Champions Trophy 2025: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కీలక ప్రకటన చేశారు. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ మెన్స్ చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆడడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. చిలిమండ గాయం కారణంగా కమిన్స్ పాల్గొనడం కష్టమని పేర్కొన్నారు. కమిన్స్ గైర్హాజరీ నేపథ్యంలో స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని మెక్‌డొనాల్డ్ తెలిపారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో 25 వికెట్లు తీసిన కమిన్స్, భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరువాత అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. అయితే, ఆ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అనంతరం కమిన్స్ గాయంతో బాధపడుతున్నారు. అంతేకాకుండా, తన రెండో బిడ్డ పుట్టుకతో శ్రీలంక టూర్‌ను తప్పుకున్నారు. ప్రస్తుతం కమిన్స్ బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టలేదని కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ వెల్లడించారు.
Also Read: Maha Kumbh mela 2025: కుంభమేళాలో ప్రధాని మోడీ పుణ్య స్నానం
ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి.. ఆయన ఆడే అవకాశం చాలా తక్కువ అని మెక్‌డొనాల్డ్ అన్నారు. ఆటగాళ్లతో మా చర్చలలో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ నాయకత్వానికి ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు. స్టీవ్ స్మిత్ టెస్టు, వన్డే క్రికెట్‌లో అనుభవజ్ఞుడైన నాయకుడు. టెస్టుల్లో స్మిత్ నాయకత్వం చాలా బాగా పనిచేసింది. మరోవైపు ట్రావిస్ హెడ్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. ఇక ప్యాట్ కమిన్స్‌తో పాటు జోష్ హేజిల్‌వుడ్ కూడా గాయాల నుండి కోలుకునే ప్రయత్నంలో ఉన్నాడు. మెల్‌బోర్న్ టెస్ట్ సమయంలో జోష్ హిప్ గాయంతో బాధపడుతూ.. శ్రీలంక పర్యటనకు దూరమయ్యాడు. అప్పటినుండి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని మెక్‌డొనాల్డ్ తెలిపారు.
Also Read: Ambati Rambabu: గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి ఫైర్
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ బ్యాక్ ఇంజరీ కారణంగా చాంపియన్స్ ట్రోఫీ 2025 నుండి తప్పుకున్నాడు. అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు బ్యూ వెబ్‌స్టర్ పేరు పరిశీలనలో ఉందని కోచ్ చెప్పారు. బ్యూ వెబ్‌స్టర్ సీమ్-బౌలింగ్ ఆల్‌రౌండర్ కావడంతో అతనికి అవకాశం దక్కే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా గతంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2009 ఎడిషన్‌లో విజయం సాధించినప్పటికీ, ఆ తర్వాత జరిగిన టోర్నమెంట్లలో ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేకపోయింది. ఇప్పుడు ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ వంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నీకి దూరమవుతుండటం ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. మొత్తం మీద, చాంపియన్స్ ట్రోఫీకి ముందే కెప్టెన్సీపై స్పష్టత రానున్నది. స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్ నాయకత్వంలో ఆస్ట్రేలియా టోర్నమెంట్‌లో కొత్త రీతిలో ముందుకెళ్లాలని చూస్తోంది.