Ambati Rambabu: గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లాక్కుంటోందని ఆరోపించారు. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు గెలవడంపై స్పందించిన అంబటి రాంబాబు ఈ విజయాన్ని కుట్రలతో సాధించారని విమర్శించారు. గుంటూరులో 57 డివిజన్లలో వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, టీడీపీ స్టాండింగ్ కమిటీని చేజిక్కించుకుందని ఆయన ఆరోపించారు. ‘మా కార్పొరేటర్లను లాక్కొని, కొందరితో క్రాస్ ఓటింగ్ చేయించారు. క్రాస్ ఓటింగ్ చేసినవారికి నైతిక విలువలు లేవు. బాహాటంగా పార్టీకి వ్యతిరేకంగా వెళ్లినవారు కన్నా లోపలుండి వెన్నుపోటు పొడిచే వారు మరింత ప్రమాదకరం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ దేశంలో పార్టీ ఫిరాయింపుల చట్టం సరిగా అమలు కావడంలేదని అంబటి రాంబాబు అన్నారు. దానితో ఇలాంటి ఘటనలు ఎక్కువవుతున్నాయని, పార్టీలో ఇమడలేని వారు బయటకు వెళ్లిపోవచ్చని పేర్కొన్నారు. అంతేకానీ, లోపలుండి కుట్ర రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కూడా మార్చాలని చూస్తున్నారు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి స్థానిక సంస్థలను తమ వశం చేసుకోవాలని టీడీపీ చూస్తోంది. పార్టీ గీత దాటిన వారి పైన సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే వ్యక్తులపై వైసీపీ కఠిన చర్యలు తీసుకుంటుందంటూ ఆయన చేసిన హెచ్చరిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో జరిగిన ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ.. చంద్రబాబు నాయుడు దొంగ మాటలు, చీటింగ్ వ్యవహారాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ టీడీపీ చేసిన అక్రమాలను కళ్లముందు చూస్తున్నా ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. గతంలో ప్రజాస్వామ్యం కోసం గళం విప్పిన పవన్ ఇప్పుడు మాత్రం మౌనం వహించడం ఏంటని విమర్శలు గుప్పించారు. అలాగే బుడమేరు వరదల పేరిట 9 కోట్ల రూపాయల స్కాం చేసి ప్రభుత్వాన్ని మోసం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఆ స్కాంను బయటకు తీసుకొచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని, న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. “ఎన్ని ప్రలోభాలు పెట్టినా మా వైపు నిలిచిన 24 మంది కార్పొరేటర్లకు అభినందనలు. వారు మా పార్టీకి నిజమైన బలమైన కడుగు సైనికులు” అని అన్నారు. అయితే, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన కార్పొరేటర్లపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.