రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టగా స్థానికుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని జనవాణి కార్యక్రమం ద్వారా తాము చేస్తున్నామని తెలిపారు. వైసీపీ సర్కారు తన బాధ్యతలను మర్చిపోయిందని.. దీంతో సామాన్యులు, మధ్యతరగతి వాళ్లు నేడు నలిగిపోతున్నారని పవన్ ఆరోపించారు. తాను సంపూర్ణంగా ప్రజల పక్షాన నిలబడేందుకు వచ్చానని భరోసా ఇచ్చారు. రౌడీయిజం, గూండాయిజం చేసే రాజకీయ నాయకులంటే తనకు చిరాకు అన్నారు. అలాంటి వాళ్లు నియోజకవర్గానికి 25 మంది ఉంటారేమోనని.. వాళ్లను ఎదురించాలంటే ప్రజలకు కూడా భయమేనన్నారు. వైసీపీ నేతలు ఏమైనా దిగొచ్చారా.. అన్యాయంపై గొంతెత్తితే బెదిరిస్తున్నారని పవన్ మండిపడ్డారు. ప్రశ్నిస్తే పథకాలు ఆపుతామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని.. స్మశానాలను సైతం కబ్జాలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ నచ్చాడని ఫేస్‌బుక్‌లో పోస్టు పెడితే పెన్షన్ అపుతారా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు.
Read Also: Andhra Pradesh: ఎల్లుండి సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్న ద్రౌపది ముర్ము
వైసీపీ ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని.. గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడుస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇసుక రేట్లు అడ్డగోలుగా పెంచి వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతోందని విమర్శలు చేశారు. మూడేళ్లుగా ఏపీలో మేడే వేడుకలు నిర్వహించడంలేదని.. దీన్ని బట్టి కార్మికులంటే ప్రభుత్వానికి ఏ మాత్రం గౌరవం ఉందో అర్ధమవుతోందని పవన్ కళ్యాణ్ చురకలంటించారు. ఏపీలో అన్ని విభాగాలకు ఒకే మంత్రి సజ్జల ఉన్నారని ఎద్దేవా చేశారు. తిరుపతి రేణిగుంటలో రెండు సెంట్ల స్థలం కోసం వృద్ధురాలిని వైసీపీ నాయకులు బెదిరింపులకు గురిచేయడం సిగ్గుచేటన్నారు. అంబేడ్కర్ విదేశీ విద్య పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. దీంతో పేద బిడ్డలు విదేశాల్లో చదివే అర్హత కోల్పోయారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సీఎం జగన్ తమను చూసి వెంట్రుకలు పీక్కుంటున్నారని.. అలా చేస్తే ఆయనకు ఉన్న జుట్టు ఊడిపోతుందని పవన్ కౌంటర్ ఇచ్చారు.