ఎయిర్ పోర్టు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం శనివారం గన్నవరం నుంచి బెంగళూరుకు వెళ్లింది. అయితే విమానంలో కొంత మంది ప్రయాణికుల లగేజీ లేదు. సిబ్బంది ఈ విషయాన్ని విమానం బెంగళూరుకు చేరుకున్న తర్వాత గుర్తించారు. మొత్తం 13 మంది ప్రయాణికులకు చెందిన లగేజీని గన్నవరం విమానాశ్రయంలోనే వదిలి వచ్చినట్లు గుర్తించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు టేకాఫ్ అయ్యే సమయంలో.. 13 మంది ప్రయాణికులకు చెందిన లగేజీని ఎయిర్ ఇండియా సిబ్బంది మర్చిపోయారు.
READ MORE: MS Dhoni: ఎకానమీ క్లాస్‍లో ప్రయాణం చేసిన ధోనీ.. చప్పట్లు, కేరింతలతో మార్మోగిన విమానం..
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా బెంగళూరుకు చేరుకున్న తర్వాత అసలు సంగతిని గుర్తించినా లాభం లేకుండా పోయింది. అయితే పొరపాటును గ్రహించిన సిబ్బంది.. ప్రయాణికులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. లగేజీని మర్చిపోయామని, వచ్చేంత వరకూ వేచి చూడాలంటూ.. ఆ 13 మంది ప్రయాణికులకు సూచించారు. అయితే ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రయాణికులు తీవ్రంగా మండిపడ్డారు. లగేజీ గురించి ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రయాణికులకు, ఎయిర్ ఇండియా సిబ్బందికి మధ్యన జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో లగేజీ మర్చిపోయి ఎలా వెళ్లార అయ్యా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ మధ్య ప్రయాణికులు పలు కారణాల వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించే విషయంలో విమానయాన సంస్థలు విఫలమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కార్గో, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ విధానంలో మళ్లీ మళ్లీ సమస్యలు తలెత్తుతున్నాయి.